Tuesday, 6 December 2022

                                                            నాన్న ఏ లోటూ చేయలేదు!

                                                                                                                            రవి          

మధుర గాయకుడు ఘంటసాల మరణించిన తర్వాత కూడా కోట్ల మంది హృదయాల్లో సజీవంగానే ఉన్నారు. ఘంటసాల జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఆయన వర్థంతి సందర్భంగా కుమారుడు ‘రవి’ వెల్లడించారు..



‘‘ఘంటసాలగారి మొదటి భార్య సావిత్రమ్మగారనే విషయం అందరికీ తెలిసిందే. మా అమ్మ సరళాదేవి ఆయన రెండో భార్య. సావిత్రమ్మగారికి ఐదుగురు, మా అమ్మకు ముగ్గురు పిల్లలు. అమ్మ బాగా చదువుకుంది. మద్రాసులోని స్టెల్లా కాలేజీ మొదటి బ్యాచ్‌ స్టూడెంట్‌. ఆ తర్వాత ఎంఏ సైకాలజీ కూడా చేసింది. నాన్నగారికి 1944లో మొదటి వివాహమయింది. మా అమ్మ వాళ్ల కుటుంబం కూడా ఆ సమయంలో వారింటి పక్కనే ఉండేది. రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవి. ఈ సాన్నిహిత్యం వల్ల అమ్మ- నాన్నగారి ప్రేమలో పడింది. తాతగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ అమ్మ బాగా పట్టుబట్టింది. ఈ పెళ్లికి సావిత్రమ్మగారు కూడా ఒప్పుకున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో.. 1950 జూన్‌ 1న తిరుచానురులో వివాహం జరిగింది. ఆ తర్వాత నేను, మా తమ్ముడు, చెల్లి పుట్టాం. 

నాన్నగారు మాకు ఎప్పుడు రహస్యంగా బతకాల్సిన పరిస్థితిని కల్పించలేదు. ఆయన బతికున్నంత కాలం మాకు ఎటువంటి లోటు లేదు. బయట వారు కూడా మా గురించి చెడుగా మాట్లాడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నేను ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరతానన్నప్పుడు- ఆయనే నన్ను స్వయంగా తీసుకువెళ్లి చేర్పించారు. నాన్నగారు ప్రతి రెండు రోజులకు ఒక సారి వచ్చేవారు. నాన్నగారు ఇంటికి వస్తున్నారని తెలియగానే మేమంతా సిద్ధంగా ఉండేవాళ్లం. కలసి డిన్నర్‌ చేసేవాళ్లం. ఏది కావాలన్నా వద్దనేవారు కాదు.  ‘అలాగే తీసుకుందాం.. అయిపోతుంది రాజా’ అనేవారు. 

ఇక నాన్నకు చెల్లంటే చాలా ఇష్టం. సెలవులు వస్తే చెల్లి సావిత్రమ్మగారి ఇంటికి వెళ్లేది. ఉదయాన్నే ఆమెను వాళ్లింటి దగ్గర దించడం.. సాయంత్రం తీసుకురావడం నా పని. అప్పుడప్పుడు సావిత్రమ్మగారు ఎదురుపడేవారు. ఆమెకు నమస్కరించేవాడిని. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆయన మమ్మల్ని బెంగళూరు తీసుకువెళ్లేవారు. బంధువులందరికీ పరిచయం చేసేవారు. ఆయన తరపు బంధువులందరికీ మేము తెలుసు. 

ఆ తర్వాత..

నాన్నగారి మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆ సమయంలో అమ్మ గురించి.. మా గురించి రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా అమ్మ ఎవ్వరిని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే అమ్మ బయటకు వచ్చి మాట్లాడితే నాన్నగారి పేరు పాడవుతుంది. ఘంటసాల గారి పిల్లలు వీధికెక్కారనే అపవాదు వస్తుంది. అందుకే మౌనం వహించాం. 

