Thursday, 12 May 2022

 


ఈ వ్యాసం ప్రధమోద్దేశం చదువరులకు ఒక మహోన్నత దూరదృష్టి కలిగిన వ్యక్తిని పరిచయం చెయ్యడం .
రెండోది అపార తెలివితేటలు కలిగి బాగా చదివే పిల్లలకు ఉన్నత విద్య అభ్యసించాలని ఉన్నా , అటువంటి వారికి ఇందులోని సంస్థ గురించి తెలియచేస్తే వారి ప్రతిభాపాటవాలు వారి ఆశయాలు వారు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం విద్యారుణాల నిబంధనలు కష్టతరమై, విద్యార్థులను నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి.
గత రెండు మూడు దశాబ్దాల నుంచి మన తరం వాళ్ళు, పిల్లల ఉన్నత విద్యాబ్యాసం కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు
ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం ప్రారంభించాయి అన్న విషయం తెలిసిందే.
అంతకుముందు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి బాగా డబ్బు ఉన్నవారికే ఆస్కారం ఉండేది.
వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా 1889 అంటే నేటికి 130 ఏళ్ల క్రితమే ఒక వ్యక్తికి విద్యా రుణాలు సమకూర్చాలి తమ ట్రస్ట్ ద్వారా, అర్హులైన విద్యార్థులకు అన్న ఆలోచన రావడం, ఆచరణలో పెట్టడం , ఆ ట్రస్ట్ ద్వారా ఎందరో లబ్దిపొంది, సమాజంలో పేరుప్రఖ్యాతులు గల వ్యక్తులుగా రూపుదిద్దుకున్నారు .
ఆ అద్భుతమైన ఆలోచన వచ్చిన వ్యక్తి శ్రీ జెమ్షెట్ జి (Jamset Ji) టాటాగారు. టాటా సంస్థల వ్యవస్థాపకులు. చరిత్ర చెప్పని మహా దేశభక్తుడు. వీరికి , స్వామి వివేకానంద వారికి చక్కటి పరిచయం కూడా ఉంది.

