Friday, 10 February 2023

                     వీరనారి నాయకీ

మహామ్మద్ ఘోరీని వణికించిన వీరనారి నాయకీ దేవి...


చుట్టూ పరికించి చూశాడు మహమ్మద్ ఘోరి !

ఒక స్త్రీ ,ఆమెతోపాటు ఒక‌సైనిక పటాలం అజాగ్రత్తగా ఉన్న తన సైనికులను ఊచకోత కొయ్యటం కనిపించింది ! ఎటుచూసినా ఆ వీరవనితచేతిలోని కత్తి తళత్తళలే కనిపించాయి ! 

మహమ్మద్ ఘోరీ తేరుకుని తన సైనికులను సన్నద్ధం చేసేలోపులోనే ఆ వనిత అక్కడ లేదు ఆమెతో వచ్చిన సైనిక పటాలము లేదు అంతా ఆరావళి కొండలలో మటుమాయమయ్యారు ఎంత గాలించినా ఎవరూ కనపడలేదు వారికి ! సైనికుల ప్రాణనష్టం భారీగా జరిగింది ఘోరీ వైపు !

ఆవిడ !! ఆ ధీరమూర్తి!!

 పేరు నాయికిదేవి ! చాళుక్యరాజవంశాన్ని మెట్టిన వనిత ! గోవాకు చెందిన ఒకమహామండలేశ్వరుడైన పరమార్ది కూతురు 

నాయికిదేవి సోలంకివశస్తుడైన అజయపాలడి సతీమణి ! అనహిలవాడను రాజధానిగా చేసుకొని నేటి రాజస్థాన్, గుజరాత్ లోని కొన్నిప్రాంతాలకు అజయపాలుడు రాజు ! 

అజయపాలుడి హఠాన్మరణం తో పసివాడైన కొడుకును గద్దెనెక్కించి ప్రతినిధిగా తాను రాజ్యం పరిపాలించింది నాయికిదేవి !

నాయికిదేవి చిన్నతనంలోనే గుర్రపుస్వారీ ,ఖడ్గచాలనం ఇత్యాది యుద్ధవిద్యలలో శిక్షణ పొందింది ! రాజనీతి చతరురాలు యుద్ధవ్యూహాలలో మేటి ! 

ఆ రాజ్యాన్ని దాని వైభవాన్ని గురించివిన్నాడు మహమ్మద్ ఘోరి ! 

ఒక ఆడుది, ఒక పసివాడు పరిపాలించే రాజ్యాన్ని సునాయాసంగా కొల్లగొట్టవచ్చు అనుకున్నాడు ! 

అనుకున్నదే తడవుగా

ఆఫ్ఘనిస్తాన్ నుండి లక్ష సైన్యంతో బయలు దేరాడు ! 

వేగులద్వారా మహమ్మద్ ఘోరీ కదలికలు వాడి ఆలోచనలు పసిగట్టింది నాయికిదేవి ! 

కానీ వాడి సైన్యం చాలా పెద్దది తన వద్ద అంత సైనిక సంపత్తి లేదు ఎలా ? 

తలవంచటంకంటే ఎదిరించి నిలబడటంలోని ఔన్నత్యం తెలిసిన వనిత కనుక తన చుట్టుపక్కల ఉన్న తోటి రాజుల సహాయాన్ని అర్ధించింది ! 

రాజులైన.....

కీర్తిపాలుడు సరేనన్నాడు

ధరావర్షుడు నేను సిద్ధం అన్నాడు

కల్హణదేవుడు ఘోరీతో కలహానికి నాదే ముందడుగు అని కబురంపాడు !

అనుకున్నట్లుగా సైన్యం సమకూరింది ! అయినా వాడి సైన్యం ముందు చాలా చాలా తక్కువ ! 

ఆలోచించింది రాణి ఏమి చేయాలా అని ! 

ఒకరోజు ఒకరాయబారి ఘోరీవద్దనుండి కబురు తెచ్చాడు ! 

దాని సారాంశమిది " నీవు నీకొడుకుతోసహా నావద్దకు వచ్చి నీ రాజ్యంలోని స్త్రీలను ,సంపదను నాకు సమర్పించి లొంగిపోతే ఏ విధమైన ప్రాణనష్టముండదు """ అని ...

కాస్త ఆలోచించింది రాణి ! సరే ! నీవు చెప్పినట్లే చేస్తాను ! నీవు ఆరావళి పర్వత శ్రేణి వద్దగల ప్రాంతానికి వచ్చినవెంటనే నా అంతట నేనే వచ్చి లొంగిపోతాను ...అని కబురుపెట్టింది !

ఆరావళి పర్వతశ్రేణులలో ప్రతి కొండ ,కోన ,లోయ మలుపులు గుహలు చాటుమాటుప్రదేశాలు తన వద్ద ఉన్న అన్ని రాజ్యాల సైనికులకు తెలుసు ! నిజానికి ఆ దారులు కొట్టిన పిండి వారికి ! 

అప్పటికప్పుడు ఆమె యుద్ధవ్యూహం నిర్ణయించుకున్నది ! అది గెరిల్లా వ్యూహం ! 

అక్కడ !! విడిదిలో రాణి వచ్చి లొంగిపోతుంది అన్న ధ్యాసలో ఉండి కాస్త యుద్ధ సన్నద్ధత తగ్గి గానాబజానాలో మునిగిపోయారు ఘోరిసైనికులు ! 

ఎక్కడనుండి ఏ కొండ ఈనిందో తెలియదు వచ్చారు మిడతలదండులాగ మీదపడ్డారు

అదనుచూసి పదునైన కోలుకోలేని దెబ్బతీసి గుట్టలలోకి‌ పారిపోయారు ! వారి వెంటపడ్డారు కొందరు ఘోరీ సైనికులు ! ...సైన్యం అలా చీలి పోగానే గుట్టలలో ఇంకొక వైపునుండి మరొక‌బృందం మిగిలిన సైన్యాన్ని ఇదే తరహాలో చావుదెబ్బకొట్టింది ! ఇలా బృందాలు బృందాలుగా వారు వస్తూనే ఉన్నారు !

ఈ విధమైన యుద్ధంలో గుట్టలలో కెళ్ళిన ఘోరీసైనికులు గుట్టలలోనే మట్టువెట్టబడ్డారు  ! 

లక్ష ఉన్న సైన్యం కాస్త ఘోరి,అతని అంగరక్షకదళం మాత్రమే మిగిలారు ! ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టింది వాడికి !

బ్రతుకు జీవుడా అంటూ మృత్యుభయంతో ప్రాణాలరచేతబట్టుకొని గాంధారం వైపు పరుగులుతీసి ఇల్లు చేరుకున్నాడు !!

మరి జీవితంలో బ్రతికి ఉండగా గుజరాత్ వైపు కన్నెత్తి చూడలేదు ! 

ఇదీ వీరనారి నాయికిదేవి సాహసోపేతమైన వీరగాధ !..

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...