Tuesday, 12 July 2022


డా౹౹హెడ్గెవార్


ఆయుధాలు లేకుండా ఆంగ్లేయుల నెదిర్చిన చరిత్రలో ఉజ్జ్వల ఘట్టం.రాజద్రోహానికి డా౹౹హెడ్గెవార్ విచారణ



1920 డిసెంబరులో నాగపూరులోజరిగిన కాంగ్రెస్ అఖిల భారతీయ మహాసభల తర్వాత ప్రాంతంలోని ముఖ్యనాయకులలో ఒకరుగా డా. హెడ్గేవార్ పరిగణింపబడసాగారు. 1921లో ప్రాంత కాంగ్రెసు సమావేశంలో విప్లవవీరులను నిందిస్తూ ఒకరు తీర్మానం ప్రవేశ పెట్టినపుడు డాక్టర్జీ దానిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఫలితంగా ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన వారు వెనుకకు తీసుకోవలసివచ్చింది. "అనుసరించే పద్ధతులపట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వారి దేశభక్తిని వ్రేలెత్తి చూపటం అపరాధమని డా. హెడ్గేవార్ నమ్ముతారని సమావేశానికి అధ్యక్షత వహించిన ఎం. ఎస్ ఆణే అన్నారు. డా.హెడ్గేవార్ తిలక్ వాదీ కాదు, గాంధీవాదీ కాదు, ఆయన ఏవాది అనేది తేల్చి చెప్పాలనుకుంటే 'స్వాతంత్ర్య వాది'అని చెప్పటమే సమంజసం.
1921 మే నెలలో డా. హెడ్గేవార్ ప్రాంత కాంగ్రెసు కమిటీ సభ్యునిగా ఎన్నికైనారు. ఆ నెలలోనే రాజద్రోహకరమైన ఉపన్యాస మిచ్చిన ఆరోపణతో ఆయనపై కోర్టులో కేసు నడిచింది. కాటోల్, భరత్ వాడలలో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలను తమ కేసుకు ఆధారంగా ప్రభుత్వం పేర్కొంది. లోకమాన్య తిలక్ తనకుతాను స్వయంగా వాదించుకున్న కేసు (1908) భారత దేశ సంగ్రామ చరిత్రలో ఒక స్ఫూర్తి దాయకమైన ఘట్టంగా ప్రసిద్ధి గాంచింది. డా. హెడ్గేవార్ పై విచారణ జరిగిన ఈ కేసు కూడా దానితో సమానంగా ప్రేరణదాయకమైనదే.
1921 జూన్ 13న స్మెలీ అనే ఆంగ్లేయుడు న్యాయ మూర్తిగా ఉన్న కోర్టులో విచారణ మొదలై మరునాడు కొనసాగింది. డా.హెడ్గేవార్ తరఫు న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు పోలీసు సబినస్పెక్టర్ తత్తరపడ్డాడు. అర్థంలేనిప్రశ్నలు, అసందర్భమైన ప్రశ్నలు అంటూ న్యాయమూర్తి చిరాకుపడ్డాడు. కేసును 20 వ తేదీకి వాయిదా వేశాడు. జూన్ 20 న న్యాయవాది బోబడే తన ప్రశ్నలకు న్యాయమూర్తి అడ్డుపడుతున్నందుకు కోపం తెచ్చుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆపైన డా.హెడ్గేవార్ తన కేసును తానే వాదించుకొనడానికి పూనుకొన్నారు.
