Sunday, 6 June 2021

 మిత్రుడు Moshe Dayan రాసిన ఈవ్యాసం

సైన్సు, సైన్సు ఆవిష్కరణల చుట్టూతా ఉన్న జడ్ కేటగరీ సెక్యూరిటీని అంతం చేశాడని నా అభిప్రాయం. కొంచెం పెద్దదే కాబట్టి నేను ఇంకేం చెప్పినా ఎక్కువే అవుతుంది.
----
The greatest enemy of knowledge is not ignorance, it is the illusion of knowledge.
---- ఎవరైతేనేం
ఉండాల్సినోడు ఆనందయ్య. తెలిసో తెలియకో పెద్ద తేనెతుట్టెనే కదిపాడు. మందు సంగతేమోగానీ ఏది సైన్సు,ఏది కాదు? సైన్సెందుకు గొప్ప? సంప్రదాయమెందుకు రోత? జ్ఞానులెవ్వరు , గొర్రెలెవ్వరు? వంటి అవసరమైన ప్రశ్నలే లేవనెత్తాడు. ప్రశ్నించటానికి ప్రత్యేకమైన సందర్భమేమీ అవసరం లేదుగానీ వింతలూ అద్భుతాలూ అని మనం అనాగరికంగా పిలుచుకునే ఇంగ్లీష్ anomolies కనబడ్డప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు బలంగా వినబడతాయి. ఇప్పుడు జరిగిందదే. అయితే మనమేం చేశాం? ఎప్పట్లాగే చర్చని పక్కకి నెట్టాం. సైద్ధాంతిక ముష్టియుద్ధాలకి దిగాం. మేధో బలప్రదర్శనలకి తెగబడ్డాం. తీర్పులు తీర్చాం. ఎప్పట్లాగే సత్యాన్నీ మనిషినీ సమాధి చేశాం. నేనేం చెప్పదలుచుకున్నానో కొన్ని వాస్తవాలతో మొదలు బెడతాను.
* 2011 లో Don Poldermans అనే ఒక డచ్ డాక్టర్ scientific misconduct ఆరోపణల మీద పదవి నుండి తొలగించబడ్డాడు. Non -cardiac surgery లలో Betablockers వాడవచ్చని నిర్ధారిస్తూ అతను పబ్లిష్ చేసిన ఫలితాలన్నీ తప్పుడు లెక్కలూ, తప్పుడు పరిశోధనల ఆధారంగా నిరూపించ బడినవేనని తేలింది. ఆ పరిశోధనలని ప్రామాణికంగా చేసుకొని జరిగిన సర్జరీల వల్ల ఒక్క యూరోప్ లోనే ఎనిమిది లక్షలమంది చనిపోయినట్టు లెక్క తేల్చారు. ఎనిమిది లక్షలమంది! ఇదే సంఖ్యలో రువాండాలో జనం ఊచకోతకి గురయినప్పుడు మనం దాన్ని genocide అని పిలిచాం,గుర్తుందా?
* ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకి సైడ్ ఎఫెక్ట్స్ అని మనం ముద్దుగా పిలుచుకునే adverse drug reactions ఒక ప్రధానమైన కారణం. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏటా లక్షా ఎనభై వేలమంది preventable medical errors వల్ల చనిపోతున్నారని Centre for disease control అంచనా వేసింది.
*2009 ,2014 మధ్య ఐదేళ్ళ కాలంలో అమెరికాలోని పది అతి పెద్ద ఫార్మా కంపెనీలు తాము పాల్పడ్డ మోసాలగ్గాను కట్టిన జరిమానాలు అక్షరాలా 14 బిలియన్ డాలర్లు.
