Monday 19 September 2022

  వారణాశి (కాశీ) ఆలయాలు
















త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల సంకల్పంతో కాశీకి విశిష్టస్థానం ఏర్పడింది. శివకేశవులు ఒకేచోట నివాసమున్న క్షేత్రం వారణాశి (కాశీ). మహావిష్ణువు బిందుమాధవునిగా, శివుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వెలుగొందుతున్న పవిత్రప్రదేశం వారణాశి. పుణ్యక్షేత్రములు ఆన్నిటిలోనూ వారణాశికి ప్రత్యేక స్థానం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9 వది వారణాశిలోని విశ్వనాధ జ్యోతిర్లింగం. ముక్కోటి దేవతలు ప్రతిరోజూ సూర్యోదయం ముందు హిమాలయాల్లోని మానససరోవర్ నందు స్నానంచేసి కైలాసపర్వంతంపై పార్వతీ సమేతుడై కొలువున్న శివుని పూజిస్తారని పురాణాల్లో వ్రాయబడింది. ఆవిధంగానే దేవతలు వారణాశినందు గంగానదికికల 84 స్నాన ఘట్టములందు ముఖ్యమైన మణికర్ణిక ఘాట్ నందు అదృశ్యరూపులై ఇప్పటికినీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నానంచేసి విశ్వనాధుని సేవిస్తారని చెప్పబడినది. ముక్కోటి దేవతలు వివిధరూపాల్లో నివసించు క్షేత్రం వారణాశి. మానససరోవరం, కైలాసపర్వతం దర్శించడానికి శారీరక మరియు ఆర్ధికస్థోమత అవసరం. కానీ వారణాశి (కాశీ) నందు విశ్వనాధుని దర్శించడానికి అనేక ప్రయాణ సాధనాలు కలిగి సులువుగా చేరుకోడానికి వెసులుబాటు ఉన్నది. ఎయిర్ పోర్టు నుండి వారణాశి పట్టణం 20 కి.మీ దూరంలో ఉంది.వారణాశి దేశంలోని అన్నినగరాలనుండి రైళ్లతో కలుపబడి ఉంది. బసకు, భోజనమునకు యాత్రికులకు మద్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటళ్లు, ఆశ్రమాలు మరియు సత్రములు ఉన్నాయి. వారణాశి విశ్వనాధ దేవాలయంవద్ద శ్రీ అన్నపూర్ణ మఠ మందిరంనందు కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో యాత్రికులకు అన్నదానం మరియు పరిమిత వసతి కేటాయింపు సౌకర్యం కలదు. కాశీలో అధికాబాగం ఆశ్రమములు మరియు సత్రములందు ఉచిత వసతి సదుపాయంలేదు. వారణాశిలో బస మరియు భోజనము లభ్యమగు సత్రములు మరియు ఆశ్రమముల వివరములు కాశీవాసం అను ప్రత్యేక కధనంలో వివరిస్తాం.
కాశీ అనేది సృష్టి ప్రారంభంలో శివుడు స్వయంగా నిర్మించిన నగరం మరియు కైలాస పర్వతం తర్వాత అత్యంత ప్రియమైన నివాసం. వారణాశి (కాశీ). సప్తమోక్షద్వారాలలో ఒకటి. ప్రళయకాలంలో పరమేశ్వరుడు త్రిశూలంపైన వారణాశినగరం కాపాడుతాడని గ్రంధాలు చెపుతున్నాయి. పుణ్యకార్యాలు చేసినవారికి కాశీప్రవేశం లభిస్తుందని, కాశీదర్శిస్తే పునర్జన్మనుండి విముక్తి కలిగుతుందని పురాణాల్లో చెప్పబడింది. కాశీలో మరణించిన జీవి కుడిచెవిపైకి లేచిఉంటుంది. శివుడు జీవికుడిచెవిలో తారకమంత్రం ఉపదేశించి ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాశీవాసంతో సమస్త యాగాలు, తపస్సులు చేసినపుణ్యం సంప్రాప్తిస్తుందని స్థలపురాణం. చనిపోయినవారి చితాభస్మం గంగానదిలో నిమజ్జనం చేస్తే, వారు కాశీలో జన్మించి, పరమశివుని వల్ల మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. కాశీలో ఆవులు పొడవవు. శవాలుకాలుతున్నా వాసన రావు, విశ్వేశ్వరునికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. కాశీక్షేత్రంలోచేసిన పాపపుణ్యములు కోటిరెట్లఫలితం ఇస్తాయని నానుడి. విశ్వనాథుణ్ణి అభిషేకించిన పిమ్మట చేతిరేఖలు మారతాయిఅని భక్తులనమ్మకం.
