విదేశీ వస్త్రబహిష్కరణ ఉద్యమంలోపాల్గొన్న వీరవనిత, బహు భాషా కోవిదురాలు"బారు అలివేలమ్మ’’ గారి వర్థంతి సందర్భంగా
#మనదేశం రత్నగర్భ. ప్రపంచానికి జ్ఞానభిక్షనుపెట్టింది. కానీ మన సమైక్యతను దెబ్బతీసేలా పాశ్చాత్యులు మనదేశాన్ని దోచుకున్నారు. వారు మనకు మేకులై, పాలకులై మనలను బానిసలుగా చేసి అనేక కష్టనష్టాలపాలు చేశారు. ఆ క్రమంలో మనదేశాన్ని మనమే ఏలుకోవాలి అనే భావన భారతీయులందరికీ కలిగింది. ఆసమయంలోనే అనేక మంది నాయకుల నేతృత్వంలో భారత స్వాతంత్య్రానికై అనేక పోరాటాలు జరిగాయి.
ఆ క్రమంలో పురుషులతో పాటు మహిళలూ ధైర్య స్థైర్యాలతో పోరాటం జరిపారు బ్రిటీష్ పరిపాలనాకాలంలో పురుషులతోపాటు మహిళలు కూడా స్వాతంత్ర్యపోరాటంలో తమవంతు కృషిని అందజేశారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను చేపడతూ... స్వాతంత్ర్యంపట్ల ఇతరుల్లో చైతన్యం కల్పించిన ఎందరో మహిళా ప్రతిభావంతులు వున్నారు. అలాగే ఆనాటి బ్రిటీష్ వారి విదేశీ సంస్కృతీ-సంప్రదాయాలను పూర్తిగా వ్యతిరేకించి, వాటిని శాశ్వతంగా బహిష్కారలంటూ ఎందరో ఉద్యమాలు చేపట్టారు. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు, దురాచారాలను అరికట్టే దిశగా అడుగులువేస్తూ.. సాటి మహిళలకు నిదర్శనంగా నిలిచిన వీరవనితలు చాలామందే వున్నారు. అటువంటివారిలో ‘‘బారు అలివేలమ్మ’’ కూడా ఒకరు! స్వాతంత్ర్యోద్యమంలో ఈమె పాత్ర ఎంతో కీలకమైనది.
#వ్యక్తిగత జీవితం :
1897 సెప్టెంబర్ నెలలో కాకినాడలో నివాసమున్న పత్రి కృష్ణారావు, వెంకుబాయమ్మ దంపతులకు అలివేలమ్మ జన్మించారు. ఆనాడు మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత అంతగా లేకపోవడం వల్ల ఈమె విద్యాభ్యాసం అంతంతమాత్రమే సాగింది. తక్కువ వయస్సులోనే పెళ్లి కూడా జరిగిపోయింది. ఈమె వివాహం ‘బారు రాజారావు’ అనే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడితో జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శిగా ఆయన సమర్థవంతంగా పనిచేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో వెంకట గోవిందరావు అనే కుమారుడు కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తియే. దాదాపు వీరి కుటుంబసభ్యులందరూ స్వాతంత్ర్యసమరంలో తమవంతు పాత్రపోషించినవారే వున్నారు.
#స్వాతంత్ర్యోద్యమంలో అలివేలమ్మ పాత్ర :
స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే ఈమె మహిళల చైతన్యంకోసం ఎన్నో ఉద్యమాలు, కార్యక్రమాలను చేపట్టింది. ఈమె కమలా నెహ్రూతో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అలాగే రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొందిన ఈమె... మహిళలందరిని అక్షరాస్యులుగా మార్చేందుకు ఎంతగానో కృషి చేశారు. అయితే విదేశీ వస్త్రబహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకుగాను ఈమెకు బ్రిటీష్ ప్రభుత్వం కఠిన కారాగారశిక్షను విధించింది. ఇలా ఈవిధంగా ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూనే దేశంకోసం ఈమె తన చాతుర్యాన్ని చాటిచెప్పింది. 1973 నవంబర్ 13 తేదీన ఈమె తుదిశ్వాస విడిచింది.
#అలివేలమ్మ సంస్మరణ :
స్వాతంత్రోద్యమంలో, మహిళల చైతన్యంపట్ల ఈమె చూపించిన చొరవను గుర్తించిన ప్రభుత్వం... ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు. విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్ర సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన కృషి వంటివి సవివరంగా చెక్కించారు.
2002 ఫిబ్రవరి 3న ఆమె వారసుల సౌజన్యంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి సబ్ కలెక్టర్ వి.శేషాద్రి ఆవిష్కరించారు.బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశిన అలివేలమ్మ జీవితం నేటి సమాజంకు స్పూర్తిదాయకం.