క్రిస్టియానిటీ ప్రపంచంలో కి వచ్చాక అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన చాలా మూల ప్రాచీన సంస్కృతులు కాల గర్భంలో కలిసిపోయాయి.
అవి నాశనం అయితే కానీ క్రిస్టియానిటీ వ్యాప్తి చెందదు కాబట్టి ఆ ప్రాచీన సంస్కృతులు నాశనం చేయడానికి ఈ మిషనరీలు రెండు ముఖ్య పద్ధతులు అనుసరించారు. ఒకటి ఆ సంస్కృతి అవలంబిస్తున్న స్థానిక ప్రజలపై, అనవాళ్లపై భౌతిక హింసాత్మక దాడులు. రెండు, వారు అప్పటి వరకు నమ్ముతున్న దైవ స్వరూపాలు, పూజా పద్ధతులు చాలా తప్పు అని, వాటి కంటే క్రిస్టియానిటీ ఎంతో మెరుగైంది అని చెప్పే మేధోపరమైన సాంస్కృతిక దాడులు.
మన దేశాన్ని బ్రిటిష్ వారు అక్రమించాక కూడా మిషనరీలు అవే పద్ధతులు ఈ దేశంలో కూడా అవలంబించారు. ఇక్కడ ప్రాచీనులకు అసలు జ్ఞానం లేదు అని, వీరు అనుసరించే దేవుళ్ళు పూజా విధానాలు, ఆచారాలు, అలవాట్లు అన్ని చాలా అనాగరికమైనవి అని, తమ పద్ధతులు చాలా అభ్యుదయ మైనవి అని , తాము ఈ దేశ ప్రజలు పాటిస్తున్న సాంఘిక దురాచారాలను నిర్మూలించి వారిని నాగరికంగా తీర్చి దిద్దుతామని చెప్పి దేశంలోఒక వర్గ మేధావులను తమ వైపు తిప్పుకుని తమ కార్యాచరణ అమలు చేసారు. ఈ దేశ దురదృష్టం ఏమిటంటే ఆ బ్రిటిష్/మిషనరీల ప్రభావానికి ఈ దేశంలో కొందరు మేధావులు అమ్ముడు పోవడం.
బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చేసరికే ఇక్కడ సమాజం తనను తాను సంస్కరించుకుంటూ చాలా పురాతన సాంఘీక దురాచారాలను వదిలించుకున్నారు. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ల లెక్కల ప్రకారమే వాళ్ళు వచ్చేసరికి ఎక్కడో ఒకటో ఆరా తప్ప సతీసహగమం అనే దురాచారం విస్తృతంగా లేదు. ఎందుకంటే వారి లెక్కలు ప్రకారం 1815-28 మధ్య 13 సం. లలో 8139 కేసులు అదీ ఎక్కువగా అగ్రవర్ణాల లోనే నమోదు అయ్యాయి, దీనిలో సతి వల్ల కాకుండా మామూలు మరణాలు కూడా కలసి ఉన్నాయి, అలాగే 40సం. లు వయసు దాటిన విధవల మరణాలు కూడా ఉన్నాయి అని రాసుకున్నారు. (అంటే బాల్య వివాహాలలో భర్తలు పోతే బాలికలను విధవలుగా బతక నిచ్చేవారు కాదు అనే అబద్దానికి ఇది రుజువు). అంటే, పోనీ 25% అటువంటి మరణాలు తీసేస్తే
6000 సతి మరణాలు అనుకుంటే. అంటే సం. కి 500 లోపు. 1815లో భారత జనాభా సుమారు 18కోట్లు. పోనీ పెళ్లి అయిన స్త్రీలు ఒక 2కోట్లు వేసుకున్నా దానిలో సం. కి 500 అనుకుంటే ఎంత శాతం? 0.00025%. అంటే అప్పటికే హిందూ సమాజంలో ఈ సతీ అనాచారం దాదాపు కనుమరుగు అయిపోయింది. అయినా ఈ సతీ మరణాలకు విపరీతంగా వ్యతిరేక పబ్లిసిటీ ఇచ్చి హిందూ సమాజాన్ని ఒక ఆటవిక సమాజంగా చిత్రీకరించారు.
తమ మిషనరీ అజెండాకు ముడిసరుకు కావాలి కాబట్టి జనాలు మరిచిపోయిన ఈ సతీ సహగమనాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు. మరి దానికి ఇక్కడ స్థానిక మేధావుల ముద్ర కూడా కావాలి కదా? అలా బ్రిటిష్ వాళ్ళ ఎజెండాకు పావులా ఉపయోగపడి మిషనరీలు అజెండాను ఈ దేశంలో అమలు పరచడానికి శాయశక్తులా కృషి చేసిన వాడే ఈ రాజా రామమోహన్ రాయ్.