దేవతలండరు అలంకారప్రియులు. ఎటువంటి ఆభరణములు ధరించక మెడచుట్టూ నాగరాజు, సిగపై చంద్రవంకతోపాటు నడుముకు ఏనుగు చర్మంధరించి శరీరంపై బూడిద పులుముకొని ఎందుకు నివసిస్తున్నారని పార్వతి శివుడిని అడిగింది. శ్మశాన వాటికలో నివసించే ప్రేతాత్మలవల్ల పుణ్యకార్యాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు బ్రహ్మదేవుడు తనను శ్మశాన వాటికలో నివసించాలని కోరుకున్నందున తాను శ్మశానంలో నివసిస్తున్నానని శివుడు చెప్పాడు. ధనవంతుడు,నిరుపేద తారతమ్యం లేకుండా మరణించిన పిమ్మట ప్రతిమనిషి శ్మశానానికే చేరుతారనే విషయం ప్రజలు గుర్తించడానికే తాను శ్మశానంలో ఉంటున్నానని తెపిపాడు. అంతేకాక ప్రతివారు జీవించి వున్నంతకాలం అందరూ నావాళ్ళు అనుకుంటారు., మరణించిన పిమ్మట బంధువులు శవాన్ని శ్మశానంలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారని మరణించిన వారికి తాను తోడుగా ఉన్నానని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు శివుడు పార్వతికి తెలిపాడు. చనిపోయినవారి ఆత్మలు అనంతంలో కలిసిపోయే శ్మశాన వాటిక అని, కాశీ ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక అని, భూలోకంలో మృత్యుభయం లేకుండా మరణించే ప్రదేశం కాశీఅని, కాశీలో మరణించిన వ్యక్తి చెవిలో తాను తారక మంత్రం ఉపదేశించి పునర్జన్మ లేకుండా మోక్షం ప్రసాదిస్తానని శివుడు పార్వతికి వివరించాడు.
విశాలాక్షిశక్తిపీఠం కొలువైఉండి జగత్తుకి ఆహారంపెట్టే అన్నపూర్ణ నివాసస్థలం వారణాశి. విశ్వనాథ దేవాలయం గతంలో రాజులచే నిర్మించబడిన ఇతర ఆలయాలతో వైభవంగా ఉండేది. మహమ్మదీయులు కాశీని లక్ష్యంగాచేసుకొని జరిపిన దండయాత్ర లందు విశ్వనాధ ఆలయం ధ్వంసం చేయబడగా తరవాత కాలంలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ పాలనలో ఆలయం పునరుద్ధరణ చేయబడింది. విశ్వనాధ ఆలయం ఇటీవల పునరుద్ధరించబడి గోపురంతోపాటుగా గర్భాలయం బంగారురేకు తాపడంతో రూపుదిద్దుకొంది. విశ్వేశ్వరుని నామస్మరణ, కాశీ క్షేత్ర దర్శనం వలన మోక్షం లభిస్తుంది. కాశీలో కల ప్రముఖమైన ఆలయాలు ఉదహరిస్తున్నాం.
