స్వచ్ఛంద పేదరికం
అనగనగా ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నవలా రచయితయ్యాడు, అమ్మ పోయిన బాధలో యోగిగా మారాడు, అకస్మాత్తుగా సన్యాసం వీడి పారిశ్రామికవేత్తగా అవతరించాడు. ఓ స్టార్టప్ ని ప్రారంభించిన పద్దెనిమిదినెలల్లోనే దానికి 2240 కోట్ల రూపాయల విలువ కల్పించి... అనూహ్యంగా అమ్మేశాడు! అదికూడా జూమ్ మీటింగ్ లోనే, కొనేవారిని ముఖాముఖి కలవకుండా. ప్రస్తుతం అతని వయస్సు 42. చిన్న వయసులోనే ఇన్ని అవతారాలెత్తిన ఆ యువ యోగి-కమ్ -పారిశ్రామికవేత్త కరణ్ బజాజ్ ! చిత్రమైన అతని కెరీర్ ప్రయాణమే భారతీయ స్టార్టప్ రంగంలో గత ఏడాది హాట్ టాపిక్ . ఆ ప్రస్థానం గురించి కరణ్ మాటల్లోనే.
న్యూయార్క్ నగరంలో అదో పెద్ద రెస్టరంట్ . అక్కడ మా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ జరుగుతోంది. ఆ రాత్రి కడుపునిండా తిన్నాను... పీకల్దాకా తాగాను. ఫ్రెండ్స్ తో ఉబుసుపోక కబుర్లేవో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత చేస్తున్నా నా మనసులో బాధ తగ్గడంలేదు. పొగిలి పొగిలి వస్తున్న దుఃఖం ఆగట్లేదు. అప్పటికి అమ్మ చనిపోయి ఆరునెలలవుతోంది. క్యాన్సర్ తో బాధపడుతూ... మృత్యువుతో నిస్సహాయంగా పోరాడుతూ... నా కళ్లెదుటే చనిపోయింది. అమ్మ కోసం నెలన్నరపాటు సెలవుపైన ఇండియా వచ్చిన నేను ఆ బాధలన్నీ అతిదగ్గరగా చూశాను. మృత్యువు తనని నా నుంచి ఇలా దూరం చేయడం తట్టుకోలేకపోయాను. అప్పటిదాకా నేను చాలా పరిణతి ఉన్నవాడిననీ, తార్కిక బుద్ధి ఉన్నవాడిననీ... అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ అమ్మ మరణం నన్ను చిన్నపిల్లాడిలా... బేలగా మార్చింది. ఆ దుఃఖం ఓ వైపున ఉంటే మరో వైపు నాలో ఎన్నో ప్రశ్నలు. ‘అసలేమిటీ జీవితం... పుట్టుకేమిటీ? చావడమేంటీ? పెళ్ళీ పిల్లలూ సంసారం... వీటి గమ్యమేంటీ!’ ఇలా ఎన్నో తాత్విక ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఈ బాధలూ, ప్రశ్నల నుంచి బయటపడదామనే ఆ రోజు పార్టీకి వచ్చాను. ఇక్కడ వేదన పెరుగుతోందే కానీ తగ్గలేదు. నా ఫ్రెండ్ కెరీతో ఇవన్నీ చెప్పుకుని ఏడ్చేశాను. తను ఓ ఐడియా చెప్పింది. ‘ఓ పని చేద్దాం కరణ్ ... ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం. అవి మన బాధని ఎంత వరకు తగ్గిస్తాయో చూద్దాం... తగ్గేంత వరకూ తిరుగుతూనే ఉందాం!’ అంది. నాకూ ప్రయాణాలంటే ఇష్టమే కాబట్టి ఆ తర్వాతి వారమే అమెరికా నుంచి బయటపడ్డాం. మమ్మల్ని బాహ్యప్రపంచంతో బంధించే సెల్ ఫోన్ , నెట్ , బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ వదిలేసి ప్రయాణం కట్టాం. అప్పటిదాకా... ఓ సగటు భారతీయుడు అమెరికాలో కోరుకునే విలాసాలన్నీ అనుభవిస్తూ వచ్చినవాణ్ణి నేను. అమెరికాలోని క్రాఫ్ట్ ఫుడ్స్ అనే సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కులోని ఓ పెద్ద లగ్జరీ ఫ్లాట్ లో నివాసం. అన్నింటినీ వద్దనుకుని కేవలం ఓ జతబట్టలు సర్దుకుని నేనూ కెరీ బయలుదేరాం. స్కాట్లాండ్ లోని బౌద్ధ కేంద్రానికి ఫ్లైట్ లో వెళ్లాం కానీ... ఆ తర్వాత మేం చేసిన ప్రతి ప్రయాణం రోడ్డుపైనే. ఇంచుమించు కాలినడకనే... అదీ ఇండియాదాకా! ఆ యాత్ర నన్ను యోగిని చేసింది. ఆ స్థితి నుంచి పారిశ్రామికవేత్తగా ఎందుకయ్యానో వివరించే ముందు... నా గురించి ఇంకాస్త చెప్పాలి మీకు...
