Thursday, 3 August 2023

                     అళసింగ పెరుమాళ్

మనదేశం , ధర్మం , సంస్కృతి మీద వెకిలి కామెంట్లు చేసే అమీర్ ఖాన్ , ప్రకాష్ రాజ్ , కమల్ హాసన్ లాంటి వాళ్ళు మనకు బాగా తెలుసు కానీ , దేశం , ధర్మం కోసం కుటుంబాలు , ఆస్తిపాస్తుల్ని వదిలేసుకొన్న అళసింగ పెరుమాళ్ గురించి మనకు తెలియదు. 

ఎవరు ఈ అళసింగ పెరుమాళ్? 

1865 లో మైసూరు ప్రాంతానికి చెందిన చిక్కమంగళూరు లో వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి , మద్రాసులో చదువుకొన్న ఈయన స్వామీ వివేకానంద జీవితానికి , బోధనలకు విశేషంగా ప్రభావితం అయ్యారు. 1892 డిశెంబరు లో స్వామీజీ మద్రాసు వచ్చినప్పుడు , వారిని కలిసి త్వరలో అమెరికా లోని షికాగో మహానగరంలో '' విశ్వమత మహా సభ '' [  World Parliament of Religions ] జరగబోతున్నదని , మన సనాతన ధర్మం , భారతజాతి , నాగరికత , సంస్కృతి ఎంత గొప్పవో , మానవాళికి ఎంత మేలు చేస్తాయో చెప్పడానికి అది మంచి వేదిక అని చెప్పి , అమెరికా వెళ్లేందుకు కావాల్సిన డబ్బుకు  తాను , తన స్నేహితులు కూడా విరాళాలు సేకరిస్తామని అన్నారు. అలాగే సేకరించి స్వామీజీకి పంపించారు. 

1893 మే 31 న ముంబాయి నుండి బయలుదేరి స్వామీ వివేకానంద అమెరికా చేరాక , జూలై 30 న షికాగోలో అడుగుపెట్టారు. అక్కడ ఆయన్ని పట్టించుకొనేవాళ్ళు ఎవ్వరూ లేరు.  తనదగ్గరున్న డబ్బు తక్కువే కాబట్టి , రోజూ తిండి కొనుక్కొని తింటుంటే అది అయిపోతుందని తెలిసి రెండు , మూడు రోజులకు ఒకసారి మాత్రమే స్వామీజీ భోజనం చేసేవారట. అలా చేసినా వున్న డబ్బు అయిపోతోంది. అపుడు స్వామీజీ  అళసింగ పెరుమాళ్ కు టెలిగ్రాం పంపారట. అమెరికాలో స్వామీజీ పడుతున్న కష్టం అర్థం అయ్యి పెరుమాళ్ చాలా బాధ పడ్డారు. అపుడు ఆయన మద్రాసులో కొన్ని రోజులు , చిక్కమంగళూరులో కొన్ని రోజులు ఇంటీంటికీ వెళ్ళి భిక్షాటన చేసి కొంత డబ్బు సేకరించారు. ఆరోజుల్లో వూళ్ళో బావి నుండి నీళ్ళు చేదుకొని ధనవంతుల ఇళ్ళకు ఇస్తే డబ్బులు ఇచ్చేవారు. అది కూడా చేసాడు పెరుమాళ్. అప్పటీకే అతనికి పెళ్ళి అయ్యివుంటుంది. భర్త ఉదయం నుండి మధ్యాహ్నం దాకా బావి నుండి నీళ్ళు తోడి ,  సాయంత్రం  మళ్ళీ ఇంటింటికి వెళ్లి డబ్బులు భిక్షం అడగడాన్ని చూసి చాలా బాధ పడిన భార్య మంగమ్మ , తన పుట్టింటివారు ఇచ్చిన నగల్లో ఒక్క తాళిబొట్టును మాత్రమే వుంచుకొని తక్కినవన్నీ ఇచ్చేసి ,  '' మీరు వీటిని అమ్మి , ఆ డబ్బును స్వామీజీకి పంపండి ''  అని భర్త తో అన్నదట. కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా పెరుమాళ్ అలానే చేసి , డబ్బును స్వామీజీకి మనీ ఆర్డర్ ద్వారా పంపారట. 

1893 విశ్వమత మహాసభ లో ప్రసంగించి అంత వరకూ ప్రపంచ దేశాలకు , మేధావులకూ భారత్ అంటే అనాగరికమైనదని , పాములు పట్టుకొని ఆడించే జాతి అని వున్న నీచ అభిప్రాయాన్ని పటాపంచలు చేసి భారత్ ను విశ్వగురువు స్థానంలో నిలిపిన స్వామీ వివేకానందుల బ్రహ్మాండమైన విజయం వెనుక కర్ణాటకకు చెందిన ఇద్దరు పేద చిక్కమంగళూరు బ్రాహ్మణ దంపతుల త్యాగం కూడా వుందని ఎందరికి తెలుసు ? 

చరిత్ర గుర్తించని చరితార్థులు ఎందరో ! 

పుస్తకాల్లో కనపడని పుణ్యాత్ములు ఇంకెందరో !

మరుగున పడిపోయిన మహానుభావులు మరెందరో !

జైహింద్ 🇮🇳

No comments:

Post a Comment

show image

  Sep 12 , 2025 " The Great Indian Warriors " Saragarhi Day September Twenty Sixth Trib...