Tuesday, 16 September 2025

 

🌹🌹ఎం.ఎస్.సుబ్బులక్ష్మి🌹🌹
(మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి)
1916 .సెప్టెంబర్ .16 – 2004 .డిసెంబర్ .11

పోతపోసిన భారతీయత
సంగీతానికే పరిపూర్ణత..

ఆవిడ పేరు తలచుకోగానే తాదాత్మ్యతతో కూడిన భక్తి భావం మదిలో కదలాడుతుంది.

ఆవిడ రూపం చూడగానే సనాతన ధర్మం మూర్తీభవించిన భావన కలుగుతుంది.

ఆవిడ ఆలపించిన కీర్తన వినగానే అమృతవర్షం కురిసిన భావన మిగులుతుంది....


ఆవిడ పఠించిన సుప్రభాతం వింటుంటే స్వామి సన్నిధిన ఉన్న భావన కలుగుతుంది.భక్తి, భారతీయత, శాస్త్రీయతతో కూడిన మాధుర్యం,
దేవతానుగ్రహం - ఇవన్నీ కూడితే ఆమె సేవామార్గం. వినమ్రత, ప్రశాంతత, చెదరని చిరునవ్వు, ఆత్మ విశ్వాసంఇవన్నీ కూడితే ఆమె వ్యక్తిత్వ పరిమళం..
పాపపుణ్యాల భారములు, సిరిసంపదల ఆలోచనలు,శిష్యవర్గపు బంధనాలు - ఇవన్నీ లేనిది ఆమె ఆత్మ ప్రస్థానం బాహ్యంతరములు, ఇంటా బయటా, విదేశ స్వదేశములు - వీటన్నిటా స్థిరమైన భావనలు ఆమె జీవన విధానానికి దర్పణం కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో ఆమె ఎప్పటికీ మహారాణిగానే ఉంటుంది.

సూర్యోదయానికి ముందే కౌసల్యా సుప్రజా రామానిదురించే ముందు జో అచ్యుతానంద జో జో వరకు ఆమె గాత్రమాధుర్యంలో జాలువారినవే. పండి తనములలోని దేవతమూర్తుల స్తోత్రములతో పాటు శంకరచార్యులు భగవద్రామానుజులు మొదలైన అవతారపురుషుల రచనలు ఆమె గళంలో పలికినవే. మీరా, సూరదాసు మొదలైన ఉత్తరాది మహనీయులు రచించిన భజనలు ఆమె గాత్రంలో ప్రకాశించినవే.

ఆమె కర్ణాటక సంగీత ఝరి..ఎన్నటికీ వాడని మల్లెల సౌరభ సంగీత సుగంధం..ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఆమె సంగీతం అలరారుతుంది. ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. ప్రముక కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి.

ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ తిరుపతిలో పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా పట్టుచీరతో, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.

మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన మహనీయురాలు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాల్సిందే. ఓ భజన కీర్తనలను మొక్కుబడిగా పాడటం వేరు, దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.,ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందారు సుబ్బులక్ష్మి. ఆమె సంగీతం..పాటల గురించి చెప్పుకోవాలంటే ఒక యుగం కూడా సరిపోదు.

తమిళనాడు మదురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది సుబ్బులక్ష్మి. చిన్నారి సుబ్బులక్ష్మిని ఆమె తల్లి ముద్దుగా కుంజమ్మ అని పిలుచుకునేవారు. ఆమెకు తల్లి ఆది గురువు. పదేళ్ళ వయస్సులో సుబ్బులక్ష్మి సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించేది. ఏ కారణం లేకుండా తనను టీచరు కొట్టిందనే కోపంతో బడికి వెళ్ళడం మానేసారు చిన్నారి సుబ్బులక్ష్మి. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకుంది. తన ప్రతిభతకో చాలా తక్కువ సమయంలోనే భారతజాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన ప్రారంభమై..సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడించింది.

సుబ్బులక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి చేరుకోవటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది.

సంగీతపరంగా సుబ్బులక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో అధ్యాయం అని చెప్పక తప్పదు.

సదాశివన్ తొలిభార్య కుమార్తె రాధనే ఆమె పెంచుకున్నారు. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు అయ్యింది. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బులక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బులక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి ఆటంకాలు రాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన ‘మీరా’ చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. ‘మీరా’ సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అదే ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉందనే మరచిపోకూడదు.