బెస్ట్ సీఈఓగా గుర్తింపొచ్చినా..
మా నాన్న ఆర్మీ ఆఫీసర్ . ఆయనకి ఎన్నో బదిలీల తర్వాత మేం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో స్థిరపడ్డాం. అక్కడి ఆర్మీ స్కూల్ లో చదువుకున్నాను. ఎంత బాగా చదువుతూ ఉన్నా సరే, నా మనసంతా ఎదురుగా ఉన్న హిమాలయాలపైనే ఉండేది... వాటిని ఎప్పుడు అధిరోహించాలా అని మనసు ఉవ్విళ్లూరేది. ప్లస్ టూ తర్వాత బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో చేరాను. ఆ తర్వాత మేనేజ్ మెంట్ పైన ఆసక్తి పుట్టి బెంగళూరు ఐఐఎంలో సీటు సాధించాను. అక్కడ ఎంబీఏ ముగించగానే ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) సంస్థలో మార్కెటింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్లలోనే ఆ సంస్థ తయారుచేస్తున్న ఏరియల్ వాషింగ్ పౌడర్ కి బ్రాండ్ మేనేజర్ గా అమెరికాకి వచ్చాను. ఏరియల్ తో నేను సాధించిన విజయానికి గుర్తుగా అమెరికాకి చెందిన యాడ్ -ఏజ్ సంస్థ 2007లో ‘టాప్ మార్కెటీర్ 40 అండర్ 40’ జాబితాలో నన్ను చేర్చింది. కానీ ఆ విజయాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించలేకపోయాను. టీనేజీ నుంచి నాలో ఏదో మూల ఉన్న ‘రచయితని కావాలనే కల’ నన్ను వెంటాడింది.
రచయితని కావాలంటే కొద్దిగానైనా ప్రపంచాన్ని చూడాలి కదా అనిపించింది! దాంతో ఆరునెలలు సెలవుపైన మొదట దక్షిణ అమెరికా దేశాలైన పెరూ, చిలీ, అమెజాన్ ప్రాంతాలనీ, తూర్పు యూరప్ దేశాలనీ, మంగోలియానీ చూశాను. ఈ ప్రయాణంలో నేను చూసిన అసాధారణ వ్యక్తులకే నా ఊహల్నీ జోడించి ‘కీప్ ఆఫ్ ది గ్రాస్ ’ అనే నవల రాశాను. ‘నేనూ రచయితనైపోయానోచ్ ...’ అంటూ ఆనందంతో అమెరికా వస్తే అక్కడ ఆర్థిక సంక్షోభం విలయ తాండవం చేస్తోంది! దాంతో నా ఉద్యోగం పోయింది. అప్పటికి నా వయసు ముప్పై ఏళ్లు. నాతోటివాళ్లంతా పెళ్లై కార్లూ, ఆస్తులని కొనుక్కుంటూ ఉంటే నేను మాత్రం ఉన్న డబ్బంతా పర్యటనలోనే ఖర్చుచేసేసి... అమెరికాలోని మా అక్కవాళ్లింట్లో తలదాచుకున్నాను. దాంతో కుటుంబం, బంధువులే కాదు స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ హేళనల మధ్య నాకు ధైర్యం నూరిపోసింది అమ్మే. తనిచ్చిన ధైర్యంతో ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ బోస్టన్ కన్సల్టన్సీ గ్రూప్ (బీసీజీ)లో చేరాను. అందులో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను. ఈలోపు 2010లో నా మొదటి ఇంగ్లిష్ నవల ఇండియాలో అచ్చయి సూపర్ హిట్టయింది! అప్పట్లో పేరున్న రచయితల పుస్తకాలే ఐదువేల కాపీలు పోవడం గగనమైతే... నా మొదటి పుస్తకం ఏడాదిలోనే 70 వేల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. అది నా జీవితాన్ని మార్చింది. ఈలోపు నా మొదటి పుస్తకం ముద్రించిన సంస్థవాళ్లు రెండో నవల రాయమన్నారు. రాద్దామని కూర్చుంటే... ఏ కొత్త ఆలోచనలూ రాలేదు. మొదటి నవలతోనే నా సరుకంతా అయిపోయిందనిపించింది. దాంతో, నవల రాయడం కోసమే బ్యాగ్ సర్దుకుని ప్రయాణాలు మొదలుపెట్టాను. ఈసారి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆ అనుభవంతో మరో పర్యటక నవల ‘జానీ గాన్ డౌన్ ’ రాశాను. అది లక్ష కాపీలు దాటింది. దాన్ని సినిమాగా తీయడానికి బాలీవుడ్ నిర్మాతలు కాపీ రైట్స్ తీసుకున్నారు! ఆ తర్వాత క్రాఫ్ట్ ఫుడ్స్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా మారాను. ఈ విజయాలన్నీ ఆనందిస్తుండగానే అమ్మ మరణం... ఓ సునామీలా నన్ను ముంచెత్తింది. ఆ ఊపిరాడని పరిస్థితిలోనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టాను.అదే ధర్మం అని తెలిసింది.
