Thursday 20 January 2022

 "రాణి వేలు నాచియార్"    "వీరమంగై ( వీరవనిత )"


◆ మనలో చాలామంది 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటే బ్రిటిష్ వారిమీద తొలి స్వాతంత్ర్య పోరాటం అనుకుంటారు.. కానీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ( బ్రిటిష్ ) వారిపై పోరాటం సాగించిన మొట్టమొదటి వ్యక్తి "రాణి వేలు నాచియార్". ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా తమిళులు ఈమెమీద అభిమానంతో వీరమంగై ("వీరవనిత") అని పిలుచుకుంటారు..అంతకుముందు 16 వ శతాబ్దంలో కర్ణాటకకు చెందిన అబ్బక్క చౌతా పోర్చుగీస్ వారి మీద సుధీర్ఘ పోరాటం జరిపి నాలుగు దశాబ్దాల పాటు వారిని నిలువరించి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచారు..
◆ తమిళనాడు , రామనాడు ( ప్రస్తుత రామనాధ్ పురం జిల్లా - రామేశ్వరం ) రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి , రాణి సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక. "రాణి వేలు నాచియార్" 3 జనవరి 1730 న జన్మించారు. ఆ రాజ దంపతులకు పుత్ర సంతానం లేదు.
◆ రాణి వేలు నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. కత్తిసాము, విలువిద్య, గుర్రపుస్వారీ, వలరి, సిలంబం(కర్రసాము) వంటి యుద్ధనైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు,
ఫ్రెంచి, ఆంగ్లము మరియు ఊర్దూ మొదలగు
బహుభాషలలో కోవిదురాలు... ఆవిడకి తన పదహారవ ఏట, శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో వివాహంజరిగింది. వీరికి ఒక పుత్రిక కూడా జన్మించింది.
◆ 1772 బ్రిటీష్ వాళ్ళు శివగంగ రాజ్యం మీద దండెత్తారు.. 'కైలయార్ కోయిల్' యుద్ధంలో ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, ఆర్కాట్ నవాబు కొడుకు కలిసి హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికి సన్నద్ధమైంది. కానీ తగిన సైన్యం లేకపోవడంతో దిండిగల్ వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ గోపాల నాయక్కర్ అండలో తన కుమార్తెతో కలిసి ఎనిమిదేళ్లపాటు తలదాచుకోవలసి వచ్చింది.
◆ ఈ కాలంలోనే గోపాల్ నాయకర్, సుల్తాన్ హైదర్ అలీ సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది "వీరమంగై వేలు నాచియార్". ఈస్ట్ ఇండియా కంపెనీ ( బ్రిటిష్ ) వారి ఆయుధాగారన్ని కనుగొని తన సేనా నాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది
"ఉడైయాల్" అనే స్త్రీ సేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు..
తదనంతరం హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించి, వీరవనిత అనే నామాన్ని సార్ధకం చేసుకొంది.
◆ 1790 సంవత్సరంలో తన కుమార్తె 'వెల్లచ్చి' కి రాజ్యాధికారాన్ని అప్పగించిన "రాణి వేలు నాచియార్" 25 డిసెంబర్ 1796 లో మరణించారు.. ఆమెను "జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. "వీరమంగై రాణి వేలు నాచియార్" స్మృతిలో భారత ప్రభుత్వం 2008 లో ఒక పోస్టల్ స్టాంపు ను కూడా విడుదల చేసింది..
ఇటువంటి ఎందరో వీరులను వీరమాతలను కన్న "మేరా భారత్ మహాన్"....

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...