Absolutely shocking! తవ్వుకుంటూ పోవాలేగానీ ఇట్లాంటి ఉదాహరరణలెన్నో బయటపడతాయి. అయినాగానీ విడిగా చూస్తే పెద్దగా తెలుసుకోవటానికేమీ ఉండదు. ఎవరో ఒకానొక అవినీతిపరుడైన వైద్యుడు, ఏవో కొన్ని మరణాలు, అప్పుడప్పుడు సంభవించే fluke incidents గానే కనబడతాయి. విడిగా చూసి వదిలేస్తే 'ఫార్మాకంపెనీల కుట్రలు వేరు మెడికల్ సైన్సు వేరు, దేనికది విడిగా చూడాలి ' అని ఆదర్శీకరించే వెసులుబాటు కూడా కలుగుతుంది. రెటారిక్ లోనుండి బయటపడితేగానీ, సిద్ధాంతాల చట్రాలనుండి బుద్దిని విడుదల చేస్తేగానీ వాస్తవాలకుండే ముసుగులు తొలగవు.
అసలు సమస్య అవినీతిమయమైన వ్యక్తులు కాదు, అవినీతిమయమైన సైంటిఫిక్ రీసెర్చ్. ఆనందయ్య మందు విషయంలో జరిగిన చర్చల్లో ఈ మందుకి శాస్త్రీయ ప్రామాణికత లేదనీ, శాస్త్రబద్ధంగా పరీక్షించి నిర్ధారించిన అల్లోపతి మందులూ, పద్ధతులే ప్రామాణికమైనవన్న వాదనలు వినిపించాయి. అల్లోపతి మందుల గురించీ వైద్యవిధానం గురించీ మనకున్న utopian విశ్వాసాలు నిజమైతే గొడవే లేదు. కానీ మానవత్వం పట్లా,సత్యం పట్లా నిబద్ధత చావని డాక్టర్లూ, సైంటిస్టులూ కెరీర్లని ఫణంగా పెట్టి మరీ పరిశోధించి వెలికితీస్తున్న వాస్తవాలు ఇంకేదో చెప్తున్నాయి.
అసలేం జరుగుతుందో చుద్దాం. ఈ రోజు మనం వాడే మందులు ప్లాసిబో టెస్ట్ లూ, డబుల్ బ్లైండ్ మెథడ్స్ వంటివన్నీ అనుసరించి, శాస్త్రీయమైన పద్ధతిలో పరీక్షించి పారదర్శకంగా అప్రూవ్ చేసినవేనని అమాయకంగా నమ్ముతున్నాం కదా మనం. ఇప్పుడు అది నిజం కాదంటున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మెడిసిన్ & స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ John Loannidis ఒక పరిశోధనకోసం పరిశీలించిన 60,000 క్లినికల్ ట్రయల్స్ లో కేవలం 7% మాత్రమే నాణ్యమైనవని నిర్ధారించాడు. అంటే తొంబై శాతం క్లినికల్ టెస్టుల ఫలితాలు మందుల ఎఫికసీని, పనితనాన్ని నిర్ధారించటానికి ఏ మాత్రం పనికిరావు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ లొ సగం పైగా అసలు ఫలితాలనే పబ్లిష్ చెయ్యటం లేదు. అయితే నష్టమేంటి? ఏదైనా మందు ఎఫికసీ పరీక్షించటానికి జరిగే ట్రయల్స్ లో కొన్ని ఫలితాలు మందు నిజంగానే పని చేస్తుందని అనుకూలంగా వస్తాయి. కొన్ని నెగెటివ్ గా వస్తాయి. అయితే ఫార్మా కంపెనీలేం చేస్తాయి? నెగెటివ్ ఫలితాలని దాచిపెడతాయి. ఎక్కువ పాజిటివ్, అతి తక్కువ నెగెటివ్ ఫలితాలని కలిపి అప్రూవల్ కోసం అవసరమైన statistical value [ look for P- value hacking ] వచ్చేలా fabricated data సృష్టిస్తాయి. ఈ అబద్దాలనే మెడికల్ మ్యాగజీన్లూ జర్నల్స్ లో ప్రచురిస్తాయి. వీటి మీద అధిక సంఖ్యలో పీర్ రివ్యూలు రాయిస్తాయి. ఇవే నిజమని ప్రభుత్వాలనీ, డాక్టర్లనీ, పరిశోధకులనీ నమ్మిస్తాయి. తమ మందులు యధేచ్చగా అమ్ముకుంటాయి. ఎప్పటికో నిజం బైటపడేలోపు అబద్ధాలే సైంటిఫిక్ సత్యాలుగా చెలామణీ అవుతాయి. జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఒక్క మందులకే పరిమితం కాదిది. Surgical procedures, diagnostic equipment, therapies వంటి మార్కెట్ విలువ కలిగున్న ప్రతి అంశాన్నీ publication bias అనబడే ఈ జాడ్యం బ్రష్టు పట్టించింది. కార్పొరేట్ సంస్థలూ, అకడెమిక్ ఇన్స్టిట్యూషన్లూ, ప్రభుత్వ సంస్థలూ, డాక్టర్లూ, సైంటిస్టుల భాగస్వామ్యంలో మొత్తం మెడికల్ సైన్సు ప్రామాణికతనే ప్రశ్నార్ధకంగా మార్చివేసిన భారీ కుట్ర ఇది. 2017 లో దీనిగురించి నియమించిన Peter Wilmshurst కమిటీ బ్రిటిష్ పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో ఇది organised criminal activity అంటూ తీవ్రంగా విమర్శించింది. ఫార్మాకంపెనీల కుట్రలకీ మెడికల్ సైన్సు క్రెడిబిలిటీకి సంబంధం లేదన్న వాదన ఎంత బలహీనమైనదో అర్ధమౌతోందా?
నిజానికి ఈ జాడ్యం ఒక్క మెడికల్ సైన్సుకే పరిమితం కాదు. అసలు మొత్తం సైన్సే తప్పుడు పరిశోధనలవల్ల చావుదెబ్బ తింటోంది. ఈ రోజు మనం ఒక పారడాక్సికల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ఒకసారి చార్లీ చాప్లిన్ గౌరవార్ధం tramp వేషధారణ పోటీ పెడితే చార్లీ చాప్లిన్ కూడా సరదాగా వేషమేసుకుని పోయాడంట. నకిలీ చార్లీ చాప్లిన్లు మొదటి రెండు బహుమతులు గెలుచుకుంటే ఈయనకి మూడోబహుమతి వచ్చిందంట. ఎంతనిజమో తెలియదుగానీ ఈనాటి సైన్సు పరిస్థితి అచ్చం ఈ కథ లాగే ఉంది. సత్యమేదో తెలుసుకోవటానికి జరిగే శాస్త్ర పరిశోధనలు ఒకవైపు జరుగుతూనే ఉన్నా అసత్యాలకి సైన్సు ముసుగేసి అదే ప్రామాణికమైన సైన్సుగా చెలామణీ చెయ్యటానికి జరిగే ప్రయత్నాలు అంతకంటే ముమ్మరంగా జరుగుతున్నాయి. 1950 లలో అమెరికన్ సిగరెట్ కంపెనీలు అత్యంత భారీ స్థాయిలో ఇటువంటి సైంటిఫిక్ ఫ్రాడ్ మొదలుబెట్టాయి. అప్పటిదాకా ఏమాత్రం హానిలేని harmless pastime అని భావించిన సిగరెట్ నిజానికి కాన్సర్ కారకమని పరిశోధనలలో తేలింది. నిషేధించాలని పబ్లిక్ డిమాండ్ మొదలయ్యింది. సిగరెట్ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. ముల్లుని ముల్లుతోనే తియ్యాలని నిశ్చయించుకున్నాయి. వార్ స్ట్రాటజీ సిద్ధమయ్యింది. కళ్ళు చెదిరే స్థాయిలో ఫండింగ్ సమకూరింది. కాన్సర్ కారకాలైన ఇతర అంశాలని హైలైట్ చేస్తూ పెద్దమొత్తం లో