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి వైశిష్ట్యం ఆవిడలో ఉన్న రససిద్ధి - ఆ సంగీత రసాన్ని పూర్తిగా అనుభూతి చెంది దానిలో రమించటం. ఇదీ కళాకారుడి సాధనకు పతాక స్థాయి. రససిద్ధి పొందిన కళాకారుడికి తరువాత వేరే ఏదీ రుచించదు. అమృతత్వమంటే ఇదే. ఒక గాయకుడికి ఇది భావములో జీవించటం, దానిలో లయించి స్వరాలు పలికించటం. అధరం మధురం అని సుబ్బులక్ష్మి గారు ఆ శ్రీకృష్ణుని నుతిస్తూ మధురాష్టకం పాడితే ఎదురుగా ఆ పరమాత్మ దివ్యమంగళ స్వరూపం ముందు నిలిచిందా అనిపిస్తుంది. భావయామి గోపాల బాలం అని పాడితే ఆ చిన్ని కృష్ణుడు ముద్దుగా ఎదుట నిలిచినట్లే. ఇలా ఎన్నో. కారణం ఆమెకు ఆ సంకీర్తనలోని భావం మనసులో నిలిచి ఆ దేవతా స్వరూపం కళ్లముందున్నంత విశ్వాసం. తాదాత్య్మత కలిగిన కళాకారిణి ఆమె.

ఒకపరికొకపరి వయ్యారమై అని ఆవిడ అన్నమాచార్యుల వారి కీర్తన ఆలపిస్తే అలమేలుమంగ, శ్రీనివాసుల వైభవం మన కళ్ల ఎదుట నిలుస్తుంది. అదీ ఆ కళాకారిణి యొక్క గొప్పతనం. నిత్యానందకరీ వరాభయకరీ అని అన్నపూర్ణాష్టకం ఆలపిస్తే ఆ శంకరులు అన్నపూర్ణను నుతించిన సన్నివేశం కళ్లముందు నిలుస్తుంది. అన్నపూర్ణ యొక్క కరుణావృష్టితో మనకు ప్రశాంతత కలుగుతుంది. రఘువంశ సుధాంబుధి చంద్ర అని రాముని నుతించి అందులో అందమైన స్వరాలను పలికించిన రీతి ఆ రాగ లక్షణాలను, దేవతామూర్తి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. అదీ ఆవిడ గాత్రంలోని పరిశుద్ధత. పా కామాక్షీ పావనీ అని శరణాగతితో వేడుకుంటే ఆ దేవత శ్యామశాస్త్రుల వారిని కటాక్షిన ఘట్టం మనకు
అనుభూతికి రావలసిందే.

జగతోద్దారణ అని యశోద తనయుని..చేరి యశోదకు శిశువితడు అని అదే బాలుని వేర్వేరు భావనలతో, రాగములలో ఆవిడ ఆలపించిన పద్ధతి వాగ్గేయకారుల భావనలను మనముందుంచుతాయి. మాతే మలయధ్వజ పాండ్యసజాతే అని ఆమె ఖమాస్ రాగంలో వర్ణం స్వరములతో ఆలపిస్తే ఎంతో క్లిష్టమైన స్వరస్థానాలు ఆవిడ గళంలో ఎంత సులువుగా పలుకుతాయో అర్థమవుతుంది. బ్రోచేవారెవరురా అని పాడితే మైసూర్ వాసుదేవాచార్యుల వారి శరణాగతితో కూడిన ఆర్ద్రతను ఆవిష్కరించింది. నిను వినా నామదెందు అని ఉచ్ఛ స్థాయిలో మూడవకాలంలో ఆవిడ స్వరములను, సాహిత్యాన్ని పలికితే త్యాగరాజ స్వామికి అనుభవైకవేద్యమైన రామవైభవం మనకు అవగతమవుతుంది. ఇలా ఎన్నో, ఎన్నెన్నో.. కర్ణాటక సంగీతంలో సుబ్బులక్ష్మి గారు కనబరచిన శుద్ధత నభూతో న భవిష్యతి.

