తెలుగుకు ప్రాచీనభాషగా గుర్తింపు - పూర్వాపరాలు
డా।। కస్తూరి విశ్వనాధం, మైసూరు.
9480770557
తమిళభాషను ప్రాచీనభాషగా గుర్తిస్తూ కేందప్రభుత్వం 2004 వ సంవత్సరం అక్టోబరు 12వ తేదీన అధికార ప్రకటన వెలువరించింది. ఆ విషయం నేను వెంటనే సామల రమేష్ బాబుగారితో చర్చించి తెలుగుకు తీరని అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని తెలుగువారు తీవ్రంగా పరిగణించాలని తెలుగు భాషకు కూడా ఆ అర్హతలన్నీ ఉన్నాయని వివరించాను. ఆయన నన్ను ఈ విషయంమీద ఒక వ్యాసం వ్రాసి పంపమన్నారు. ఇది జరిగింది 2004 అక్టోబరులోనే. నేను పంపిన వ్యాసం అదే సంవత్సరం డిసెంబరు ‘నడుస్తున్న చరిత్ర’లో ప్రచురితమయ్యింది. ఈ విషయం మీద ఇదే పత్రికలో పడిన మొదటి వ్యాసమనుకొంటాను. తర్వాత మెల్లమెల్లగా ప్రజలలోను చైతన్యం రావటము, సబలలోను, సమావేశాలలోను, విద్యాలయాలలోను ఈ విషయం మీద చర్చలు జరిగాయి. ఆ తర్వాత వివిధ పత్రికలలో వ్యాసాలు వచ్చాయి. అందరికంటే ముందుగా స్పందించినవారిలో ఆర్.వి.ఎస్.ఎస్ సుందరం గారున్నారు. ఈ ప్రకటన సాహిత్య అకాడమీ వారి అజమాయిషీలోని భాషాశాస్త్రజ్ఞుల కమిటీలో చాలాసార్లు చర్చించిన మీదట వారి సిఫారసుతోనే జరిగింది. ఆ కమిటీలో ఇద్దరు అరవవాళ్ళు ఇద్దరు తెలుగువాళ్లు ఒక ఒడియా భాషాశాస్త్రజ్ఞుడు, ఇద్దరు ఉత్తరదేశీయులు వున్నారు. సభ్య కార్యదర్శి(ఈయన మలయాళీయుడు) కాక అరవంతో సమానంగా ఇద్దరు తెలుగువాళ్లున్నా తెలుగు తరఫున వాదించి న్యాయం చేయలేకపోయారు. అటువంటి పరిస్థితులలో సామల రమేష్బాబు గారి సలహాతో నేను, అప్పుడు ఎం.ఎల్.ఏగా వున్న మండలి బుద్ధప్రసాద్ గారు ఢిల్లీకి వెళ్ళి ఆనాటి సాంస్కృతిక శాఖామాత్యును కలిసి (సాహిత్య అకాడమీ సాంస్కృతిక శాఖ క్రింద వస్తుంది కాబట్టి)తెలుగుకు జరిగిన అన్యాయాన్ని వివరించి తెలుగును కూడా ప్రాచీనభాషగా ప్రకటించే ప్రయత్నం చేయమని ప్రాధేయపడ్డాము. ఆ మంత్రిగారు కూడా తెలుగువారే అయినా ఈ విషయం మీద పెద్దగా ఉత్సాహం చూపించకపోవటమే కాక అది రాజకీయ నిర్ణయమనే అభిప్రాయం కలిగించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు, పండితులు కేందప్రభుత్వ నిర్ణయాన్ని గర్హిస్తూ, తెలుగుకు కూడా ఆ హోదా ఇవ్వాలని కోరుతూ వ్యాసాలు ప్రచురించారు. సమావేశాలలో ప్రకటించారు. అందరి లాగే నేను కూడా ఈ విషయం మీద పలుచోట్ల మాట్లాడటమే కాక కొన్ని వ్యాసాలు ప్రచురించాను. ముఖ్యంగా నడుస్తున్న చరిత్ర పత్రికలో.
ఎట్టకేలకు 2008లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను, 2009లో ఆంధప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని తెలుగు కన్నడాలను ప్రాచీన భాషలుగా గుర్తిస్తూ అక్టోబరు 31వ తేదీన ప్రకటన వెలువడింది. ఈ గుర్తింపు విషయంలో తెలుగువారికంటే కర్నాటకులే ఎక్కువ పాటుపడ్డారని గుర్తుంచుకోవాలి.
