Wednesday, 13 September 2023

 ఆముక్తమాల్యద ఆహార నియమాలు-

రాయల వారు సర్వం ఎరిగిన వారు.తన ఆముక్తమాల్యద లో భక్తి, రాజనీతి సూత్రాలు, ఆహార నియమాలు ఇలా అన్నీ ఉటంకించారు. భూదేవి అంశ అయిన ఆండాళ్ లేదా గోదా దేవిని పెంచిన పరమ భాగవతులు విష్ణు చిత్తుడు పరమ నిష్టాగరిష్ఠుడు. ఆయనకు తగ్గ ఇల్లాలే విష్ణుచిత్తుని ధర్మపత్ని కూడా.

వేసవిలో విష్ణు చిత్తుని ఇల్లాలు అతిథి అభ్యాగతులకు తెల్లని వేడి అన్నం, వెచ్చని చారులు, వివిధ రకాల మజ్జిగలు , వివిధరకాల అంబళ్లు, భక్ష్యాలు, నిండా మజ్జిగ కలిపిన అన్నములోనికి వడదెబ్బ తగలకుండా ఊరవేసిన మామిడి పిందెల ఊరగాయలు..భోజనం అనంతరం చెరుకు రసాలు అందించేదిట.
వర్షాకాలములో అయితే ఎండిన కొబ్బరి బొండాలను , మట్టలను వంట చెరుకుగా ఉపయోగించి వేడి వేడి అన్నం చేసి కొబ్బరి చిప్ప అపకలతో ఆకులలో వడ్డించి వేయించిన పెసర పప్పు కూర వేసి , ఆకు మరియు వివిధ కాయలతో చేసిన తాళింపులతో , పెసర పప్పులోకి మాంచి సువాసన గల కమ్మని ఆవు నేతిని చెయ్యి తడిచేట్టు ఆకుల్లో అతిథులకు వండి వార్చే వారట.
ఇక శీతాకాలములో వేడి వేడి కమ్మని పుణుగు వాసన వచ్చే రాజనాల వరి అన్నములో మిరియం పొడి, చుయ్యిమని శబ్దం వచ్చేట్టు అపుడే తాళింపు పెట్టిన కూరలను నిప్పుల కుంపటి పొయ్యి మీద నుండి దించి నేరుగా అన్నములోకి వడ్డించేది. శీతాకాలంలో శరీరం లో రొంప ఇత్యాదులు రాకుండా మిరియం కాపాడుతుంది. ఇంక కూరలు అన్నీ దాదాపు ఆవపెట్టి చేసేవారట..దీని వల్ల శరీరములో వేడి పుట్టి చలిని తట్టుకునే తత్వాన్ని కలిగిస్తుంది. మిరియం కారముతో నాలుక చుర్రుమనే ఆవకాయ ఊరగాయలు, అపుడే వేడి చేసిన నెయ్యి కూరలతో కలుపుకుని తిన్నాక.. బాగా ఎఱ్ఱగా మరుగ కాచిన పాలను అన్నములో కలుపుకోమని కొసరి కొసరి వడ్డించే వారట.
వారి వైభవమే వైభవము - ఇపుడు ఏది తిన్నా మధుమేహం వస్తుందేమో అని హడలి చచ్చే కాలం వచ్చింది గానీ అప్పట్లో సుష్టుగా తిని పుష్టిగా పెరిగి కష్టించి పని చేసి ఏ మాయరోగాలు లేకుండా జీవించారు .
అలాగే కృష్ణరాయల కాలము నాటి వాడు, దూర్జటి మహాకవి శిష్యుడు అయిన కోట శివరామయ్య అనే కవి అప్పటి ఆహారపు అలవాట్లను గూర్చి ఎంత బాగా చెప్పారో తేట తెనుగులో .
అందరూ అంటారు బ్రాహ్మణులకు తప్ప మిగతా వారు కవులు లేరని, వారికి విద్యాభ్యాసం ఉండేది కాదనిన్నీ..ఎందుకు లేరూ ఉన్నారు ఇతర వర్ణస్తులు విధ్యాధికులు అయినవారెందరో .. కానీ వారు వ్రాసిన వ్రాతలు లభ్యం కానందువల్ల చరిత్రలో ఉటంకించలేకపోయారు గానీ మన కావలి సోదరులు చెప్పిన ప్రకారము దాదాపు 20,000 తాళపత్ర ప్రతులు వారు గ్రామ గ్రామాల కు తిరిగి సేకరించినవి కనీసం ఆ అక్షరాలు కూడా గుర్తు పట్టని స్థితిలో ఉంటే వాటిని కలకత్తా మ్యూజియం కి తరలించామని . ఇది 1830 ల నాటి మాట. ఇపుడవి లభ్యమో కాదో మరి కానీ ఆధునిక పరిజ్ఞానం వినియోగించి వాటిని పరిష్కరిస్తే మరెన్ని తెలుగు కావ్యాలు లభ్యం అయ్యేవో మనకు.
ఈ కోట శివరామయ్య శూద్రవర్ణము వారు అయిననూ దూర్జటి మహాకవి కుటుంబ సాంగత్యం చేత మంచి ప్రజ్ఞ గడించి తేట తెనుగులో సనందోపాఖ్యానం అనే గ్రంథం వ్రాశారు. అందలి పద్యం ఏదీ మచ్చుకు రుచి చూడండి.
"గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్
జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్
సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్
బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్"
ఆహా గారెలు, బూరెలు, ఇడ్డెనలు , కమ్మని దోసెలు , చక్కిలంబులు , చారు, కూరలు , ఫలరసాలు , పానకములు, పాయసాన్నములు , చక్కెర అప్పడాలు, పేరిన నేయి , చెరకు బిళ్లలు, చల్లని నీరు మజ్జిగ.. ఇవన్నీ వింటుంటేనే నోరూరుతోందే.
అన్నా కుమార్ ఆత్రేయ గారూ , లక్ష్మి గారూ, విశ్వనాథ శర్మ మొదలి గారూ ఇకనుండీ మీ వద్దనున్న ఆ తమిళ కుంకలకు నొక్కి మరీ చెప్పండి ఇడ్లీ , దోసెలు, చారు ఇవన్నీ అచ్చంగా మనవే అని.
కావాలంటే ప్రూఫ్ ఇదిగో అని మరీ చూపండి. ఇఖ నుండీ మా ఇంటిలో కూడా నేను తగ్గేదే లేదు.. హన్నా!!
మన వంటలు కాపీ కొట్టి తమిళం స్టైల్ అని పోజులు కొడతారా
ఇదండీ ఆనాడు అత్యధికులు దీర్ఘ కాలం మంచి ఆరోగ్యము తో జీవించిన మనవారి ఆహార ఆరోగ్య సూత్రాలు.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...