కాదా దుర్మార్గుడు?????
ఎవరో విదేశీయులు వ్రాస్తే అది సత్యమా?
చరిత్ర ఊహాజనితం కాదు. కాల్పనిక గాథ చరిత్ర కాదు. గతాన్ని, చారిత్రక వ్యక్తులను వారు జీవించిన సమయంలోని పరిస్థితుల ఆధారంగా అంచనా వేయాలే తప్ప ప్రస్తుత పరిస్థితి ఆధారంగా చరిత్ర నిర్మించడానికి ప్రయత్నం చేయకూడదు. రాచరిక యుగం నాటి పరిణామాలను ప్రజాస్వామ్య ప్రమాణాలతో అంచనావేస్తే వాస్తవం మరుగున పడుతుంది. మన దేశాన్ని పరిపాలించిన అనేక మంది రాజులు చరిత్రలో నిలిచి పోయారు. మంచి చేసిన వారితో పాటు చెడు చేసిన వారిని కూడా జనం గుర్తుంచుకుంటారు. వారు చేసింది మంచో చెడో నిర్ణయించాల్సింది వారు జీవించిన కాలాన్నిబట్టే తప్ప ఈ నాటి ప్రమాణాలతో కాదు.
మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ (1618-1707) దుష్ట పరిపాలకుడిగ జనం మదిలో నిలిచిపోయారు. దిల్లీలోని ఔరంగజేబ్ రోడ్ పేరు ఇటీవల ఎ.పి.జె.అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు. ఇది చారిత్రక పొరపాట్లను చక్కదిద్దడంగా భావిస్తున్నారు. ఔరంగజేబ్ ఆ రోజుల్లో ప్రపంచంలోకెల్లా సంపన్నుడు. అత్యంత శక్తిమంతుడైన రాజు. ఆయన 1658 నుంచి 1707 దాకా అంటే దాదాపు అర్ధ శతాబ్దంపాటు రాజ్యమేలారు. ఆయన ఏలుబడిలో ఉన్న రాజ్యం దక్షిణాసియాలో అన్నింటికన్నా పెద్దది. ప్రస్తుత యూరప్ అంతటికన్నా విశాలమైంది. ఆయన ఏలుబడి గురించి, వ్యక్తిత్వం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే జనం మదిలో ఆయన అత్యంత క్రూరుడైన పరిపాలకుడు. హిందూ మతాన్ని, సంస్కృతిని తుడిచిపెట్టాలను కున్న రాజు. ఔరంగజేబ్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఆయన వేలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడని, లక్షలాది మంది హిందువులను బలవంతాన ఇస్లాం మతం స్వీకరించడానికి బలవంత పెట్టాడని, హిందువులమీద మారణకాండ కొనసాగించాడని, హిందువులను, హిందూ మతాన్ని రూపుమాపాలనుకున్నాడని అనేక ఆరోపణలున్నాయి. ఇవన్నీ నిజమే అయితే అది దిగ్భ్రాంతికరమైందే.
అమెరికాకు చెందిన చరిత్రకారిణి ఆద్రే ట్రష్కి ఈ ఆరోపణల నిగ్గు తేల్చడానికి ‘‘ఔరంగజేబ్: ది మాన్ అండ్ ది మిత్’’ గ్రంథం రాశారు. 2017లో పెంగ్విన్ రాండం హౌజ్ ఇండియా ఈ గ్రంథాన్ని ప్రచురించింది. త్రష్కీ న్యూ జెర్సీలోని రూట్జర్స్ యూనివర్సిటీలో చరిత్ర బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్. నెవార్క్ లోని ఈ యూనివర్సిటీలో ఆమె దక్షిణాసియా చరిత్ర బోధిస్తారు. ఈ గ్రంథం రాయడానికన్నా ముందు ట్రష్కి ‘‘కల్చర్ ఆఫ్ ఎంకౌంటర్స్: సాన్స్ క్రిట్ అట్ ది మొగల్ కోర్ట్’’ గ్రంథం రాశారు. ఇదీ పెంగ్విన్ ప్రచురణే. ఔరంగజేబ్ రోడ్ పేరు మార్చాలని మొట్టమొదట కోరింది స్థానిక సిక్కులు. ఔరంగజేబ్ నిరంకుశుడు, అమానుషమైన రీతిలో వ్యవహరించిన వాడు కనక ఆ రోడ్డు పేరు మార్చాలన్నారు. ఆ తర్వాత పార్లమెంటులో కొంతమంది బీజేపీ సభ్యులు ఈ వాదనను బలపరిచారు. 2015 ఆగస్టులో దిల్లీ అధికారులు ఆ రోడ్డు పేరు ఎ.పి.జె. అభుల్ కలాం రోడ్డుగా మార్చారు. ఔరంగజేబ్ దుష్ట పాలకుడైతే ఆయనను స్మృతిపథం లోంచి చెరిపేయడానికి ప్రయత్నించాలి తప్ప ఆయనను మరో సారి గుర్తు చేసే పనులు చేసి ఉండవలసింది కాదు. ఆ తర్వాత పార్లమెంటులో శివ సేన సభ్యుడొకరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను ‘‘ఔరగజేబ్ కి ఔలాద్’’ (సంతతి) అని దూషించారు. అయోధ్య రగడ తారస్థాయిలో ఉన్నప్పుడు భారతీయ ముస్లింలను బాబర్ కి ఔలాద్ అనే వారు అని ట్రష్కి గుర్తు చేస్తారు.