దేశంలో అప్పటి వరకు అమలు అవుతున్న సంస్కృతం ఆధారిత విద్య స్థానంలో యూరోపియన్ విద్యా విధానం ప్రవేశ పెట్టాలి అని 1835లో చెప్పిన మేకాలే కంటే 12 సం. ల ముందే ఈయన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఆమ్హీరేస్ట్ కి డిసెంబర్ 11 వ తేదీ 1823లో ఒక పెద్ద నోట్ ప్రిపేర్ చేసి సమర్పించాడు. అంతే కాదు, HH విల్సన్ ఆధ్వర్యంలో జనరల్ కమిటి ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రుక్షన్ ప్రభుత్వ ఖర్చుతో కలకత్తా లో సంస్కృత కళాశాల పెట్టాలి అనే సిఫార్స్ ని కూడా తీవ్రంగా ఈ రాయ్ వ్యతిరేకించినా, అది జనవరి 1824లో అప్పటికే యూరోపియన్ విద్యావిధానాన్ని అనుసరిస్తున్న హిందూ కాలేజీ (తర్వాత కాలంలో ప్రేసిడెన్సీ కాలేజి గా పేరు మార్చారు) ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో అది ప్రారంభించబడింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విగ్రహారాధన తప్పు అని అబ్రాహామిక్ మతాలు వారు నమ్మి ఫాలో అయ్యే సిద్దాంతాన్ని, దేవుడు ఒక్కడే ఉంటాడు అనే సూత్రాలను తాను స్థాపించిన" బ్రహ్మ సమాజం" ద్వారా ప్రచారం చేసాడు. అంటే పరోక్షంగా మిషనరీల వాదనకు నైతిక మద్దతు ఇచ్చాడు. అతను తనకి నచ్చిన విధానం ఫాలో అవ్వడాన్నీ దానిని ప్రచారం చేసుకోవడాన్ని తప్పు పట్టక్కరలేదు.. కానీ మేధావిగా చెప్పుకునే అతను కొన్ని కోట్ల మంది విగ్రహారాధన చేసే వాళ్ళ దేవుళ్లను, వారి నమ్మకాలను అపహాస్యం చేసే విధంగా పుస్తకాలు రాయడం ఏం మేధావి తనం? ఏం నైతికత? మరి క్రిస్టియన్ మిషనరీలు తమ మత మార్పిడి ఎజెండాకు అప్పటి నుండి ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్దతి అదే కదా?
ఇక అతనికి హిందూ ధర్మం అన్నా హిందూ దేవుళ్ళు అన్నా ఎంత ద్వేషమో ఆ పుస్తకాలలో రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకి ఇక్కడ చూడండి.
* ఆయన తాత్వికత మీద రెండు పుస్తకాలు రాసాడు. ఈ రెండూ చదివిన తరువాత అయినా హిందువులు విగ్రహారాధన మానేస్తారు అని ఆశించాడు.
* "లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్" అనే పుస్తకంలో మరియు బాప్టిస్ట్ మ్యాగజైన్ 1817లో ఉన్న ప్రకారం "కృషుడు దొంగ. నా ఇంట్లో బాత్ రూమ్ లు శుభ్రం చేసే పనిపిల్ల కూడా అంత హీనమైన పని చేయదు" అని అన్నాడు.
* కృషుడు మీద ఇలా వాగడం ఇదొక్క సారే కాదు, 1817లో విగ్రహారాధన మీద రాసిన పుస్తకం లో కృషుడు ని వ్యభిచారిగా పేర్కొన్నాడు. అతను ఎక్కువ దాడి కృష్ణుని మీదే చేసాడు. కృషుణ్ణి వ్యభిచారి, హంతకుడు, స్త్రీలను వేధించేవాడు అని రాసాడు. శివుని సింబల్ శివలింగం గురించి పబ్లిక్ లో మాట్లాడడానికి అసహ్యం వేస్తుంది అని రాసాడు.
* ఆ పుస్తకం లో మహాదేవుణ్ణి గురించి, కాళికా దేవి గురించి ఎంత అసహ్యంగా రాయవచ్చో అంత అసహ్యంగానూ రాసాడు. మహా విష్ణువు రాక్షసులను వెన్నుపోటు పొడిచాడు అని, బలి కి అన్యాయం చేశాడని, అతనో రేపిస్ట్ అని, శివుడు మోహిని అంటే పడి చచ్చేవాడు అని రాసాడు.