విశ్వనాధ ఆలయం
సానందమానందవనే వసంతం
ఆనందకందం హతపాపవృందమ్
వారాణశీనాథ మనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
కాశీవిశ్వనాథ్ ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగములలో 9వ జ్యోతిర్లింగం. ఆలయం గంగానది పశ్చిమ ఒడ్డుపై ఉన్నది. విశ్వనాధుడు అనగా విశ్వము లేదా ప్రపంచమునకు నాధుడు లేదా దైవం. విశ్వనాధఆలయం మొఘల్ రాజూ ఔరంగజీబు పాలనలో ధ్వంశం చేయబడి అందులో వారిచే మసీదు నిర్మాణం చేయబడి, పిమ్మట మరాఠారాణి అహల్యాభాయిచే మసీదుకుచేర్చి ఆలయం పునర్నిర్మాణం చేయబడినది. దర్మిలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వము ఆధీనములోనికి వచ్చినది. ఇటీవలనే ఆలయం కొత్తసొగసులతో నవీకరించబడి గర్భాలయం బంగారురేకు తాపడంతో రూపుదిద్దుకొంది. దేశములో అధికఆధాయము
కలిగిన 5 ఆలయములలో విశ్వేశ్వరఆలయము ఒకటి. ధనస్సురాశికి చెందిన స్త్రీ పురుషులు వారణాశినందు విశ్వనాధ్ జ్యోతిర్లింగం దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది. విశ్వనాధ జ్యోతిర్లింగం పూర్తి సమాచారం ద్వాదశ జ్యోతిర్లింగాలు నందు ipltours.in web site లో తెలుసుకోవచ్చును.
దుండి గణపతి మందిరం కాశీవిశ్వనాధ మందిరమునకు ముందుగా అన్నపూర్ణ ఆలయమునకు చేరువలో సాక్షివినాయకమందిరం కలదు. యాత్రనందు ఎటువంటి ఆటంకములు కలుగకుండా గణపతి దర్శనము చేసుకొనెదరు. మరియు కాశీయాత్ర చేసినట్లు సాక్షిగా గణపతికి నమస్కరింతురు. దారి మార్గమునకు కొంచెముపైన ఈగణేశప్రతిమ ఉన్నది. ఈప్రతిమ వెండిచేతులు, దంతము, పాదములు, చెవులు కలిగి మిక్కిలి రమ్యము మరియు ఆకర్షణీయముగాను ఉంటుంది. ఈఆలయము మరాట
పేష్వాచే 18 వ శతాబ్ధాములో నిర్మించబడినది.
అన్నపూర్ణ ఆలయం
వినాయక ఆలయం తరువాత అన్నపూర్ణ ఆలయం కలదు.
వరుస క్రమములో వినాయకుని దర్శనం పిమ్మట విశ్వేశ్వర దర్శనం చేసుకొనెదరు. పిమ్మట అన్నపూర్ణ దర్శనం చేసుకొనెదరు. మతపరంగా ఈఆలయమునకు గుర్తింపుఉన్నది. పార్వతీదేవి మరోరూపంఅయిన అన్నపూర్ణ ఆకలితీర్చు దేవత. పేష్వా బాజీరావుచే ఈఆలయము నిర్మించబడింది. ఆలయంలో అర్చనకు ఉపయోగించు ముడిబియ్యం ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసెదరు. భక్తులు ప్రసాదమును తమఇండ్లలో ఉంచుకొనిన అన్నపూర్ణాదేవి దయవలన గృహంలో భుక్తికిలోటు ఉండదని భక్తుల విశ్వాసం. పార్వతి అన్నపూర్ణాదేవిగా కాశీలో అవతరించ డానికి ఒకకధనం ఉంది.
