Monday 27 February 2023

 భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఆనందీబాయి జోషి గారి వర్థంతి సందర్భంగా...్



#ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది.
#మహారాష్ట్ర పూణేలోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 31 మార్చి, 1865 లో జన్మించింది. తల్లితండ్రులు యమున అని పేరు పెట్టారు. ఆ కాలంలో బాల్యవివాహాల సాంప్రదాయం ఉండేది. ఈమెకు 9 సంవత్సరాల వయసులో దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషితో వివాహం జరుగుతుంది. వివాహం తరువాత, భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాల్ రావు, కళ్యాణ్ లో తపాలాశాఖలో గుమాస్తాగా పనిచేసేవారు. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. అతను మహిళల విద్యకు మద్దతు పలికాడు. విద్య అనేది ఆనాటి బ్రహ్మణుల కుటుంబాలలో సర్వసాధారణంగా ఉండేది. విద్యపట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి, ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. 14 సంవత్సరాల వయస్సులో, ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చింది. కానీ అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పది రోజుల్లో చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపుకు కారణమవుతుంది. తను వైద్యురాలు కావడానికి నిశ్చయించుకుంటుంది.
#గోపాలరావు తన భార్య వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. అనందీబాయి భర్త ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కొరకు ప్రయత్నాలు చేసాడు. 1880 లో, అతను రాయల్ విల్డర్ (ఒక ప్రసిద్ధ అమెరికన్ మిషనరీ) కు వ్రాసిన లేఖలో ఆనందీబాయికి యునైటెడ్ స్టేట్స్‌ లో వైద్య అధ్యయనం చేయడానికి గల ఆసక్తిని పేర్కొంటూ, తన కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికై విచారించారు. ఆలుమగలు క్రైస్తవమతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని విల్డర్ ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదనను జోషి దంపతులు తిరస్కరిస్తారు. అయితే విల్డర్ ఈ ఉత్తరప్రత్యుత్తరాలను తన సొంత పత్రికైన ప్రిన్సటన్ మిషనరీ రివ్యూలో ప్రచురించటం జరుగుతుంది.
#రొస్సెల్, న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ అనే యాధృఛ్ఛికంగా ఈ పత్రికలో ఆనందీబాయి గురించి చదివింది. వైద్యవిద్య చదవాలన్న ఆనందీబాయి తపన, దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త యొక్క వృత్తాంతం ఆమెను కదిలించింది. ఆనందీబాయికి ఉత్తరం వ్రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేయగలనని ముందుకువచ్చింది. కార్పెంటర్‌కు, ఆనందీబాయికి మధ్య అనేక విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. వారు పరస్పరం సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలలో బాల్యవివాహం కారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఒకటి కావటం విశేషం. ‘‘ సెరంపోర్ కాలేజ్’’ హాలులో ఆనందీబాయి ఉపన్యసించిన సమయంలో తాను వైద్యవిద్యను అభ్యసించడానికి అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటుందో వెల్లడించింది. అనందీబాయి ఆమెభర్త అనుభవించిన హింస గురించి తన ఉపన్యాసంలో వివరించింది.
#భారతదేశంలో హిందూ మహిళావైద్యురాళ్ల అవసరం గురించి వివరించింది. అలాగే ఆమె భారతదేశంలో మహిళా వైద్య కళాశాల ప్రారంభించడం తన లక్ష్యమని వివరించింది. అయితే తాను క్రైస్తవమతాన్ని స్వీకరించనని మాత్రం తెలుపుతుంది. ఆమె ఉపన్యాసం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. భారతదేశం నలుమూలల నుండి ఆర్థికసహాయం చేస్తామని సందేశాలు వస్తాయి. ఆమె విద్యకు సహాయంగా అప్పటి భారత వైస్త్రాయి కూడా 200 రుపాయల ఆర్థికసాయం పంపాడు. భర్తకు అమెరికాలో ఉద్యోగం లభించని కారణంగా అనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళింది. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ మాసంలో వైద్యవిద్యాభ్యాసానికి అమెరికాలో అడుగుపెట్టింది.