ఈ లోపల ప్రభుత్వం ఏమీ చేయక ముందే కె.గాంధీ అనే ఒక న్యాయవాది మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో తెలుగు కన్నడాలకు ఆ హోదా ఇవ్వటం సరికాదని, ఆ భాషలకు అర్హత లేదని, వాటికా హోదా ఇచ్చేటప్పుడు అనుసరించిన విధానం సరిగా లేదని వ్యాజ్యం వేశాడు. ఇది అరవవాళ్ళకు ఇతర భాషాసంస్కృతులపట్ల వున్న ఈర్ష్యాసూయలను, సంకుచిత స్వభావాన్ని వెల్లడిస్తుంది. కేసు వేసిన తర్వాత కొంతకాలం ప్రభుత్వం స్తబ్దంగా వుంది. కేసులో పస లేదని గ్రహించిన తర్వాత నాయకుల, పండితుల ఒత్తిడితో 2011 నుంచి కొంత మొత్తాన్ని తెలుగు కన్నడాలకు కలిపి మంజూరు చేయటం ప్రారంభించింది. ఆ సంవత్సరమే డిసెంబరులో మైసూరులోనే కేంద్ర భారతీయ భాషా సంస్థ (సి.ఐ.ఐ.ఎల్)లో శాస్త్రీయ కన్నడ భాషాధ్యయన ప్రాశస్త్య కేంద్రం అనే సంస్థ ప్రారంభోత్సవం జరిగింది. ఎందుకంటే ఇది భాషావిషయం కాబట్టి, అప్పటికే మైసూరులో కేంద్ర ప్రభుత్వాధీనంలో ఒక భాషాసంస్థ వుంది కాబట్టి. ప్రారంభోత్సవం కన్నడ తెలుగు రెండింటికి చేయాలని తలపెట్టినా కొన్ని స్వార్థశక్తుల ప్రమేయంతో తెలుగు కేంద్రాన్ని హైదరాబాదులో నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రారంభోత్సవంలో తెలుగును తొలగించారు. దీని వెనుక కొందరు ఎం.పిలు మరికొందరు రాజకీయ నాయకులు వున్నారు. ఆ సందర్భంలో కేంద్రమంత్రి గారిని ‘తెలుగు కెప్పుడు?’ అని ప్రశ్నిస్తే ఆమె ‘తెలుగుకు కూడా త్వరలోనే ప్రారంభోత్సవం వుంటుంది’ అన్నారు. ఈ లోపల కరుణానిధి గారి ప్రోద్బలంతోను, ఒత్తిడితోను తమిళ సంస్థను చెన్నైకి మార్చటం జరిగింది. మైసూరులో వున్న 3,4 సంవత్సరాలు బాగా నిర్వహింపబడిన తమిళ సంస్థ రాజకీయాలలో చిక్కుకొని చెన్నైకి పోయిన తర్వాత నిర్వీర్యమై కార్యక్రమాలు సరిగా జరగటం లేదు. అది చెన్నైకి మారినా 2,3 సంవత్సరాలు బిల్లులు ఆమోదించటం సంస్థకు చెందిన త్రైమాసపత్రిక ప్రచురణ మొదలైనవన్నీ మైసూరు నుంచే జరిగాయి. ఇవి రాష్టప్రభుత్వం ద్వారా చేయటానికి వీలు లేదు కనుక.
కన్నడ సంస్థ (Centre for Excellence for the study of classical Kannada) కు సంబంధించి మైసూరులో ఏమీ జరగటం లేదు, కాబట్టి బెంగుళూరుకు మార్చామని, బెంగుళూరు విశ్వవిద్యాయలంలో చోటు ఇస్తామని కన్నడ, సంస్కృతి శాఖామంత్రి (Minister for Kannada and Culture)కేంద్ర మానవవనరుల సెక్రటరీకి జాబు పంపిన తర్వాత ఇక్కడా ప్రాంతీయ నాయకుల ఒత్తిడితో మైసూరులోనే ఆ సంస్థకోసం కొన్ని నియామకాలు జరిగాయి. ఒక సంచాలకుడు (డైరెక్టరు), ఒక కార్యాలయాధికారి (ఆఫీసు సూపరింటెండెంటు), ఒక అకౌంటెంటు, ఒక యూడీసీ, ఒక ఎల్డీసీ, అటెండరు లాంటి పోస్టులకు నేను చైర్మన్గా వున్న ఇంటర్వ్యూలో సెలెక్షన్లు జరిగి నియామకాలు జరిగాయి. ఆ తర్వాత మరికొన్ని చిన్నస్థాయి ఉద్యోగులను నా మీద నియమించారు. ఉద్ధృతంగా కాకపోయినా కొంతవరకు కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి.