బ్రహ్మ అయిదవ శిరస్సును ఖండించిన శివునికి కలిగిన బ్రహ్మహత్యా దోషంవల్ల శివుడు యాచకునిగా మారి బిక్షాటన చేయడం ప్రారంభించాడు. శివుడు భిక్షాటనయందు లీనమై మానవాళికి జీవనాధారమైన ఆహారం ప్రాముఖ్యత మరఛాడు. ఆహార ప్రాముఖ్యత శివునికి తెలియ జేయడానికి పార్వతీదేవి ప్రపంచంనుండి ఆహారాన్ని ఉపసంహరించి కాశీకి వచ్చింది. శివుడు భక్తులఆకలి బాధచూడలేక కాశీకివచ్చాడు. కాశీలో పార్వతి భక్తులకు అన్నపూర్ణేశ్వరి రూపంలో ఆహారం అందిస్తూ సేవ చేయడం చూశాడు. శివుడు ఆహారంకోసం పుర్రె గిన్నెగా చేసుకొని నిలబడ్డాడు. అన్నపూర్ణాదేవి శివుని గిన్నెలోకి ఒకగరిటె ఆహారాన్ని అందించింది. ఆఆహారంతో శివుని ఆకలితీరింది శివుని బ్రహ్మహత్యా దోషం సమసిపోయింది. శివునికోరికపై పార్వతి అన్నపూర్ణాదేవి అవతారంలో కాశీలో స్తిరపడింది. ప్రతి సంవత్సరం దీపావళి ముందురోజున, తరువాతిరోజున మొత్తము మూడు రోజులు బంగారు అన్నపూర్ణ ప్రతిమను ఆలయంలో భక్తుల దర్శనార్ధము ఉంచెదరు. బంగారుఅన్నపూర్ణాదేవిని లక్షలకొలదీ భక్తులు దర్శించెదరు.
చక్రేశ్వర్ లేదా యంత్రేశ్వర్ శివలింగం కాశీఖండంలో తెలిపిన ప్రకారం పార్వతీదేవి కాశీలో ఉన్న పవిత్ర తీర్ధముల వివరములు శివుని నుండి తెలుసుకొనవలెనని తలచినది. శివుడు చక్రేశ్వర్ శివలింగం గురించి తెలియచేస్తూ శివలింగంపై శ్రీ చక్రం ఉండటం వలన శక్తివంతము మరియు శుభప్రదమైనదని నిష్టగల గురువు పర్యవేక్షణయందు చక్రేశ్వరుని స్వచ్చమైన మరియు దీక్షతో పూజించవలసి ఉన్నదని తెలిపాడు. చక్రేశ్వర లేదా యంత్రేశ్వర శివలింగం అన్నపూర్ణాదేవి ఆలయం నందు ప్రవేశించగానే కుడివైపున ఉన్నది. ఆలయం అన్నివేళల తెరచిఉండును కావున భక్తులు ఎప్పుడైననూ చక్రేశ్వరుని దర్శించవచ్చును. ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా ఆలయంలో స్థానికంగా లభ్యమగు పూజారితో చేయించుకొవచ్చును.
విశాలాక్షి ఆలయం
దేశములోని అష్టాదశ శక్తి పీఠములుగా చెప్పబడు 18 శక్తి పీఠములలో విశాలాక్షి శక్తిపీఠం 17వ శక్తిపీఠం.. విశాలాక్షి శక్తిపీఠం గంగానది ఒడ్డున మీర్ ఘాట్ (మణిiకర్ణిక ఘాట్) వద్ద కాశీవిశ్వనాధుని ఆలయమునకు సమీపంలోఉన్నది. విశాలాక్షీదేవి ఆలయమునందు రెండువిగ్రహాలు ఉంటాయి. ఉత్సవమూర్తి పెద్దది, వెనుకభాగంలో చిన్నగాకనిపించే విగ్రహము శక్తిపీఠము. దేవిని ఆదివిశాలాక్షిగా భక్తులు అర్చిస్తారు. విశ్వనాధుని వైభవాన్ని కనులు పెద్దవిచేసి ఆశ్చర్యంగా చూసినదేవికావున విశాలాక్షి అనిపేరువచ్చిందని ప్రతీతి. వారణాశికి పూర్వనామము కాశీ అందువలన దేవి కాశీవిశాలాక్షిగా ప్రసిద్ధము. దేవీపురాణమునందు విశాలాక్షీదేవి ఆలయమును గురించి చెప్పబడినది.
