Saturday 22 January 2022

 త్యాగరాజస్వామి ఆరాధన

నాదబ్రహ్మకు నాదనీరాజనం

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి" అని ఆర్యోక్తి.
’సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్తనద్వయం
ఏకమాపాతమధురం
అన్యదాలోచనామృతం’
భగవతర్పన కోసం కుల మత భాష వర్గ బేధాలు లేని ఏకైక సాధనం సంగీతం. సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యుడు, నాదోపాసన చేసిన నాదలోలుడైన భగవంతుని సేవించిన నాదయోగి త్యాగయ్య. సంగీత కుటుంబాలన్ని ఒకటిగా చేసిన మహానుభావుడు.

డిసెంబర్ జనవరి నెలలు మొదలవగానే దక్షిణభారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ప్రతి వీధి, ప్రతి గృహము మధురమైన సంగీతనాదంతో ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వని ఈ నాడు పాశ్చాత్య దేశాలకు కూడా పాకింది. చెన్నయ్ నగరంలో ప్రతిరోజూ సాయం సమయాలలో చలిని కూడా లెక్కచేయకుండా కళాభిమానులందరూ ఏదో ఒక సంగీత కార్యక్రమానికి హాజరు అయి తీరుతారు.
ఇంతటి సందడికి కారణం పుష్య బహుళ పంచమి నాడు రాబోయే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు.
తెలుగునాట త్యాగరాజస్వామి వారి పేరు వినని వారు వుండరంటే అది అతిశయోక్తి కాదు. ఏ శుభ సందర్భమైనా దేవాలయాల్లో ఏ పర్వదినమైనా ఆయన కీర్తనలు వినబడకుండా వుంటే ఆ కార్యక్రమం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. త్యాగయ్యమీద విడుదలైన సినిమాలవల్లనే కావచ్చు, అనేక ఇతర సినిమాలలో వాడుకున్న ఆయన పాటల ప్రభావమే కావచ్చు. టివిలలో జరిగే పాటలపోటీలవల్లే కావచ్చు, తిరిగిత్యాగరాజస్వామివారి కీర్తనలు బహుజన ప్రాచుర్యం పొందాయన్న మాట మాత్రం వాస్తవం.
ఇవన్ని ఒకఎత్తైతే ప్రతి సంవత్సరం తిరువయ్యూరులో జరుగుతున్న ఆరాధన ఉత్సవాలు మరొక ఎత్తు.సంగీత సాహిత్యాలను గంగా యమునలతోనూ, అంతర్లీనంగా వున్న భక్తిభావాన్ని సరస్వతితోనూ పోల్చి త్యాగబ్రహ్మ కీర్తనలను త్రివేణి సంగమంగా అభివర్ణించారు వాగ్గేయకారులు.
దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు పర్యటిస్తూ అక్కడ దేవాలయాలలోని దేవుళ్ళ మీద కీర్తనలను వ్రాసిన త్యాగయ్య ప్రముఖంగా రాముడిమీదనే కొన్ని వందల కీర్తనలు వ్రాసాడు. కొన్ని వందలమంది శిష్యులకు ఆయన స్వయంగా శిక్షణ ఇవ్వ బట్టే ఆయన కృతులు శాశ్వతంగా తరువాతి తరాలకు అందించబడ్డాయి. మొదట్లో కొన్ని సంస్కృతంలో కీర్తనలు వ్రాసినా, సింహభాగం అచ్చ తెలుగులోనే, అందరికీ అర్ధమయ్యేభాషలోనే వ్రాసాడనటం నిర్వివాదాంశం.
ఆ మహాయోగి, తనకు మరణ సమయం ఆసన్నమవుతున్నదని తెలుసుకొని అంతకు కొన్ని రోజులముందే సన్యాసాశ్రమం స్వీకరించి త్యాగబ్రహ్మ త్యాగరాజస్వామిగా మారాడని, 1847 జనవరి 6నలో సిద్ధిపొందిన త్యాగరాజు పార్ధివశరీరాన్ని ఆయన శిష్యులు ఆయన కోరిక మేరకు తిరువయ్యూరుకు తూర్పున కావేరీ నదీ తీరాన సమాధి చేసారని చరిత్ర చెప్పుతున్నది.
అక్కడే తులసి వనం ఏర్పాటు చేసి ఆ రోజుల్లో తులసి బృందావనం అని వ్యవహరించేవారు.
ప్రతిఏటా పుష్య బహుళ పంచమి నాడు ఆయన శిష్యులు సమాధి వద్ద 40 సంవత్సరాల పాటు నివాళులు అర్పించి తమ భక్తి శ్రద్ధలను చాటుకొనేవారు. ఆ తరువాత ఎవరి ప్రాంతాలలో వారు ఆరాధనలు నిర్వహించటం మొదలెట్టారు.
సమాధి శిధిలావస్థకు చేరుకొనే సమయాన కొందరు శిష్యులు విరాళాలు సేకరించి సమాధికి మరమ్మత్తులు చేయించి ఒక పూజారిని సంరక్షకుడిగా నియమించారు. అప్పటి నుండి, అంటే 1907 నుండి ఆరాధన పేరుతో భజనలు కచేరీలూ చేయసాగారు.
మెల్లిమెల్లిగా ఆ నోటా ఈ నోటా ఈ సంగతి వూరూరా పాకి భక్తిశ్రద్ధలతో ఆ నాటికి తిరువయ్యూరు చేరుకొని కచేరీలలో పాలు పంచుకోవటం కూడా మొదలయింది.