కెరీతో నా ప్రయాణంలో కొన్ని దేశాల్లో ప్లాట్ ఫామ్ పైన పడుకున్నాం. కొన్నిసార్లైతే ఆగకుండా 50 కిలోమీటర్లూ ప్రయాణించాం. అలా ఇండియా వచ్చి మదురైలోని శివానంద ఆశ్రమంలో చేరాం. రెండు నెలలపాటు అతికఠినమైన శిక్షణ ఇచ్చారక్కడ. ఉదయం ఐదున్నరకే లేచి మంచుగడ్డని తలపించే చన్నీళ్లలో స్నానం చేయడం, కటిక నేలమీద పడుకోవడం, రోజూ యోగా, ధ్యానం మా జీవిత దృక్పథాన్నే మార్చింది. ఆ తర్వాత రుషికేష్ లోని శివానంద ఆశ్రమానికి వెళ్లాం. అక్కడే నేను సన్యాసిగా మారాను. ఏడాది తర్వాతే నాలో చైతన్యం మొదలైంది. మన భారతీయ చింతన ప్రకారం... ప్రతి జీవికీ తాను మాత్రమే నెరవేర్చగల కర్తవ్యం ఒకటి ఉంటుంది. దాన్ని స్వధర్మం అంటారు. నేను ఓ యోగిగా హిమాలయాల్లో ఉండగలిగినా... నా స్వధర్మం పెద్ద సంస్థల్ని సృష్టించడమేనని అర్థమైంది. దాంతో సన్యాసానికి స్వస్తి పలికాను. అమెరికా వచ్చి కెరీని పెళ్ళి చేసుకున్నాను. ఆధ్యాత్మిక జీవనం మనస్సునీ, శరీరాన్నీ శక్తిమంతం చేయడమే కాదు... ప్రాపంచిక వ్యవహారాల్ని తామరాకుమీద నీటిబొట్టులా చూసేలా చేసింది. కోపతాపాలకి దూరం చేసింది. కాకపోతే, ఇంత పరిణతి తర్వాతా ఓటమి నాకు ఎదురవుతూనే వచ్చింది...
వరుస అపజయాలు.
భారతదేశంలో యోగిగా నా ఆధ్యాత్మిక అనుభవాలతో ‘ది సీకర్ ’ అనే నవల రాశాను. దాదాపు 62 పుస్తక ప్రచురణ సంస్థలు దాన్ని తిప్పికొట్టాయి! చివరికి పెంగ్విన్ సంస్థవాళ్లు అచ్చేసినా... ఆశించినంతగా అమ్ముడు పోలేదు. ఆ తర్వాత ఓ స్టార్టప్ లో పెట్టుబడులు పెడితే అందులోనూ నష్టం వచ్చింది. ఆ తర్వాత డిస్కవరీ ఛానెల్ ఇండియా సంస్థకి వైస్ ప్రెసిడెంట్ ని అయ్యాను. ఆ సంస్థ కోసం కొత్తగా హిందీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ మొదలుపెట్టాను. మరెన్నో చేయాలనుకున్నాను కానీ సాధ్యం కాలేదు. నా ఉద్యోగం కాస్తా నెలకోసారి వెళ్లి ప్రధానమంత్రినీ, మంత్రుల్నీ కలవడంతోనే సరిపోయేది. అది నాకు సరిపడక రాజీనామా చేశాను. అంత మంచి హోదాకి రాజీనామా చేశానని తెలిసి నా భార్యవైపు వాళ్లు నన్ను పిచ్చోడిలా చూడటం మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లల తండ్రిగా నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏ అత్తామామలు భరిస్తారు చెప్పండి! కానీ ఒకప్పుడు మా అమ్మ చేస్తున్నట్టు ఇప్పుడు మా ఆవిడ నన్ను వెనకేసుకొచ్చింది. ‘అతనో క్రియేటర్ ... తను ఇలాగే ఉండగలడు!’ అని తనవాళ్లతో వాదించింది. తనకి నాపై ఉన్న ఆ నమ్మకమే నా ‘వైట్ హ్యాట్ జూనియర్ ’ సంస్థకి పునాది!