మణికర్ణికా ఘాట్
వారణాశిలో గంగానదిఒడ్డునకల 64 ఘాట్లయందు ముఖ్యమైనది మణికర్ణికాఘాట్. కైలాసశిఖరం వద్ద మానససరోవర్ నందు ప్రతిరోజూ ప్రాతః కాలమున ముక్కోటిదేవతలు స్నానముఆచరించి శివపార్వతులను పూజించేదరని పురాణములందు తెలుప బడినది. ఆవిధముగానే వారణాశి మనికర్ణికా ఘాట్ నందు ప్రతిరోజూ అపరాహ్ణము అనగా మధ్యాహ్నం 12 గంటలకు దేవతలు మణికర్ణికాఘాట్ నందు స్నానము ఆచరించి విశ్వేశ్వరుని అర్చించేదరని తెలుపబడినది. అందువలన భక్తులు అదే సమయంలో మణికర్ణికాఘాట్ నందు స్నానంచేసేదరు. మరణించిన పూర్వీకులకు సద్గతులు ప్రాప్తించుటకు ఇచ్చటనే పిండప్రదానము చేసేదరు.
రత్నేశ్వర్‌మందిరం
మణికర్ణికా ఘాట్ నందు 1825-30 మధ్య నిర్మితమై ప్రస్తుతం శిధిలావస్థలోనున్న రత్నేశ్వర్‌ఆలయం లేదా మాతృకృష్ణమందిరం ఉన్నది. ఈఆలయం ప్రపంచంలో ఎనిమిదవ వింత అనిచెప్పుకునే ఇటలీ నందు 1372 సంలో నిర్మితమైయన లీనింగ్ టవర్‌ ఆఫ్ పిసా కంటే ఎత్తైనది. మణికర్ణిక ఘాట్‌ వద్ద వున్న ఈమందిరం 9 డిగ్రీల కోణంతో వంగివుండి 74 మీటర్లు ఎత్తు కలిగిఉంది. పీసాటవర్‌ కేవలం 4 డిగ్రీల కోణంతో 54 మీ ఎత్తు వుంటుంది. సుమారు 500 ఏండ్ల క్రిందట రాజా మాన్‌సింగ్‌ పాలనలో నిర్మితమైనదని 1825-30 మధ్య నిర్మితమైనదని నిర్మాణంపై విభిన్న కధనములు ఉన్ననూ ప్రపంచవింత అయిన దీనిగురించి పాఠ్యాంశాలలోకానీ చరిత్రలోకానీ ఎక్కడనూ ప్రస్తావించబడలేదు. ఆలయంలో మణికర్ణేశ్వరుడు లింగరూపంలో దర్శనంఇస్తాడు. ఆలయం అన్నివేళలా తెరచి ఉంటుంది.
కాలభైరవ మందిరం వారణాసిలోని దేవాలయాలలో కాలభైరవ దేవాలయం ముఖ్యమైనది. కాల భైరవుడు విశాలాక్షీదేవికి మరియు వారణాసికి రక్షకుడు. కాశీపట్టణమునకు క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీ సందర్శించినవారు ప్రతిసారి తప్పనిసరిగా కాలభైరవుని దర్శించవలసియున్నది. వారణాశి నందు బారోనాథ్ విశ్వేశ్వరగంజ్ సమీపంలో ఉన్న కాలభైరవ ఆలయమునకు హిందూమతంలో చారిత్రకంగా మరియు సాంస్కృతికపరంగా ప్రాముఖ్యత ఉంది. కాశీ విశ్వేశ్వరునికి భక్తుల ఆగమనముపై కాలభైరవుడు నివేదింస్తాడని ప్రసిద్ధి.
