Thursday, 31 August 2023

 ఆరుద్ర గారి జయంతి సందర్భంగా


కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త,అంత్య ప్రాసల ముద్ర ఆరుద్ర' అనే నానుడి తెచ్చుకున్న ఆరుద్ర గారి జయంతి సందర్భంగా.....


【 #ఆధునిక ఆంద్ర సాహిత్య చరిత్రలో ఒక సముచిత స్థానాన్నిసంపాదించుకున్న మహానుభావుడు. ఇతను 'ఆరుద్ర' కాడు, 'ఆరో రుద్రుడు' అని శ్రీశ్రీ చేత అనిపించుకొన్న ధన్యజీవి.#】

" తరానికో వంద కవులు.. తయారవుతారెప్పుడూ
వందనూ మందలోనూ... మిగలగలిగేదొక్కడు''...

అంటూ తన మాటల్లోనే #అభ్యుదయ కవిత్వోద్యమంలో నిలదొక్కుకుని, ఆ తరంలో మిగలగలిగిందీ, విశ్వరూపం దాల్చిందీ ఒక్కడే. ఆ ఒక్కడే "#కళాప్రపూర్ణ డిగా సాహితీప్రియుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన ఆదర్శనీయుడు "ఆరుద్ర". ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక అపూర్వమైన, అరుదైన సంఘటన ఏదంటే.. #ఆరుద్ర అనే ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, ఒక ఇతిహాసంగా రూపొందడమే.

కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం, ఒక సాహిత్య సాంస్కృతిక సుదర్శనం. అభ్యుదయ కవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు.

#ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. 1925వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన వెంకట జోగమ్మ, భాగవతుల నరసింగరావు దంపతులకు జన్మించారు. ఆరుద్ర ఒక నక్షత్రం పేరు. ఒక పురుగు పేరు కూడా. వర్షకాలంలో నేల పరిచిన పచ్చటి తివాసీలా ఉన్నప్పడు, ఎర్రగా ముఖమల్‌లా మెత్తగా మెరుస్తూ నేలపై నడయాడే అందమైన పురుగు ఆరుద్ర. చిన్నప్పడు ఆరుద్ర కూడా ఆ పురుగులాగే ఎర్రగా, బొద్దుగా, చూడముచ్చటగా ఉంటే, స్నేహితులు అతనికి వెటకారంగా పెట్టిన పేరే స్థిరపడింది. సాహిత్యలోకానికి ఆయన ఆరుద్రగానే పరిచయమయ్యారు.

ఏ.వీ.ఎన్‌ హైస్కూల్‌లో, తరువాత విజయనగరంలోని యం.ఆర్‌.కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1934-47 మధ్యకాలంలో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో గమస్తాగా పనిచేశారు. చిన్నప్పటినుండి సంగీతంపట్ల మక్కువ ఉన్న ఆరుద్ర ఉద్యోగం వదిలేసి కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన దృష్టి సాహిత్యం వైపు మళ్ళింది. 1947-48 మధ్యకాలంలో మద్రాసు నుండి వెలువడిన ‘ఆనందవాణి’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు.

ఆ పత్రికలో శ్రీశ్రీతో పాటుగా ఎన్నో కవితలను వ్రాశారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆరుద్ర. ఆయన రచనల్లో మార్క్సిస్టు భావజాలం ఉండడాన్ని బట్టి ఆరుద్రపై శ్రీశ్రీ రచనల ప్రభావం ఉందని పలువురు సాహితీ వేత్తలు అంటుంటారు. 1946లో ఆరుద్ర చాలా కష్టాలు అనుభవించారు. తినడానికి తిండికూడా లేక మద్రాసులోని "పనగళ్ పార్కు"లో నీళ్ళు తాగి పడుకున్నారు. అయినా ఇవేమీ ఆయన సాహిత్యసేవకు అడ్డురాలేదు.

కేవలం సినిమా పాటలేకాదు, గేయాలు, గేయనాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య రచనలు ఇలా కొన్ని వందల రచనలు ఆయన కలం నుండి జాలువారాయి. ఆయన రాసిన రచనలతో ఆంధ్ర సాహిత్యం ఉన్నత శిఖరాలనధిరోహించింది. ఇంత వైవిధ్యమున్న రచయిత మరొకరు ఉండరేమో అనేంతగా ఉంటాయి ఆయన రచనలు.

