Friday, 30 June 2023

మాలతి చందూర్ 🌺👏 🚩

వ్రాసిన వారు:- చొప్పకట్ల సత్యనారాయణ గారు.



     ❤️1950లు ఆంధ్రులు మద్రాసుకు ఏదైనా పని మీద వెళ్ళాలంటే ఆ పనితో పాటు కొన్ని చూసి రావాలి అని ఒక ప్రణాళిక ఉండేది. వాటిలో ముఖ్యమైనవి మెరీనా బీచ్, సినీతారల ఇళ్ళు, స్టుడియోలు, ఒక రచయిత్రి ఇల్లు. అమెరికా ప్రెసిడెంట్ నుండి ఆత్రేయపురం పూతరేకుల తయారీ వరకూ, గృహ అలంకరణ నుండి జీవన విధానం వరకూ, వైవాహిక జీవితం దగ్గర నుంచి ఉద్యోగ జీవితం వరకూ ఏ విషయం మీద అయినా సాధికారికంగా మాట్లాడగలిగే రచయిత్రి ఆమె. ప్రపంచ ప్రఖ్యాత నవలల దగ్గర నుంచి మనం మరిచిపోయిన మన గొప్ప రచనల వరకూ ఏ పుస్తకం గురించైనా వివరించగల సత్తా ఆమె స్వంతం. అందుకే ఆమెను చూడాలని, ఆమెతో నేరుగా మాట్లాడాలని, ఆమె మాకు తెలుసు అని నలుగురికీ చెప్పుకోవాలని యావత్ ఆంధ్రులందరూ ఉవ్విళ్ళూరేవారు. ఆమే రచయితల్లో సూపర్ స్టార్ గా ఎదిగిన శ్రీమతి మాలతీ చందూర్.

 

      🏵తన 21వ ఏట 1949లో రచనా ప్రస్థానం మొదలుపెట్టిన మాలతీ గారు 85 ఏళ్ళ వయసులో 2013లో చనిపోయేవరకూ సాహితీ సేవకే అంకితమయ్యారు. మొదట రేడియో వ్యాసాలు రాసి, చదవడం ద్వారా సాహితీ ప్రపంచంలో ఆమె ప్రస్థానం మొదలైంది. ‘రవ్వల దుద్దులు’ కథతో మొదలై ఎన్నో కథలు, 18 నవలలు రాశారు. ఇక 1952లో ఆంధ్రప్రభ వారపత్రికలో ‘ప్రమదావనం’ శీర్షికతో మొదలైన ఆమె ప్రభంజనం దాదాపు 47ఏళ్ళ పాటు కొనసాగింది. అన్ని ఏళ్ళ పాటు శీర్షిక నడిపిన మొట్టమొదటి తెలుగు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

 

     🏵 ప్రమదావనం శీర్షికలో వంటలు, ఆంగ్ల  నవలల, రచయితల పరిచయం, విదేశాలలో ప్రయాణం చేసినవారి అనుభవాలు, సౌందర్య చిట్కాలు, గృహ అలంకరణ, ప్రశ్నలు-జవాబుల ద్వారా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, వ్యాపార, మానసిక ఆరోగ్య విషయాలపై ఆమె ఎందరికో జీవితాలను నిలబెట్టగలిగే సలహాలు, సూచనలు చేశారు. నిజానికి ఏ విషయంపై సందేహం వచ్చినా నేడు మనం గూగుల్ ని అడిగినట్టు, ఆ కాలంలో మాలతీ గారికి ఉత్తరాలు రాసి, ఆమె దానిని ప్రమదావనం శీర్షికలో జవాబివ్వగా తెలుసుకునేవారు. ఆమె ఇచ్చిన సూచనలను పాటించి అన్నీ కోల్పోయాననుకుని, ఆత్మహత్యకు సిద్ధమైనవారు కూడా జీవితంలో గెలుపు సాధించినవారు కోకొల్లలు. ఇక ఆమె రాసిన వంటలు-పిండివంటలు పుస్తకంతో అత్తారింటిలో గృహప్రవేశం చేసిన ఆడపడుచులు ఎందరో.

