Monday, 26 December 2022

 పురందర దాసు కథ:



పురందర దాసును ఆధునిక కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అనవచ్చు. పుట్టుకతో ధనవంతుడూ, పిసినారి అయిన ఆయన పరమ భక్తుడు కావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మహారాష్ట్ర లోని పూనా సమీపంలో ఒక పురందరగడ్ అనే కుగ్రామంలో జన్మించాడు. ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక్. వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసే వారు. బాగా కలిగిన కుటుంబం. ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించాడు. ఆయన్ని నవకోటి నారయణుడు అని కూడా అనేవారు. అయితే మొదట్లో చాలా పిసినారిగా ఉండేవాడు. డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. ఆయన భార్య పేరు సరస్వతీ భాయి. ఆమె పరమ భక్తురాలు. దయాగుణం కలది. భర్త లోభ గుణం గురించి తెలిసినా ఏమీ చేయలేకపోయేది.
ఇలా ఉండగా ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక్ దగ్గరకు వచ్చాడు. ఆయన్ని తర్వాత రమ్మంటూ పంపించి వేశాడు. అలా ఆ బ్రాహ్మణుని చాలా రోజులు తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాడు కానీ ధన సహాయం మాత్రం చేయలేదు. ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడువకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు. ఆరు నెలలు గడిచాయి. చివరకు ఆ బ్రాహ్మణుడిని ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని రాని నాణేలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతనికి నచ్చిన ఒక నాణేన్ని తీసుకుని మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగాడు.
వెళుతూ వెళుతూ సరస్వతి భాయి ధార్మిక గుణం గురించి తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమె భర్త తనను చాలాకాలం తిప్పుకుని చివరకు రిక్త హస్తాలతో ఎలా తిప్పిపంపాడో వివరించాడు. ఆమె ఆ పేద సుబ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించిన తీరు విని చాలా బాధ పడింది. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సహాయ పడాలనుకుంది. కానీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనంది. ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి “అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి” అన్నాడు. అప్పుడామె తన ముక్కెర ను తీసి ఆయనకు ఇచ్చింది.
ఆ బ్రాహ్మణుడు అది తీసుకుని నేరుగా శ్రీనివాస నాయక్ దుకాణానికే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావంటూ ఆ బ్రాహ్మణున్ని కోప్పడ్డాడు శ్రీనివాస నాయక్. ఆ బ్రాహ్మణుడు శాంతంగా “అయ్యా! నేను యాచించడానికి రాలేదు. ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టి కొంత ఋణం తీసుకుందామని వచ్చాను” అన్నాడు.
ఆయన ఆ ముక్కెర చూడగానే తన భార్యదేనని గుర్తు పట్టేశాడు. ఆ బ్రాహ్మణుడిని అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు. ఆ బ్రాహ్మణుడిని మరలా రేపు రమ్మని, ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనప్పట్టె లో దాచి ఇల్లు చేరాడు శ్రీనివాస నాయక్. తన భార్యను పిలిచి ముక్కెర ఏదని అడిగాడు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ పేదబ్రాహ్మణుడికి ఆమే తన ముక్కుపుడక దానం చేసి ఉంటుందని ఆయన అనుమానం.
సరస్వతీ భాయి కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. నిజం చెబితే భర్త తన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది. మరో ప్రత్యామ్నాయం ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని ఒంపుకొని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాసులో ఏదో గల గల మని సవ్వడి వినిపించింది. కిందికి దింపి చూస్తే తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తన ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి దాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకు చూపించింది. దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయక్ కు మతి పోయినంత పనైంది. అది అచ్చం తాను అంగడిలో దాచి వచ్చిన ముక్కుపుడక లాగే ఉంది.
వెంటనే ధృవీకరించుకోవడానికి తన దుకాణానికి వెళ్ళాడు. తను ఉంచిన చోట చూస్తే ఆ ముక్కుపుడక లేదు. ఆయన మాట పెగల్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో చెప్పమని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇదంతా విన్న ఆయన మనసులో సంక్షోభం చెలరేగింది.
తీవ్ర అంతర్మథనం తర్వాత, ఆ బ్రాహ్మణుడెవరో కాదు, సాక్షాత్తూ ఆ విఠలుడే అని తెలుసుకున్నాడు. గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలన్నీ ఆయన కళ్ళముందు కదలాడాయి. ఆయన పిసినారితనం మీద, ప్రవర్తన మీద ఆయనకే అసహ్యం వేసింది. తన భార్య తన కన్నా అదృష్టవంతురాలని అనిపించింది ఆయనకు. తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుని ఈ విధంగా కష్ట పెట్టవలసి వచ్చిందని తలంచి తన దగ్గరున్న సమస్త సంపదలూ భగవంతుని పేర దాన ధర్మాలు చేసేశాడు.
అప్పట్నుంచీ ఆయన శ్రీహరి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారయణుడు, నారాయణ భక్తుడైపోయాడు. బంగారు, వజ్రాల నగలతో అలంకరణతో అలంకరింపబడ్డ చేతులిప్పుడు తంబురను చేతబట్టాయి. వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. తన దగ్గరకు దేహీ అని వచ్చిన అనేక మంచి యాచకులను తిప్పి పంపిన తను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక్ పురందర దాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...