.
నిజానికి జెమ్షెట్ జి టాటా గారు మన దేశంలోనే ఒక సైన్స్ విశ్వవిద్యాలయం ప్రారంబిద్దాము అన్న ఆలోచనలో ఉన్నారు అప్పుడు. అయితే అందుకు చాలా కాలమే పడుతుంది. ఆ తరువాత రెండు దశాబ్దాలకు కానీ ఆయన ఆలోచన ఆచరణలోకి రాలేదు (1909 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , బెంగుళూరులో ప్రారంభం అయింది). అదికూడా ఆయన పోయిన తరువాత ప్రారంభింపబడింది.
ఈలోపు ఉన్నత చదువు చదువు కోవాలనుకునే విద్యార్థులకు ఎలా సహాయపడడం అని ఆలోచించారు ఆయన.
జెంషేడ్ జీ టాటా గారు ఆచరణాత్మక వ్యక్తి. 1889లో ఆయన మనదేశ ప్రతిభావంతులైన కొద్దిమంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే అవకాశం కల్పించాలని అనుకోవడమే కాదు , స్కాలర్షిప్ ప్రకటించడం చాలా సులువు ఆయనకున్న వనరులకు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నత వర్గాలకు చెందినవారు స్కాలర్షిప్ అంటే ముందుకురారు. అలాగే ఈ పథకానికి జెంషేడ్ జీ టాటా గారు దానం ఇస్తున్నట్టు ప్రజలు భవించకూడదు అనుకున్నారు.
చేయూత అందుకునే విద్యార్థులు అప్పు తీసుకున్నట్టు ఉండాలి. చదువుకోసం తీసుకున్న మొత్తాన్ని చదువు పూర్తి అయ్యి స్వదేశానికి తిరిగి వచ్చి ఉద్యోగంలో చేరిన తరువాత విడతల వారిగా అప్పు తీర్చాలి . (నూట ముప్పై ఏళ్ళ క్రితం నేడు అమలులో ఉన్న విద్యారుణం పధకం మూలాలకు ఆయన ఆలోచనే )
అనుకున్న వెంటనే J N Endowment scholarship ప్రారంభమైంది. మొదటి టాటా స్కాలర్ ఒక వైద్య విద్యార్థిని . ఆ అమ్మాయి పేరు డాక్టర్ ఫ్రెఅనీ కే ఆర్ కామ. టాటా స్కాలర్షిప్ కింద పదివేల రూపాయల రుణం పొందారు . 1892లో పదివేల రూపాయలు అంటే నేడు ఎన్ని కోట్ల రూపాయలో.
ఆ అమ్మాయి స్కాలర్షిప్ అగ్రిమెంట్ ఏప్రిల్ 7 , 1892 నాడు స్వయంగా
జెంషేడ్ జీ టాటా గారే సంతకం చేశారు. ఆ డబ్బుతో ఆవిడ ఇంగ్లాండ్ వెళ్లి రెండేళ్ల పాటు చదువుకుని, మొదటి తరం gynaecologist గా దేశానికి ఎనలేని సేవ చేసింది.
అలాగే 1902లో జెంషేడ్ జీ టాటా గారు ఇంకో అగ్రిమెంట్ మిస్. కృష్ణభాయ్ కేవల్కర్ చదువుకోసం సంతకం చేశారు
ఆవిడ ఆ సంస్థ తో పొందిన అప్పుతో డబ్లిన్ లో FRCS చేశారు.
జెంషేడ్ జీ టాటా గారు మన దేశ యువత బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ & టెక్నికల్ సర్వీసెస్ లో ఎక్కువుగా చేరాలని ఆశించారు. ఆయన అనుకున్నట్టుగానే వారి సంస్థ నుంచి స్కాలర్షిప్ పొంది ICS అయినవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ఆ స్థానాలకు మనదేశ యువత అర్హత సాదించకపోతే ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ యువత వచ్చి చేరేవారు. అలా వచ్చినవారు పొందే జీతం, ఇతర సౌకర్యాలు, పెన్షన్ మొత్తం లెక్కకడితే రూ 2,00,000 వారి దేశానికి పట్టుకెళ్లేవారు.
అదే ఉద్యోగంలో మనవాళ్ళు చేరితే ఆ డబ్బు దేశంలోనే ఉంటుంది అనేది జెంషేడ్ జీ టాటా గారి ఆలోచన.స్వాతంత్రం పొందే కొన్ని వందలాది భారతీయులు ఈ స్కీం ద్వారా ICS ఆఫీసర్లు అయ్యారు.
ఇక్కడ అప్రస్తుతం అయినా సుభాష్ చంద్రబోస్ గారు ICS చదివి ఉద్యోగానికి 1919లో రాజీనామా చేశారు. వారు టాటా సంస్థ సహాయం పొందలేదు. అలాగే మా పెద్దనాన్నగారు శ్రీ వల్లూరి కామేశ్వర రావు గారు కూడా 1932లో ఇంగ్లాండ్ వెళ్లి ICS పూర్తి చేసుకుని చివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీ గా చేశారు .
ఇంకో విషయం , స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం వదిలి వెళ్లిపోతూ బ్రిటీషర్లు ICS వాళ్లకు పదవి విరమణ పొందిన తరువాత 1997 దాకా బ్రిటిష్ పాండ్స్ లో పెన్షన్ ఇచ్చారు. అది వాళ్ళ దాతృత్వం కాదు, ICS లో వాళ్ళ దేశస్తులు కూడా ఉండేవారు. ఆ ఒప్పందంతో సంబంధం లేకుండా భారత ప్రభుత్వం రిటైర్ అయిన ICS ఆఫీసర్లకు పెన్షన్ ఇచ్చేది. అంటే 1947 ముందు ఇంగ్లాండ్ వెళ్లి చదువుకొచ్చి సివిల్ సర్వీసెస్ లో చేరిన మన దేశస్తులకు రెండు పెన్షన్లు ఉండేవి.
మా పెద్దనాన్నగారు ఆ విషయంలో అదృష్టవంతులు , ఆయనకు రిటైర్ అయిన తరువాత కొన్నేళ్లపాటు మూడు పెన్షన్లు వచ్చేవి, కారణం, ఆయన రిటైర్ అయిన తరువాత నీలం సంజీవ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఈయన చీఫ్ సెక్రటరీ గా పనిచేయడం. ఆ ఐదేళ్ల సర్వీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగం కింద పరిగణింపబడి , పెన్షన్ ఇచ్చేవారు.
మా నాన్నగారు, పెద్దనాన్నగారు ఇద్దరూ కూడా సర్వీస్ లో ఉన్నప్పుడు పొందిన జీతభత్యాల కన్నా పెన్షన్ ఎక్కువ కాలం పొందారు. మా నాన్నగారు 38 ఏళ్ళు, పెద్దనాన్నగారు 46 ఏళ్ళు పెన్షన్ అందుకున్నారు.
మన్నించాలి ఎక్కడికో వెళ్ళిపోయాను.
టాటా స్కాలర్షిప్ ద్వారా లబ్దిపొందిన వారిలో చాలామంది ఉన్నత పదవులు , పేరుప్రఖ్యాతులు పొందారు, అటువంటి వారి లిస్ట్ చాలా పెద్దది. పూర్వ రాష్ట్రపతి కే ఆర్ నారాయణ్ గారు, రాజా రామ్మన్న గారు, టైటాన్ సంస్థ వ్యవస్థాపకులు Xerxes దేశాయి , ఇలా ఎందరో ఉన్నారు.
సుబ్రహ్మణ్యం వల్లూరి.
5
2 comments
1 share
Like
Comment
Share

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...