ఒక మహోన్నత వ్యక్తి, పద్మశ్రీ గ్రహీత, శాంతి స్వరూప్ బట్నాకర్ గ్రహీత
*డాక్టర్ అయ్యగారి సాంబశివరావు''
చరిత్రలో, ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓ గొప్ప వ్యక్తి కథ ఇది !! ఆ గొప్ప వ్యక్తి మన తెలుగువారు కావడం ఎంతో గర్వకారణం.
"కాలం మనిషిని పుట్టిస్తుంది, అదే కాలం మనిషిని తనలో ఐక్యం చేసుకుంటుంది".
ఆ మనిషి పేదవాడైనా, ధనవంతుడైనా, సామాన్యుడైనా - అసమాన్యుడైనా...అదే కాల ధర్మం.
ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి కొందరు చరిత్ర పుటల్లో మిగిలిపోతారు - మరి కొందరు ప్రజల హృదయాల్లో !
అలా చరిత్రలో మరియు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అతి కొద్ది మంది వ్యక్తులలో, ఈయన కూడా ఒకరు. ఆయన మరెవరో కాదు మన తెలుగుతల్లి ముద్దుబిడ్డ, #భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రదేశాలతో సరి సమానంగా నిలిపిన మహోన్నతుడు, అంతకుమించి మానవతావాది,
కర్మయోగి. ఆయన పేరుని ఆయన పుట్టిన ఊరికి
కాక, వేరే ఒక ప్రాంతంలో ,అది కూడా ఒక ప్రముఖ
మెట్రో నగరంలో ఒక ఏరియాకి ఆయన పేరు పెట్టారంటే ఆయన ఏమి సాధిస్తే అలా పెడతారు? ఆ పేరు పలికితే
రెండే పదాలు, కానీ ఆయన పేరు కన్నా ముందుగా ఆయన
ఏమి సాధించారో చెప్తే ఆ పేరుకున్న వెయిట్ అర్థం అవుతుంది,
ఆ పేరు గల మనిషి బలం అర్ధమవుతుంది.
"ఈ ప్రపంచంలో కనుగొనబడిన ప్రతిదీ కూడా ఈ
భూమి ప్రసాదమే, అది మనం తినే అన్నమైన, ఒక సూపర్ కంప్యూటర్ అయినా... అలాగే తాను కనిపెట్టగలిగే వస్తువు ముడి సరుకు ఆ భూమిలోనే ఉంది అనే మేధస్సు కలిగిన వ్యక్తుల ఆలోచనల
ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో అనుభవించే
ప్రతి సుఖానికి, బద్ధకానికి నాంది."
అది 1914 వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీకు,
విక్రమ నామ సంవత్సరం, భాద్రపద బహుళ దశమి, సోమవారం, మేష లగ్నం , #భీమవరానికి పది
కిలోమీటర్ల దూరంలో #మొగల్లు అనే చిన్న పల్లెటూరు, సమయం సరిగ్గా రాత్రి తొమ్మిది కావస్తోంది. అప్పుడే అయ్యగారి వారింట ఒక నిండు గర్భిణీ ఐన సుందరమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యయి, హాస్పిటల్ కి వెళ్ళాలన్నా పది కిలోమీటర్ల పోవాలా,
ఊళ్లో పురుడు పోసే ఒక ముసలమ్మను వెంటనే తీసుకొచ్చారు, లోపలికి వెళ్లి తలుపులు మూసింది,
మళ్లీ అదే ముసలమ్మ తలుపులు తెరిచి,
"ఆ రాములోరి నక్షత్రంలో నీకు మగ బిడ్డ జన్మించాడు వెంకటాచలం" అంటూ శుభవార్తను తెలియజేసింది.
ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, చిన్నప్పటి
నుంచి చదువు అంటే ఎంతో ప్రేమ, అలాంటి ఇలాంటి ప్రేమ కాదు, ప్రతి పరీక్షలోనే అతడే అగ్రగన్యుడు. ఆ మొగల్లులోనే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. అంతకుమించి అతనికి చదవాలని ఆశ ఉన్నా, స్కూలు అయితే లేదు. అప్పట్లో ఐదవ తరగతి దాటి చదవాలంటే వేరే ఊరు వెళ్లాలి , తన కుటుంబాన్ని ఎంతగానో బ్రతిమాలాడు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే , చివరికి #తణుకు చెందిన వంగూరి వారు అతనికి చదువు మీద ఉన్న ప్రేమను చూసి వసతి ,మరియు ఒక రోజు భోజనం పెట్టడానికి ఒప్పుకున్నారు, మొత్తం మీద తణుకు హైస్కూల్లో తన యొక్క సెకండరీ విద్యను ప్రారంభించి, ప్రతిరోజు భోజనానికి వారాలబ్బాయిగా మారాడు, ఒకరోజు భోజనం అంటే ఏదోలా కష్టపడొచ్చు కానీ
ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయ్యేంతవరకు భోజనం అంటే మాటలా, కొంతమంది నువ్వు మా వాడివి కాదని మరి కొంతమంది మీ శాఖ వేరని అలా చాలామంది భోజనం పెట్టేవారు కాదు, ఒక్కోసారి కొన్ని వారాల పాటు కూడా భోజనం చేసే అవకాశం ఉండేది కాదు, చివరికి
ఒక్కోసారి తన ఆకలిని తీర్చుకోవడానికి మినుములను నానబెట్టి వాటిని తింటూ ఉండేవాడు. మొత్తానికి కష్టపడి దాతల సహకారంతో #తణుకులోనే ఎస్.ఎస్.ఎల్.సి ని విజయవంతంగా పూర్తి చేశారు, చదువుకోవాలి అనే తృష్ణ ఆయనలో రోజురోజుకీ పెరిగిందే తప్ప, ఎన్నడూ తగ్గలేదు.
"నీ సంకల్పం గొప్పదైతే ప్రపంచంలో ప్రతి అణువణువు కూడా నీకు సహకరిస్తుంది"
ఎలాగోలా, ఎస్.ఎస్.ఎల్.సి అయితే పూర్తి చేశాడు
కానీ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదవాలి అనే
తన ఆశని తన అన్నలకి వ్యక్తం చేయడంతో వారు
కూడా సరే అని విజయనగరం మహారాజా కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ అయితే అయ్యాడు కానీ
మళ్ళీ అవే ఆర్థిక సమస్యలు, చివరికి ప్రతిరోజు ఆ విజయనగరంలో దేవాలయాల వద్ద వచ్చే భక్తులకు తనకు సాయం చేయమని కూడా అడిగేవాడు.
"కడుపు కోసం చెయ్యి చాచేవాడిని చూసి ఉంటాము, కానీ చదువు కోసం చేయి చాచిన వ్యక్తులు చాలా
అరుదు కదా!" అలా కష్టపడి చదువును నెట్టుకొస్తున్న సమయంలో ఇతని ప్రతిభను గుర్తించినటువంటి ఆ విజయనగరం మహారాజా వారు కొంతవరకు సాయం చేయడంతో మొత్తానికి విజయవంతంగా తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
కొడుకుకి చదువు మీద ఉన్న ప్రేమను చూసి
ముగ్ధురాలైన ఆయన తల్లి గారు, తన పట్టు చీరలు అమ్మేసి తన కొడుకుని బీఎస్సీలో చేర్చడానికి సహకరించారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో బ్యాచిలర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాయిన్ అయిన మొదటిరోజు నుంచే ఎంతో కష్టపడి చదివేవారు.
అప్పట్లో పండిత మదన్మోహన్ మాలవ్య ఆ కాలేజీ
యొక్క ప్రిన్సిపాల్ గా ఉండేవారు. జాయిన్ అయితే అయ్యాడు కానీ, మొదటి సంవత్సరం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి .అతని పరిస్థితి చూసి పండిత్ మదన్మోహన్ మాలవ్య గారు కనీసం రెండో సంవత్సరం అయినా ఫీజు కట్టమని చెప్పారు, మళ్లీ రెండోసంవత్సరం కూడా అదే పరిస్థితి కానీ అతనికి చదువు మీద ఉన్న ప్రేమకు ఆనందభరితుడైన ఆ ప్రిన్సిపాల్ గారు కనీసం మూడో సంవత్సరం అయినా పరీక్ష ఫీజు కట్టమని చెప్పి, ఆ సంవత్సరం కూడా పరీక్షలు రాయనిచ్చారు.