ఆవిడ గళంలో ఎంతో ప్రాచుర్యం పొందినవి హనుమాన్ చాలీసా, నామరామయాణం, మధురాష్టకం, కనకధారా స్తోత్రం, అన్నపూర్ణాష్టకం, శ్రీరంగ గద్యం, మీనాక్షీ సుప్రభాతం, కామాక్షీ సుప్రభాతం, నా పంచరత్న రామనాథ సుప్రభాతం... అనంతం ఆమె సంగీత సేవలోని సుమాలు. అజరామరం ఆ సంగీత రసప్రవాహం.ఎదిగిన కొద్దీ ఒదగమని అన్న నానుడికి ఎమ్మెస్ అత్యుత్తమ
ఉదాహరణ. ఆవిడ వ్యక్తిత్వం తెల్లని కాగితం వంటిది. అంతటి పేరు ప్రఖ్యాతులు పొందినా ఆమె అజాత శత్రువు.ఆవిడ వ్యక్తిత్వం తెల్లని కాగితం వంటిది. అంతటి పేరు ప్రఖ్యాతులు పొందినా ఆవిడ అజాత శత్రువు. జీవితమంతా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సామాన్యంగానే గడిపిన కీర్తిశేషులు ఆవిడ. క్రమశిక్షణతో కూడిన దినచర్య, నిరంతర సాధన, తన ధర్మాన్ని తుచ తప్పకుండా నిర్వర్తించటం ఆవిడ జీవన విధానం. ఎన్నో సామాజిక కార్యక్రమాలకు విరాళాలు సమకూర్చటానికి కచేరీలు చేశారు. అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని పొందారు. కంచికామకోటి పరమాచార్యుల వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన ఏకైక కళాకారిణి సుబ్బులక్ష్మి గారు. ఆయన రచించిన గీతాలను ఆలపించి ఆయన పట్ల తనకున్న కృతజ్ఞతను తెలుపుకుంది ఆ తల్లి. ఎంతో పేరుపొందిన తోటి కళాకారులు ఎమ్మెల్ వసంతకుమారి, డీకే పట్టమ్మాళ్, సెమ్మన్గూడి శ్రీనివాస అయ్యర్ మొదలైన వారితో ఎంతో సత్సంబంధాలు కలిగి ప్రేమానురాగాలకు పాత్రురాలైంది ఆ అమ్మ.

భారత జాతి గర్వించదగ్గ బహుకొద్ది మంది పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల పౌరులలో ఆవిడ అగ్రస్థానంలో ఉంటుంది.

80ఏళ్లు దాటిన పిమ్మట సుబ్బులక్ష్మి 1997లో తన ఆఖరి కచేరీ చేశారు. 1997లో స్వరాలయ పురస్కారం లభించిన కొద్ది రోజులకే భర్త సదాశివం మరణించారు. అటు తరువాత ఎమ్మెస్ మళ్లీ వేదిక ఎక్కి పాడలేదు. 1998లో భారత ప్రభుత్వం తన అత్యున్నత పురస్కారమైన భారత రత్న బిరుదుతో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని గౌరవించింది. సుదీర్ఘమైన సంగీత జీవితం తరువాత 2004లో ఎమ్మెస్ తన తుదిశ్వాస విడిచారు. మరణించేంతవరకూ సంగీత సాధన విడువలేదు. తాను సంపాదించినదంతా సేవా సంస్థలకు విరాళాలుగా ఇచ్చి దివ్యమైన వ్యక్తిత్వంతో, ఆత్మ సౌందర్యంతో, భగవంతుని సేవా భాగ్య ఫలంతో సుబ్బులక్ష్మి ఆత్మ ఈ లోకాన్ని విడచి వెళ్లింది.

వీరి జ్ఞాపకార్థం 2005 డిసెంబర్ 18వ తేదీన స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. స్టాంపు మీద కుడివైపున వృత్తంలో ముద్రించారు. ఎడమవైపున కచేరిలో తంబురాశృతి చేస్తూ పరవశిస్తున్న గాన కోకిల దర్శనమిస్తారు.

1998లో దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌లో ఆమె కాంస్య విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీవారి సుప్రభాతాన్ని యావత్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ దే.
🙏🙏🙏🙏🙏
- శ్రీదేవి రెడ్డి. ఐల

No comments:

Post a Comment

show image

  ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి) 1916 .సెప్టెంబర్ .16 – 2004 .డిసెంబర్ .11 పోతపోసిన భారతీయత సంగీతానికే పరిపూర్ణత.. ఆ...