ఆనందీబాయి కలకత్తా నుండి న్యూయార్క్ వరకూ నౌకలో ప్రయాణం చేసారు. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా ఇద్దరు ఆంగ్ల మహిళలు ఉన్నారు. 1883 జూన్ లో న్యూయార్క్ లో ఈమెను స్వాగతించడానికి కార్పెంటర్ వచ్చింది. అమెరికాలో మిసెస్ కార్పెంటర్ అతిథిగా ఆమె ఇంటికి చేరింది.
#న్యూయార్క్ లో 1983లో థియోడిసియా కార్పెంటర్ ఆనందీబాయి బస మరియు పోషణ బాధ్యత వహించింది. ఆనందీ మరియు కార్పెంటర్ అత్యంత ఆత్మీయులుగా మారారు. కార్పెంటర్ ఆనందీబాయిని కుమార్తెగా భావించి అభిమానించింది. ఆనందిని చూసి కార్పెంటర్ విస్మయం చెందగా, అమెరికా వైవిధ్యం అనంది గోపాలును విస్మయపరిచాయి.
పెన్సిల్వేనియా మహిళా వైద్యకాలేజీలో వైద్యవిద్యకై ఈమె దరఖాస్తు చేసుకున్నారు మొట్టమొదటి మెడికల్ క్యాంప్ నిర్వహించుచున్న పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ వారికి ఆమె తనూ పాల్గొనేందుకై ఒక లెటర్ వ్రాసారు. అదే ప్రపంచ మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్. రేచెల్ బాడ్లీ, కాలేజీ డీన్, ఆమెకు ఈ విద్యాకోర్సుకై అర్హతను ఇచ్చారు.
ఈమె సహాధ్యాయినులైన కెయి ఒకామీ మరియు సబాత్ ఇస్లాంబులీ కెయి ఒకామీ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన తొలి జపాను మహిళ. ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఆమెను వదిలిన కార్పెంటర్ పసిపిల్లా విలపించడం వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది.
#కాలేజీ సెక్రెటరీ మరియు సూపరింటెండెంట్ సుదూరం నుండి విద్యాభ్యాసానికి వచ్చిన ఆనందీ గోపాలును చూసి ప్రభావితమై ఆమెకు అక్కడ ఉన్న 3 సంవత్సరాలు 600 అమెరికన్ డాలర్లను ఉపకారవేతనం ఏర్పాటుచేసింది. 19వ యేట ఆమె తన వైద్య విద్యను ప్రారంభించారు.
ఆమె అమెరికాలో ఎదుర్కొన్న ప్రధానసమస్య శీతోష్ణస్థితి. ఆమె 9 గజాల మహారాష్ట్ర సాంప్రదాయ శైలి చీర ధారణ నడుమును, పిక్కలను కప్పలేదు కనుక తీవ్ర అంతర్మథనం తరువాత గుజరాతీ శైలిలో చీరను ధరించాలని నిర్ణయించుకోవటం విశేషమైతే అది ఆమె భర్తకు తెలియజేయకూడదని నిర్ణయించడం మరొక ప్రత్యేకత. అయినా ఆమెకు కాలేజి వారు ఏర్పాటు చేసిన గదిలో సరైన ‘‘ ఫైర్‌ ప్లేస్’’ లేనందున ఉన్న ఫైర్‌ ప్లేస్ నుండి అత్యధికంగా పొగరావడం వలన ఆమెకు చలి లేక పొగ భరించవలసిన పరిస్థితి ఎదురైంది.
#రెండు సంవత్సరాల తరువాత ఆమెకు అపస్మారకం మరియు తీవ్రజ్వరం అధికమైంది. అప్పుడు మొదలైన దగ్గు ఆమెను చివరి వరకు వదిలిపెట్టలేదు.
ఆమె తీవ్ర ఆరోగ్యసమస్యలతో బాధపడుతూనే మూడు సంవత్సరాల ఉన్నతవిద్యాభ్యాసం పూర్తిచేసి చివరి పరీక్షలు వ్రాస్తుంది. మార్చి11, 1886 న ఆమె వైద్యవిద్యలో డాక్టరేట్ సాధించింది. ఆమె పరిశోధనాంశం ‘‘ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ-శిశు సంబంధిత వైద్య’’. స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి కూడా ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని పంపటం జరుగుతుంది. ఆమె పట్టభద్రోత్సవంలో ఆమె భర్త కూడా పాల్గొన్నాడు. ఆ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం ఆమెకు మరపురాని అనుభూతిని కలుగజేసిందని ఆమె తన కథనాలలో పేర్కొన్నది. ఆ ఉత్సవంలో పండిత రమాబాయి పాల్గొనడం మరో ప్రత్యేకత.