వ్యాసకాశీ లేదా సారనాధ్
గంగానదికి మరోవైపున వారణాశికి ఎదురుగా నందు సారనాధ్ రామ్ నగర్ కోట నందు వ్యాసమందిరంలో మహర్షి వేదవ్యాస స్థాపిత శివలింగం కలదు. కోటలోని మ్యూజియం నందు పూర్వపు రాజులువాడిన అనేకఖడ్గములు, పల్లకీలు, తుపాకులు బధ్రపరచారు. ఈఆలయము మహాభారత గ్రంధమును వ్రాసిన వేదవ్యాసమహర్షి పేరున పిలువబడుచున్నది. వ్యాసమందిరము తప్పనిసరిగా చూడవలసినప్రదేశము మరియు సంవత్సరం అంతయు మందిరము సందర్శకులతో నిండిఉంటుంది. వ్యాసమహర్షికికల అధికఅహంకారమునకు కోపగించి శివుడు వారణాశినుండి వ్యాసుని గంగకు ఆవలివైపున నివశించమని ఆదేశించినట్లు వ్యాసుడు కాశీ ప్రవేశం లేనందున రాంనగర్ నందు ఆలయం నిర్మించి ఇచట నివసించినట్లు తెలియుచున్నది. కాలభైరవునితోపాటు వ్యాసకాశీ దర్శించనిదే కాశీయాత్ర పూర్తి కాదు అనినానుడి
వారాహిదేవి ఆలయం
వారాహిదేవి మహాశివునిసోదరి అనిచెప్పబడినది. దశాశ్వమేధ ఘాట్ నకు 150 గ దూరంలో ఈఆలయమున్నది. ఆలయము ఉ 4-30 నుండి 10-00 వరకు మాత్రమే తెరచియుండి తరువాత మూసివేయబడుతుంది. స్థానికప్రజల సహకారముతో రోడ్డులోపల ఉన్నఆలయం చేరవచ్చును. వారాహిదేవి చాలా శక్తివంతమైనది మరియు భీకరమైనది. అందువలన నేరుగా చూచుట నిషిద్దము. వారాహి మాత నేలమాగళినందు ప్రతిస్టించబడినది. నేలపై రెండు గ్రానైట్ పలకలు తొలగించబడి ఉండును. ఒక రంద్రము నుండి పాదములు ఇంకొక రంద్రమునుండి లీలగా ముఖభాగము గోచరించును. పూజారితప్ప ఎవరికి నేలమాగళి ప్రవేశములేదు. పూజారి భక్తులతో అమ్మవార్ల యందు శాంతకళ, ఉగ్రకళ అని రెండు ఉండునని శాంతకళతో ఉన్నఅమ్మవారిని ఎదురుగావెళ్లి దర్శనంచేసుకోవచ్చు. ఉగ్రకళ అనగా దుష్టసంహరార్థం ఎత్తిన అవతారంఅని అందువలన ఆకలలోఉన్న వారాహి అమ్మవారిని సామాన్యులు చూసి తట్టుకోలేరని అందువలననే పైన పలకల ఖాళీనుండి చూడమని తెలుపుతారు. కాశీఖండంనందు వారాహిదేవిని దర్శించినవార్కి ఎటువంటిఆపదలు కలుగవని చెప్పబడినది.
వారాహిదేవి వరాహ అవతారం మరియు శక్తిస్వరూపమని ఈశక్తి వారణాశిని దుష్ట గ్రహములనుండి కాపాడునని, వారాహిదేవి రాత్రి సమయంలో కాశీపట్టణమును కావలికాసి సూర్యోదయమునకు పూర్వము ఆలయప్రవేశము చేయునని తెలియుచున్నది. అమ్మవారి ఉగ్రరూపం ఉపాసనచేయువారుతప్ప ఆన్యులు ఎవరూచూసి తట్టుకొనలేరని, పూర్వము పోతన మహాభాగవతం నందు యజ్ణవరాహము వ్రాయుసమయములో ఒకరాజు భాగవతమును అంకిత మివ్వమనిఅడిగి, పోతన ఆగ్రంధం శ్రీరామునికితప్ప ఇతరులకు అంకితమిచ్చుటకు నిరాకరించుట వలన అప్పటివరకూ పోతనవ్రాసిన భాగగతమును బలవంతంగా పొందుటకు సైన్యముతోరాగా అతిపెద్ద వరాహాము నిరోధించినది. అప్పుడు రాజు పోతనను క్షమింపకోరినాడు. పోతన వారాహిశక్తి కాపాడింది ఆని తెలిపినాడు.వారాహిదేవత వారణాశి పట్టణముకు గ్రామదేవత. వారణాశి నందు వారాహిని దర్శించిన వారు జీవితంలో అన్నిఆటంకముల నుండి మరియు ఇబ్బందులనుండి రక్షణ పొండేదరని స్థానికులనమ్మకం.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...