ఇది ఇట్లా వుండగా 1925లో బెంగుళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలికి కలలో త్యాగరాజు కనిపించి ఆయన సమాధి దర్శించాలన్న కోరికతో తిరువయ్యూరు చేరుకున్నది. అక్కడ కేవలం సమాధి, దాని చుట్టూ తులసివనం తప్పమిగతా ప్రాంతమంతా తుప్పలూ మొక్కలతో అస్తవ్యస్తంగాకనిపించి, అక్కడ స్వామివారికి ఒక మందిరం కట్టించాలని సంకల్పించి తన ఆస్తులు అమ్మగా వచ్చిన ధనం వినియోగించి సమాధి చుట్టూ ప్రాకారం కట్టే పనులకు శ్రీకారం చుట్టింది.
అప్పటి నుండి 13 ఏళ్ళవరకు ప్రతిఏడూ నాగరత్నమ్మ సమాధివద్దకు నిరాటంకంగా వెళ్ళివస్తూ వుండగా అక్కడ ఒక సమాధిమందిరం కట్టాలన్న ఆలోచన వచ్చింది. కొంతకాలం ఆ ప్రదేశంలో రామ విగ్రహం పెట్టాలా, త్యాగరాజ విగ్రహం పెట్టాలా, అన్న సందిగ్ధం వచ్చి చివరకు త్యాగరాజస్వామి విగ్రహమే పెట్టాలన్న తీర్మానానికి వచ్చి 1939లో త్యాగరాజ విగ్రహ స్థాపన జరిగింది.
1957లో మందిర గోడలపైన పాలరాతిఫలకాలపైన త్యాగరాజకృతులు చెక్కించి వాల్మీకి మంటపాన్ని కట్టి వాల్మీకి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు.
ఆ మరుసటి సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఆ మందిరంలో ఆరాధన వుత్సవాలు జరుగుతూనే వున్నాయి.
వుదయం ఉంఛవృత్తి చేసి, ఆ పిమ్మట భజన చేస్తూ, ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుండి బయలుదేరి ఆయన సమాధివరకు ఊరేగింపుగా వస్తారు.
ఒకపక్కన మందిరంలో స్థాపించిన స్వామి వారి విగ్రహానికి అర్చన అభిషేకాదుల వంటి వైదిక కర్మలు జరుగుతూ వుండగానే ఆవరణలో వున్న సంగీతకారులందరూ ఏక కంఠంతో ఆయన ఘనరాగంలో రూపొందించిన ప్రఖ్యాతమైన ఘనరాగ పంచరత్న కీర్తనలని ఆయనకు నివాళిగా గానం చేయటం ఒక సాంప్రదాయం. ఇక్కడ కేవలం గాత్రమే కాదు. ఏ వాయిద్యంలో నిష్ణాతులైన వారు ఆ వాద్య పరికరం మీద ఆ కీర్తనలను వాయిస్తారు.
పాల్గొనేవారంతా మహా విద్వాంసులే అనుకోవటం పొరపాటు. అప్పుడే సంగీతం నేర్చుకుంటున్న వారు కూడా పంచరత్న కీర్తనలను కరప్త్రాలలో చూస్తూ పాడటం గమనించవచ్చు.
ఈ శుభ ఘడియ కోసం సంవత్సరం పొడుగూతా ఎదురు చూస్తున్న గాయకులు వాద్యకారులు ఆ నాటికి అక్కడికి తప్పనిసరిగా చేరుకోవటంతోనే వారి భక్తి శ్రద్దలు ద్యోదకమవుతాయి.
ఎందరో ప్రతిష్టాత్మకమైన పదవులలో వున్నవారు కూడా తారతమ్యం లేకుండా సాంప్రదాయమైన దుస్తులలో అక్కడ ఆరాధన వుత్సవంలో పాల్గొనటం విశేషం. పంచలు కండువాలూ, ఘనమైన పట్టుచీరలు, పట్టుపరికిణీలు ఓణీలు, నుదిటిన విభూతి కుంకుమ బొట్టు, తమిళనాట సంవత్సరం పొడుగూతా దొరికే మల్లెచెండ్లు కనువిందు చేస్తూ, భారతీయ సాంప్రదాయమంటే ఇది అని చూపించటం మనకెంతో గర్వకారణం.
ప్రపంచవ్యాప్తిగా సంగీతప్రియులంతా ఒక్కవేదికమీద కలవటానికి కారణమైన ఈ మహోన్నత కార్యక్రమానికి మూలమైన మహానుభావుడు తెలుగువాడవటం కూడా మనం గర్వించదగ్గ విషయం.
తిరువయ్యూరులోనే కాక మన ఆంధ్రదేశంలో కూడా త్యాగరాజ ఆరాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించటం కనిపిస్తున్నది.
ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళటానికి వీలులేనివారి సౌకర్యార్ధం దూరదర్శన్ లోని వివిధ చానెళ్ళు తిరువయ్యూరు నుండి ప్రత్యక్షప్రసారం చేయటం ముదావహం.
తెలుగు భాష వున్నంతవరకు త్యాగరాజు ప్రతిభ, సంగీతం వున్నంతవరకు, ఘనరాగ పంచరత్నాలతో పాటు ఇతర మధురమైన కీర్తనలు స్మరణకు వస్తూంటాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు.
సంగీత ప్రియులమంతా కలిసి ఈ త్యాగరాజ ఆరాధనలో పాలు పంచుకొని భక్తిశ్రద్దలతో నివాళులర్పించుదాము.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...