నేను మద్రాసు దూరదర్శన్‌లో ఉద్యోగంలో చేరా. ఆ సమయంలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. సావిత్రమ్మగారిఇంటికివెళ్లివిషయాలన్నీ మాట్లాడాలనిపించేది. కానీవెళ్లలేకపోయాను. ఇండస్ట్రీలో మా గురించి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణగార్ల సహా అనేక మందికి తెలుసు. అసలు రెండో కుటుంబం ఉందనే విషయం తెలియనట్లు నటించేవారు. కాంతారావుగారి కుటుంబం మాత్రం మాకు సన్నిహితంగా ఉండేవారు. ఇలాంటి స్థితిలో ఒక రోజు అమ్మ- ‘‘ఇంత బాధ పడుతూ నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు?  దూరంగా  వెళ్లి పని చేసుకో. నీకు మనశ్శాంతిగా ఉంటుంది, నాన్నగారి పేరు చెడకుండా ఉంటుంది. మిగతా వాళ్ల విషయం వదిలెయ్యి. మమ్మల్ని చూసుకోవడానికి ఆ భగవంతుడు ఉన్నాడు’’ అంది. దాంతో నేను ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని లక్నో వెళ్లిపోయా. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. చెల్లెలు మీరాకు పెళ్లి అయిపోయింది. తమ్ముడు శంకర్‌ దర్శకత్వశాఖలో చేరి చాలా సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశాడు. 

మానస సరోవరంలో..

నాన్నగారికి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లాలని గాఢమైన కోరిక ఉండేది. కానీ ఆయన వెళ్లలేకపోయారు. అమ్మకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ కోరిక పెరిగిపోయింది. ‘‘నాన్న వెళ్లలేకపోయారు. ఆయన బదులుగా నేనైనా వెళ్తా..’’ అనేది. మేము ఎవరు చెప్పినా వినకుండా 83వ ఏట మానస సరోవర్‌కు వెళ్లింది. కైలాశ్‌ శిఖరానికి వెళ్తున్న సమయంలో ఆమె మరణించింది. ప్రస్తుతం మాతో అమ్మ,నాన్న లేకపోయినా వారి జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. నా భార్య పార్వతి  నాట్య కళాకారిణి. కళాప్రదర్శినీ అనే సంస్థ కూడా ఉంది. ప్రతి ఏడాది నాన్నగారు పాడిన పాటలతో  ‘గాన గంధర్వ ఘంటసాల’ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి ప్రదర్శనలు ఇస్తోంది. అంతే కాకుండా- ప్రతి ఏడాది ‘కళాప్రదర్శిని ఘంటసాల పురస్కారం’ పేరుతో సంగీత ప్రముఖులకు అవార్డులు ఇస్తున్నాం. బాలు, వాణీ జయరాం వంటి లబ్ద ప్రతిష్ఠులకు కూడా ఈ అవార్డులు ఇచ్చాం. నాన్నగారి శత జయంతి ఉత్సవాల వరకూ ఈ అవార్డులు ఇస్తూనే ఉంటాం. 

నాన్నగారి గాత్ర వారసత్వం మాకు రాలేదు. కానీ నేను చిన్నప్పుడు గిటార్‌ నేర్చుకున్నా. రిథమ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ప్లే చెయ్యడం తెలుసు. సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌లో నేను మెంబర్‌ని కూడా. ఒక దశలో ఘంటసాలగారి అబ్బాయి అనే గౌరవంతో నన్ను ప్రోత్సహించేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత రికార్డింగ్‌ థియేటర్‌కు వెళ్లాలనిపించలేదు. పదేపదే ఆయన జ్ఞాపకానికి వస్తుండడంతో వృత్తి  మీద కాన్‌సంట్రేషన్‌ చేయలేకపోయా. అందుకే యూనియన్‌ నుంచి బయటకు వచ్చేశాను.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...