distracting research మొదలయ్యింది. బట్టతలకీ కాన్సర్ కీ ఉన్న సంబంధం మీద రీసెర్చ్ లు జరిగాయి. కాన్సర్ కీ పుట్టిన నెలకీ ఉన్న సంబంధంపైనా జరిగాయి. జనాన్ని పీకల్లోతు అయోమయం లోకి నెట్టాయి. మొత్తమ్మీద సిగరెట్ కంపెనీలు విజయం సాధించాయి. ఒక దుస్సంప్రదాయానికి శక్తివంతమైన బీజం పడింది. సైన్సుని లాభసాటి interventional technology లుగా మార్చి సొమ్ముచేసుకునే క్రమంలో పెట్టుబడిదారీవ్యవస్థ ఈరోజుకీ ఇటువంటి distracting research నే ముఖ్యమైన ఆయుధంగా వాడుకుంటోంది. పొగాకు, యాసిడ్ రెయిన్, కెమికల్ పెస్టిసైడ్స్, కాంట్రాసెప్టివ్స్, స్టెంట్స్, యాంటీడిప్రెసెంట్స్, క్లైమేట్ చేంజ్...... ఒకటేమిటి, అమ్ముకోవటానికి వీలున్న ప్రతి అంశమూ ఈ false sientific nerrative లోకి అందంగా ఒదిగిపోయింది. సైన్సుని అత్యంత భక్తి ప్రపత్తులతో కొలిచే విద్యావంతులే ఈ manufactured ignorance యధేచ్చగా వ్యాపించటానికి ప్రధానమైన వాహకాలవటం పెద్ద ఐరనీ.
సైన్సంటే మనిషికి సృష్టిరహస్యాన్ని వివరించే సాధనమనీ, ఒక divine pursuit of truth అనీ నమ్ముతుంటాం మనం. In a perfect world, అది నిజం కూడా. కానీ ఈ రోజున జరుగుతున్న సైంటిఫిక్ రీసెర్చ్ ఎంతమాత్రమూ అటువంటి అన్వేషణ కాదు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకోసం, కార్పొరేట్ డబ్బులతో నడుస్తున్న బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఒకవైపు లాభదాయకమైన టెక్నాలజీగా మార్చే అవకాశమున్న పరిశోధనాంశాలకేమో లెక్కలేనంత ఫండింగ్ లభిస్తుంటే ,భౌతిక ప్రయోజనంలేని సత్యాలనావిష్కరించే పరిశోధనలకి పైసా దొరకని పరిస్థితి.ఐన్ స్టీన్ గనక ఈరోజు జీవించి ఉంటే నిస్సందేహంగా మట్టిగొట్టుకుపోయేవాడు. ఎంతోకొంత పబ్లిక్ ఫండ్స్ కల్పించే ఆర్ధికాలంబన లేకపోతే abstract science పరిశోధనల్లో ఈమాత్రమైనా ముందడుగులు పడేవి కాదు.
మెడికల్ సైన్సులోనేగాక, అసలు మొత్తం సైన్సులోనే వేళ్ళూనుకుపోయిన invasive approach మానవాళి ఉనికికే ముప్పుగా మారిందన్న స్పృహ ఇప్పటికే మొదలయ్యింది. సైన్సుని నడిపిస్తోన్న foundational values గురించి లోతైన అంతర్మధనమే జరుగుతోంది. ప్రపంచం ఈరోజున్న విధంగా రూపుదిద్దుకోవటంలో సైన్సు పోషించిన శక్తివంతమైన పాత్రని గుర్తిస్తూనే అదే సైన్సు కారణంగా మన జ్ఞానంలోనూ, జీవితంలో ఏర్పడిన పగుళ్ళని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులమీదా, సంప్రదాయ జ్ఞానం మీదా ప్రపంచం కొత్తగా చూపు సారిస్తోంది. ప్రతి రంగంలోనూ ఆధునికతకీ సంప్రదాయానికీ మధ్యనున్న కాంప్లిమెంటారిటీని గుర్తిస్తోంది.
