భారత్లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా? గీతా పాండే
30 ఏళ్ల క్రితం ప్రాణాంతక హెచ్ఐవీ తమ దేశంలోనూ వ్యాపిస్తోందని భారత్ గుర్తించింది. ఆరుగురి రక్త నమూనాలను పరీక్షించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చింది.
అయితే, ఈ పరీక్షల వెనుక ఒక మహిళా శాస్త్రవేత్త ఉన్నారు. ఆమె గురించి నేటికీ పెద్దగా ఎవరికీ తెలియదు.
అది 1985 చివరి సమయం. 32 ఏళ్ల మైక్రోబయాలజిస్టు నిర్మల సెలప్పన్.. చెన్నై మెడికల్ కాలేజీలో పరిశోధన చేపట్టేందుకు ఒక అంశం కోసం చూస్తున్నారు.
అప్పుడే తన మెంటర్, ప్రొఫెసర్ సునిధి సోలోమన్ ఒక ఐడియా ఇచ్చారు. 1982లోనే అమెరికాలో హెచ్ఐవీ కేసులను ట్రాక్ చేయడం మొదలైంది.
అయితే, భారత్లో అధికారులు మాత్రం ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఇక్కడికి రాలేదని భావించేవారు.
అప్పట్లో హెచ్ఐవీ ఇక్కడ కూడా వ్యాపిస్తోందనే ఆలోచన కూడా ఎవరూ ఊహించుకోలేదని నిర్మల గుర్తుచేసుకున్నారు.
మరోవైపు మీడియాలో కూడా హెచ్ఐవీని పశ్చిమ దేశాల వ్యాధిగా చెప్పేవారు. అక్కడ ఫ్రీ సెక్స్, హోమోసెక్సువాలిటీయే దీనికి కారణమని వివరించేవారు.
భారత్లో ప్రజలు మాత్రం స్వలింగ సంపర్కానికి దూరంగా, దేవుడిపై భయం, దయతో జీవించేవారని చెప్పేవారు.
ప్రపంచ ఎయిడ్స్ దినం: ముద్దులు, కౌగిలింతలు, తల్లిపాల ద్వారా హెచ్ఐవీ సోకుతుందా?
ముంబయిలో నెగిటివ్...
మరోవైపు ఈ వ్యాధి భారత్కు వచ్చేలోపే అమెరికన్లు దానికి చికిత్స కూడా కనుక్కొంటారని కొన్ని పరిశోధన పత్రాలు కూడా ప్రగల్భాలు పలికేవి.
చెన్నై నగరంతోపాటు తమిళనాడులోని ప్రాంతాలను అప్పట్లో పూర్తి సంప్రదాయ, కట్టుబాట్లను అనుసరించే ప్రాంతాలుగా భావించేవారు.
అయితే, వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబయిలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. ఇక్కడి నుంచి వందల శాంపిల్స్ను పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పరీక్షల కోసం పంపించేవారు.
అయితే, వాటిలో పాజిటివ్ ఫలితాలు కనిపించేవి కాదు.
అందుకే నిర్మల కూడా రోగులకు హెచ్ఐవీ పరీక్షలు చేయాలనే ఆలోచన పక్కన పెట్టేయాలని అనుకున్నారు.
‘‘ఆ పరీక్షల ఫలితాలు నెగెటివ్గా వస్తాయని డాక్టర్ సోలోమన్కు నేను చెప్పాను’’అని నిర్మల వివరించారు.
కానీ, ఎలాగైనా ఆ అనుమానిత రోగులకు పరీక్షలు నిర్వహించేలా నిర్మలను సోలోమన్ ఒప్పించారు.
ముప్పు ఎక్కువగా ఉండే సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ఆఫ్రికా విద్యార్థులు లాంటి 200 మంది నుంచి రక్త నమూనాలను సేకరించాలని నిర్మల భావించారు. అయితే, ఇదేమీ అంత తేలిక కాదు.
ఇదివరకు కుక్కలు, ఎలుకల నుంచి వ్యాపించే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లెప్టోస్పిరోసిస్పై నిర్మల పనిచేశారు. ఆమెకు హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ గురించి పెద్దగా ఏమీ తెలియదు.
వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?
ఎక్కడ ఉంటారో తెలియదు..
మరోవైపు అసలు ముప్పుండే వారు ఎక్కడ జీవిస్తారో నిర్మలకు సరిగా తెలియదు కూడా. ముంబయి, దిల్లీ, కోల్కత్తా లాంటి నగరాల్లో రెడ్లైట్ ఏరియాలు ఉండేవి. కానీ, చెన్నైలో అలాంటి నిర్దేశిత ప్రాంతాలు ఉండేవి కాదు.
దీంతో సుఖ వ్యాధుల కేసులు ఎక్కువగా వచ్చే ముంబయి జనరల్ హాస్పిటల్కు మొదట వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.