న్యాయమూర్తి అయోగ్యుడు, అజ్ఞాని, అపాత్రుడూ అయినందున న్యాయమూర్తిని మార్చవలసిందిగా తాను దాఖలు చేసుకోబోతున్న అర్జీపై చివరి నిర్ణయం జరిగేవరకు కేసు విచారణ కార్యక్రమాన్ని నిలిపి ఉంచాల్సిందిగా న్యాయమూర్తి స్మెలీని కోరారు. ఎటువంటి సాహసమిది? ఏమి తెగింపు? కాగా అవమానకరము, సిగ్గుచేటూ అయిన ఆ స్థితికి స్మెలీ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. జిల్లా సెషన్స్ జడ్జి ఇర్విన్ డా. హెడ్గేవార్ లిఖితపూర్వకంగా ఇచ్చిన అర్జీని త్రోసిపుచ్చుతూ స్మెలీవద్దనే విచారణజరగాలని నిర్ధారించాడు.(జూన్27)
రకరకాల నాటకీయ పరిణామాలవంటి విచారణ తర్వాత న్యాయమూర్తి సూచనపై జులై 13న డా. హెడ్గేవార్ తన లిఖితపూర్వక వాఙ్మూలాన్ని ఇచ్చారు. "ఒక భారతీయుడు చేసిన కార్యం గురించి ఒక పరాయి ప్రభుత్వం నిర్ణేతగా కూర్చోవటం నాకు, ఎంతో గొప్పదైన నా దేశానికి అవమానకరమని నేను భావిస్తున్నాను. నేడు హిందూ దేశంలో న్యాయ సమ్మతమైన ప్రభుత్వమేదీ లేదని నా విశ్వాసం... నేడిక్కడ ఉన్నది పశుబలంతో మానెత్తిన రుద్దబడు తున్న భయము, ప్రమాదములతోకూడిన సామ్రాజ్యం మాత్రమే.... హిందూస్థానం హిందువులది అనే భావాన్ని నాప్రజల హృదయాలపై ముద్రించ డానికి నేను ప్రయత్నించాను. ఒక భారతీయుడు రాజద్రోహం చేయనిదే ఈ భావాలు నిర్మించలేని స్థితి ఏర్పడినదంటే, భారతీయులకు, యూరోపు ప్రజలకూ మధ్య శత్రుత్వం రెచ్చగొట్టనిదే సత్యాన్ని స్పష్టంగా ప్రకటించలేని స్థితి దాపురించినదంటే, తమను భారతీయ ప్రభుత్వంగా చెప్పుకొనే యూరోపి యనులు ఇప్పుడు తిరిగివెళ్లిపోవలసిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి.... నేను మాట్లాడిన ప్రతి ఒక్క శబ్దానికీ బాధ్యతవహించడానికి నేను సహర్షంగా సిద్ధమై యున్నాను....అవన్నీ న్యాయోచితమైనవేనని వక్కాణిస్తున్నాను" (సంక్షిప్తం చేయబడినది)
ఆగస్టు 5న విచారణ కొనసాగుతున్న సమయంలో- ఆరోపణలకు జవాబు చెప్పడానికి అవకాశం లభించి నప్పుడు ఇలా ఉపన్యసించారు.- "హిందూస్థానం హిందూస్థానీయులదే - కాబట్టి మనకు స్వరాజ్యం కావాలి." అన్నది సాధారణంగా నా ఉపన్యాసాలలో ఉండే విషయం. అయితే ఇంతమాత్రమే చెప్తే సరిపోదు. స్వరాజ్యం ఎలా సంపాదించుకోవాలి, స్వరాజ్యాన్ని సాధించుకొన్నతర్వాత మనం ఎలా మెలగాలి? - ఈవిషయంకూడా ప్రజలకు అవగతం చేయాలి. అది జరగకపోతే యథారాజా తథాప్రజా అన్న సామెత ననుసరించి ప్రజలు ఆంగ్లేయులను అనుకరించ మొదలుపెట్టుతారు. ఇటీవల ప్రపంచ యుద్ధసందర్భంలో- ఆంగ్లేయులు తమ రాజ్యంతో సంతృప్తి చెందరని, ఇతరుల దేశాలను ఆక్రమించు కొని, వాటిని తమ అధీనంలోకి తెచ్చుకొంటారనీ, వాటిపైన తమ పాలనను రుద్దుతారనీ, కాగా తమ స్వాతంత్ర్యం ప్రమాదంలో పడినప్పుడు వారే ఆయుధాలు పట్టుకుని రక్తపుటేరులు ప్రవహింప జేయడానికి సందేహించరనీ ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఆంగ్లేయుల సైతాన్ నాగరికతను అనుసరించ వద్దు అని మేము మా ప్రజలకుచెప్పవలసిన అవసరం ఏర్పడింది.