ఈ రోజు అలోపతీ అని మనం పిలిచే వెస్టర్న్ మెడికల్ సైన్సులో ఉన్న లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్టర్న్ సైన్సుకి మూలస్తంభం లాంటి cartesian విలువలే మొదట్లో మెడికల్ సైన్సుకి కూడా మార్గం నిర్దేశించాయి. ఫలితంగా మనిషిని మనిషిగాకాక మానవ శరీరంగా అర్ధం చేసుకున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతిలో మమేకమైన integral భాగంగా కాక స్వతంత్రమైన అస్థిత్వమున్న యంత్రంగా భావించారు. యంత్రభాగాలకి రిపేర్ చేస్తే యంత్రం బాగయినట్టు, స్వతంత్ర భాగాల్ని బాగు చేస్తే మనిషి బాగవుతాడనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. శరీరం, మనసుల మధ్యనున్న అద్వైతం అర్ధమయ్యింది. వైద్యంలో డాక్టర్లకున్నంత ప్రాముఖ్యత పేషెంట్ల నమ్మకాలకీ, విలువలకీ ఉందని గుర్తిస్తూ Evidence Based Medicine ఉద్యమం మొదలయ్యింది. ఇప్పుడు జరుగుతున్న క్లినికల్ టెస్టులే గాక గతంలో జరిగిన అన్ని టెస్టుల వివరాలని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలనే డిమాండ్ తో AllTrials Movement నడుస్తోంది.
ప్రపంచం మారుతోంది. సైన్సు ఒక paradigm shift అంచున నిలబడి ఉంది. మనం మాత్రం అపసవ్య దిక్కుకు చూస్తున్నాము. సైన్సుని దైవంగా మార్చి కొత్త మతం స్థాపించే ఉద్యమం చేస్తున్నాము. దాన్నే సైంటిఫిక్ టెంపర్ అని ప్రకటించుకుంటున్నాము.
సరే, మందుకీ, ముద్దకీ, మనసుకీ, మనిషికీ సైన్సే ప్రమాణమని నమ్ముదాం. కానీ ముందే సైన్సుని నమ్మాలో తేల్చుకుందాం. సైన్సంతా ఒక monolithic system కాదు. పాత సైన్సుంది. థియరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటం ఫిజిక్స్ ఆవిష్కరించిన కొత్త సైన్సుంది. వాటి foundational values అధ్యయనం చేద్దాం. Science, false-science, pseudo-science, junk -science, bad -science వంటి వంద వేరియేషన్లున్నాయి. తేడాలు తెలుసుకుందాం. సైన్సులో కులవ్యవస్థలాంటి వర్గీకరణ ఒకటుంది. మొన్నటిదాకా ఈ అప్రకటిత hierarchy లో physics, mathematics వంటి hard sciences పైమెట్ల మీదుండేవి. సంప్రదాయ జ్ఞానాన్ని ఏ కారణంతో చిన్నచూపు చూస్తామో సరిగ్గా అటువంటి కారణాలవల్లనే బయలాజికల్ సైన్సెస్, మానవ శాస్త్రాలు దిగువనుండేవి. ఇప్పుడిప్పుడే genetics, biotechnology వంటివి పైకెక్కుతున్నాయి. మనమెటువైపుండాలో, ఏ విలువలని సమర్ధించాలో స్పష్టం చేసుకుందాం.
