పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి. - పింగళి చైతన్య
(జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య ముని మనుమరాలి లేఖ)
బ్రాహ్మణుడికి జంధ్యం ఎంత ముఖ్యమో.. మా కుటుంబంలో దేశభక్తి కలిగి ఉండటం అంత ముఖ్యం (ఈ పోలిక కావాలనే చెప్తున్నాను). దేశం గురించి ఏమన్నా తెల్సా అంటే.. తెల్సి కాదు, అది వారసత్వంగా వచ్చిన ఆస్తి.
ముత్తాత స్వతంత్రోద్యమంలో ఉన్నారు. త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారు. ఇది నా చిన్నప్పుడే నూరి పోశారు. స్కూల్ లో జెండా వందనం రోజు ఒక గౌరవం. ఈ ప్రివిలేజ్ ని చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని.
వెంకయ్య కొడుకు, అంటే మా తాత, చలపతిరావు ఇండియన్ ఆర్మీలో పని చేశారు. సర్వీస్ లో ఉండగానే చనిపోయారు. మా నాయనమ్మని కనీసం ట్రైన్ పాస్ కూడా తీసుకోనివ్వలేదు వెంకయ్య గారు. మా నాన్నని 28 ఏళ్ళకి చంపేశారు. ఈ త్యాగాలు, కీర్తుల వల్ల, నేను చదువుతున్న పుస్తకాల వల్ల.. తెలీకుండానే.. మా కుటుంబ వాతావరణంలో దేశభక్తి అనేది, బ్రష్ చేసుకోవటంలా ఒక భాగం.
కానీ మా ఇంట్లో, బంధువుల్లో .. బిజెపి భావజాలాన్ని నమ్మిన వాతావరణం అప్పుడు లేదు. బాబ్రీ మసీదు కూల్చినపుడు నేను స్కూల్ ఏజ్. మా నాయనమ్మకి క్యాన్సర్, మేం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్తుంటే.. బంద్ వల్ల మా బండి ఆపేశారు. ఆరోజు నేను, 'మీ మసీదు కూలితే, మమ్మల్ని ఎందుకు ఆపుతారు?' అని ఏడుస్తూ అరిచాను.
మా అమ్మ, నాయనమ్మ ఇద్దరూ తిట్టారు. 'తప్పు కదా, షిరిడీ మీద ఏమన్నా చేస్తే నువ్వు బాధపడవా?' అని అడిగింది మా అమ్మ. అప్పటికి సాయిబాబా పారాయణం ప్రతి నెలా చేసే నేను, ఆ ఊహకు కూడా భయపడ్డా. ఈ రోజు మసీదు మీద మా కుటుంబీకుల అభిప్రాయం అడిగే ధైర్యం చేయలేను.
దేశం పట్ల ఒక లౌకిక దృక్పథం, దేశ గొప్పతనం పట్ల గర్వం ఉన్న వాతావరణం అప్పట్లో మా కుటుంబంలో వుంది. ఇప్పడు లేదు. 'భారత దేశము నా మాతృభూమి' అని స్కూల్ లో ప్రార్థన చేయటం వల్ల.. ఇది (యూనియన్) 'సమాఖ్య' అనే సంగతి అందరి పిల్లల్లా నాకు తెలీదు.
భారత దేశం ప్రజాస్వామ్య విలువలకు, శాంతికి కట్టుబడి ఉంది అని, మనం ఎవరి మీదా దాడి చేయం అని పూర్తిగా నమ్మాను. పాకిస్తాన్ దుర్మార్గ దేశం అని, కాశ్మీర్ ని ఆక్రమించుకున్నారు అని కోపం ఉండేది. మన సైన్యం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు అనే ఫీలింగ్. పైగా మా తాత చైనా యుద్ధ సమయంలో, సర్వీస్‌లో పోయాడాయె. ఇవన్నీ నా మీద సైన్యం గొప్పది అనే ముద్ర వేశాయి.
అయితే 'ఇండియన్ ఆర్మీ రేప్ ఇష్యూ' బ్యానర్ పట్టుకుని మణిపూర్ మహిళలు 'నగ ప్రదర్శన' చేసినప్పుడు నాకు పెద్ద షాక్. గుండె బద్దలు అయ్యింది. ఆ తర్వాత అనేక సంవత్సరాల ప్రయాణం.. చదివాను, తెలుసుకున్నాను. కాస్త పైసలు జమ అవ్వగానే, ఏదో ఒక రాష్ట్రం తిరగటం నా పని.
మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, కాశ్మీర్ రాష్ట్రాలు, బంగ్లాదేశ్, బర్మా దేశాలు.. వెళ్ళాను. చరిత్ర తెల్సుకోటానికే! విహారానికి కాదు. స్త్రీల పట్ల 'భారత సైన్యం' ఎలా ఉంటుంది.. నా కళ్లతో చూశాను. అనుభవించాను కూడా! నాతో వచ్చిన మా బాలుతో, 'వెళ్లిపోదాం, వాళ్ళు నైట్ మన హోటల్ కి వస్తే..' అని భయపడ్డాను. 'మనని (!?) ఏం చేయరులే' అని మా బాలు ధైర్యం చెప్పేవాడు.
