మానవబాంబు --- కొయిలీ
*మనం మరిచిన మన చరిత్ర
అది తను తన భర్త కలిసి వైభవంగా నివసించిన కోట ! తాము రాజ్యమేలిన కోట ! నేడు బ్రిటిష్ నక్కల స్వాధీనంలో ఉన్నది ! తాను దానిని తిరిగి తన ఏలుబడిలోనికి తెచ్చుకొనవలె !
చాలా దూరం నుండి ఆ కోటను పరికిస్తున్న ఆ స్త్రీ మూర్తి హృదయంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి !
ఆమె ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్టవేస్తూ గూఢచారిదళ ముఖ్యుడు పిలిచిన "అమ్మా" అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డది ఆవిడ !
ఏమిటి సేతుపతి ఏమి వార్తలు తెచ్చావు ?...అన్నట్లుగా చూసిందావిడ !
అమ్మా ! మన దళాలు ఇప్పుడు ఒకఅడుగు ముందుకు వేసినా సర్వనాశనం తప్పదు ! జాగ్రత్తగా ఆలోచించి అడుగు కదపాలమ్మా అన్నాడతడు !!
ఎందుకు ? అన్నట్లుగా మరల చూపులతోనే ప్రశ్నించిందావిడ !
అమ్మా ! ఆంగ్లేయుల వద్ద అధునాతన తుపాకులు ఫిరంగులు ,బాంబులు ,మందుగుండుసామాగ్రి ఉన్నదమ్మా ! దానితో వారు సుదూరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలరు ! మనవారు ఇప్పుడు ఎదురువెళ్ళడమంటే సరాసరి మృత్యుదేవత ఒడిలోకి వెళ్ళడమే !
మరిప్పుడు ఏమి చెయ్యాలి ? రాణి మదిలో తొలుస్తున్న ప్రశ్న ఇది ! ఎనిమిది సంవత్సరాలు అడవులలో ఉంటూ ఆకులు అలములు తింటూ చేసిన తన సుదీర్ఘ ప్రయత్నం వృధాకావలసినదేనా ? తన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా ?
తన భర్తను హత్యచేసిన బ్రిటిష్ వారికి తాను దొరకకుండా ఎనిమిది సంవత్సరాలు రహస్యంగా గడుపుతూ నిర్మాణం చేసిన తన సేన ఇలా ఎందుకూ కొరగాకుండా పోవలసినదేనా ?
కొయిలీ ఏది? ఎక్కడ ? పిలిచింది రాణి !
ఆవిడ శివగంగై మహారాణి "వేలునచ్చియార్" !
కొయిలీ !! తమిళనాడులోని శివమహాదేవుడిని కొలిచే వారి వారసులమని సగర్వంగా చెప్పుకునే సాంబవర్ తెగకు చెందిన స్త్రీ మూర్తి ! వీరవనిత!!! యుద్ధవిద్యలలో నిష్ణాతురాలు
అందము ,తెగువ,తెలివితేటలు కలగలిసి ఒకరూపుదాలిస్తే వచ్చే రూపము "కొయిలీ" !
ఇక్కడే ఉన్నానమ్మా అంటూ వచ్చింది కొయిలి !
మహారాణి ఏ విషయమైనా కొయిలి తో చర్చించిగాని ముందుకు అడుగువెయ్యదు ! వీరనారీమణులతో ఏర్పడిన దళానికి అధిపతి కొయిలి !
కొయిలీ ఏంచేద్దాం ? మనము అల్లంత దూరాన ఉండగనే మనలను సర్వనాశనం చేయగల ఆయుధాలు బ్రిటిష్ వారివద్ద ఉన్నాయి ఇప్పుడెలా ??? అడిగింది రాణి !
గూఢచారదళ ప్రముఖుడిని మరల పిలిపించింది కొయిలి !
