Sunday, 25 December 2022

 పేదలకు షేవింగ్... జగనన్నకు సేవింగ్

 15 లక్షల తెల్లరేషన్ కార్డులు తొలగింపుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

 ఈ దెబ్బతో పేదలకు ప్రభుత్వ స్కీములన్నీ కట్

 నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

 రాష్ట్రంలో 15 లక్షల తెల్ల రేషన్ కార్డులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తెల్ల రేషన్ కార్డులు తొలగించడం ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ స్కీములేవీ కూడా దక్కకుండా చేసే కుట్ర  ఇందులో దాగి ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డులు పెద్ద సంఖ్యలో తొలగించడం ద్వారా   ప్రజలకు షేవింగ్... జగనన్నకు సేవింగ్ అంటూ ఎద్దేవా చేశారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కోటిన్నర తెల్ల రేషన్ కార్డులు ఉండగా,  ఇందులో 80 లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వమే  బియ్యం సరఫరా చేస్తోందని తెలిపారు. 80 లక్షల తెల్ల కార్డుల వల్ల  రాష్ట్ర ప్రభుత్వానికి దమ్మిడి కూడా ఖర్చు లేదన్నారు. అయితే మిగిలిన తెల్ల కార్డులు కలిగిన కుటుంబాలకు బియ్యం సరఫరాతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా క్షవరం చేసే ప్రయత్నాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు. 

రాష్ట్రంలో 98 శాతం  సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తనదేనని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలను పరిశీలిస్తే...  ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.

 పాత పథకాలకే కొత్త పేర్లు... ఇది జగనన్న స్టైల్

 గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలకు కొత్త పేర్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే ఆ  సంక్షేమ పథకాలు కూడా గత ప్రభుత్వాలు అమలు చేసినంత సమర్థవంతంగా అమలు చేయలేదు. గత ప్రభుత్వాల హయాంలో ఫీజు రియంబర్స్మెంట్  పథకం ద్వారా నేరుగా స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు   ఫీజులు చెల్లించేవారు. దీని ద్వారా ఫీజులు చెల్లించడంలో జాప్యం జరిగినా విద్యార్థులకు ఇబ్బంది ఉండేది కాదు.  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకం  పేరు తొలగించి,  జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని నామకరణం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనలో భాగంగా అందజేసే మొత్తాన్ని నాలుగు వాయిదాలుగా  చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో రెండు వాయిదాలను చెల్లించనే లేదు. 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని, టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ గా మార్చింది. ప్రస్తుతం వైయస్సార్ జగనన్న  ఆరోగ్యశ్రీ గా పేరు మార్చారు. ఆరోగ్యశ్రీ కి అయ్యే ఖర్చులో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. జలయజ్ఞం కంటే  రాష్ట్ర ప్రభుత్వం రుణయజ్ఞమే ఎక్కువగా చేస్తోంది. పోలవరం అటకెక్కింది. అప్పుడప్పుడు వెలిగొండ సొరంగాన్ని తవ్వామని సాక్షి దినపత్రికలో రాసుకోవడం మినహా, ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క తాగు సాగునీటి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేదని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 

 అమ్మబడి వల్ల అగ్రవర్ణాలకు మేలు... నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లు

