Monday, 3 July 2023

వ్యాసపౌర్ణిమ 

*వ్యాసం వసిష్ఠ నప్తారం, శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతమ్ తపోనిధిమ్*

   ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పౌర్ణమి' అని అంటారు. ఇదే రోజు వ్యాసమహర్షి జన్మతిథి కనుక, మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ ఈ పౌర్ణమి రోజు గురుభగవానుడు వ్యాసమహర్షిని పూజించి అష్టైశ్వర్యాలు పొందుతున్నారు..

గురువందనం!

మాకు అన్నిను హేమలపూరి(అలంపూర్ ) తల్లిఅయిన జోగుళాంబాదేవి,అలాగే గురువురేణ్యులకు మా హృదయపూర్వక నమసుమంజలు

'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’   

   వ్యాసమహర్షి యమునా నదీతీరంలో పుట్టాడు. కనుక కృష్ణద్వైపాయనుడు అని, వేదాలని విభజించినవాడు కనుక వేదవ్యాసుడని, పరాశరుడి కుమారుడుగా పారాశర్యుడని, సత్యవతీ పుత్రుడుగా సాత్యవతేయుడని పేర్లున్నాయి. 

  గురుపూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్ఠత గురించిన కథ ఒకటి తెలుసుకుందాం...

    పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన భార్య  పేరు 'వేదవతి'. వీళ్లిద్దరు ఎప్పుడూ చక్కని ఆధ్యాత్మిక భావంతో భక్తి జ్ఞానాలు కలిగి జీవించేవాళ్లు.

   ఆ దంపతులకి సంతానం కలగలేదు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. 

   ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో స్నానం కోసం వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి వస్తూ ఉంటారని వేదనిధికి తెలిసింది. ఎలాగైనా సరే వ్యాసమహర్షిని దర్శించాలని ప్రతిరోజు వేయికళ్ళతో ఎదురు చూసేవాడు. ఒకరోజు భిక్షువు రూపంలో ఉన్న దండధారుడైన ఒక వ్యక్తి వేదనిధికి కనిపించాడు. 

  వెంటనే వేదనిధి వారి పాదాలకి నమస్కారం చేశాడు. ఆ భిక్షువు వేదనిధని చీదరించుకుని కసురుకున్నాడు. అయినా సరే పట్టిన పాదాల్ని మాత్రం విడిచిపెట్టలేదు వేదనిధి. భిక్షుకుడితో “ “మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుకే మీ పాదాల్ని ఆశ్రయించాను”” అన్నాడు.

   ఆ మాటలు విన్న  భిక్షువు గంగానది ఒడ్డుమీద అన్నివైపులకి ఒకసారి పరికించి చూస్తూ నిలబడిపోయాడు. తనను ఎవరూ చూడట్లేదని నిర్ణయించుకుని వేదనిధితో ఆప్యాయంగా మాట్లాడి ఏం కావాలో అడగమన్నాడు.

   వేదనిధి “ “అయ్యా! రేపు నా తండ్రిగారి ఆబ్దీకం. దానికి మీరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పకుండా రావాలి” అని వేడుకున్నాడు. వ్యాసభగవానుడు వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరించాడు.

   వేదనిధి ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకుని తన భార్యకి గంగానదీతీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వ్యాసమహర్షి వేదనిధి ఇంటికి వచ్చాడు.

   ఆ దంపతులు వ్యాసమహర్షిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాల్ని, పువ్వుల్ని సిద్ధం చేశారు. 

     పూజ పూర్తయ్యాక ఎంతో శుచిగా వంటకాలని సిద్ధం చేసుకుని శ్రాద్ధవిధులని విధి విధానంగా నిర్వహించారు. అంతా పూర్తయ్యాక ఆ దంపతులు  వ్యాసభగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు.

   వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠుడైన ఆ ముని శ్రేష్ఠుడు “ ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏం వరం కావాలో కోరుకోండి” అన్నాడు. 

   ఆయన మాటలకి వేదనిధి దంపతులు “”మహానుభావా! ఎన్ని నోములు, వ్రతాలు చేసినా మాకు సంతానభాగ్యం మాత్రం కలుగలేదు. దయచేసి మాకు సంతానం ప్రసాదించు!””  అని వేడుకున్నారు.

   అది విని వ్యాసభగవానుడు “ “త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రులు కలుగుతారు”” అని ఆశీర్వదించాడు.

    వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసభగవానుడి అనుగ్రహంతో సంతానం పొంది సుఖసంతోషాలతో జీవించి, చివరికి విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.

   వ్యాసపూర్ణిమ రోజున వ్యాస దేవుని పూజించాలి. గురుపూజ చెయ్యాలి. నిజానికి గురుపూజ చెయ్యవలసిన రోజు వ్యాసపౌర్ణిమ. చదువులు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా సత్కరించి అర్చించాలి. గురువులోనే వ్యాసదేవులున్నారని భావించి ఆరాధించాలని పెద్దల మాట!