నిజాంకాలంలో ఒకసారి ఓ యువతి, ఒక రైలుపెట్టెనుండి మరో రైలుపెట్టెకు నగ్నంగా తిరుగుతూ ప్రయణీకులను ఇబ్బందులకు గురిచేసిందట. అక్కడున్న కొంతమంది ఆమెను ‘‘ఇలా నగ్నంగా తిరగడానికి సిగ్గనిపించడంలేదా’’ అని నిలదీశారు. దానికి ఆమె ‘‘నా గౌరవం, మర్యాద, సిగ్గు అన్నీ రజాకార్ల చేతుల్లో బలయ్యాయి. ఇంకా సిగ్గుపడడానికి నా దగ్గర ఏమీలేదు. అయినా రోజు రోజుకూ రజాకార్ల చేతుల్లో బలైపోతున్న మహిళలను కాపాడలేకపోతున్నందుకు మీరు సిగ్గుపడాలి’’ అని బదులిచ్చిందిట రజకార్ల చేతుల్లో అత్యాచారానికి గురైన ఆ మహిళ. తరువాత ఆ యువతి ఉరివేసుకుని చనిపోయింది.

1940 దశకంలో తెలంగాణాలో రజాకార్ల ఆకృత్యాలకు బలైపోయిన మహిళల దుస్థితికి అది ఓ ఉదాహరణ మాత్రమే. "కృష్ణ పత్రిక"లో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని చదివిన ఆరుద్ర అప్పట్లో చలించిపోయారు. తెలంగాణాలో రజాకార్లు చేస్తున్న ఆకృత్యాలపై గుండెల్లో పుట్టిన తన ఆవేదనను కావ్యరూపంలో మలిచారు. "ఆరుద్ర" కలం పేరుతో ఆయన రాసిన ఆ కావ్యమే "#త్వమేవాహం". ఈ రచన తెలంగాణాలో నిజాం నిరంకుశత్వానికి అద్దంపడుతుంది.

రజాకార్ల ఆకృత్యాలపై రచించిన ఈ "త్వమేవాహం" అనే కావ్యం ఎందరో తెలంగాణావాదులకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన ముఖ్య రచనలలో ఒకటిగా అది నిలిచింది. ఈ కావ్యాన్ని చదివి "నేనిక పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు" అని మహాకవి శ్రీశ్రీ అంతటి గొప్ప కవి నుండి ప్రశంసలందుకున్నారంటే ఆ రచన ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు.

అభ్యుదయ సాహిత్యంతో తెలుగుజాతిని మేల్కొలిపిన అతికొద్దిమంది రచయితల్లో ఆరుద్ర ఒకరు. అభ్యుదయ సాహిత్యమేకాకుండా సినీసాహిత్యంలో కూడా ఆయనకు తిరుగులేదు. వివిధ రంగాల్లో, ప్రక్రియల్లో వ్యాసాలను రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. విభిన్న కోణాల్లో రచనలు చేయడం ఆరుద్రకే చెల్లింది.

కేవలం అభ్యుదయ రచనలు, కావ్యాలకే పరిమితం కాలేదు ఆరుద్ర. సినీ సాహిత్యంలో ఆయన రాసిన పాటలు, తెలుగు సినీ సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిందనడంలో అతిశయోక్తిలేదు. ఈ మహాకవి చేసిన సాహితీ సేవకు గుర్తింపుగా 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం "#కళాప్రపూర్ణ" బిరుదునిచ్చి సత్కరించింది.అయితే ఆరుద్రకు దక్కిన ఏకైక పురస్కారం ఇదొక్కటే కావడం ఎంతైనా బాధాకరం.

మహాకవి శ్రీశ్రీ తరువాత యువతపై ఎక్కువగా ముద్రవేసిన కవిగా పేరుగాంచిన ఆరుద్ర జూన్‌ 4, 1998న స్వర్గస్తులైనారు. ఆయన లేకపోయినా.. "ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలో మమకారం ఎప్పటికీ పోదు' అనే ఆయన పాటలాగే ఆయన సాహితీ కుసుమాలు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
ఆయన అన్నట్లుగానే -#కవిత కోసమే ఆయన పుట్టాడు,క్రాంతి కోసం కలం పట్టాడు.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...