చాలా మందికి దేశభక్తి కలిగి ఉండటం ఒక లక్షణం. నేను పెరిగిన వాతావరణం వల్ల , నాకు అది గుండె చప్పుడు. మోయాలేమో అని ఫీల్ అయిన ఒక వారసత్వం. ఏ రోజైతే.. నేను మణిపూర్ లో రక్తం తొక్కుతూ నడిచానో.. ఆ క్షణం నా హృదయం ముక్కలయ్యింది. నాగాలాండ్ లోని ఒక ఊరిలో, ప్రతి రోజూ ఉండే కర్ఫ్యూ వల్ల, హాస్పిటల్‌కి తీసుకెళ్ల లేక తల్లి చేతిలో చనిపోయిన బిడ్డని చూశానో.. ఆ క్షణం 'నా భారత మాత' మారిపోయింది.
కాశ్మీర్ లో తమ పొలాల్లోకి తాము వెళ్ళాలి అంటే.. ఆడ మగ అనే భేదం లేకుండా ఆర్మీతో ఒళ్ళంతా తడిమించుకునే కాశ్మీరీలను చూసి.. సిగ్గుతో చచ్చాను. 'ఓషన్ ఆఫ్ టియర్స్ డాక్యుమెంటరీ' లో ఉన్న పరిస్థితి ప్రతి క్షణం ఉంటుంది అక్కడ. కరెంట్, ఇంటర్నెట్, ఫోన్లు.. ఏ క్షణం అయినా ప్రభుత్వం బంద్ చేస్తుంది. రోజూ కర్ఫ్యూ.
త్రిపుర లో బెంగాలీల ఆధిపత్యం వల్ల అస్తిత్వం కోల్పోతున్న భిన్న ఆదివాసీల కథలు.. రకరకాలు. బెంగాలీలు అక్కడ బిజినెస్ చేస్తారు. కాబట్టి బెంగాలీ, మన కర్మకి హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, మణిపురి నేర్చుకుంటారు. ఇన్నేసి భాషల మధ్య వాళ్ళ సాంస్కృతిక నేపథ్యం క్రమంగా కనుమరుగవుతోంది.
నేను నా కళ్లతో చూశాను.. అక్కడ పిల్లలు ఎప్పుడూ ఒక భయం లో ఉంటారు. వాళ్ళకి బాల్యం సహజంగా ఉండదు. దేశభక్తితో, భారత దేశంలో భాగంగా ఉండాలి అనుకున్న 'రాణి గైడిన్ ల్యూ' జీవిత చరిత్ర రాయాలి అని వెళ్లిన నేను.. ఈశాన్య రాష్ట్రాల చరిత్ర, ఇరోమ్ షర్మిల జీవిత కథ నేపథ్యంతో రాస్తున్నాను.
నా దేశం, శాంతి సందేశం అని నమ్మిన నేను.. 'ఇండియా ఈస్ అప్రెసర్' అని అర్థం చేసుకున్నాను. రెండు వాక్యాల్లో రాసిన ఈ మాటలు.. నాకు జీర్ణం కావడానికి సంవత్సరాలు పట్టింది. నేను ఆ ప్రాంతాల నుండి వెనక్కి వచ్చిన తర్వాత, కొన్ని రోజుల వరకు నిద్ర పట్టేది కాదు.
ఈ సంవత్సరం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని, పైసలు కూడపెట్టాక.. నాకు ధైర్యం చాలక ఆగాను. ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉన్నాడు. వాడు స్వేచ్ఛగా నవ్వటం, ఆడటం చూసిన కళ్ళతో.. వాడిని పక్కనే ఉంచుకుని, అక్కడ పిల్లల్ని చూస్తుంటే.. అపరాధ భావన వస్తోంది.
నాలో ఉన్న దేశభక్తి కేవలం 'ఇండియా'గా భావించబడుతున్న నేల మీదా? లేదా మనుషుల మీదా? అనేది తేల్చుకోవటం తేలిక. 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అనే ముక్క అర్థమయ్యి చస్తే! కానీ దేశభక్తి కరవటం వల్ల... ఖర్చు, ఏడుపు, భయం, 'ఇలాంటి చోట్లకి ఎందుకు తీసుకొస్తావు?' అని మా బాలుతో తిట్లు, జీవితంలో పదేళ్లు.. పట్టింది. అందుకే ఎవరన్నా దేశభక్తి తో రంకెలు వేస్తుంటే.. ఏమన్నా వాక్సినేషన్ ఉంటే బావుండు అనిపిస్తుంది.