"ఒకజాతి ప్రజలకు మరోజాతి ప్రజలపై ప్రభుత్వం చలాయించే అధికారం లేనపుడు - అది సహజసిద్ధ మైన నియమాలకు వ్యతిరేకమైనపుడు - ఆంగ్లేయు లకు హిందూస్థానీలను తమ కాళ్లక్రింద త్రోక్కిపడ వేస్తూ పాలన సాగించే అధికారం ఎవరిచ్చారు? ఇది నీతిని, ధర్మాన్ని హత్య చేయటం కాదా? ఇంగ్లాండును పారతంత్ర్యంలోకి నెట్టి, వారిమీద రాజ్యంచేయాలనే కోరిక మనకు ఏనాడూ లేదు.అయితే, బ్రిటన్ ప్రజానీకం బ్రిటన్ ను ఎలా పరిపాలించుకొంటున్నారో, జర్మనీ ప్రజానీకం జర్మనీని ఎలా పరిపాలించుకొంటున్నారో, మనంకూడా అదే విధంగా మనదేశంమీద మన జాతీయుల పాలనే ఉండాలని కోరుకొంటున్నాం. మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావలసిందే. ఈ విషయంలో ఏలాంటి రాజీ సాధ్యంకాదు...."(సంక్షిప్తీకరింపబడినది)
తీర్పు చెప్పే తేదీగా ఆగస్టు19 ని నిర్ణయించారు. "ఏ ఉపన్యాసాన్నిగురించి విచారణ జరుపుతున్నామో, దానికంటే మించి రాజద్రోహకరంగా ఉంది ఈ ప్రకటన." అంటూ వాఙ్మూలాన్ని గురించి ప్రస్తావిస్తూ - ఒక సంవత్సరం వరకు ఉపన్యాసాలు చెప్పనని హామీ యిస్తూ, దానికి జమానతుగా ఒక్కొక్కటి వెయ్యేసి రూపాయలకు ఇరువురినుండి హామీపత్రాలను దాఖలుచేయాలని, మరో వేయి రూపాయలకు ముద్దాయికూడా వ్యక్తిగత హామీపత్రం ఇవ్వాలనీ న్యాయమూర్తి స్మెలీ ఆదేశించాడు.
"నేను దోషిని కాదు, నేను నిర్దోషినని నా అంతరాత్మ ఘోషిస్తూఉంది. ప్రభుత్వం ఈ విధమైన దమనకాండ ద్వారా ఇప్పటికే ప్రజ్వరిల్లుతున్న అగ్నిలో ఆజ్యం పోస్తున్నది. ఈ విదేశీ ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేసుకో వలసిన రోజు త్వరలోనే వస్తుందని నా విశ్వాసం. జమానతు,.హామీపత్రాలు ఇవ్వటం నాకు అంగీకారం కాదు." అంటూ డా.హెడ్గేవార్ ప్రభుత్వనిర్ణయాన్ని సవాలుచేశారు. ఒక ఏడాదిపాటు కఠిన కారాగార వాసశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించాడు.
జైలుకు వెళ్లేముందు న్యాయస్థానం వెలుపల గుమిగూడిన పురప్రముఖులు, బంధుమిత్రులను ఉద్దేశించి డా. హెడ్గేవార్ ఇలా చెప్పారు - "రాజద్రోహ నేరాన్ని ఆరోపించిన కేసులో రక్షించుకొనడానికి వాదించినవాడు దేశద్రోహి అనే అభిప్రాయం నేడు చాలామందిలో ఉంది. ఆత్మరక్షణ చేసుకొనకుండా నల్లిలా నలిపివేయబడటం సమంజసమని నేను అనుకోను. ప్రభుత్వం యొక్క నీచబుద్ధిని మనం తప్పక బహిర్గతం చేయాలి. ఆత్మరక్షణకు యత్నించక పోవటం ఆత్మఘాతకమవుతుంది. మాతృభూమి రక్షణలో జైలుకు వెళ్లటంమాత్రమే కాదు, ద్వీపాంతర వాస శిక్షలకు, ఉరికంబాలకు వ్రేలాడదీయబడడానికి కూడా సంసిద్ధులం కావాలి. అయితే జైలుయాత్ర అంటే స్వర్గప్రాప్తిఅని గాని, అదే స్వాతంత్ర్య ప్రాప్తి అనిగానీ భ్రమలలో విహరించవద్దు. నేను ఏడాదిలో తిరిగి వస్తాను....హిందూదేశానికి పూర్ణ స్వాతంత్ర్యం సాధించే ఉద్యమం ప్రారంభమవుతుందని నా విశ్వాసం. హిందూదేశాన్ని ఇంకా బానిసతనంలోనే త్రొక్కిపట్టి ఉంచటం కుదరదు."
