Saturday, 24 June 2023

 ' మోగా ' సంఘటన జరిగి రేపటికి 34 ఏళ్ళు..

సంఘ చరిత్రలో ఒక బాధాకరమైన ఆద్యాయం..

25 మంది స్వయంసేవకులు దేశం కోసం బలిదానం అయిన రోజు..


ఆరోజుల్లో ప్రత్యేక రాజ్యమైన ఖలిస్తాన్ కావాలని కొంతమంది దారితప్పిన సిక్కు యువకులు పాకిస్తాన్ ప్రోద్బలంతో హింసామార్గం ఎంచుకున్నారు.ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. .హిందువుల మీదనైతే దాడులు ప్రారంభించారు కూడా.


అది 1989 జూన్ 25. పంజాబులోని జిల్లా కేంద్రం మోగా పట్టణంలో నెహ్రూ పార్కు. ఉదయపు నడక కోసం ఎంతోమంది పార్కులో ఉన్నారు. అదే పార్కులో ఒక చోట ఆరెస్సెస్ ప్రభాత్ శాఖ జరుగుతోంది. పెద్దలు, యువకులు, బాలల కేరింతలతో సందడిగా ఉంది.కొంతమంది పౌరులు వారి ఆటపాటలను చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.మరికొందరు అక్కడున్న బెంచీలమీద సేద తీరుతున్నారు. ఉన్నట్టుండి కొందరు ఆయుధదారులైన సిక్కు(ఖలిస్తాన్ ) తీవ్రవాదులు ఆ పార్కులోకి వచ్చారు. సంఘశాఖను చుట్టుముట్టారు.శాఖలో దేశభక్తిపూరిత వాతావరణంలో మునిగిఉన్న స్వయంసేవకులపై ఉన్నట్లుండి కాల్పులు జరపడానికి ఆయుధాలు సిద్ధం చేసుకోసాగారు. . అది గమనించిన స్థానిక నగర మాననీయ సంఘచాలక్ శ్రీ రామావతార్ గారు వెంటనే స్వయంసేవకులందరినీ నేల మీద ఒకరి మీద ఒకరిని పడుకోమని గట్టిగా అరిచారు. ఏం జరుగుతోందో అర్థం కాకపోయినా జ్యేష్ఠ అధికారి సూచనను పాటించడానికి ఉద్యుక్తులయ్యారు. అదే శాఖలో ఉన్న స్థానిక ప్రచారక్ శ్రీ నాగేశ్వర్ స్వయంసేవకులందరికన్నా పైన పడుకోబోయాడు. అయితే ఆయనను స్వయంసేవకుల క్రింద పడుకునేలా చేసి, అందరికంటే పైన శ్రీ రామావతార్ గారు పడుకున్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదుల తుపాకులనుండి వెలువడిన తూటాలు ఆయన శరీరాన్ని జల్లెడలా మార్చేశాయి. అక్కడితో ఆగకుండా దాదాపు 25 మంది స్వయంసేవకుల శరీరాల్లోకి దూసుకుపోయి వారి వెచ్చటి నెత్తుటిలో తడిశాయి. శ్రీ నాగేశ్వర్ కు కూడా కాలిలో తూటాలు దిగబడ్డాయి.అయితే ప్రాణాలతో బయటపడ్డాడు.


జరిగిన సంఘటనను ఆ తర్వాత శ్రీ నాగేశ్వర్ గారు ఇలా వివరించారు: 

' నేను స్వయంసేవకులపైన పడుకోవడానికి సిద్ధమవుతుంటే మాననీయ నగర సంఘచాలకులైన శ్రీ రామావతార్ జీ ఆపి, సంఘ కార్యవిస్తరణ కోసం సుదూర కర్ణాటక నుండి వచ్చిన మీరు చావకూడదంటూ నన్ను క్రింద పడుకోబెట్టి స్థానిక స్వయంసేవకులను నా మీద పడుకోబెట్టడమే గాక అందరికన్నా పైన ఆయన పడుకుని తమ ప్రాణాలను మొదట భారతమాత పాదాలపై సమర్పణ చేశారు. అందరికీ మార్గదర్శకులుగా ఉండే జ్యేష్ఠ కార్యకర్తగా అందరికన్నా ముందు తూటలకు తమ శరీరాన్ని అడ్డుపెట్టి , కొంతమందినైనా రక్షించి ఆయన మమ్మల్ని వీడి వెళ్ళిపోయారు.'


ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న ఆ రోజుల్లో సిక్కులు, హిందువుల మధ్య సామరస్యం సాధించాలనే ఉద్దేశ్యంతో ఆరెస్సెస్ వివిధ ప్రాంతాలనుండి తన ప్రచారకులను పంజాబుకు పంపింది. అలా వెళ్ళినవారిలో శ్రీ నాగేశ్వర్ ఒకరు.


సరిగ్గా రేపటికి మోగా లో ఈ దురంతం జరిగి ముప్పై ఏళ్ళవుతోంది. ఇదంతా ఒకెత్తు కాగా ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా మరుసటి రోజే అంటే జూన్ 26 న యథావిధిగా సంఘ శాఖ రెట్టింపు సంఖ్యతో జరగడం మరింత విశేషం. తోటి స్వయంసేవకుల రక్తం చింది తడిసి ముద్దయిన నేలను ఉల్లాసభరితమైన దేశభక్తి నినాదాలతో ,తమ పదఘట్టనలతో మళ్ళీ పొడిపొడిగా మార్చిన స్వయంసేవకుల ధ్యేయనిష్ఠ ప్రశంసార్హమైంది.


రండి ! రేపటి మన మన సంఘశాఖల్లో , మోగా దురంతంలో దేశమాత పాదాలను తమ రక్తంతో అభిషేకించిన ఆ పవిత్రాత్మలకు సద్గతులు ప్రాప్తించేలా చేయమని మరోమారు ఆ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తూ , మనమూ భారతమాత సేవకు పునరంకితమవుదాం.


* || భారతమాతాకీ జై ||*'

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...