Thursday, 25 November 2021

  శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి వర్థంతి సందర్భంగా

【  స రి గ మ ప ద ని.....

సప్తస్వరాలు.

ఆ స్వరాలన్నిటికీ నైవేద్యం పెట్టిన బాలగంధర్వుడు...

స్వరస్వతీపుత్రుడు.......】

ఆయన జీవితమే... ఓ సంగీత ఝరి........

#ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో #చైతన్యాన్ని రగిలించేది సంగీతం. శిశుర్వేత్తి... పశుర్వేత్తి... వేత్తిగాన రసఃఫణిః అని పెద్దలు ఏనాడో చెప్పారు. అవధులెరుగనిది..ఎల్లలు ఒల్లనిది..భాషాభేదాలు లేనిది..ప్రాంతీయతలు తెలియనిది సంగీతం ఒక్కటే......

#మధుర మంగళ నాదమణులకు #తళుకులద్దిన స్వరజ్ఞాని మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు.

#పాటే ఆయన పరిమళం..  రాగాలే ఆయన అస్తిత్వం.. ఒక్క మాటలో  చెప్పాలంటే #సంగీతం ఆయనకు సర్వస్వం.ముదిమేది వయసేది నీ పదముల చెంతను ముదమారవించగా అంటూ తనకు తన గానానికి వయోభారం లేదని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ నిరూపించారు.

సరిగమలు లోతులు సామాన్యులకు సైతం తెలిపే గానం ఆ గానగంధర్వుడు బాలమురళీ కృష్ణది. అనేక కీర్తలను తన గొంతు నుంచి అమృత ధారల రూపంలో శ్రోతలకు వీనుల విందులు చేసాడు.కర్నాటక సంగీతం అనగానే ఈ తరంలో వెంటనే స్పురణకు వచ్చే పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీతాన్ని ఔపోసన పట్టిన #మహానుభావుడు బాలమురళి గారు.

#బాల్యం:

 బాలమురళీకృష్ణ 06 -07 -1930 న తూర్పు గోదావరి జిల్లాలోని,శంకరగుప్తంలో పుట్టారు.ఆయన తల్లి తండ్రులు సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య గార్లు.తల్లి వీణా విద్వాంసురాలు. మాతామహుడు అయిన శ్రీ ప్రయాగ రంగదాసు గారు సంగీత కోవిదుడు. వారు స్వయంగా కొన్ని కృతులను వ్రాసి స్వరపరిచారు. అవి ‘శ్రీ ప్రయాగ రంగదాసు కీర్తనలు’ గా ప్రసిద్ధి చెందాయి. శ్రీ బాలమురళీకృష్ణ వాటిని గానం చేసారు

ఈయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. మంగళంపల్లి ఏడవ ఏటనుండే కచేరీలు చేయటం ప్రారంభించాడు. తొమ్మిదియేళ్ళ వయసులో వయోలిన్,మృదంగం,కంజీర లాంటి వాయిద్యాలలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. కుమారునికి ఉన్న సంగీత జ్ఞానాన్ని గుర్తించి తండ్రి గారైన పట్టాభిరామయ్య గారు ఆయనను గాయక బ్రహ్మ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్ద శిష్యరికానికి పంపారు. దీనితో శ్రీ మంగళంపల్లి జీవితానికి ఒక మార్గం లభించింది. 

#ఉద్యోగం:

విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్న బాలమురళీకృష్ణ విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కొంతకాలం పనిచేసారు. ఆ రోజుల్లో విజయవాడలో శ్రీ విశ్వనాధ వారి మన్నలను,ఆశీస్సులను పొందారు.

కాలక్రమంలో మద్రాస్‌లో స్థిరపడి, తమిళ , కర్ణాటక, మళయాళ భాషలపై కూడా పట్టు సాధించారు.

#విస్తారమైన పాండిత్యము:

సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషితో కలిసి ముంబయిలో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నాడు. ఇతను తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు.

#కచేరీలు:

8 #సంవత్సరాల #అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా #బాలమేధావి అనిపించుకున్నారు.