ఆయుర్వేదాన్నీ, సంప్రదాయ జ్ఞానాన్నీ ల్యాబరేటరీ కొలబద్దలతోనే కొలిచిచూద్దాం. కానీ ఇప్పుడా కొలబద్దలు విరిగిపోయిఉన్నాయి. అతికేదాకా వేచిచూద్దాం. అజ్ఞానం పాపం కాదుగానీ అజ్ఞానులంటూ మనుషుల్ని వెటకారాలాడేటప్పుడైనా మనలో కొంత కొత్త జ్ఞానానికి చోటిద్దాం. ప్లాసిబో ఎఫెక్ట్ వొట్టిభ్రమ కాదనీ నిజంగానే biochemical changes కలిగిస్తుందనీ,.అధిక శాతం క్లినికల్ టెస్టుల్లో అసలు మందులకంటే ప్లాసిబో మందులే బాగా పని చేస్తాయనీ ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది. మనమేమో కాలం చెల్లిన జ్ఞానం పట్టుకువేళ్ళాడుతున్నాం. 'Nothing but a feeling !' అని తీర్పులిస్తూ జనాన్ని వెక్కిరిస్తున్నాం.
పసరుమందులు, సాంబారూ, పచ్చళ్ళంటూ గేలి చేస్తున్నాంకదా. ఇప్పుడు అమెరికాలో Fecal Metabiota Transplant పేరుతో మనిషి మలాన్ని శుద్ది చేసి క్యాప్సూల్స్ గా మార్చి మింగిస్తున్నారు. దానికేమందాం?
సైన్సు, ప్రగతిశీల భావజాలం, నాస్తికత్వం, హేతువాదం తప్పనిసరిగా ఒక కట్టగా కలిసుండాలన్న నియమమేం లేదు. వీటిని నడిపించే విలువల్లో సారూప్యతకంటే వైరుధ్యాలే ఎక్కువ. ఈ గందరగోళంలోనుండి బయటపడదాం.
దేవుడులేడని నిరూపించటం, మూఢనమ్మకాలని పారద్రోలటం సైన్సుకున్న ప్రధాన ప్రయోజనాలు కానే కాదు. అయితే గియితే second -rate by-products అవుతాయి.
సైన్సు వేరు, టెక్నాలజీ వేరు. సైన్సు గొప్పదనాన్ని వివరించే ప్రతి సందర్భంలో కంప్యూటర్లనీ ,రాకెట్లనీ ఉదాహరణలుగా చూపించే naivety తగ్గించుకుందాం. వింటానికి చిరాగ్గా ఉంటోంది.
సైన్సు సాధించిన విజయాలే దాన్ని గౌరవించటానికి ప్రాతిపదికలన్న ఆలోచన ఎంత దుర్మార్గమైనదో ఇప్పటికైనా గ్రహిద్దాం. ఆ లెక్కల్లో చూస్తే అంబానీకంటే గొప్పవాళ్ళెవరూ ఉండరు. Let us learn to look at the big picture. మోడర్న్ సైన్స్ చాలా విజయాలే సాధించింది..కాదంటంలేదు. కానీ అది మనిషిని ఓడించింది. మనిషి జీవితకాలాన్ని పెంచింది. కానీ మానవజాతి ఆయుర్దాయాన్ని తగ్గించింది.
మనిషిప్పుడొక endangered species. బతకటానికి నానా చావు చస్తున్నాడు. నిజానికి సగటుమనిషికి మనకుండే సిద్ధాంతాల జంజాటాలు ఏనాడూ లేవు. ఇప్పుడైతే ఎట్లాగైనా ప్రాణాలు దక్కించుకోవాలన్న తపన తప్ప వేరే ప్రయారిటీలు అసలే లేవు. ఏం తప్పుందందులో? ఆస్తులు కోల్పోయి కూడా ప్రేమించిన మనుషుల్ని కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితిలో కళ్ళముందు కనిపించే కారణాల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు .ఏ సన్నటి వెలుగురేక కనిపించినా ఆశగా చూస్తున్నాడు. న్యాయమేకదా? ఆ మాత్రానికే గొర్రెలూ, మూర్ఖులూ, బావిలో కప్పలన్న మాటలు మొయ్యాలా? బావిలో కప్పలు కానిదెవరు మనలో?బావిలోనుండి బయటపడ్డ కప్పలేమైనా లోకమంతా తిరుగుతాయా? ఎవరికుండే హద్దులు వారికున్నాయి కదా! బతుకే బరువైన మనిషిలో scientific temper వెతికే మన హేతుబద్దతలో నిగ్గెంత ?
బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రతిఉదయం కిటికీ ముందు నగ్నంగా నిలబడి బయటికి చూసేవాడు. Nikola Tesla నిద్రబోయేముందు వందసార్లు బొటనవేళ్ళు కదిలించేవాడు. అంతర్జాతీయ నాస్తిక ఉద్యమానికి నాయకత్వం వహించే The four horsemen లో ఒకడైన Richard Dawkins కి దయ్యాలంటే భయం. ఐజక్ న్యూటన్ కి alchemy లోనూ, occult sciences లోనూ ప్రగాఢమైన విశ్వాసముంది. ఎవరి ideosyncracies వాళ్ళకున్నాయి. ఎవరి irrationalities వాళ్ళకున్నాయి. వాళ్ళలో కనబడని అహేతుకత్వం, మూర్ఖత్వం ఆనందయ్య మందుకోసం పోయే ఎంకన్నలోనో, యలమందలోనో అంత ప్రత్యేకంగా ఎందుక్కనబడుతున్నాయి? ఆమాటకొస్తే ఒక anomoly కనపడ్డప్పుడు కనీసమైన scientific curiosity కి తావివ్వకుండా కొట్టిపారేసిన మనదేమాత్రం సైంటిఫిక్ టెంపర్! నిజమే, మనుషులు పిరికివాళ్ళే. దేవుళ్ళనీ, దెయ్యాలనీ నమ్ముతారు.చెట్టుకీ, పిట్టకీ, రాయికీ, రప్పకీ ఆత్మని ఆపాదిస్తారు. కానీ ఇవేమీ మనుషుల స్వయంకృతాలు కావు. లేనిది ఉందనుకోవటం, కంటికి కనబడని abstract patterns ని కల్పించుకోవటం వేల సంవత్సరాలుగా ప్రకృతి మనకందిస్తూ వచ్చిన evolutionary advantage. ఇటువంటి mystic insights గనక మనిషికి లేకపోతే సైన్సు, భాష, మతం, సాహిత్యం, సామూహిక అస్తిత్వాలే సాధ్యమయ్యేవి కాదు. అసలు ఇంతకాలం మనిషి బతికి బట్టకట్టేవాడే కాదు.
మన మెదడులో mirror neurons అనే ప్రత్యేకమైన టిష్యూ ఒకటుంది. తోటి మనిషితో సహానుభూతి చెందమనీ, సమూహాన్ని అనుసరించమనీ అది ప్రేరేపిస్తుంది. సమాజాన్నీ, నాగరికతనీ నిర్మించటంలో అది బలమైన పాత్ర పోషించింది. కాబట్టి మందననుకరించటం, అనుసరించటం మనమనుకుంటున్నట్టు గొర్రెతనం కాదు. మన అస్తిత్వంలో నిక్షిప్తమై ఉన్న అచ్చమైన మనిషితనం. ఏ పేరైతేనేం, చదువు లేని మూర్ఖుల్లోనే కాదు, మెదడనేదొకటుంటే మహానుభావులమైన మనలోనూ ఉంది. ఒప్పుకోమంతే. సైంటిఫిక్ టెంపర్లూ, రేషనాలిటీలూ గొప్ప విషయాలేగానీ ఉపయోగించే మనకి సంయమనం లోపిస్తే ఈ బతుక్కి మిగిలిన కొద్దిపాటి అందమూ, సున్నితత్వమూ దూరమౌతాయి. సైన్సు గొప్ప జ్ఞానమార్గమేగానీ జ్ఞానానికి అదొక్కటే మార్గం కాదు. మనిషిని మించిన ప్రమాణమేదీ లేదు.
PS: With due respect to all the exceptional doctors out there. And to Science that taught me the value of wonderment and humility.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...