Wednesday, 25 January 2023

నేతాజీ మరణం గురించిన పూర్తి నిజాల్ని తెలిపే వ్యాసం

ఎం.వి.ఆర్. శాస్త్రి, ఆంధ్రభూమి ఎడిటర్, ఉన్నమాట, 03/10/2015

 గాంధీగారు కాంగ్రెసుకు సర్వాధికారి.

తిరుగులేని నియంత.

అంతటివాడికే ఎదురొడ్డి నిలిచి గెలిచినవాడు జాతీయ కాంగ్రెసు చరిత్రలో ఒకే ఒక్కడు:

నేతాజీ సుభాష్ చంద్ర బోస్.

1939 త్రిపురి కాంగ్రెసు అధ్యక్ష ఎన్నికలో నేతాజీకి పోటీగా పట్ట్భా సీతారామయ్యను నిలబెట్టి మహాత్ముడు సర్వశక్తులు ఒడ్డినా బోసుబాబే ఘనవిజయం సాధించాడు.

* * *

దేశాన్ని అడ్డగోలుగా చీలుస్తూంటే మీరెలా ఊరుకున్నారు? ఎందుకు తిరగబడలేదు అని విదేశీ పత్రికా ప్రతినిధి ఆ తరవాత అడిగితే స్వతంత్ర భారత ప్రధాని నెహ్రు పండితుడు ఏమన్నాడు?

‘అప్పటికి మా శక్తులు సన్నగిల్లాయి. పోరాటాలు చేసిచేసి అలసిపోయాం. మళ్లీ ఉద్యమించి జైళ్లకు వెళ్లే ఓపిక మాకెవరికీ లేదు. స్వాతంత్య్రానికి దేశ విభజన దగ్గరిదారి చూపింది. అందుకే ఒప్పేసుకున్నాం.’

నెహ్రులాగే, ఆయనకు తోడుబోయిన కాంగ్రెసు మహానాయకుల్లాగే మిగతా దేశం కూడా కాడికింద పారేసి కాళ్లు బారజాపి కూచుని ఉంటే బహుశా నెత్తుటి ముద్ద స్వాతంత్య్రం కూడా సిద్ధించేది కాదు. మిగిలిన అగ్రనేతలు అలిసి సొలిసి దిక్కులు చూస్తున్న సమయాన ఒక నేతాజీ చిచ్చర పిడుగులా చెలరేగాడు. ఆంగ్లేయ సర్కారు కళ్లుకప్పి రహస్యంగా దేశం వదిలిపోయి బ్రిటిషు వారిపై పోరుకు సాయుధ సైన్యాన్ని కూడగట్టాడు. ఏకంగా ప్రవాస భారత ప్రభుత్వమే నడిపాడు. స్వతంత్ర రాజ్యాధినేతగా పనె్నండు దేశాల గుర్తింపు పొందాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆజాద్ హింద్ ఫౌజ్‌తో దండెత్తివచ్చి, తెల్లవారి పీచమణచి, దేశవాసుల సహకారంతో భరతమాతను విముక్తి చేయగలిగేవాడే.

* * *

‘కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొనే్నళ్ల కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పెత్తనానికి వచ్చిన గత్తరలూ లేవు. మరి మీరేమిటి - కొంపలేవో మునుగుతున్నట్టు అలా ఆదరాబాదరా జెండా పీక్కొని పలాయనం చిత్తగించారు? అంత అర్జంటుగా స్వాతంత్య్రం ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవడానికి మిమ్మల్ని పురికొల్పిన కారణాలేమిటి?’

-అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’

* * *

అంటే - ఈనాడు మనం విచ్చలవిడిగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొన్నదగ్గవాడు సుభాష్ బోస్ ఒక్కడే. జాతికి, దేశానే్నలే వారికి కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి, పూజించవలసింది ఆయననే.

చెప్పుకుంటే సిగ్గుచేటు. పూజించే మాట దేవుడెరుగు. కనీస మర్యాద, మన్ననలకే ఆ మహానుభావుడు నోచుకోలేదు.

ప్రపంచంలో ఏ దేశంలోనైనా - విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆ యోధులే స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పనికి సాధారణంగా ఏ స్వతంత్ర ప్రభుత్వమూ ఒడిగట్టదు.

మహా ఘనత వహించిన నీతులమారి భారత సర్కారు మాత్రం సరిగ్గా ఆ పాపిష్టి పనినే పావుశతాబ్దం పాటు జంకులేకుండా సాగించింది.

ప్రజాస్వామిక విలువలను,

నెహ్రు పండితుడే బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలను పొంచి చూడమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.

ఇక్కడో సందేహం సహజం.

నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వారూ అంగీకరించారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?

వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని! అసలు సంగతి తెలిస్తే జనం తమ మొగాన పేడనీళ్లు ఎక్కడ కొడతారోనని!!

1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.

శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.

‘విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కో’మని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతగాడు సమాచారం రాబట్టాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పాడు. వైస్రాయ్ తల ఊచాడు.

ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు పవర్లోకి వచ్చింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రు ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే.

కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతాశ్రీలకు తెలుసు. ప్రజాబలంలో అతడి ముందు వారు ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకూ క్షేమమని వారూ తలిచారు. ఏమి జరిగిందో ఎరగనట్టు మాయమాటలతో కాలక్షేపం చేశారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టారు. వారికొచ్చే ఉత్తరాలను చించి, తమకు చిక్కులు తెచ్చే వాటిని సర్కారీ అరల్లో దాచేసేవారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు... ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారిని కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల కిందే బయటపెట్టాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.

అసలు మిస్టరీ ఇది కాదు.

సాటిలేని జాతీయ వీరుడైన బోస్ జ్ఞాపకాలను తుడి చెయ్యాలని ఆయన ప్రత్యర్థి జవహర్లాల్ నెహ్రు ఆరాటపడ్డాడంటే అర్థం ఉంది. తమ కులదైవాల ప్రతిష్ఠ మసకబారకూడదన్న ఆదుర్దాలో కాంగ్రెసు ప్రభుత్వాలు గుట్టురట్టు కానివ్వలేదన్నా అర్థం చేసుకోవచ్చు. 

‘మీ రక్తం ఇవ్వండి; స్వాతంత్య్రం పొందండి’ అని గర్జించిన మహానేతకు స్వతంత్ర దేశంలో ఇవ్వవలసిన నివాళి ఇదేనా? మన స్వాతంత్య్రం మేడిపండేనా?....

కట్టర్ హిందూ...

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...