భారతదేశంలో పేద ప్రధాని ఎవరు?
న్యూఢిల్లీ నగరంలోని డిఫెన్స్ కాలనీలో ఒక 94 ఏళ్ల వృద్ధుడిని ఇంటిఅద్దె చెల్లించలేదని ఆ ఇంటి యజమాని బయటకు గెంటేశాడు. ఆ వృద్ధుడి వద్ద పాత మంచం, కొన్ని అల్యూమినియం పాత్రలు, ఒక ప్లాస్టిక్ బకెట్, రెండు జతల బట్టలు తప్ప మరే వస్తువులు లేవు. అద్దె చెల్లించడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని ఆ వృద్ధుడు యజమానిని బ్రతిమాలుకొన్నాడు. ఇరుగుపొరుగు వారు కూడా ఆయనపై జాలిపడి, అద్దె చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని యజమానిని ఒప్పించారు. ఇంటి యజమాని అయిష్టంగానే అద్దె చెల్లించేందుకు కొంత సమయం ఇచ్చాడు. ఆ ముసలాయన తన వస్తువులను మళ్లీ లోపలికి తీసుకున్నాడు.
అటుగా వెళ్తున్న ఓ జర్నలిస్టు ఆగి ఆ దృశ్యాన్నంతా చూశాడు. ఈ విషయం తన వార్తాపత్రికలో ప్రచురించడానికి బాగుంటుందని అతను భావించాడు. " డబ్బు కోసం అద్దె ఇంటి నుండి ఒక వృద్ధుణ్ణి తరిమివేసిన క్రూరమైన ఇంటి యజమాని" అని ఒక శీర్షికను కూడా అనుకున్నాడు. ఆ అద్దె ఇంటిని, ఇంటిలోని వృద్ధుడిని ఫోటోలు తీసుకొన్నాడు.
ఆ పత్రిక ఎడిటర్ ఆ చిత్రాలను చూసి ఆశ్చర్యపోయాడు. "ఆ వృద్ధుడు ఎవరో తెలుసా?" అని తన విలేకరిని అడిగాడు. అతడు 'తెలియదండీ ఎవరో ముసలాయన' అని చెప్పాడు. ఆయన రెండుసార్లు భారత తాత్కాలిక ప్రధాన మంత్రిగా పని చేసిన శ్రీ గుల్జారీలాల్ నందా అని ఎడిటర్ తన విలేకరికి తెలియజెప్పాడు.
మరుసటి రోజు ఆ వార్తాపత్రిక మొదటి పేజీలో పెద్ద వార్త వచ్చింది. "దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న భారత మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా" అన్న శీర్షికన. ఒక మాజీ ప్రధానిని అద్దె కట్టలేక ఇంటి నుంచి ఎలా గెంటేశారో వార్తల్లో వ్రాసారు. ఈరోజుల్లో నిన్నమొన్న రాజకీయాల్లోనికి వచ్చినవారు కూడా బాగానే సంపాదిస్తుంటే, రెండుసార్లు మాజీ ప్రధానిగా ఉండి, ఎక్కువ కాలం కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆ వ్యక్తికి సొంత ఇల్లు కూడా లేదు అని వ్రాసారు.
మరుసటి రోజు అప్పటి ప్రధాని ఆదేశంతో మంత్రులు, అధికారులు వాహనాలతో హుటాహుటిగా వారి ఇంటికి వెళ్లారు. అన్ని వీఐపీ వాహనాల రాకపోకలను చూసిన ఆ ఇంటి యజమాని భయపడిపోయాడు. తన ఇంట్లో అద్దెకున్న పేద ముసలాయన భారత మాజీ ప్రధాని శ్రీ గుల్జారీలాల్ నందా అని అతనికి అప్పుడే తెలిసింది. గుల్జారీలాల్ నందా గారి పాదాలపై పడి ఆయన పట్ల తన దురుసు ప్రవర్తనకు క్షమించమని వేడుకొన్నాడు.
ప్రభుత్వ వసతి సౌకర్యాలను అంగీకరించాలని అధికారులు, మంత్రులు గుల్జారీలాల్ నందాను అభ్యర్థించారు. 'ఈ వృద్ధాప్యంలో ఇలాంటి సౌకర్యాల వల్ల ఏం ప్రయోజనం' అని గుల్జారీలాల్ నందా వారి అభ్యర్థనలను అంగీకరించలేదు. చివరి శ్వాస వరకు ఒక పేద సాధారణ పౌరుడిలా నెలకు రూ. 500/- భృతితో సాదాసీదాగా జీవించి 1998లో అహమ్మదాబాదు లోని తన కుమార్తె ఇంటిలో మరణించారు. 1997లో ప్రభుత్వం ఆయనను భారతరత్నతో సత్కరించింది. ఐదు సార్లు ఎంపీగా, రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన ఆ భారత రత్న, గుల్జారీలాల్ నందా గారే భారతదేశపు అత్యంత పేద ప్రధాన మంత్రి.
No comments:
Post a Comment