తెలుగుకోసం ఏం జరుగుతున్నది?
తెలుగు విషయానికి వస్తే ఏమీ జరగటం లేదు కాబట్టి నేను, ఆర్వీయస్ సందరం గారు, మరికొందరు కలిసి కన్నడం వాళ్ళతో కలిగిన ప్రేరణతో ఏదో ఒకటి చేయాలని మూడుసార్లు సమావేశమై ప్రాచీనభాషపై ఒక 3 వారాల కోర్సు నిర్వహించటానికి నిర్ణయించి ద్రావిడ విశ్వవిద్యాలయ సహకారంతో పోయిన డిసెంబరు -జనవరి నెలల్లో విశ్వవిద్యాలయ కళాశాలల పాఠశాలల అధ్యాపకులకు ఒక ప్రత్యేక కోర్సు నిర్వహించాము. అందులో 80 మంది పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి దానికి మంచి స్పందన లభించింది. ఇటువంటివి మరికొన్ని కోర్సులు చేయాలనుకొన్నా పరిస్థితులు అనుకూలించక చేయలేకపోయాం. ఆర్వీయస్ సుందరంగారు, మరొక పెన్సిల్వీనియా ఆచార్యులు కలిసి ‘ఆంధ్రశబ్దం చింతామణి’ గ్రంథాన్ని ఆంగ్లంలోనికి అనువదించారు. దాన్ని ప్రాచీన తెలుగు భాషా విభాగపు పైకంతోనే ......సంస్థ ప్రచురించింది. మరి కొన్ని గ్రంథాలు మరికొందరికి కేటాయించడి అనువాద కార్యక్రమం జరుగుతూనే వుంది ప్రస్తుతం.
ఈ లోపల స్వార్థ ప్రయోజనాలు కలిగిన కొందరు వ్యక్తులు ప్రాచీనభాషా విషయంలో వాళ్ళింతవరకు ఏమీ చేయకపోయినా దీన్ని గురించి వాళ్ళకేమీ తెలియకపోయినా సంస్థను ఆంధ్రకు తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుపుతూ వున్నారు. అడపాదడపా ఈ విషయం మీద పత్రికలలో వ్యాసాలు వార్తలు పడుతూనే వున్నాయి. ఈ విషయంలో నేను ‘ప్రాచీన భాషగా తెలుగుకు గుర్తింపు వచ్చిన తర్వాత చేయవలసిన దేమిటి?’ అనే శీర్షికతో 2008 నడుస్తున్నచరిత్రలో సవివరంగా ఒక వ్యాసం ప్రచురించాను. దానిలో ఇచ్చిన వాటికి మరికొన్ని చేర్చవలసి వున్నది. అందులో సూచించినవి అన్నీ కాకపోయినా వాటిలోని చాలా విషయాలు అవసరమైన కార్యక్రమాలే.
అసలు ప్రాచీనభాషకు సాహిత్య అకాడమీ వారు నిర్దేశించిన అర్హతలు కార్యక్రమాలు ఏమిటి అనేది ఇప్పుడు ఆ విషయం మీద మాట్లాడుతున్న చాలామందికి తెలియదు. అది ఈనాటి తెలుగు అభివృద్ధి కోసం గాని, పాఠ్యగ్రంథాల ఆధునీకరణ కోసం గాని మరేదైనా విషయం కోసం గాని కాదు. ఈనాడు కాలక్రమేణా మరుగుపడిన, పడిపోతున్న తెలుగు భాషా సాహిత్యాలను భావితరాల వారి కోసం పరిరక్షించుకోవటం ఇందులోని ముఖ్యోద్దేశం.అందుకే భాషాశాస్త్రజ్ఞుల కమిటీవారు పరిరక్షణకు (to preserve) పరిపోషణకు (to promote) ప్రవర్థనానికి (to propagate) అవి సూచించారు. అంటే శాసనాకాలం నుంచి కొన్ని వందల యేండ్ల సంవత్సరాలు వర్థిల్లి ప్రస్తుతం మరుగున పడుతున్న మన భాషను పరిరక్షించుకొని, వృద్ధి చేసి ప్రచారం లోనికి తీసుకురావటమన్నమాట.