 

       🕉వైవాహిక బంధంలో ఉండే ఆటుపోట్లు గురించి, మన భాగస్వామిని ఎలా అర్ధం చేసుకోవాలి, మన గురించి వారికి అర్ధమయ్యేలా ఎలా చెప్పాలి వంటి రిలేషన్ షిప్ సలహాలు కూడా ఆమె ఎన్నో చెప్పేవారు. అవి పాటించి తమ సంసారాలను సాఫీగా, ఆనందంగా గడిపేసిన జంటలను లెక్కించడం కష్టం. నిజానికి సలహాలు ఇవ్వడం సులువు, పాటించడం కష్టం. ఏదో ప్రశ్న అడిగారు కాబట్టి ఉచిత సలహా విసిరేసినట్టు రాసేవారు కాదు ఆమె. తన జీవితంలో పాటించిన సలహాలనే పాఠకులకు ఇచ్చేవారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. 

 

        🔔ఆమె భర్త ఎన్. ఆర్. చందూర్ గారు కూడా గొప్ప సాహితీవేత్త, రచయిత. పత్రికను కూడా నడిపేవారు. ఆయన ‘మంగళూరు మెయిల్’ పేరుతో తన అనుభవాన్ని ఒక కథగా రాశారు. అందులో తన హోటల్ లోనే పక్క గదిలో ఉండే ఒక అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఆమె భర్త పని కోసం అహర్నిశలూ రోడ్లు పట్టుకు తిరుగుతుంటాడు. డబ్బు లేని వారు ఆమె ఎర్రటి బంగారపు దుద్దులను హోటల్ యజమానికి ఇవ్వగా, ఈ రచయిత దగ్గర తాకట్టు పెట్టి, వారు ఇవ్వాల్సిన అప్పుగా ఆ డబ్బులను జమ చేసుకుంటాడు యజమాని. ఈలోపు ఈమె పరిస్థితి విషమిస్తుంది. ఈ రచయిత డాక్టర్ కు చూపించి, రాత్రంతా ఆమె దగ్గరుండి సేవలు చేసి, ఆ రాత్రి గండం గట్టెకిస్తాడు. తెల్లారి తన ఊరు పంపేయమని ఆమె అడగగా, ఆమె అన్నదమ్ములకు ఆమెను అప్పగించి మంగళూరు మెయిల్ ఎక్కిస్తాడు రచయిత. ఆమె గుర్తుగా తన దగ్గరున్న ఆ ఎర్ర దుద్దులను తరువాత తన జీవితంలోకి వచ్చిన భార్యకి ఇస్తాడు. 

 

        🕉ఈ కథ చందూర్ గారికి నిజంగా జరిగింది. ఎన్నో ఏళ్ళ పాటు మాలతి గారు ఆ ఎర్ర దుద్దులనే పెట్టుకునేవారు. ఈ కథ చదివిన చాలామంది ఆయనకు వేరే అమ్మాయిపై సానుభూతి లాంటి ప్రేమ ఉండడాన్ని ఆక్షేపించారట. కానీ ‘మనిషన్నాకా ఎవరినీ ప్రేమించకుండా ఎలా ఉండగలడు? తరువాత నాతో ఆయన అనుబంధం ఎలా ఉంది అన్నదే నాకు ముఖ్యం కానీ, గతాన్ని తవ్వుకుంటూ మా వర్తమాన, భవిష్యత్ జీవితాన్ని నాశనం చేసుకోవడం అవివేకం అవుతుంది’ అని సమాధానం ఇచ్చారట ఆమె. అంత నిజాయితీతో వైవాహిక జీవితాన్ని అనుభవించారు కాబట్టే ఆమె ఇచ్చే రిలేషన్ షిప్ సలహాలు అందరి జీవితాల్లో వెలుగులు పూయించాయి.