కనీసం కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా లేని పరిస్థితి , పరీక్ష సమయంలో పుస్తకాలు కూడా ఎవర్నో ఒకరిని అప్పు అడిగి తెచ్చుకొని చదివేవారు, చివరికి మూడో సంవత్సరం రానే వచ్చింది, కానీ ఈసారి ప్రిన్సిపాల్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ! చివరికి చేసేది ఏమీ లేక ఇంటికి టెలిగ్రామ్ పంపారుజ్ "మీరు కనుక డబ్బు పంపగలిగితే రెండు రోజుల్లో నేను ఫీజు కట్టగలను లేదంటే రెండు రోజులలో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను" అని దాని సందేశం. ఆరోజు మొగల్లులో డ్యూటీలో ఉన్న #పోస్టుమాస్టర్ పైడిమర్రి వెంకట రామయ్య గారు ఈ యొక్క విషయాన్ని చదివి చలించిపోయి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి భార్య 120 తులాల బంగారు గొలుసును అమ్మేసి ఆ డబ్బులు అతనికి మనీ ఆర్డర్ చేశారు. "నిజంగా అటువంటి దాతృత్వం కలిగిన వెంకటరామయ్య గారు ఆ రోజు డ్యూటీలో లేకపోయి ఉంటే ఈరోజు భారతీయ ఎలక్ట్రానిక్ పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో.
మొత్తానికి మనీ ఆర్డర్ తో ఫీజు కట్టి మూడో సంవత్సరం పరీక్ష కూడా మొట్టమొదటి స్థాయిలో ఉత్తీర్ణతను సాధించాడు ఆ యువకుడు. తర్వాత 1938లో అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు భౌతిక శాస్త్రంలో తన యొక్క మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశారు.
ఆ తర్వాత #టాటా సంస్థ వారి యొక్క సహకారంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో తన యొక్క మాస్టర్స్ పట్టా కూడా పొందారు, అక్కడ ఎలక్ట్రానిక్ రంగంలో నిష్ణాతులైన డేవిడ్ ప్యాక్యార్డ్ వంటి వారి నుండి అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. అక్కడే వారికి ఉద్యోగాన్ని ఆశ చూపినా, తన జ్ఞానాన్ని భారతదేశ కోసం మాత్రమే ఉపయోగించాలని నిశ్చయించుకుని, తిరిగి తనకి సహకారం చేసిన టాటా సంస్థలోనే జాయిన్ అయ్యారు. హోమీ #జహంగీర్_బాబా, #సివిరామన్, #విక్రమ్_సారాభాయ్ వంటి ఎంతోమంది ప్రముఖులతో కలిసి పని చేశారు.
అప్పటివరకు భారతదేశం కనీ, వినీ ఎరుగని ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడం ప్రారంభించారు, 1956 లో దేశీయంగా తయారుచేసిన #అప్సర అనే పరమాణు రియాక్టర్ నిర్మాణంలో కూడా విశేషమైన కృషి చేశారు. ఆయన యొక్క ప్రతిభ తెలియడానికి భారతదేశానికి ఎంతో సమయం పట్టలేదు. 1960 వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీని, 1972వ సంవత్సరంలో పద్మభూషణ్ తో సత్కరించింది.
అది 1962 సంవత్సరం. భారతదేశం - చైనా మధ్య జరిగిన యుద్ధంలో మన దేశానికి కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే స్వీయ ఆయుధాల తయారీ అనేటువంటిది భారతదేశానికి అత్యవసర రంగమని బాబా గారు గుర్తించారు.
దానికోసం ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి అని నిశ్చయించుకున్నారు. అదే *ఎలక్ట్రానిక్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా లిమిటెడ్.* కానీ దాన్ని ఎలాగైనా
తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పాలి అనేటువంటిది
మన హీరో గారి బలమైన సంకల్పం.
చివరికి ప్రభుత్వాన్ని, ఆ సంస్థలో వారిని ఏదో విధంగా ఒప్పించి ఆ సంస్థని 1967 లో, #హైదరాబాదులో స్థాపించడం జరిగింది. దానికి చైర్మన్ గా డాక్టర్ విక్రం సారాభాయ్ గారిని, అలాగే ఎండిగా మన కథలోని నాయకున్ని నియమించడం జరిగింది.
ఈ యొక్క #ఈసీఐఎల్ లో భారత దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ సిస్టమ్స్ , అలాగే వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ని కూడా అక్కడే తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది సైంటిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ యొక్క కంప్యూటర్ల మీద మరియు సాఫ్ట్వేర్ తయారీలో ప్రత్యేక ట్రైనింగ్ కూడా నిర్వహించేవారు. భారత దేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ సిస్టమ్స్, షేర్ మార్కెట్స్ , బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, మొదటి ఈవీఎం మిషన్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్, ఎయిర్పోర్ట్ స్కానింగ్ సిస్టమ్స్ , అలాగే ఆర్మీకి సంబంధించి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు సాఫ్ట్వేర్లను అన్ని కూడా ఈసీఐఎల్ లో తయారయ్యాయి. ఒకరకంగా ఈరోజు హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ గా తయారయ్యింది అంటే, దానికి కారణం కూడా #ఈసీఐఎల్ సంస్థ. సంస్థలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు కలిసి హైదరాబాదులో మొట్టమొదటి
సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ప్రారంభించడం జరిగింది.