 అమ్మ ఒడి పథకంలో భాగంగా అగ్రవర్ణాలకు  మేలు జరిగితే, ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోయారని రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే  ఇద్దరికీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైయస్ భారతి చెప్పారు. కానీ, ఒక కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. అందులోనూ 2000 రూపాయల కోత విధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలలో అమ్మ ఒడి కాసింత గుడ్డిలో మెల్ల. అయితే ఈ పథకం ద్వారా, ఎస్సీ ఎస్టీ బీసీలకు దెబ్బ పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయా వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశాలను అమ్మ ఒడి ద్వారా కోల్పోయారు. గత ప్రభుత్వ హయాములో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. కానీ  ఇప్పుడు ఆ అవకాశం లేదు. రైతు భరోసా పథకంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కంటే  రైతులకు 1500 రూపాయలు ఎక్కువగా లభించాయి. కానీ ఒక్కొక్క రైతు పదివేల రూపాయల మేర నష్టపోయారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా రైతులకు 6000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో 6000 రూపాయలిచ్చి ఆదుకుంది. రైతన్నకు 13500 ఇస్తానని చెప్పిన జగన్, తరువాత మాట మార్చి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి 13500 ఇస్తానని చెప్పారు. దీనితో గత ప్రభుత్వ హయాంలో కంటే ఒక్కొక్క రైతుకు 1500 రూపాయల లబ్ధి చేకూరింది. కానీ వ్యవసాయ పనిముట్ల కు లభించే సబ్సిడీ అందకుండా పోయింది. డ్రిప్ ఇరిగేషన్ విధానం అటకెక్కింది. ట్రాక్టర్ల కొనుగోలులో రైతన్నలకు  లభించే సబ్సిడీ దూరమయింది. రైతు భరోసా పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధి చేకూరిందే తప్పితే, రైతులకు ఒరిగిందేమీ లేదు. ఇక 3,500 కోట్ల రూపాయలతో  ధరల స్థిరీకరణకు  చర్యలు తీసుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఒక్క రూపాయి కేటాయించింది కూడా లేదు. రాష్ట్రంలో రైతుల అవసరాల కోసం శీతల గిడ్డంగులను నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని  పార్లమెంటు సాక్షిగా వెల్లడయ్యింది. సగటున ఒక్కొక్క రైతు రెండున్నర లక్షల రూపాయల అప్పులలో ఉన్నారని  చెప్పారు. పార్లమెంటు సాక్షిగా చెప్పింది అబద్దమా?, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట, రైతులను దగా చేసిందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

 రాష్ట్రంలో కట్టింది ఐదు ఇండ్లు మాత్రమే...

 రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినప్పటికీ ,  గత మూడున్నర ఏళ్లలో ఐదు ఇల్లు మాత్రమే నిర్మించారని పార్లమెంటు సాక్షిగా కేంద్రం  వెల్లడించిందని  రఘురామకృష్ణంరాజు తెలిపారు.  రాష్ట్రంలోని పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారా?, లేకపోతే ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారా?? స్పష్టం చేయాలి. పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి  తన భారతీ సివెంటును  అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 98 శాతం పథకాలను అమలు చేశానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు. వృద్ధాప్య పింఛన్ పథకంలో భాగంగా 300 యూనిట్ల  విద్యుత్ ను వినియోగించిన వారికి పింఛన్ కోత విధిస్తున్నారు. అలాగే ఎవరైనా తమ పాత ఇంటిని విస్తరించి 1000 అడుగులు దాటి నిర్మించుకుంటే వారికి వృద్ధాప్య పింఛన్ కట్ అంటున్నారు. వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి విద్యుత్ వినియోగానికి, ఇంటి విస్తరణకు సంబంధం ఏమిటి?. వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి వృద్ధుడు అయితే చాలు కదా?. అంతేకానీ విద్యుత్ వినియోగానికి, ఇంటి విస్తరణకు లింకు పెట్టడం వెనక మతలబు ఏమిటి??. ఒక కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్  నిల్ అని రిటర్న్స్ దాఖలు  చేసిన ఆ కుటుంబంలోని  వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ నిలిపి వేస్తున్నారు. తన మనుమడు 15 వేల రూపాయల ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం చేసుకుంటూ, ఇన్కమ్ టాక్స్ నిల్ అని రిటర్న్స్ దాఖలు చేసుకుంటే, అతని తాతకు సంబంధం ఏమిటి?. వచ్చే జీతంతో  అతడు తన కుటుంబాన్ని పోషించుకునేదే కష్టమైతే, ఇక తన తాత బాగోగులు ఏమి చూసుకుంటాడు?. వృద్ధాప్య పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 18600 కోట్ల రూపాయలు  ఖర్చు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి మరో రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. పెరగనున్న భారాన్ని  తగ్గించుకోవటానికి 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు, ఆరు లక్షల వృద్ధాప్య పింఛన్లను తొలగించేందుకు కసరత్తు చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడవద్దు అన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం.  గడపగడపకు తిరగమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, ఈ పరిస్థితిల్లో  తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు జుట్టు పట్టుకొని కొట్టే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం పరదాల మాటున రక్షణ వలయంలో తిరుగుతారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

 ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండండి

 ఆంధ్రప్రదేశ్ ప్రజల  కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని పేర్కొంటున్న  జగన్మోహన్ రెడ్డి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కాకుండా, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడి గానే కొనసాగాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. అలాగే జాతీయ కార్యదర్శి కూడా ప్రాంతీయ కార్యదర్శిగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది తన కుటుంబమని జగన్ అంటున్నారంటే, హైదరాబాదులో నివసిస్తున్న షర్మిల, డాక్టర్ సునీత, విజయమ్మ తన కుటుంబం కాదని భావిస్తున్నట్లే లెక్క. ఏపీలో బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామని సజ్జల అన్నారు.  ఒకవేళ ముఖ్యమంత్రి  ఆ మాట అని ఉంటే తన మాట మార్చుకునే అవకాశం ఉండేది. సజ్జల అన్నారంటే  ఆయన మాట శిలాశాసనమే. కమలాపురం బహిరంగ సభకు   డ్వాక్రా మహిళలను బ్రతిమాలి

ఆహ్వానించే బదులు, ఈసారి జరిమానా విధిస్తామని బెదిరించి పిలిచారు. అయినా యధావిధిగా సభకు హాజరైన ప్రజలు పారిపోయారు. రాజాంలో కంటే  బొబ్బిలిలో చంద్రబాబు నాయుడు సభకు 30 నుంచి 40 శాతం అధిక సంఖ్యలో ప్రజలు అధికంగా హాజరయ్యారు. కమలాపురంలో జగన్ నిర్వహించిన సభకు హాజరైన ప్రజలు పారిపోతుంటే, బొబ్బిలిలో ఆరు గంటలు ఆలస్యం అయిన చంద్రబాబు రాక కోసం ప్రజలు వేచి చూశారు. బొబ్బిలి సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ తాను గతంలో బొబ్బిలికి ఎన్నిసార్లు వచ్చానని ఇంత జనాన్ని ఎప్పుడూ  చూడలేదని చెప్పారు. తానేమి సినిమా హీరోను కాకపోయినా  ప్రజలు తండోపతండాలుగా హాజరవుతున్నారంటే దానికి ముఖ్యమంత్రి పై ఉన్న వ్యతిరేకతే కారణమని పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

 రాయలసీమకు జగన్ చేసింది ఏమీ లేదు

 రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కడప స్టీల్ ప్లాంటు పనులను ప్రారంభిస్తానని  హామీ ఇచ్చారు. ఇప్పుడు 

  నాల్గవ కృష్ణుడి చేత కడప స్టీల్ ప్లాంటు కు శంకుస్థాపన చేయించారు. పదిహేను వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మిస్తామని చెప్పి, ఇప్పుడు ఆ మొత్తాన్ని ఎనిమిది వేల 500 కోట్లకు తగ్గించారు. పులివెందుల లో బస్ స్టాండ్ నిర్మాణం మినహా రాయలసీమకు జగన్ చేసింది ఏమీ లేదు. రాయలసీమ లో హైకోర్టు కూడా  ఏర్పాటు చేయబోమని సుప్రీం కోర్టు కు చెప్పారు. కాగితాలపైనే  రాయలసీమ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప అమలుకు ఏ ఒక్కటి నోచుకోలేదని రఘురామకృష్ణ విమర్శించారు.



No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...