‘‘అక్కడ కొంతమంది సెక్స్ వర్కర్లతో పరిచయం పెంచుకున్నాను. వారే మరికొంత మంది సెక్స్వర్కర్లను పరిచయం చేశారు. వారి పత్రాలను పరిశీలించినప్పుడు ‘‘వీ హోమ్’’అనే పేరు రాసి ఉంది. దీనికి అర్థమేంటి అని అడిగినప్పుడు విజిలెన్స్ హోమ్ అని చెప్పారు. అక్కడే సెక్స్ వర్కర్లు, అనాథలు ఉండేవారు’’అని నిర్మల చెప్పారు.
సెక్స్ వర్క్ భారత్లో నేరం. ఈ మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు కూడా తరలించొచ్చు. వీరి దగ్గర బెయిలుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు.
ఎయిడ్స్ డే: పాకిస్తాన్లో వందల మంది చిన్నారులకు హెచ్.ఐ.వీ ఎలా సోకింది...
మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
రోజూ రిమాండ్ హోమ్కు
రోజూ ఉదయం ఉద్యోగానికి వెళ్లేముందు సెక్స్ వర్కర్ల రిమాండ్ హోమ్కు నిర్మల వెళ్లేవారు.
నిర్మల ఒక మారుమూల గ్రామంలోని ఒక సంప్రదాయ కుటుంబంలో పెరిగారు. ఆమెకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
‘‘నేను తమిళ్లో మాట్లాడేదాన్ని. ప్రశాంతంగా జీవించడానికే మొగ్గు చూపేదాన్ని’’అని ఆమె చెప్పారు.
కానీ, ఆమె భర్త వీరప్పన్ రామమూర్తి ఆమెను ప్రోత్సహించేవారు. ప్రతి అడుగులోనూ ఆమెకు తోడుగా ఉండేవారు. కొన్నిసార్లు ఆ రిమాండ్ హోమ్కు ఆయనే ఆమెను స్కూటర్పై తీసుకొచ్చేవారు. వీరిద్దరూ కెరియర్ ప్రారంభంలో ఉండేవారు.
బస్సు ఖర్చు తగ్గించుకునేందుకు, డబ్బులు ఆదా చేసుకునేందుకు వీరు కలిసి వెళ్లేవారు.
మూడు నెలల్లో ఆమె మొత్తంగా 80కిపైగా శాంపిల్స్ సేకరించారు. ఆమెకు గ్లవ్స్ ఉండేవి కాదు. భద్రతా పరమైన పరికరాలేమీ ఆమె దగ్గర ఉండేవి కాదు.
మరోవైపు అటు సెక్స్ వర్కర్లకు కూడా వారి దగ్గర నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు.
‘‘నేను ఎయిడ్స్ కోసం శాంపిల్స్ తీసుకుంటున్నానని వారికి చెప్పలేదు’’అని ఆమె వివరించారు. ‘‘వారు పెద్దగా చదువుకోనివారు. నేను ఒకవేళ చెప్పినా వారికి ఎయిడ్స్ అంటే ఏమిటో అర్థం కావడం కష్టం. ఏదో ఇన్ఫెక్షన్ కోసం నేను శాంపిల్స్ తీసుకుంటున్నానని వారు భావించేవారు’’అని ఆమె వివరించారు.
మరోవైపు సోలోమన్.. గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సా నిపుణురాలు. భర్త నుంచి డబ్బులు తీసుకొని ఒక చిన్న ల్యాబ్ను ఆమె ఏర్పాటుచేసుకున్నారు. ఇక్కడే సోలోమన్, నిర్మల కలిసి ప్రాథమిక పరీక్షలు చేపట్టేవారు.
అయితే, ఇక్కడ స్టోరేజీ సదుపాయం లేదు. దీంతో ఇంట్లోనే రిఫ్రిజిరేటర్లో ఆమె శాంపిల్స్ పెట్టేవారు.
చెన్నైలో అప్పటికి ఎలీసా టెస్టు చేసే సదుపాయం లేదు. దీంతో చెన్నైకి 200 కి.మీ. దూరంలోని వేలూర్ క్రిస్ట్రియన్ మెడికల్ కాలేజీలో హెచ్ఐవీ పరీక్షల కోసం ఈ నమూనాలను పంపించేవారు.
‘‘అది 1986 ఫిబ్రవరి నెల. నేను, నా భర్త శాంపిల్స్ను ఐస్ బాక్సులో పెట్టుకొని ట్రైన్ ఎక్కాం. స్టేషన్లో దిగి మెడికల్ కాలేజీకి వెళ్లడానికి ఆటో ఎక్కాం’’అని నిర్మల వివరించారు.
నిర్మల, ఆమె భర్తకు సాయం చేయాలని అసిస్టెంట్లు పి.జార్జ్ బాబు, ఎరిక్ సిమోస్లకు వైరాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జాకబ్ టీ జాన్ సూచించారు.
హెచ్ఐవీ బాధితుల కోసం ప్రపంచంలోనే తొలి స్పెర్మ్ బ్యాంకు
ఏం జరిగింది?