శిక్షకులందరూ మహిళలే.
పిల్లలకి కంప్యూటర్ కోడింగ్ ని ఓ ఆటలా నేర్పించే సంస్థ నాది. ఆన్ లైన్ లో ఇలాంటి శిక్షణ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వడం లేదని తెలిసి దీన్ని మొదలుపెట్టాను. కేవలం మహిళల్ని మాత్రమే టీచర్లుగా తీసుకున్నాను. ఇందుకూ... మా అమ్మ జీవితమే కారణం. అమ్మ అప్పట్లోనే పీజీ చేసినా నాన్న బదిలీల కారణంగా తనకంటూ కెరీర్ లేకుండా పోయింది. తనలోని ఆ బాధని నేను చిన్నప్పటి నుంచీ చూస్తూ వచ్చాను. అందుకే, నేను కోడింగ్ కోచ్ లుగా మహిళలు మాత్రమే ఉండాలనుకున్నాను! ఏ కాస్త ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చినా వాళ్లు అద్భుతాలు చేస్తారనే నమ్మకం నాలో బలంగా ఉండేది. మావాళ్లు దాన్ని నిజం చేశారు!
ఆ అద్భుతాలు ఇవి.
కేవలం పదిమంది ఉద్యోగులతో నా సంస్థని 2018 అక్టోబర్ లో ప్రారంభించాను. మొదటి ఏడునెలలు పెద్దగా లేదుకానీ ఆ తర్వాత పిల్లలూ, తల్లిదండ్రుల నుంచి మేం ఆశించిన స్పందన మొదలైంది. దాంతో టీచర్ల సంఖ్యని నాలుగు వందలకి పెంచాం. అక్కడి నుంచి మరో నాలుగు నెలల్లో నాలుగువేలకి చేర్చాం. అమెరికాలోనూ ఈ సేవలు అందించడం ప్రారంభించాం. రెవెన్యూ పది కోట్ల నుంచి వందకోట్ల మైలురాయిని అందుకుంది. రోజువారి క్లాసుల సంఖ్య పాతికవేలకి చేరింది. దాంతో బైజూస్ మా సంస్థని కొంటామంటూ ముందుకొచ్చింది. సుమారు రూ.2,240 కోట్లు... నగదుగా ఇస్తానంది! కేవలం ఏడాదిన్నర వయసే ఉన్న సంస్థకి ఇంత డిమాండు రావడం ఓ రికార్డు. నాకూ బైజూస్ ద్వారా నా ఆలోచనలు మరింత ఎక్కువమందికి చేరడం మంచిది అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. సంస్థని అమ్మినా సీఈఓగా నిర్వహణ బాధ్యతలన్నీ నేనే చూస్తున్నాను. మా టీచర్ల సంఖ్యని లక్షమందికి చేర్చడం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం ప్రస్తుతం నా లక్ష్యాలు. ఇవి పూర్తయ్యాక ఎప్పట్లాగే మరో సరికొత్త రంగంవైపు వెళ్లాలనుంది..!
మా ఆవిడ కెరీ చాలా గ్రేట్.
మా ఆవిడ కెరీ, నేనూ, మా ఇద్దరు పాపలు నీలా, రూమీ అందరం ముంబయిలోనే ఉంటున్నాం. మా ఆవిడ పిల్లల పోషకాహార నిపుణురాలు. తను లేకపోతే నా విజయాలే లేవని చెప్పడం అరిగిపోయిన రికార్డ్ లోని వాక్యంగా అనిపించొచ్చుకానీ... అది వందకు వెయ్యిశాతం నిజం. తనకే నా మీద నమ్మకం లేకుంటే ఇన్ని అపజయాల తర్వాత నిలదొక్కుకునేవాణ్ణి కాదు. బైజూస్ డీల్ తో సంస్థ ప్రొమోటర్ గా వెయ్యి కోట్లు వచ్చినా... ఒకప్పటి మా సన్యాస జీవితమే అలవాటై మేం సొంత ఆస్తులేవీ కొనలేదు. మాకు సొంతిల్లూ, కారూ లేవు. ఇప్పటికీ వీలున్నంత తక్కువ ఖర్చుతోనే నెట్టుకువస్తున్నాం. మా పిల్లలకీ ఈ ‘స్వచ్చంద పేదరికాన్ని’ నేర్పిస్తున్నాం!