కానీ, ఎవరో నూరు కోట్లిస్తామన్నారనే గాలివార్తను పట్టుకొని దాని కోసం ప్రాకులాడటం జరుగుతున్నదిప్పుడు. ఆ మాట అధికారికంగా ఎవరూ అనలేదు. పరిశోధనలు జరుపుకోవటానికి కావలసిన ధనం మాత్రం ప్రతియేడు కేటాయించబడుతుంది. 2011 నుంచి ఇస్తూనే వున్నా తెలుగు కన్నడాలకు ఆ ధనం ఉపయోగింపబడలేదు-కొన్ని అనివార్య కారణాల వల్ల. నూరుకోట్లు ఒక్కసారిగా లాటరీ తగిలినట్లు వస్తుందనేమో తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రాచీనతెలుగులో ఎం.ఏ.అని ఒక కోర్సును కూడా ప్రతిపాదించటమే కాక విశ్వవిద్యాలయాన్ని యు.జి.సి. నుంచి తొలగించి కొంతకాలం సాంస్కృతిక శాఖ క్రింద చేర్చారు. కేందప్రభుత్వం ప్రాచీన భాషల గుర్తింపు సాంస్కృతిక శాఖ ద్వారా ప్రకటించబడింది కాబట్టి. అంటే ఇది కేవలం నూరు కోట్ల రూపాయల మహత్మ్యం అని తేటతెల్లమవుతున్నది. ఇలాగా ప్రాచీన తెలుగు భాషాధ్యయన ప్రాశస్త్య కేంద్రం వస్తే ఏదేదో జరుగుతుందని అనుకోవటం ఊహాలోకంలో విహరించటమే.
అసలు విషయానికొస్తే రాబోయే సంస్థ నిర్మాణం ఇలా వుంటుంది. ఒక సంచాలకుడు (Director) 62 యేండ్ల వయసు దాటి వుండకూడదు. కానీ దరకాస్తుదారులు దొరకక ప్రభుత్వం కన్నడ భాషా విషయంలో 62ను 65 గా మార్చింది. ఇది తెలుగుకు కూడా వర్తించగలదు. అంటే డైరెక్టరు పోస్టుకు 65 యేండ్లు నిండినవారు అర్హులు కారు. డైరెక్టరుకిచ్చే పారితోషికం నెలకు 70 వేల రూపాయలు. అలాగా ఈ నియమాలలోన ఒక ఆఫీసు ముఖ్యాధికారి(ఆఫీసు సూపరింటెండెంట్) ఒక అకౌంటెంటు వుంటారు. వీళ్లు కాక ఒక అప్పర్ డివిజన్ క్లర్కు ఒక లోయరు డివిజన్ క్లర్కు, ఒకరిద్దరు అటెండర్లు వుంటారు. ఈ పోస్టులన్నీ కూడా తాత్కాలికమైనవే. ఇందులో ఏదీ శాశ్వత నియామకం కాదు. దీనికొక ప్రాజెక్టు మానిటరింగ్ బోర్డు (Project Monitoring Board) వుంటుంది. దానికి ఛైర్మను కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి, కొందరు అధికారిక, అనధికారిక సభ్యులుంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో సంస్థ నడుస్తుంది. ప్రాజెక్టులను కార్యక్రమాలను ఈ బోర్డు ప్రతిపాదిస్తుంది. వాటిని సమర్థులు, అర్హులు అయిన పండితులకు, అధ్యాపకులకు ఇచ్చి వాళ్ళకు పారితోషికాలను నిర్ణయించి కేటాయిస్తారు. ఇవి కాలపరిమితి కలిగిన ప్రాజెక్టులు.
ప్రస్తుతం కొందరు భావిస్తున్నట్లు, కోరుతున్నట్లు ఈ సంస్థ కేందప్రభుత్వ అ•మాయిషీ నుంచి తొలగి రాష్ట్ర ప్రభుత్వపు చేతిలోకి వస్తే అది రాజకీయాలు పుట్టగా తయారై ఎన్నో ఉన్నతాశయాలతో నెలకొల్పబడిన తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం లాగా నిర్వీర్యమై నిరాదరణకు గురై పతనం అయిపోవచ్చు.
కొత్త వార్తల ప్రకారం మునుపటి కేంద్రవనరుల మంత్రి స్మృతి ఇరానీ గారు ఈ సంస్థను ఆంధ్రలో నెలకొల్పటానికి అంగీకరించారని, దానికి ముఖ్యమంత్రిగారు 1000 గజాల స్థలం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇవ్వటానికి అంగీకరించారని వినికిడి. ఒకవేళ ముందటి మంత్రి అటువంటి నిర్ణయం తీసుకొని వుంటే అది అనాలోచితంగా వాస్తవ పరిస్థితులను బేరీజు వేయకుండా తీసుకున్న నిర్ణయమే అవుతుంది. ప్రతి చిన్న విషయానికి రెండు తెలుగు రాష్ట్రాలు కీచులాడుకుంటున్న పరిస్థితులలో ఇది జరుగదు. జరుగవలసిన పనులు జరుగవలసిన రీతిలో జరుగక రాజకీయాలు స్వైరవిహారం చేస్తున్నాయి. కార్యక్రమాలు జరుగక సంస్థ దురపయోగమౌతుంది.