 

       🌻చందూర్, మాలతీ గార్ల వ్యక్తిగత జీవితం కూడా ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆయన పత్రికకు ఆమె దన్నుగా నిలిచారు. ఆమె రచనా వ్యాసంగానికి ఆయన ఎంతో సహాయం చేసేవారు. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి మేనమామ అయిన చందూర్ గారి సాహితీ కృషిని చూస్తూ పెరిగారు ఆమె. ఆయనలానే పుస్తకాలు చదవడం, ఆయన కోసం వచ్చే గొప్ప రచయితల గోష్టులలో పాల్గొనడంతో ఆమెకు సాహితీ సువాసనలు అబ్బాయి. ఆ తరువాత వారి వివాహం అయ్యాకా రచన, రేడియో ప్రసంగాలు ఇవ్వడం వంటి విషయాలలో ఎంతో ప్రోత్సహించారు చందూర్ గారు. ఆమె రాసే వాటిని చదివి అభిప్రాయం చెప్పడం, చదవడానికి పుస్తకాలను సూచించడం వంటివి చేసేవారు. ఆమె కోసం అభిమానులు ఇంటికి వస్తే, ఆయన కోసం గొప్ప గొప్ప రచయితలు వచ్చేవారు. నిజానికి మద్రాసులో జరిగే ఏ సాహితీ సభ అయినా చందూర్ దంపతులు లేకుండా జరిగేది కాదు అంటే అతిశయోక్తి కాదు. ఎక్కడికైనా వాక్కు, అర్ధంలా ఇద్దరూ వెళ్ళేవారే తప్ప, ఒకరు లేకుండా ఒకరు ఏ కార్యక్రమానికి హాజరయ్యేవారు కాదు. అంతటి ఆదర్శ దాంపత్యం వారిది. 

 

       ⚜ ఇలా వారానికొక వ్యాసం రాయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎడిటోరియల్ రాయడం సాహితీ ప్రక్రియలలో క్లిష్టమైన పనిగా ఎందరో సాహితీవేత్తలు గుర్తించారు. ఎన్నో విషయాలపై అవగాహన, రాసే శైలి క్లిష్టంగా ఉండకుండా ప్రతి పాఠకునికి అర్ధమయ్యేలా ఉండడం, భాషపై పట్టు, మూసలో ఇరుక్కుపోకుండా రాసే ప్రతిసారి వైవిధ్యం కలిగి ఉండడం, చెప్పాలనుకున్నది స్పష్టంగా వేరే అర్ధాలు రాకుండా చెప్పగలగడం ఇలా ఎన్నో అవరోధాలు, అడ్డంకులు కలిగిన దారి అది. అందుకే ఎంత గొప్ప రచయితలైనా కాలమ్ నిర్వహించేందుకు జంకుతుంటారు. నిజానికి చాలామంది కాలమిస్టులు కథలు, నవలలు తక్కువగా రాస్తారు. ఎందుకంటే వారు చెప్పదలుచుకున్నది ఆ శీర్షికలోనే అయిపోతుంది కాబట్టి. కానీ మాలతీ గారు 47 ఏళ్ళ పాటు శీర్షిక రాసినా, ఎన్నో కథలు, నవలలు రాయడం ఆమె ప్రతిభకు తార్కాణం.

 

      💜 300పై చిలుకు నవలలను ఇతర భాషల నుండి తెలుగులోకి సంక్షిప్త రూపంలో వ్యాసంగా అనువదించడం అంటే మామూలు విషయం కాదు. ‘పాత కెరటాలు’, ‘కొత్త కెరటాలు’ పేరిట స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. వాటినే ‘నవలా మంజరి’ పేరుతో 25 నవలా పరిచయాలు ఒక సంపుటిగా, 8 సంపుటాలు ప్రచురితమయ్యాయి.

No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...