Wednesday, 18 January 2023

  రాణీ తారాబాయి భోంస్లే

*ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనుక ఉన్న వారికి దుమ్ము తప్ప గుర్రం కనబడేది కాదట. కరవాలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్లగింజలు ఆవిడ ఒంటిని తాకలేకపోయేవట. నేటికీ మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటల్లో సజీవంగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న కొడుకు 'రాజారాం భోంస్లే' భార్య.. _"తారాభాయ్ భోంస్లే"_* 

*ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబ్ క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహరాజ్ చిన్న కొడుకు రాజారాం రాయ్ ఘడ్ కోట నుంచి నేటి తమిళనాడు జింగీ కోటకు వలస వెళ్లారు. అక్కడ నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు. దురదృష్టవశాత్తూ ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు. అప్పటికి మహారాణి తారాభాయ్ భోంస్లే వయసు కేవలం 25 ఏళ్ళు. ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్ ఘడ్ కు చేరుకొని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటలన్నీ తిరిగి రాబట్టారు. ఆవిడ ప్రతి కోటనూ తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా మాల్వాప్రాంతాన్ని (ఉజ్జయిన్.. బుర్హాంపూర్.. సిరోంజీ.. ముంద్రా) కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నారు.*

*ఒక 'విధవ' ఇద్దరు చిన్నపిల్లలతో తననేమి గెలవగలదని మదంతో తారాభాయ్ మీద యుద్ధానికి వచ్చిన ఆనాటి ఔరంగజేబ్ సేనాని 'ఆలంగీర్' గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టి కిందపడేసిన సివంగి 'మహారాణి తారాభాయ్.' బతుకుజీవుడా అని పారిపోయి తిరిగి తన జీవితకాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు ఆ పిరికి ఆలంగీర్. తన బావ శంభాజీ, భర్త రాజారాం ల మరణంతో నీరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి, అజేయంగా మలచి కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి... 27 ఏళ్ళు పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా ఏలిన _'వారియర్ క్వీన్' (యుద్ధరాణి).._ భారత్ లో ఒక రాణి ఝాన్సీ.. కాకతీ రుద్రమ్మ.. చౌతా అబ్బక్కల సరసన చేర్చదగ్గ వీరవనిత మహారాణి తారాభాయ్.*

*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

*_(Facebook post by.. —Suguna Rupanagudi)_*

 *_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు}_* *-------------------------------*

No comments:

Post a Comment

show image

  Sep 12 , 2025 " The Great Indian Warriors " Saragarhi Day September Twenty Sixth Trib...