   “చాతుర్మాసం ద్విమాసం వా సదైకత్రైవ సంవసేత్”  అని శాస్త్రాలు చెబుతున్నాయి.  దీని ప్రకారం శ్రీకృష్ణుడిని, వ్యాసుడినే కాకుండా జైమిని, సుమంత, వైశంపాయన, పైలుడు మొదలైన వ్యాసశిష్యుల్ని కూడా పూజించాలి.

   ఈ రోజునే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం, దక్షిణాయనం ప్రారంభం కావడం జరుగుతుంది. కనుక, విష్ణుపూజ, దానాలు, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యడం, వ్యాసమహర్షి రాసిన గ్రంథాల్ని చదవడం వల్ల సుఖసంతోషాలు, సకల సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు.

పరాశరుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని  అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణ వేదాన్నిబోధించి లోకంలో వేదాల్ని వ్యాప్తి చేయించాడు.

   చతుర్వేదాలు, అష్టాదశపురాణాలు, చతుర్దశవిద్యలు అన్నీ అభ్యసించి వాటిని బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు

అందరికీ బోధించాడు. వాళ్ళు వాళ్ళ శిష్యులకి, శిష్యులు ప్రశిష్యులుబోధించడం వల్ల లోకంలో వేదాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

    వ్యాసమహర్షి రచించిన ’వ్యాససంహిత’, ’వ్యాసస్మృతి’ అనే గ్రంథాల్లో నిత్య కర్మల గురించి అనేక విషయాలు వివరించబడ్డాయి. వేద వ్యాసులవారు విశ్వంలోని మొట్టమొదటి ఆర్ష గ్రంథమయిన `బ్రహ్మసూత్రాలు' అనే గ్రంథాన్ని రాయడం వ్యాసపౌర్ణమి రోజునే పూర్తయ్యింది. `

   వ్యాసపౌర్ణిమ రోజున ఏ సాధకుడైతే ఆచార్యుడిని ఉపాసన చేసి తన ఆథ్యాత్మిక మార్గాన్ని నిర్ణయించుకొంటాడో అతడికి  సంవత్సరంలో  వచ్చే అన్ని ఆధ్యాత్మిక పండుగలు  జరుపుకొన్నంత ఫలితం కలుగుతుంది అని దేవతలే చెప్పారు.

   వ్యాసపూర్ణిమ నాడు నిమ్మకాయలతో గురుమండలాన్ని వేసి పుజిస్తారు. వ్యాసుమహర్షిని ప్రతినిధిగా పరంపరలో ప్రస్తుతం ఉన్న గురువులని పూజిస్తారు.

  అలా గురువులని పూజించటం వల్లే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా చెప్పబడుతోంది.  ఏ గురువుని పూజించినా వ్యాస భగవానుడిని ప్రతినిధిగా పూజించడమే అవుతుంది. ఆ పూజ స్వయంగా వ్యాసభగవానుడికే చెందుతుంది.

వ్యాసపుర్ణిమ నాడు చేయవలసింది...

   వ్యాసమహర్షిని మనస్సులో తలచుకోవడం, గురుపూజ, గురు పాదసేవ, గురు పాదుకాపూజ, అలా చెయ్యలేకపోతే గురువుగారిని కలిసి కనీసం పాదాభివందనం చేయడం, ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే గురుసమానులు ఎవరినైనా కలిసి గౌరవించడం చెయ్యాలి.

 ఈ శ్లోకం గురుపరంపరే కాకుండా వ్యాసమహర్షి వంశ స్తుతి కూడా..

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం| పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం!!

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే| నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః!!

   శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియచేస్తోంది.

   గురుపౌర్ణిమ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

  దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

   ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలని అందించినవారే వ్యాసులవారు.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే| పుల్లార విన్దాయత పత్రనేత్ర |

యేన త్వయా భారత తైలపూర్ణ| ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీపః ||

   విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముతో నింపబడిన జ్ఞానదీపము వెలిగించినవాడా! నీకు నా నమస్కారము!

గురు సందేశము :

   వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది! 

   దత్త్తాత్రయులు వారు మనకు 24 మంది గురువులువున్నారు అని చెప్పారు.  మనకు వరసగా తన గురువులు గురించి చెప్పారు.   

భూమి, వాయువు,  అగ్ని, ఆకాశము, సూర్యుడు పావురము, కొండచిలువ, సముద్రము, మిడత, ఏనుగు,

 చీమ, చేప, పింగళ అనే వేశ్య, శరకారుడు, ఒక బాలుడు, చంద్రుడు, తేనెటీగ, లేడి, గ్రద్ద, కన్య, సర్పము, సాలెపురుగు, భ్రమరకీటకము, జలము అని తన గురువుల గురించి చెప్పారు. అంతే కాదు మనకు ప్రతి జీవీ ఒక గురువే అని చెప్పారు. కనుక, అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడని గ్రహించి దయాగుణంతో మెలుగుదాం!

వ్యాస పూర్ణిమ రోజున ఆ మహర్షిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదాం..!

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...