ఆ ఆయుధాలకు కావలసిన మందుగుండు సామాగ్రి ఎక్కడ దాస్తారు ? ఆ గిడ్డంగి ఎక్కడ ఉన్నది ...ప్రశ్నించింది కొయిలి
మన కోట లోనే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ప్రక్కన పెద్ద గోదాము నిర్మించి అక్కడ భద్రపరిచారమ్మా బదులిచ్చాడు గూఢచారి !
మందుగుండు సామాగ్రి నిలువ చేసిన గిడ్డంగిని మొదట స్వాధీనం చేసుకుంటే బ్రిటిష్ సైన్యాన్ని నిర్వీర్యులను చేయవచ్చని కొయిలి ఆలోచన !
కానీ ! కధ మొదటికొచ్చింది కోట స్వాధీనం కానిది గిడ్డంగిని వశపరచుకోలేము !
ఎలా ???
ఎలా స్వాధీనం చేసుకోవాలి కోటను ? ఎడతెరిపి లేకుండా రాణి తన అనుచరులతో మంతనాలు సాగిస్తూనే ఉన్నది !
శిబిరం లోనుండి కాసేపు బయటకు వచ్చింది కొయిలి !
కోటవైపు చూపు సారించింది ఆమె దృష్టిని ఒక విషయం ఆకర్షించింది!
వెంటనే క్షణమాలస్యం చేయకుండా ఆ వైపుకు పరుగులాంటి నడకతో వెళ్ళింది !
కొంతమంది ఆడువారు చేతిలో పూజాసామాగ్రి ఉన్న పెద్దపెద్ద పళ్ళేలు మోసుకుంటూ కోట వైపుగా సాగుతున్నారు !
ఎవరు మీరు అటువైపు ఎందుకు వెళుతున్నారు అని వారిని అడిగింది !
రేపు విజయదశమికదా అని బదులిచ్చారు వారు
అయితే ?
ఒక్క విజయదశమిరోజే కోటలోని రాజరాజేశ్వరిఅమ్మవారి ఆలయ ప్రవేశానికి అనుమతి ! ఆ ఒక్కరోజే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలంతా ముఖ్యంగా ఆడువారు తరలివస్తారు ! ...అని బదులిచ్చారు ఆ భక్తులు !
అంతే ! మదిలో ఏదో ఆలోచన తళుక్కున మెరుపులా మెరిసింది !
ఎంతవేగంగా భక్తులను సమీపించిందో అంతకు రెట్టింపువేగంతో రాణిగారి శిబిరానికి దూసుకుంటూ వెళ్ళింది !
అమ్మా ! ఇలా చేద్దాం ! అని కొయిలీ చెప్పడమూ రాణి తల ఊపడమూ వెంటవెంటనే జరిగిపోయాయి !
తమదళ సభ్యులందరినీ సమావేశపరచింది మొయిలి తన ప్రణాళిక మొత్తం వివరించింది !
స్త్రీ సైనికులందరూ చక్కగా భక్తులవేషంలోకి మారిపోయారు ! తమతమ చీరల చాటున ఆయుధాలు దాచారు ! పూజాసామాగ్రితో కోటవైపు చిన్న చిన్న జట్లుగా మారి నడక సాగించారు !
మొదటి జట్టులో కొయిలి బయలు దేరింది ! చివరిజట్టులో రాణి చేరింది !
తాము ఎప్పుడు సూచన పంపితే అప్పుడు దాడికి తరలిరావలసిందిగా మిగతా సైన్యానికి తగు ఆదేశాలిచ్చారు వారు !
అందరూ కోటలోకి చేరారు ! అమ్మవారి ఆలయంలో అన్ని సేవలు అయిపోయేవరకూ ఎవరికీ అనుమానం రాకుండా పూజలు చేశారు !
తమ చుట్టూ పరిసరాలను అందరూ ఒక్కసారి గమనించారు ! సామాన్యభక్తులందరూ దాదాపుగా తిరిగివెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్నారు !
