Tuesday 30 January 2024

 శ్రీ త్యాగరాజ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వందనాలు..🙏🙏🙏

🍁🍁🍁🍁

ఏ ఫేస్ బుక్కులూ, సెల్ ఫోనులూ, టీవీలూ, వెబ్ సైట్లూ.. కనీసం రైళ్ళ వంటి ప్రయాణ సాధనాలూ లేని రోజుల్లో, రెండు వందల ఏళ్ళక్రితం, భరతఖండంలో ఒక మూల ఎక్కడో ఒక వ్యక్తి సాధించిన ఘనత, సుదూరప్రాంతాన ఉన్న మరొక వ్యక్తి తెలుసుకొని, మొదటి వ్యక్తిని కలుసుకోవాలనుకోవడం ఎంత విడ్డూరం?


    కలుసుకొని, ఆ ఘనతను ప్రత్యక్షంగా చూసి,తన జన్మ చరితార్థమైందని భావించడం ఎంత విశేషం?

    అదే జరిగింది శ్రీ త్యాగరాజస్వామి విషయంలో.

ఆ అనుభవాన్ని వర్ణిస్తూ,త్యాగయ్య తోడి రాగంలో పాడుకొన్న 'దాశరథీ! నీ ఋణముదీర్ప నా తరమా?

పరమపావన నామ!' అనే కృతి పూర్వాపరాలను పరిశీలిద్దాం. ...

 ఉత్తరభారతదేశంలో హిందువులకు అతి ముఖ్య యాత్రాస్థలమైన కాశీ క్షేత్రం, సంగీతాది కళలకు పుట్టినిల్లు.

రెండు శతాబ్దాలకు పూర్వం, 'గణేశ్ భావే' అనే సంగీత విద్వాంసుడు అక్కడ ఉండేవారు.

ఆయన హిందుస్థానీ సంగీతాన్ని బాల్యంనుండే అవపోసన పట్టి, ఎన్నో వినూత్న ప్రయోగాలు సంగీతపరంగా చేసి, తన ప్రదర్శనలతో జగద్విఖ్యాతులయ్యారు.

అయితే ఆయనకు తృప్తికలగలేదు. తన జీవితంలో ఏదో తెలియని వెలితి...

   సంగీతం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాననే చింత అయనను దహించి వేయసాగింది.

ఒకరోజు స్వప్నంలో ఆయనకు శ్రీరామ సాక్షాత్కారం కల్గి,'నాయనా!నీ బాధ తెలిసింది. దక్షిణ భారతావని వెళ్ళి, నా భక్తుడు త్యాగయ్య దర్శనం చెయ్యి.నీకు తరణోపాయం దొరుకుతుంది.' అని చెప్పినట్లు తోచింది.

        కర్ణాకర్ణిగా 'వాగ్గేయకార శిరోమణి' త్యాగయ్య భక్తిని గురించి, సంగీత వైదుష్యం గురించి ఆయన అప్పటికే విని ఉన్నారు.

    అంతే...ఆరోజే కాలి నడకన కాశీ నుండి బయలుదేరారాయన! కొన్ని పగళ్ళూ, రాత్రులూ ప్రయాణం చేసి, తంజావూరు సమీపంలోని త్యాగయ్య గారి స్వగ్రామం తిరువయ్యారు చేరుకున్నారు.

సూర్యోదయ సమయం. కావేరీ నదిలో స్నాన సంధ్యాదులు ముగించుకొని, తిరిగివస్తుంటే త్యాగయ్యగారి ఇల్లు అల్లంత దూరాన కనబడింది.

'రార మా ఇంటిదాకా'.. అంటూ త్యాగయ్యగారు అసావేరి రాగంలో పాడుతుంటే, ఆయన శిష్యులు వంత పాడుతున్నారు.

   తంబురా చేతబట్టి, ఊరి వీధుల్లో దివ్యనామ సంకీర్తనలు పాడుతూ, ఉంఛవృత్తి నిర్వహిస్తున్న త్యాగయ్యను చూసి, పరవశించిపోయారు గణేశ్ భావే.

త్యాగయ్యగారి కృతులలో భాషలకతీతమైన భక్తిభావాన్ని దర్శించారాయన!

    ప్రాతః కాలంలో ప్రకృతిని పలకరిస్తూ, తన గానామృతంతో భగవత్సాక్షాత్కారాన్ని ఎల్లరకూ కలుగజేస్తున్న త్యాగయ్యకు నమస్కరించారాయన!

 త్యాగయ్యగారికి తనను తాను పరిచయం చేసుకొని, తన స్వప్న వృత్తాంతం చెప్పి, 'తమ దర్శన భాగ్యంవల్ల నేటితో నా జన్మ ధన్యమైంది. సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము లేదని తెలిసింది. మీ శిష్యులను చూస్తే నా కడుపు నిండిపోయింది.మీ సర్వస్వమూ సంగీతానికే త్యాగం చేసి, సార్థక నామధేయులయ్యారు.మీ జీవితము నావంటి వానికి మార్గదర్శకము' అన్నారు.

'ఎక్కడో కాశీలో ఉన్నవారికి తన గురించి తెలియడమేమిటి?తన దర్శనార్థమై రావడమేమిటి?ఆ రాముడిపై కీర్తనలు వ్రాయడం వల్లనేకదా తన కీర్తి దూరదేశములకు వ్యాప్తిచెందినది!ఓ రామా! నీఋణము నేనెట్లు తీర్చుకోగలను?' అనుకున్నారు త్యాగయ్యగారు.

కనుల అశ్రువులు నిండాయి!..

        ఆశతీర దూరదేశములను 

        ప్రకాశింపజేసిన రసిక శిరోమణి!

                          దాశరథీ! నీ ఋణముదీర్ప నాతరమా!

        భక్తిలేని కవిజాల వరేణ్యులు

        భావమెరుగలేరని కలిలోన జని,

        భుక్తి,ముక్తి కల్గునని కీర్తనముల

        బోధించిన త్యాగరాజ కరార్చిత! ||

                        దాశరథీ! నీ ఋణముదీర్ప నాతరమా!...  

        అంటూ పాడుకొని, భావేగారికి తన ఇంట సకల మర్యాదలతో ఆతిథ్యమిచ్చారు త్యాగయ్యగారు.

వారింట, శ్రీరామునికి మేలుకొలుపు మొదలు పవ్వళింపు వరకూ నిత్యం జరిగే సంగీతార్చన కళ్ళారా చూసిన భావేగారి ఆనందానికి అవధులు లేవు.

        త్యాగయ్యగారి వలె తానుకూడా తన సంగీత వైదుష్యాన్ని ఇకనుండీ మోక్షసాధనకు వినియోగించుకోవాలని, శిష్యులకు తన విద్య బోధించి, 'సద్గురువు' గా పేరుతెచ్చుకోవాలని నిశ్చయించుకొని, త్యాగయ్యగారి వద్ద శెలవు తీసుకొని, కాశీకి తిరిగి ప్రయాణమయ్యారు.

జై శ్రీమన్నారాయణ🙏


show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...