ఔరంగజేబ్ మీద ఆగ్రహం సంఫ్‌ు పరివార్ కు మాత్రమే పరిమితమైంది కాదు. ఇతర వర్గాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. పాకిస్తాన్ లోనూ ఇదే వరస. ఔరంగజేబ్ తన అన్న దారా షికో మీద విజయం సాధించడంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని షాహిద్ నదీం అనే పాకిస్తానీ నాటక రచయిత అన్నారని ట్రష్కి అంటారు. ముస్లింలను అనుమాన దృష్టితో చూసే వైఖరి 20వ శతాబ్దంలో గొప్ప చరిత్రకారులనుకునే జాదూ నాథ్ సర్కార్ వంటి వారికి కూడా ఉంది. ‘‘మహమ్మదీయుల మత విశ్వాసమే నిరంకుశత్వంతో కూడుకున్నది’’ అని 1772లోనే అలేక్జాండర్ డోవ్ అన్నారు.
‘‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?/ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?
తారీఖులు, దస్తావేజులు/ఇవి కావోయ్ చరిత్రకర్థం
ఈ రాణీ ప్రేమ పురాణం/ఆ ముట్టడికైన ఖర్చులూ
మతలబులూ, ఖైఫీయతులూ/ఇవి కావోయ్ చరిత్ర సారం’’ అన్నారు శ్రీ శ్రీ. కాని బ్రిటిష్ వారి హయాంలో రాసిన చరిత్ర అంతా వీటికే పరిమితమైంది. చారిత్రికాధారాలకు విలువ ఇవ్వకుండా విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలే చరిత్రగా చెలామణి అయాయి. అందుకే మొగలుల చరిత్రపై మరో చూపు చూడడానికి ట్రష్కి మౌలిక ఆధారాలను పరిశీలించి వాస్తవాన్వేషణకు ఉపక్రమించారు. మౌలిక ఆధారాలను వెతకడానికి ఆమె సంస్కృతం, పర్షియన్ భాషలు నేర్చుకున్నారు. ఆమె చేసిన పరిశోధనవల్ల ఔరంగజేబ్ మీద ఉన్న అనేక ఆరోపణలు నిరాధారమైనవని తేలిందంటారు ట్రష్కి. ఔరంగజేబ్ మీద ఏహ్యా భావం ఉండడానికి గత చరిత్ర కారణం కాదు, భారత్‌లోని వర్తమాన పరిస్థితే ప్రధాన కారణం అంటారు ఆమె. ముస్లిం పాలకులు భారత్ ను నాశనం చేసి హిందువులను అణచి వేశారన్న అభిప్రాయం గూడు కట్టుకున్నందువల్లే ముస్లింలను ఔరంగజేబ్ సంతతిగా భావిస్తున్నారు. ఔరంగజేబ్ పాలన మంచిదా, చెడ్డదా అని తేల్చడానికి ఆధునిక, సమానత్వ, ప్రజాస్వామ్య కొలమానాలు పనికి రావు. ఆయన ప్రవర్తనకు ఆ నాటి పరిస్థితులే కారణం తప్ప వర్తమానం నాటి పరిస్థితినిబట్టి బేరిజు వేయడం చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉపకరించేది కాదు.