ఈమధ్య కేందప్రభుత్వం ప్రాచీన భాషలకు సంబంధించి కొన్ని పురస్కారాలను ప్రకటించి, దానికి జులై 16వ తేదీలోపల రికమెండేషన్లు పంపమని రాష్టప్రభుత్వానికి లేఖ వచ్చింది. ఆ పురస్కారాలకు వ్యక్తులు అప్లై చేసుకోకూడదట. ప్రభుత్వంగాని, సంస్థలు గాని రికమెండ్ చేయాలట. మరి ఎవరు ఈ రంగంలో పనిచేశారో చేస్తున్నారో రాష్టప్రభుత్వంలోని ఎవరికెరుక? కాబట్టి అది ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలలాగా అనామకులకు, అసమర్థులకు రాజకీయ పైరవీల పాలుకావటం మాత్రం ఖాయం. చివరితేదీ దాటిపోయింది కనుక ఇటువంటి పరిస్థితులలో నెలకొల్పబోయే ప్రాచీన తెలుగు భాషా ప్రాశస్త్య కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వుంటే అది ఇంకొక తెలుగు విశ్వవిద్యాలయం లాంటిది కావటం తథ్యం.
అంతేగాక ఈ కేంద్రాన్ని నాగార్జున విశ్వవిద్యాలయంలో నెలకొల్పితే తెలంగాణవాళ్ళు ఒప్పుకుంటారా? ఒక రాష్ట్రంగా వున్నప్పటి విషయం వేరు. ఇప్పుడు దీని విషయంలో తగాదాలు తప్పకండా వస్తాయి.ఒక భాషపు ఒకే రకపు కార్యకలాపాలకు రెండు సంస్థలుండలేవు. పోనీ రెండు ప్రాంగణాలుగా చేస్తే మరి వాటి నిర్వహణ కేందప్రభుత్వం నుంచి తొలగితే ఎవరు నిర్వహిస్తారు? ఇవన్నీ మునుముందు ఎదుర్కోబోయే సమస్యలు. ఇవి స్మృతి ఇరానీ గారు గానీ మరొకరు గానీ కేంద్రంలో ఊహించని సమస్యలు.
కనుక కేందప్రభుత్వం ముందు తలచినట్లే ఈ సంస్థను అన్ని హంగులతోను, భవనాలతోను, ప్రయోగశాలలతోను, స్టూడియోలలోను, ఆధునిక ముద్రణాలయంతోను, సమగ్రమైన గ్రంథాలయంతోను వున్న కేంద్ర భారతీయ భాషా సంస్థ(సిఐఐసి)లోనే నెలకొల్పి 2,3 సంవత్సరాల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వేరే చోటుకి అవసరమైతే మార్చటం సమంజసం.
ఏ సంస్థ అయినా ఎక్కడ వుంది అనేది ముఖ్యం కాదు. అది ఎందుకు నెలకొల్పబడిందో ఆ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది ముఖ్యం కాదు. ప్రాచీనభాషా కేంద్రాన్ని అక్కడ వుండకూడదు ఇక్కడే వుండాలి అనేటటువంటి వాటిలో ముఖ్యంగా కనిపించేవి స్వార్థరాజకీయాలే. దానితో కోట్ల రూపాయలు వస్తాయనే అపోహ కూడా.
అదే మైసూరులోని భాషా సంస్థలో 46 సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాలలోని తెలుగురాని ఉపాధ్యాయులకు తెలుగు నేర్పబడుతున్నది. అందులో చేరే విద్యార్థులు తెలుగంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు కొందరైతే, అది ఎక్కడ మాట్లాడబడుతుందో కూడా తెలియని వాళ్ళు కూడా వుంటారు.నిజానికి ఇది తెలుగు రాష్ట్రంలో వుంటే విద్యార్థులు తెలుగును అవలీలగా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోగలుగుతారు. కానీ ఇంతవరకు ఎవరుగాని, తెలుగురాష్ట్ర ప్రభుత్వం గాని దాన్ని ఆంధ్రలోనో హైదరాబాదులోనో పెట్టమని అడగలేదు. అది నిజంగా అవసరమైనా, దాని వెనుక 100 కోట్ల రూపాయలున్నాయనే వదంతి లేదు కనుక