అక్షరామృతమంతా మట్టిపాలేనా!
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ మాతృభాషను పాఠశాల విద్యామాధ్యమం నుంచి తొలగించి ఆ స్థానంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రక తప్పిదం. ఎందుకంటే, ఇంగ్లీష్ ద్వారా వచ్చే వేలాది ఉద్యోగాలు కోట్లాదిమంది భారతీయులకు ఏమూలకూ సరిపోవు. లక్షలాదిమంది జనం భారతీయ భాషల ద్వారానే ఉపాధి పొందుతున్నారు. 2011–12 ఆర్థిక గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి రూ.4,64,184 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రాలలో ఉన్న మొత్తం శ్రామిక శక్తి 1,07,77,950 మంది. వీరిలో అన్ని రకాల ఉద్యోగులూ, వ్యాపారులూ, రైతులూ, కూలీలూ ఉన్నారు. వీరందరూ రూ.4,64,184 కోట్ల సంపదను సృష్టించారు. ఇంత సంపద సృష్టించినవారిలో 32.50శాతం మంది నిరక్షరాస్యులు. వీరిలో 52.02శాతం మంది అక్షరాస్యులేగానీ, ఇంటర్మీడియట్ కూడా దాటనివారు. ఇకపోతే, మిగిలిన 15.48శాతం మాత్రమే గ్రాడ్యుయేట్లు. మన గ్రాడ్యుయేట్లందరికీ ఇంగ్లీష్ వచ్చనుకుంటే, కొద్దో గొప్పో తాము చేసే పనిలో ఇంగ్లీష్ వాడి సంపద సృష్టించగలిగినవాళ్ళు 15శాతం మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాలలో సంపదను సృష్టించేవారిలో 85శాతం మంది తెలుగూ తదితర మాతృభాషలనే వాడుతున్నారు.
ఇంగ్లీష్ను ఒక భాషగా నేర్చుకోవడం వేరు, దానిని విద్యా మాధ్యమంగా అమలుపరచటం వేరు. ఇంగ్లీష్ మాధ్యమంతో దేశీయ స్థానిక భాషల ఆధారంగా నడిచే వందలాది పరిశ్రమలు మూలబడతాయి. దాంతో లక్షలాది ఉద్యోగాలు పోయి కోట్లాదిమంది ఉపాధి కోల్పోతారు. ఒకటి రెండు తరాలలో తెలుగు రాయగలిగినవాళ్ళూ చదవగలిగినవాళ్ళూ మిగలరు. తెలుగు సినిమాలూ తెలుగు టీవీ ఛానెళ్ళూ ఉండవు. తెలుగు రచనలు ఉండవు, రచయితలూ ఉండరు. వారు లేనిదే తెలుగు పత్రికలూ, తెలుగు ప్రచురణలూ ఇంకెక్కడ ఉంటాయి. అప్పుడు వేల యేండ్ల అస్తిత్వం కలిగిన తెలుగు ఏమవుతుంది? వేల యేండ్లుగా కవులూ రచయితలూ సృష్టించిన సాహిత్య సంపద ఏమవుతుంది?గత కాలపు నన్నయ, పాల్కురికి సోమన, తిక్కన, పోతన, శ్రీనాథుడు, పెద్దన, ధూర్జటి, రామలింగడు, శ్రీకృష్ణ దేవరాయలు, మొల్ల, అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, వేమన, తరిగొండ వెంకమాంబల నుంచి నిన్నమొన్నటి చెళ్లపిళ్ల వేంకట కవులూ, విశ్వనాథ, జాషువ, శ్రీశ్రీ, దాశరథి, తిలక్, సినారె వీరందరి రచనలు ఏమైపోతాయి?
‘భూషణాలు ఎన్నింటినో ధరించామని వేసుకున్న బట్టల్ని తీసివేస్తామా’ అంటూ సామాన్యుని గొంతుకను వినిపించిన కవయిత్రులూ గేయకర్తలూ కావాలిప్పుడు: ‘ఒక్క నిరుపేద ఉన్నంతవరకూ/ ఒక్క మలినాశ్రు బిందువు ఒరిగినంతవరకు/ ఒక్క ప్రేగు ఆకలి కనలినంతవరకు/ ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుధార్తి ఏడ్చు పసిపాప ఉన్నంతవరకు నాకు శాంతి కలుగదింక’ – అని ఎలుగెత్తి చాటిన తిలక్ తెలుగు పలుకులు ఉండవింక. ‘నా వచనం బహువచనం/ నా వాదం సామ్యవాదం/ కవిత్వం నా మాతృభాష/ ఇతివృత్తం మానవత్వం’ అని తెలుగు హృదయోదయాన్ని ఆవిష్కరించిన సినారె కవిత్వాన్ని ఎవరు చదువుతారు!
