Monday, 27 June 2022

 ఎవరీ తీస్తా సెతల్వాద్ !

. నిన్న అరెస్టైన తీస్తాసెతల్వాద్ ను "సామాజిక కార్యకర్త" అంటూ ప్రధానమీడియా సంస్థలన్నీ రాశాయి. సామాజిక కార్యకర్త అనగానే ఈమె ఏదో ఒక ఎన్జీవో స్థాపించి సమాజసేవ, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేసుకునే సగటు మధ్యతరగతి ఎన్జీవో నిర్వాహకురాలేమో అని భ్రమపడతాము. కానీ గుజరాత్ చరిత్రలో బాగా ధనికులై మొఘల్ సైన్యాలనుండి ఈస్టిండియా కంపెనీ సైనికుల వరకు జీతాలు సక్రమంగా చెల్లించే క్యాషియర్ లేదా మున్షీ బాధ్యతలను తరతరాలుగా నిర్వహించిన చరిత్ర తీస్తాసెతల్వాద్ కుటుంబానికి ఉంది.


తీస్తాసెతల్వాద్ తాతకు తాత అంబాశంకర్ బ్రిజ్ రాయ్ సెతల్వాద్ (1782-1853) ఈస్టిండియా కంపెనీకి వీరవిధేయుడుగా ఉంటూ సుప్రీం సివిల్ క్లెయిమ్స్ కోర్టులో రిజిస్ట్రార్ గా కెరీర్ మొదలుపెట్టి అహ్మదాబాద్ జిల్లాలో పూర్తిగా యూరోపియన్లే న్యాయమూర్తులుగా ఉండే అత్యున్నత న్యాయస్థానంలో తొలి భారతీయ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన కుమారుడు హరిలాల్ అంబాశంకర్ సెతల్వాద్ (1821–1899) కూడా బ్రిటీష్ వారికి నమ్మకస్థుడిగా ఉంటూ తనతండ్రి పొందిన పదవులతోపాటు తెల్లదొరల నుంచి రావుసాహిబ్ అనే బిరుదును కూడా సంపాదించారు.

ఇక తీస్తాసెతల్వాద్ తాత చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ కూడా నాటి బ్రిటీష్ ప్రభుత్వంలో అతిపెద్ద న్యాయప్రముఖుడు. ఆయన బొంబాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. 1924లో బీఆర్ అంబేద్కర్ తో కలిసి బహిష్కృతహితకారిణి సభ ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. మహాత్మాగాంధీ చిమన్ లాల్ ను గొప్ప న్యాయ నిపుణుడని కీర్తించేవారు. మహాత్మాగాంధీ న్యాయ నిపుణుడు , గొప్ప దేశభక్తుడు అని కీర్తించిన చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ జలియన్ వాలా భాగ్ ఊచకోత మీద నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ లో సభ్యుడు కూడా. జలియన్ వాలాభాగ్ మారణకాండపై భారతదేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిన సందర్భంలో బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో విన్ స్టన్ చర్చిల్ ఒక ఓటింగ్ పెట్టి జనరల్ డయ్యర్ చేసింది దారుణం అని తీర్మానించారు.
బ్రిటన్ పార్లమెంటు కూడా తప్పని తేల్చింది కాబట్టి జనరల్ డయ్యర్ కు కోర్ట్ మార్షల్ శిక్ష తప్పదనే అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హంటర్ కమిషన్ ఏంచేసిందయ్యా అంటే నేటి కంటితుడుపు కాలయాపన కమిటీలలాగే ఎంక్వైరీ మొదలుపెట్టింది. కమిటీ సభ్యులతోపాటు జనరల్ డయ్యర్ ను చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ కూడా ప్రశ్నించారు. కొన్ని నెలల విచారణ తరువాత చివరికి హంటర్ కమిషన్ సభ్యులంతా కలిసి జనరల్ డయ్యర్ చేసింది తప్పే అని తేల్చి ప్రభుత్వానికి రిపోర్ట్ మాత్రం పంపించారు. అయితే శిక్షలు విధించడం కానీ కనీసం శిక్షలు సూచించడం కానీ చేయలేదు. నెలల తరబడి సాగిన హంటర్ కమిషన్ ప్రహసనం ద్వారా జరిగిన కాలయాపన వల్ల దేశప్రజల్లో ఆగ్రహావేశాలు చల్లారిన తరువాత నాటి బ్రిటీష్ ఆర్మీ కౌన్సిల్, వైశ్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు "జనరల్ డయ్యర్ చేసింది తప్పే అయినప్పటికీ రాజకీయ కారణాల దృష్ట్యా అతనిని శిక్షించడం కుదరదని" తేల్చి చెప్పి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అతని సేవలకు గాను తాము మెచ్చి ఇచ్చిన ప్రమోషన్ లాంటివి వాటిని మాత్రం శిక్ష కింద రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇదంతా చదివాక అతిపెద్ద అవినీతి తిమింగలాలు, నేరస్తులు దొరికితే చిన్నపాటి సస్పెన్షన్ తో సరిపెట్టి వారిని పరోక్షంగా కాపాడే ప్రభుత్వాలు, ఏసీబీలు గుర్తుకు రావడం లేదూ?
జలియన్ వాలాభాగ్ హత్యాకాండ విషయంలో శిక్షలు విధించదగ్గ అధికారంగల హంటర్ కమిషన్ లో సభ్యుడై ఉండీ నాటి బ్రిటీష్ ప్రభుత్వం స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుని ప్రజాగ్రహం చల్లారేదాకా నాటకాన్ని రక్తికట్టించి శిక్ష ఏమిటో తేల్చకుండా ప్రభుత్వానికి వదిలేసి డయ్యర్ ను పరోక్షంగా కాపాడటమే చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ అండ్ కో భారతీయులకు చేసిన (అ)న్యాయం. ఆయన మనవరాలే తీస్తాసెతల్వాద్.
తీస్తాసెతల్వాద్ తండ్రి మోతీలాల్ చిమన్ లాల్ సెతల్వాద్ కూడా సామాన్యులు కారు. స్వతంత్ర భారతదేశానికి తొలి అటార్నీ జనరల్, తొలి లా కమిషన్ ఛైర్మన్, తొలి బార్ కౌన్సిల్ ఛైర్మన్. అంతేనా?
భారతదేశానికి అత్యధిక కాలం (13ఏళ్ళు) పనిచేసిన అటార్నీ జనరల్. జమ్మూకాశ్మీర్ వివాదంలో సరిహద్దుల నిర్ణయం కోసం ఐక్యరాజ్యసమితి ప్రొసీడింగ్ లతోపాటు రాడ్ క్లిఫ్ ట్రిబ్యునల్ ముందు కూడా ఆయన హాజరయ్యారు. అంటే జమ్మూకాశ్మీర్ విషయంలో జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనలు మోతీలాల్ సెతల్వాద్ లాంటి వారి ద్వారానే దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా అమలయ్యాయి.
లాకమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇచ్చిన ఈయన జవహర్ లాల్ నెహ్రూకు సమకాలీనుడు, అతి సన్నిహితుడు కూడా. *ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటీష్ ప్రభుత్వం దాకా గాంధీ-నెహ్రూల నుంచి సోనియా-రాహుల్ గాంధీల వరకు సెతల్వాద్ కుటుంబానికి కల సంబంధాలను దాచిపెట్టి తీస్తాసెతల్వాద్ ను కేవలం సామాజిక కార్యకర్త అని మాత్రమే సంబోధిస్తూ రాయటం మన మీడియాకు ఎంతవరకు సమంజసం*?

No comments:

Post a Comment

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...