ఎవరూ ఊహించనివిధంగా ఒక్కసారి కరవాలాలు బయటకు వచ్చాయి నిశిరాతిరిలో కత్తులు తళుక్కున మెరిశాయి పూజాపళ్ళేలుగా ఉన్న డాళ్ళు తమస్థానాలలోకి వచ్చాయి
వీర వనితలంతా రణశంఖం పూరించారు ! దొరికిన వైరిసైనికుడిని దొరికినట్లుగా తుదముట్టించారు !
ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపు సగం మంది బ్రిటిష్ సైనికులు హతమయ్యారు !
వారందరూ పెద్దగా కేకలు వేసుకుంటూ తమతమఆయుధాలు, మందుగుండు దాచి ఉన్న గిడ్డంగి వైపు పరుగులు పెట్టడం గమనించింది కొయిలీ ! ఆమెకు తెలుసు ఆ గిడ్డంగి తెరుచుకొని ఆయుధాలు వారి చేతికి వస్తే అవే తమ ఆఖరుక్షణాలని !
ఆమె దృష్టి అమ్మవారిఆలయంలో కాంతులీనే దీపస్తంభాలపై పడింది ! వాటికి చమురుదివిటీలు ఉన్నాయి ! ఒక దివిటీని చేతిలోకి తీసుకుంది ప్రక్కనే ఆ దివిటీలు నిరంతరం మండటానికి అక్కడ ఒక గంగాళం నిండుగా నెయ్యి పోసి ఉన్నది !
ఆలోచన వచ్చిందే తడవుగా ఆ నెయ్యితో తన శరీరాన్ని తడిపేసుకున్నది ! ఈమె చేయబోయే పని పసిగట్టాడొక బ్రిటిష్ సైనికుడు ఆమె ఎదకు గురిపెట్టి తుపాకి కాల్చాడు ఆ గుండు సరాసరి ఆవిడ ఎడమభుజంలోనుండి దూసుకు పోయింది ! బుస్సున రక్తం పొంగింది ! ఇంకొక తూటా కాలిలో దిగబడ్డది !
ఆమె వజ్రసంకల్పానికి అవేవీ అడ్డురాలేదు ! సంధించివిడిన బాణంలా రయ్యిన వెళ్ళి గిడ్డంగి లో జొరబడి తనకుతాను నిప్పంటించుకొని మందుగుండుసామాగ్రి మీదకు సివంగిలా దూకింది !
అంతే క్షణాల్లో బూడిదకుప్పగామారిపోయింది !
మరుక్షణంలో అక్కడ ఆయుధాలులేవు మందుగుండులేదు గిడ్డంగీలేదు అంతా బూడిద !
మరొకవైపు రాణి తన శక్తివంచనలేకుండా పోరాడుతూనే ఉన్నది ఈలోపు బయటి సైనికులు వచ్చి కలిశారు !
ఎంత వేగంగా మొదలయ్యిందో అంతే వేగంగా అంతమయ్యింది యుద్ధం !
బ్రిటిష్ దళపతికెప్టెన్ బెంజౌర్ పట్టుబడ్డాడు ! అతడికి సంకెళ్ళు వేసి రాణిముందు ప్రవేశపెట్టారు !
ప్రాణభిక్ష పెట్టమని అర్ధించాడు వాడు ! రాణి వాడిని క్షమించి వదిలివేసింది !
శివగంగై కోట వేల్ నచ్చియార్ కు తిరిగి వశమయ్యింది !
చరిత్రలో ఒక స్త్రీమూర్తి మానవబాంబుగా మారి తనవారి దాస్యశృంఖలాలు తెంచిన వీరోచిత ఘట్టం ఈ యుద్ధంలో పురుడుపోసుకున్నది !
భారతదేశ చరిత్రలో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం మొదటిమానవబాంబుగా మారిన రణచండి "కొయిలీ "
No comments:
Post a Comment