‘కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి/ పంజరాన గట్టు వడను నేను/ నిఖిలలోక మెట్లు నిర్ణయించిన/ నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’ అని ఎలుగెత్తి అరిచిన నవయుగ కవి చక్రవర్తి జాషువ పలుకులు ఇంకెవరు వింటారయా! ‘నరజాతి చరిత్ర సమస్తం/ పరపీడన పరాయణత్వం/... నరహంతలు ధరాధిపతులై/ చరిత్రలో ప్రసిద్ధి కెక్కిరి/...పరస్పరం సంఘర్షించిన/ శక్తులలో చరిత్ర పుట్టెను’ అంటూ పోరాడనివాళ్ళు చరిత్ర హీనులని తేల్చిచెప్పిన మహాకవి కవితా ఝరి చదివి స్ఫూర్తి మత్వం పొందేవారు ఇక కానరారేమోగదా! ‘ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ/ ఒక జాతిని వేరొక జాతీ/ పీడించే సాంఘిక ధర్మం/ ఇంకానా! ఇకపై సాగదు’ అని ఫెళఫెళారవాలు సృష్టించిన శ్రీశ్రీ కవితావేశాన్ని మరింక చదవగలిగిన యువజనం ఉంటారా!
‘ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!/ ఎవరు రాయలు! ఎవరు సింగన!/ అంతా నేనే! అన్నీ నేనే!/ అలుగు నేనే! పులుగు నేనే!/ వెలుగు నేనే! తెలుగు నేనే!’ అంటూ, ‘ప్రజాపీడకులపై అగ్నిధారలు కురిపించి,/ ప్రజల తరపున రుద్రవీణలు మోగించి,’ ప్రజాస్వామ్యం కోసం తిమిరంతో సమరం సాగించి, మహాంధ్రోద్యమాన్ని తలపెట్టిన దాశరథిని ఇంక ఎవరు చదువుతారమ్మా! ‘...శుభమగు నాంధ్ర జాతికి/ విశుద్ధ యశోనిధి కన్నివేళలన్–’ అన్న ‘ఆది ఆంధ్రుడు’ యశోభూషణుడు ఆచార్య ఇనాకుని శుభకామన వట్టిబోవునా!
‘బావా ఎప్పుడు వచ్చితీవు?/ సుఖులే, భ్రాతల్, సుతుల్, చుట్టముల్?’ అని ఎలుగెత్తి తెలుగువారి నెల్ల పలుకరించే తిరుపతి వెంకట కవుల చిలిపి పలుకులకు ఇంక ఎవరు ఊ కొడతారో కదా! ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా/ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అని తెలుగన్నల అనురాగాన్ని అక్కచెల్లెండ్లకు పంచిపెట్టిన గద్దరన్న పాట నీటిమీద రాతేనా.
‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ అంటూ వేల కృతులతో తెలుగు మాగాణి పంట పండించిన త్యాగయ్యను ఇంకెవరు పాడుతారయ్యా! ‘రాజుల్ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు...’ అని ఛీత్కరించిన ధూర్జటి పల్కులకేమి కానున్నదో! ‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’ అని కులాల హెచ్చుతగ్గులను నిలదీసిన అన్నమయ్యను ఇంక ఆలకించేదెవరు! ‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు/ దానహీను జూచి ధనము నవ్వు’ అంటూ తేటపరిచిన వేమనను మళ్ళీ కాదనుకొందామా!
‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’ అంటూ పసిపిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో సుద్దులు చెప్పిన సుద్దాల హనుమంతు మోగిన గేయాలు ఎవరికోసం! ‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’ అన్న ఆరుద్రనూ పట్టించుకోమా! ‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’ అంటున్న త్రిపురనేని రామస్వామి వేడుకోళ్ళు ఎవరూ వినిపించుకోరా! ‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’ అంటూ ఆకాశవీధుల చాటిన బాలాంత్రపు రజనీకాంతరావు మాటలు ఏమయ్యాయి!