1921అక్టోబరు 19 తో ఆరంభించి నాగపూర్ లోని అజినీ జైలులో ఉండిన డా.హెడ్గేవార్ 1922 జులై 11న విడుదల పొందారు. ఆరోజు వేల సంఖ్యలో ప్రజలు అజినీ జైలుముందర కుండపోత వర్షంలో నిలబడి యున్నారు. ఆ మరునాడు చిట్నీస్ పార్కు లో స్వాగతసభ ఏర్పాటైంది. వర్షంకారణంగా చివరి నిమిషంలో వెంకటేశ్ థియేటర్ కి మార్పుచేశారు. హకీంఅజ్మల్ ఖాన్, మోతీలాల్ నెహ్రూ, సి. రాజ గోపాలాచారి, విఠల్ భాయి పటేల్, డా. అన్సారీ వంటి ప్రముఖ కాంగ్రెసు నాయకులు ఆరోజు నాగపూర్ లో ఉన్నారు. ఆ సభలో పాల్గొన్నారు. థియేటర్ క్రిక్కిరిసిపోగా, అంతకు మించిన సంఖ్యలో బయట, ఆకాశమే పందిరిగా నిలబడి ఉపన్యాసాలను విన్నారు.
1930లో ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఏప్రియల్ 6న దాండీలో సత్యాగ్రహం చేయాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. ఉప్పుసత్యాగ్రహంగా అది ప్రసిద్ధమైంది. సముద్రం అందుబాటులో లేని మధ్యప్రాంతాల కాంగ్రెసు ఈ ఉద్యమాన్ని అటవీచట్టాల ఉల్లంఘనగా జరుపు కోడానికి కాంగ్రెసు నుండి అనుమతి కోరింది. అప్పటికి డా.హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించి సర్ సంఘచాలక్ బాధ్యతలో ఉన్నారు. ఆయన ఆ బాధ్యతను డా. ఎల్. వి. పరాంజపే కి అప్పగించి, జులై 21న యవత్మాల్ కి 4 కి.మీ. దూరంలో ఉన్న అడవిలో గడ్డికోయటంద్వారా సత్యాగ్రహం చేసి అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో న్యాయమూర్తి భరూచా డా.హెడ్గేవార్ కి 9 నెలల కారాగారవాసశిక్ష విధించారు.
ఈ దళంలో డా.హెడ్గేవార్ తోపాటు శ్రీయుతులు అప్పాజీ జోషీ(వర్ధా),బాబాసాహబ్ డబళే (మహారాష్ట్ర పత్రికా సంపాదకుడు), దాదారావ్ పరమార్థ్, విఠలరావ్ దేవ్,.భయ్యాజీ కుంబల్వార్ తదితరులున్నారు. వివిధ కేంద్రాలలో సత్యాగ్రహాలు చేసివచ్చిన 125 మంది అకోలా జైలులో ఉన్నారు. విడుదల అయ్యేంతవరకు వారందరికీ శారీరకంగా, మానసికంగా శిక్షణ లభించేవిధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. 1931 ఫిబ్రవరి 14న డా.హెడ్గేవార్ విడుదలపొంది 17 న నాగపూర్ చేరుకున్నారు. దారిలో అకోలా, వర్ధాలలో , ఇంకా అనేకచోట్ల వారికి స్వాగత సత్కార సభలు జరిగాయి.
ఇలా రెండుసార్లు జైలుయాత్ర చేసిన డా.హెడ్గేవార్ స్వరాజ్య సాధనోద్యమంలో భాగంగా 1924 జనవరిలో ప్రారంభించి 1925 జనవరివరకు 'స్వాతంత్ర్య' అనే పత్రికనుకూడా నడిపారు. ఈ పత్రిక తొలిరోజులలో దినపత్రికగా 1200 ప్రతులు అమ్మేది. కొన్నాళ్ల తర్వాత వారానికి రెండురోజులు ప్రకటించే పత్రికగా, ఆపై వారపత్రికగా మార్పుచేశారు. ఆ పత్రికకు ప్రసిద్ధిలభించడానికీ,చివరికి మూతబడ డానికీ ఆయనే కారకుడు అని చెప్పాలి. ఆయనలోని భావపుంజాలను నలువైపులా చేరవేసిన విమానం ఆ పత్రిక. కాబట్టి ప్రసిద్ధి లభించింది. రాజీపడే స్వభావం లేని కారణాన ఆర్థిమైన ప్రాపు లభించక చివరకు మూసివేయ వలసివచ్చింది.
పత్రికను మూసివేసిన 8-9 నెలల వ్యవధి.లోనే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించి తన శక్తియుక్తుల నన్నింటినీ కేంద్రీకరించటం అందరికీ తెలిసిన విషయమే.
(డా౹౹రాకేశ్ సిన్హా రచించిన డా౹౹కేశవ బలిరాం హెడ్గేవార్ గ్రంథం - పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురణ- నుండి)

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...