హిందూ మతాన్ని, హిందువులను తుడిచిపెట్టడానికి ఔరంగజేబ్ ప్రయత్నించారనడానికి చారిత్రక ఆధారాలు లేవనీ అయితే ఆయన హిందువుల దేవాలయాలను కూల్చేయలేదని కాదు. ప్రచారంలో ఉన్నట్టుగా ఆయన వేలాది దేవాలయాలను ధ్వంసం చేయలేదు. మహా అయితే కొన్ని డజన్ల హిందూ ద్వేవాలయాలను ధ్వంసం చేసి ఉంటారు. హిందూ మతంలోని భిన్న శాఖల వారు ఇతర శాఖలకు చెందిన దేవాలయాలను ధ్వంసం చేసిన ఉదంతాలు మొగలులు మన దేశంలో కాలు మోపక ముందే ఉన్నాయి. బౌద్ధారామాలు, శివాలయాలుగా, శివాలయాలు వైష్ణవాలయాలుగా మారిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ ఆయా మతాల విస్తరణలో భాగంగా జరిగినవే. ఈ విధ్వంస కాండ హిందువులే కొనసాగించినందువల్ల అంతగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. భారీ ఎత్తున మత మార్పుడులను ఔరంగజేబ్ ప్రోత్సహించలేదని ఆయన ఏలుబడిలో ఇస్లాం మతం స్వీకరించిన వారు తక్కువ అంటారు ట్రష్కి. ఔరంగజేబ్ పాలనా కాలమంతా యుద్ధాలతోనే గడిచింది. ఆయన కాలంలోనే మొగల్ సామ్రాజ్యం విపరీతంగా విస్తరించింది. ఈ యుద్ధాల్లో ఆయన అనేక మందిని అంతమొందించిన మాట నిజం. సోదరులందరినీ మట్టుబెట్టాడు. హిందువుల మీద దాడి చేసినట్టే ముస్లింల మీద కూడా దాడి చేశాడు. ఔరంగజేబ్ ను క్రూరుడుగా చిత్రించడానికి ప్రయత్నించే వారు ఆయన హిందూ, జైన దేవాలయాలకు సహాయం చేసిన అంశాన్ని విస్మరిస్తారు. భారత శిక్షా స్మృతిలోని 295(ఎ) సెక్షన్ ఉద్దేశపూర్వకంగా మత భావాలను అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒక మతం వారి భావాలను కించపరిచే అంశాలు చారిత్రక సత్యాలైనా భారత చట్టాలు దాన్ని నేరంగా పరిగణిస్తాయి. వెండీ డోనిగర్ రాసిన ‘‘ది హిందూస్: ఆన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ’’ 2009లో వైకింగ్/పెంగ్విన్ ప్రచురించినప్పుడు పెద్ద దుమారం చెలరేగింది. పెంగ్విన్ ఈ గ్రంథాన్ని ఉపసంహరించుకుంది కూడా. ఆమె మీద కేసు కూడా నమోదైంది. చివరకు కోర్టు వెలుపల రాజీ కుదిరింది. పెంగ్విన్ ఈ పుస్తకాలను ఉపసంహరించుకోవడాన్ని అరుంధతీ రాయ్, పార్ఠా చటర్జీ, జీత్ తాయిల్, నామ్వర్ సింగ్ లాంటి వారు దుయ్యబట్టారు. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్ భారత్ లో ప్రచురించింది. డోనిగర్ కూడా న్యూ యార్క్ లో నివసిస్తూ భారత్ చరిత్ర, సంస్కృతి పరిశోధకురాలుగా ఉన్నారు. ఆద్రే ట్రష్కి కూడా ఔరంగజేబ్ పుస్తకంలో శివాజీకి సంబంధించిన అధ్యాయంలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది.