సుమారు 30,000 కచేరీలకు పైగా ఇచ్చి ఉంటారు. అన్నమయ్య కీర్తనలు,రామదాసు కీర్తనలు,ఎంకిపాటలు,తత్వాలు,లలితగీతాలు ,ఎన్నో భక్తి గీతాలు…ఇలా చెప్పుకుంటూపోతే వారు పాడిన పాటలకు అంతే ఉండదు. ఆయన పాడింది పాట,ఆలపించింది రాగం అన్నట్లుగా ఉంటుంది. వేలాది కాసెట్లు, రికార్డ్లు రిలీజ్ అయ్యాయి! బాలమురళీ కేవలం గాయకుడే కాదు,వాగ్గేయకారుడు కూడా. 72 మేళకర్తల్లో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ఈయన.

#రాగాలు సృష్టికర్త:

లవంగి,త్రిశక్తి,మహతి లాంటి పెక్కు రాగాలు సృష్టించిన సంగీత సరస్వతి  బాలమురళీ.

#సినిమాలలో:

సినిమా పాటలు కూడా అద్భుతంగా చాలా భాషల్లో పాడారు.భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడి వేషం వేసి మెప్పించారు. హంసగీతే కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటమే కాకుండా ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. మధ్వాచార్య చిత్రానికి కూడా జాతీయ స్థాయిలో సత్కారం.హంసగీతెలో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు.

#విదేశాల్లో వేల సంఖ్యలో కచేరీలు..

మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్ దేశాల్లో వేల సంఖ్యలో కచేరీలు నిర్వహించారు. తెలుగు, కన్నడం, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడారు.

#జగమంతా సంగీతమే!

సంగీతం అంటే కేవలం సరిగమపదనిసలే కావు. మన జీవితమే సంగీతం. మన మాటల్లో శ్రుతి ఉంటుంది. నడకలో లయ ఉంటుంది. ఇలా ఫలానాది సంగీతం... ఫలానాది కాదు అని చెప్పలేం. విశ్వమంతా సంగీతమే. అన్నిట్లో సంగీతం ఉంటుంది. దేన్నుంచీ దీన్ని విడదీయలేం అంటారు.

#సంగీతమే దివ్యౌషధం:

సంగీతం.. అన్నిటికీ దివ్యౌషధం.  ఒత్తిడి.. మానసిక వ్యాకులత వీటన్నిటికీ ఇది అద్భుత ఔషధం!ఎంతోమంది ఎన్నో సమస్యలునుమ్యూజిక్ థెరపీ తగ్గించవచ్ఛు అంటారు బాలమురళీ గారు.

#బిరుదులు:

గంధర్వగాన సామ్రాట్, జ్ఞానసాగర, సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణం, గానగంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి, జ్ఞానపద్మం, నాదజ్యోతి, సంగీత కళాసరస్వతి, నాద మహర్షి వంటి ఎన్నో బిరుదులు ఆయన సొంతం

బాలమురళీకృష్ణ ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవడాక్టరేట్లు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ జాతీయ పురస్కారాలను అందుకున్నారు.మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమధ్యమావతి, గణపతి, సిద్దిరాగాలు, భద్రాద్రి శ్రీరామ చంద్రుని సుప్రభాతాన్ని ఆయన ఆలపించారు.

#ఫ్రెంచి ప్రభుత్వం నుండి:

అంతే కాకుండా ఫ్రెంచి ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన శేవేలియర్ అవార్డ్ అందుకున్న ఏకైక కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ బాలమురళీ.

#జీవితంపై పుస్తకం:

బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, అతను అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి నూకల చినసత్యనారాయణ ఉపోద్ఘాతం రాశాడు.

నవంబర్ 22, 2016న

మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.

శతాబ్దానికో, రెండు శతాబ్దాలకో ఒకసారి ఆవిర్భవించే గొప్ప విద్వాంసుల్లో బాలమురళీకృష్ణ ఒకరు.

ఆ సుస్వర మహర్షి భౌతికంగా దూరమైనా తన కీర్తనలు, పాటలతో సంగీత ప్రియుల #హృదయసీమలో శాశ్వత స్థానం #సంపాదించుకున్నారు.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...