#ఆమె ఆరోగ్యం రోజుకు రోజుకు దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయ వ్యాధిగా నిర్ధారించబడింది. వ్యాధి ఇంకా ఊపిరితిత్తులని చేరలేదు. వైద్యులు ఆమెను భారతదేశానికి తిరిగివెళ్ళమని సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరించింది.భారతదేశానికి తిరుగుప్రయాణం చేసే సమయంలో ఆనందీబాయి ఆరోగ్యం మరింత దిగజారింది. నౌకాలో ప్రయాణం చేసే సమయంలో ఆమెకు చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు. వైద్యులు చికిత్సచేయడానికి నిరాకరించడానికి కారణం ఆమె " బ్రౌన్ వుమన్ " (సాధారణంగా భారతీయులను బ్రౌన్ ప్రజలు అంటారు ) కావడమే. 1886 చివరిభాగంలో, ఆనందిబాయి భారతదేశానికి తిరిగివచ్చారు.
#దేశం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. ఆమెను కొల్హాపూర్ సంస్థానానికి చెందిన వైద్యురాలిగా నియమించింది. అల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారిణిగా బాధ్యతలను అప్పగించింది.కలకత్తా చేరిన తరువాత ఆనందీభాయి బలహీనత, నిరంతర తలనొప్పి, తరచూ జ్వరం మరియు ఆయాసాలతో బాధపడింది. థియోడిసియా ఆమెకు అమెరికా నుండి ఔషధాలను పంపింది. తరువాత ఆమె ఆయుర్వేద చికిత్స కొరకు కజిన్ ఇంట్లో బసచేసింది. ఆయుర్వేద వైద్యనిపుణుడు ఆమె నౌకాయానం చేసి విదేశాలకు వెళ్ళి సంప్రదాయ సరిహద్దులు దాటినందుకు ఆమెకు చికిత్సచేయడానికి నిరాకరించాడు.
#భారతదేశానికి తిరిగివచ్చిన ఒక్క సంవత్సరంలోపుగానే ఆమె ఫిబ్రవరి 26, 1887 తేదీన 22 సంవత్సరాల చిన్నవయసులోనే అకాలమరణం చెందారు. ఆనందీబాయి మరణానికి దేశం అంతటా విషాదం ఆవరించింది. ఆనందీబాయి చితాభస్మం థియోడిసియా కార్పెంటర్ కు పంపబడింది. కార్పెంటర్ వాటిని పూకిప్సీ, న్యూయార్క్ లోని తమ కుటుంబ శ్మశానవాటికలో బధ్రపరచింది. ఈమె సమాధి శిలాఫలకాన్ని ఈ శ్మశానవాటికలో ఇప్పటికీ చూడవచ్చు.
#అమెరికాలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత, సంస్కరణకర్త అయిన కారోలైన్ వెల్స్ హీలీ డాల్ 1888లోనే ఆనందీబాయి ఆత్మకథను వ్రాసింది.దూరదర్శన్ ఆనందీబాయి జీవితమును ఆధారముగా చేసుకొని తీసిన ధారావాహిక "ఆనందీ గోపాల్"ను ప్రసారం చేసింది. ఈ ధారావాహికకు కమలాకర్ సారంగ్ దర్శకత్వం వహించారు.
శ్రీకృష్ణ జనార్ధన జోశీ తన మరాఠీ నవల "ఆనందీ గోపాల్"లో ఆనందీబాయి జీవితంలోని కొన్ని ఘటనలను పొందుపరిచారు (ఈ నవల ఆషా దామ్లే ద్వారా ఆంగ్లంలోకి అనువాదమయి సంక్షేప రూపం పొందింది). అదే పేరుతో రాం జీ జోగ్లేకర్ ఒక నాటకాన్ని రూపొందించారు.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...