ఈయన సాధించిన విజయ పరంపర అనిర్వచనీయం, ఒక ఉద్యోగిగా తాను గొప్ప వ్యక్తే..అలాగే ఒక మనిషిగా కూడా ఆయన అంతే మహనీయుడు, మానవత్వానికి, సింప్లిసిటీకి ఆయన యొక్క కల్ట్ ఎగ్జాంపుల్. 1978 సంవత్సరంలో తనకు తానుగానే సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన అంత సాధించినా కూడా ఎప్పుడూ కూడా సాధారణ వ్యక్తిలాగ ఆర్టిసీ బస్సుల్లో, ఆటోల్లో తిరిగేవారు. చివరికి తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి ఆటో కొనిచ్చారు, తాను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అదే ఆటోలో వెళ్లేవారు...అది సన్మానాలైనా, మీటింగులైనా... అది కూడా డబ్బులు తీసుకుంటేనే ఎక్కేవారుట.
ఇంతకీ ఆయన పేరు మీకు చెప్పలేదు కదా ! ఆయన
ఒక రోజు ఎక్కడికో పనిమీద వెళ్లి, తిరిగి వస్తూ, ఆర్టీసీ బస్సులో, #"ఏఎస్ రావు నగర్ వచ్చాక ఆపండి" అని కండక్టర్ కి చెప్పారట, మళ్లీ పది నిమిషాలు పోయాక బాబు ఏఎస్ రావు నగర్ వచ్చేసిందా అని అడిగారట, అప్పుడు
ఆ కండక్టర్ చిరాకుపడుతూ ఎదర వచ్చే స్టాపే ఏఎస్ రావు నగర్ అని చెప్పాడు, ఆ స్టాప్ రాగానే ఆయన దిగి వెళ్ళిపోయారు, ఆ తర్వాత బస్సులో
ఉన్న వాళ్ళందరూ ఆ కండక్టర్ కి చెప్పారు ఆయనే,
"పద్మశ్రీ గ్రహీత, శాంతి స్వరూప్ బట్నాకర్ గ్రహీత
*డాక్టర్ అయ్యగారి సాంబశివరావు"* అని.
ఆరోజు ఆయన నాటిన *#ఈసీఐఎల్* అనే
వటవృక్షం నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి. అందుకోసమే ఈసీఐఎల్ ప్రాంతాన్ని మొత్తం ఆయన గుర్తుగా *"ఏఎస్ రావు నగర్"* గా నామకరణం చేశారు. ఎప్పుడైనా వివిధ ప్రాంతాల నుంచి ఎవరైనా
వెళ్తే చాలా ఆప్యాయంగా వారందరికీ కూడా భోజనాలు
పెట్టి పంపించేవారు. అంతేకాకుండా, భోజనానికి
ఇబ్బంది పడే వారికి ఆయన ఇంటి దగ్గరే చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసేవారు. ఎందుకంటే వారాలబ్బాయిగా చేసిన ఆయనకి తిండి , ఆకలి విలువ బాగా తెలుసు కాబట్టి. ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రాయాల్సింది చాలానే ఉంది కానీ ఎక్కడో చోట ఆగాలి కాబట్టి ఇక్కడే ఆగుతూ....
ఒక సాధారణ మధ్యతరగతి విద్యార్థిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి చదువుకు డబ్బులేక,
కడుపుకు తిండిలేక, ఎంతో ఇబ్బంది పడుతూ, కొన్ని వందల మందికి విద్యా దానాలు, కొన్ని వేలమందికి ఆకలి తీర్చే చేసే స్థాయికి ఎదిగి, భారత దేశాన్ని ఎలక్ట్రానిక్ విభాగంలో ప్రపంచ స్థాయి సంస్థలతో సమానంగా నిలిపి, కర్మను మాత్రమే చేసి వాటి ఫలితాన్ని విడిచిపెట్టిన అసలు సిసలైన కర్మయోగి, తెలుగు వారి ముద్దుబిడ్డ, శ్రీ అయ్యగారి సాంబశివరావు గారికి మన తెలుగు వాళ్ళ అందరి తరుపున వేవేల జోహార్లు, నమస్కారాలు.
No comments:
Post a Comment