సంస్కృత, పర్షియన్ సాహిత్యంలో మౌలిక ఆధారాలను పరిశీలిస్తే సాంప్రదాయిక హిందూ, జైన విజ్ఞానం మీద మొగలులు ఆసక్తి కనబరిచారు. అక్బర్, జహంగీర్, షా జహాన్ పాలనా కాలంలో దాదాపు వందేళ్ల పాటు సంస్కృత పండితులకు మంచి ఆదరణ ఉండేది. ఈ పండితులే మొగల్ చక్రవర్తుల ఆస్థానాలలో అనేక ఉత్సవాలు నిర్వహించే వారు. బ్రాహ్మణులు మొగలుల ఆస్థానాల్లో జ్యోతిషులుగా ఉండే వారు. మొగల్ రాజ కుటుంబాల జాతక చక్రాలు రాశారు. రెండు మతాలకూ చెందినవారు రాజకీయ సంప్రదింపుల్లో పాల్గొనే వారు. మొగల్ చక్రవర్తుల నుంచి కానుకలూ పుచ్చుకున్నారు. అక్బర్, జహంగీర్, షా జహాన్ అనేక సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదింప చేశారు. అక్బర్ హయాంలో దాదాపు డజన్ సంస్కృత గ్రంథాలు పర్షియన్లోకి అనువాదమయ్యాయి. వీటిలో మహాభారతం, రామాయణం కూడా ఉన్నాయి. బ్రాహ్మణులు అక్బర్ కు సంస్కృతంలో సూర్యసహస్ర నామాలు అందజేస్తే సూర్యుడి బిరుదులను ఎలా ఉచ్చరించాలో మొగలులకు జైనులు నేర్పారు. మొగలులు సంస్కృత గ్రంథాల మీద చూపిన ఆసక్తి మతంతో సంబంధం లేని విషయాలకే. ఉదాహరణకు పద్మ సుందరుడు అనే ఒక జైన మేధావి సంస్కృత అలంకార శాస్త్రాన్ని అక్బర్ కు అందజేశారు. ప్రసిద్ధ సంస్కృత పండితుడు జగన్నాథ పండిత రాయలను జహంగీర్, షా జహాన్ ఆదరించారు.
ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సంస్కృతాన్ని ఆదరించడం కొంత మేర తగ్గింది. అయితే అనేక మంది హిందువులకు భూములు ఇచ్చింది ఔరంగజేబే. ఈ భూములకు శిస్తు చెల్లించవలసిన అవసరం ఉండేది కాదు. రాజకీయంగా విభేదించిన సందర్భాలలోనే ఔరంగజేబ్ హిందూ దేవాలయాలను నాశనం చేశారు. దీనికి మతంతో నిమిత్తం లేదు, రాజకీయాలు, రాజ్య విస్తరణ కాంక్షే ప్రధానం అంటారు ట్రష్కి. ఔరంగజేబ్ అధికారం చేపట్టే నాటికి హిందీ ప్రాచుర్యంలోకి వచ్చినందువల్ల ఔరంగజేబ్ కు సంస్కృతం మీద అభిమానం మందగించింది. నిజానికి షా జహాన్ కాలం నుంచే హిందీని ఆదరించడం మొదలైంది. ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కృత పండితుడు కవీంద్రాచార్యకు రాజస్థానం నుంచి డబ్బు అందడం ఆగిపోతే ఆయన మొగల్ ప్రముఖుడైన దానిష్మంద్ ఖాన్ దగ్గర ఆశ్రయం పొందారు. ఔరంగజేబ్ పిన తండ్రి షాహిస్తా ఖాన్ పర్షియన్ మహాభారతానికి విషయ సూచిక రాసే పనిని తన దగ్గర పని చేసే హిందూ మున్షీకి అప్పగించారు. దానిష్మంద్ ఖాన్ స్వయంగా సంస్కృతంలో కవిత్వం రాసే వారు. రసకల్పద్రుమ అనే సంకలనంలో ఈ కవితలున్నాయంటారు ట్రష్కి.
ఔరంగజేబ్‌ను భయంకరుడైన పాలకుడిగా చిత్రించడంలో బ్రిటిష్ వారి పాత్రా ఉంది. మా కన్నా ముందు దండయాత్ర చేసిన వారికన్నా మేం మెరుగైన వాళ్లం అని చెప్పుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఔరంగజేబ్‌ను దుర్మార్గుడిగా చిత్రించారు. ఔరంగజేబ్ నిష్ఠా గరిష్టుడైన ముస్లిం. అయినా ఇస్లాంలోని కొన్ని అంశాలను వ్యతిరేకించేవాడు. దీనికి కారణం ఆయనకున్న రాజ్యకాంక్షే.
ఆద్రే ట్రష్కి ఔరంగజేబ్ మీద రాసిన పుస్తకం చరిత్రలోని భిన్న కోణాలను పరిశీలించడానికి, వర్తమాన పరిస్థితి ఆధారంగా గతాన్ని చూడకూడదని చెప్పడానికి ఉపకరిస్తుంది.
ఆర్వీ రామారావ్