* అటువంటి అవలక్షణాలు కల దేవుళ్లను పూజించే హిందువులకు మంచి నైతిక విలువలు వుంటాయని ఎలా అశిస్తాం అని రాశాడు.
*హిందూ దేవుళ్ళ విగ్రహాలు అసహ్యంగా, వికారంగా , వికృతంగా, రెచ్చగొట్టే విధంగా వుంటాయని, అసహ్యంగా కోతులు, చేపలు, పందులు, ఏనుగులు దేవుళ్లట అంటూ రాశాడు.
*విగ్రహారాధన మీద విషం చిమ్మాడు. వాటిని పూజించడం వల్ల అనైతికంగా తయారు అయి సమాజాన్ని నాశనం చేస్తారు అని, హిందూ వేడుకలు ప్రజల నైతికతకు విఘాతం కలిగించేవిగా మరియు గ్రీకులు లేదా రోమన్ల వాటి కంటే "విధ్వంసక మరియు సమాజానికి హానికరమైనవి" గా రాసాడు. హిందువులు ఆత్మహత్యలను అత్యంత పుణ్యకార్యంగా పరిగణిస్తారు అని కూడా రాశాడు.
* కానీ, ఆయన అభిమానులు అతను విగ్రహారాధనను వ్యతిరేకించే ఏకేశ్వరోపాసకుడని అందుకే హిందూ ధర్మం గురించి ఇలా మాట్లాడాడు అని అతన్ని సమర్థిస్తున్నారు.
కానీ, బ్రహ్మ సమాజాన్ని ఏకేశ్వరోపాసనగా స్థాపించిన రాయ్ క్రైస్తవ మతం నుండి లోతైన ప్రేరణ పొందారనేది కూడా నిజం. అతను నిజానికి క్రైస్తవ మతం యొక్క యూనిటేరియన్ విభాగానికి మారినట్లు దాదాపు స్పష్టంగా కనిపిస్తుంది. అతను 'ది పెరిసెప్ట్స్ఆఫ్ జీసస్, ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్' అనే పుస్తకాన్ని బైబిల్ ఆధారంగా రాసాడు, ఇది బాప్టిస్ట్ మిషనరీల నుండి గొప్ప గుర్తింపు పొందింది.
హిందూ దేవుళ్ళ మీద తన పుస్తకాలలో విషం కక్కిన ఈ మేధావి జీసస్ దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి పుస్తకం రాసాడో చూడండి.
కానీ, అదే రాజా రామ్ మోహన్ రాయ్ ఆధునిక హిందూ సంస్కరణకు మార్గదర్శకుడిగా భారతీయులచే కీర్తించబడటం ఆశ్చర్యకరమైన విషయం. అతని రచనలు ఆధునిక హిందూమతం పట్ల అతనికి ఉన్న అపరిమితమైన ద్వేషం యొక్క తీవ్రతను వెల్లడిస్తున్నాయి.
ఇక చివరిగా, ఈయన మిషనరీ విలియం కారీ తో పరిచయం అయిన వెంటనే క్రిస్టియన్ గా మతం మార్చుకున్నాడు అని బ్రిటీష్ మరియు క్రైస్తవ మిషనరీలు కోరుకున్నట్లుగా, తప్పుడు మరియు అవాస్తవ కథనాలతో తన స్వంత మతాన్ని మరియు సంస్కృతిని చెత్తగా చూపించడానికని బ్రిటిష్ వారిచే "గొప్ప హిందూ రీఫార్మిస్ట్" గా కీర్తించబడ్డాడు అని కూడా ఒక కథనం ఉంది.
అతను క్రిస్టియన్ గా మారాడా లేదా అనేది సందేహస్పదం అని ఒక వేళ అనుకుంటే, బ్రిటన్ లో అతనికి అంత ప్రాముఖ్యత ఇచ్చి అతన్ని ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లోని క్రిస్టియన్ ఆర్నోస్ వేల్ స్మశానవాటికలో ఎందుకు పాతిపెట్టబడ్డాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆయన సమాధి వద్ద పెట్టిన శిలా ఫలకం లో "విగ్రహారాధనను అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన" గొప్ప మహా మనిషి అని రాయబడింది. అన్నిటికంటే జోక్ ఏమిటంటే, అలా రాయబడ్డ ఆయనకు, జీవితాంతం విగ్రహారాధనని వ్యతిరేకించిన ఇతను పోయాక
'బ్రిస్టాల్ కేథడ్రాల్' వద్ద విగ్రహాన్ని ప్రతిష్టించి
"విగ్రహం" విలువ తెలియచెప్పడం..
....చాడా శాస్త్రి....
No comments:
Post a Comment