‘తీరికే లేని విశ్వ సంసారమందు/ అలిసిపోయితివేమో దేవాదిదేవ!/ ఒక నిమేషము కన్ను మూయుదువు గాని/ రమ్ము! తెరచితి నా కుటీరమ్ము తలుపు!!’ అన్న కరుణశ్రీ వేడుకోలు వినేదెవరు స్వామీ?! ‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లె మనదిరా.. ప్రతి పనికి మనమురా.. నడుమ దొర ఏందిరో.. వాని దూకుడేందిరో’ అని గర్జించిన గూడ అంజయ్య గుండె ధైర్యాన్ని చూసి జ్వలించేదెవరు! ‘తను శవమై – ఒకరికి వశమై/ తనువు పుండై–ఒకరికి పండై/ ఎప్పుడూ ఎడారై – ఎందరికో ఒయాసిస్సై’ అంటూ స్త్రీల పట్ల చెలరేగుతున్న హింసనూ, మన బాధ్యతారాహిత్యాన్నీ గుర్తు చేసిన అలిశెట్టి ప్రభాకర్ తెలుగు పదబంధాలు చదివేదెవ్వరు! ‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం/ మమ్మల్ని విభజించి పాలిస్తోంది’ అంటూ లోగుట్టు బయటపెట్టిన సావిత్రి మొరను పట్టించుకొనేదెవరు! ‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి,/ అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’ అంటూ రెండు వాక్యాల తేట తెలుగులో మొత్తం శ్రమ జీవుల హక్కుల పాఠాన్ని బుర్రకెక్కిస్తున్న విమల రాతలను గుర్తుంచుకొనేవారు ఎవరు!
‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’ అని అడుగంటిపోతున్న మానవత్వాన్ని లేపి నిలబెట్టుకోవలిసిన అవసరాన్ని గుర్తించమని వేడుకొంటున్న అందెశ్రీ మాటలను ఇంకెవరు చదువుతారు! ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట!/ ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ అని గుర్తు చేసిన కందుకూరి రామభద్రరావు గుర్తుకు రాడేమో ఇక. ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ/ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ’ అని గళమెత్తిన నందిని సిధారెడ్డి పాట సద్దుమణగక ముందే తెలుగు వెలిసిపోతోందేమో!
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలకు అర్థ విపరిణామం జరిగిందేమో చేవజచ్చిన ఈ తెలుగు జాతికి ఈ పేరులెందుకు ఈ మాటలెందుకు. మన కళ్ళముందే కాళ్ళకింది తెలుగు మాగాణి కుంగిపోతుంటే పట్టనట్టు నోట మాటపడిపోయినట్టు నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండటం భావ్యమా!
మాతృభాషలో చదువులు నాణ్యమైన విద్యకు మూలమని ఐక్యరాజ్యసమితి విద్యావైజ్ఞానిక సంఘంవారి అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చెబుతున్నాయి. ఇది చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అంతరాలను తొలగించడానికీ, నేర్చుకొనే వేగాన్ని పెంచడానికీ మాతృభాష ఎంతో అవసరం. మాతృభాషా మాధ్యమంలో విద్య పిల్లలను చిన్నప్పటి నుంచీ తమచుట్టూ ఉన్న సమాజంతో కలిసిమెలిసి పెరిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది పరస్పర అవగాహనకూ పనికొస్తుంది, చుట్టూ ఉన్నవారి పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది. అమ్మనుడులలో పొందుపరిచిన సాంస్కృతిక సామాజిక సమతా వారసత్వ సంపదను సంరక్షించడంలో సహాయపడుతుంది.
భారత రాజ్యాంగంలోని 350ఏ అధికరణం పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో బోధించడానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసినదిగా రాష్ట్రాలకు సూచిస్తోంది. దీనిని వ్యతిరేకించడమంటే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను అవమానించడమే. ఆయన సందేశం ‘విద్య, ఉద్యమం, సంఘటితం’ కావడం తెలుగు భాషోద్యమానికి ఊపిరులూదుతుంది.
గారపాటి ఉమామహేశ్వరరావు
(నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)
No comments:
Post a Comment