‘‘ఉదయం 8.30కు పరీక్షలు మొదలయ్యాయి. మధ్యాహ్నం పవర్ కట్ అయ్యింది. దీంతో మేం టీ తాగడానికి విరామం తీసుకున్నాం. మళ్లీ వచ్చిన తర్వాత, ల్యాబ్లో మళ్లీ నేను, డాక్టర్ జార్జ్ బాబు పని మొదలుపెట్టాం’’అని నిర్మల వివరించారు.
‘‘కొన్ని శాంపిల్స్ మూతలను డాక్టర్ జార్జ్ బాబు తెరిచి కొద్దిసేపటికే మళ్లీ మూసేశారు. వాటిని ముట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. అప్పుడే చూశాను.. ఆ శాంపిల్స్ పసుపు రంగులోకి మారాయి. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు’’అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఒక నిమిషం తర్వాత సైమోస్ కూడా వచ్చారు. ఆయన కూడా ఫలితాలు చూశారు. ‘‘ఇవి పాజిటివ్ ఫలితాలు’’అని ఆయన చెప్పారు. వెంటనే జాన్కు సమాచారం అందించారు. ఆయన కూడా అక్కడకు వచ్చారు. అందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.
‘‘అసలు ఈ శాంపిల్స్ ఎక్కడ సేకరించారు’’అని నిర్మలను జాన్ అడిగారు.
చెన్నైకు పయనం అయ్యే ముందే, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నిర్మల ఆమె భర్త మాట్లాడుకున్నారు.
‘‘ఇది చాలా సున్నితమైన అంశం. వారి వివరాలను బయటకు చెప్పకూడదని భావించాం’’అని రామమూర్తి చెప్పారు.
చెన్నై వెళ్లిన వెంటనే, సోలోమన్కు ఆ విషయాన్ని నిర్మల వెల్లడించారు.
ఈ 38 మందికి హెచ్ఐవీ ఎలా సోకింది?
హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు
మరోసారి శాంపిల్స్
విజిలెన్స్ హోమ్కు సోలోమన్, బాబు, సైమోస్లతో కలిసి నిర్మల వచ్చారు. ఆ ఆరుగురు మహిళల శాంపిల్స్ మరోసారి సేకరించారు.
ఆ శాంపిల్స్ తీసుకొని సైమోస్ అమెరికా వెళ్లారు. అక్కడ వెస్టెర్న్ బ్లాట్ టెస్టు నిర్వహించారు. దీంతో భారత్లో కూడా హెచ్ఐవీ వ్యాపిస్తోందని రుజువైంది.
వెంటనే ఈ వార్తను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్కు తెలియజేశారు. ఆ వెంటనే అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ, రాష్ట్ర ఆరోగ్య మంత్రి హెచ్వీ హండేలకు సమాచారం అందించారు.
ఆ ఏడాది మే నెలలో అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో హెచ్ఐవీ వ్యాపిస్తోందని హండే ప్రకటించారు. అప్పుడు నిర్మల, సోలోమన్ అక్కడే విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు.
మొదట్లో ప్రజలు ఈ వార్తను నమ్మలేదు. కొంతమంది ఆ టెస్టుల ఫలితాలను తప్పుపట్టారు. మరికొంతమంది మాత్రం వైద్యులు తప్పు చేసుండొచ్చని వ్యాఖ్యానించారు.
మరోవైపు మహారాష్ట్ర నుంచి రావడం వల్లే రాష్ట్రంలో సోలోమన్ ఇలాంటి వార్తలు వ్యాపింపజేస్తున్నారని కూడా కొంత మంది విమర్శించారు.
ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
ప్రజల్లో కోపం
‘‘ప్రజలు చాలా కోపంతో ఉండేవారు. ఉత్తర భారత దేశానికి చెందిన ఒక మహిళ మనం చెడ్డవారిమని చెబుతోందని వ్యాఖ్యానించారు. నాతోపాటు అందరూ షాక్కు గురయ్యాం’’అని సోలోమన్ కుమారుడు సునిల్ సోలోమన్ చెప్పారు.
అయితే, వెంటనే అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యాయి.
‘‘మేం ఐసీఎంఆర్ డైరెక్టర్తో మాట్లాడాం. బయట పడినవి చాలా కొద్దికేసులు మాత్రమే, ఇలాంటివి చాలా ఉండొచ్చని ఆయన అన్నారు’’అని నిర్మల చెప్పారు.
వెంటనే భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడాన్ని అధికారులు మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్ద సంవత్సరాలలో ఎయిడ్స్ ఒక మహమ్మారిగా మారింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ కేసులు విస్తరించాయి.
మొత్తంగా 52 లక్షల ఇన్ఫెక్షన్లతో భారత్ ప్రపంచంలోనే ఎయిడ్స్ కేసుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. అయితే, 2006 నాటికి ఈ కేసుల సంఖ్య సగానికి తగ్గింది.
అయితే, నేటికీ భారత్లో దాదాపు 20 లక్షల మంది ఎయిడ్స్తో జీవిస్తున్నారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ దీనికి చికిత్స అందుబాటులోకి రాలేదు.
ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
హెచ్ఐవీని జయించిన మొదటి మహిళ ఈమేనా..
ఆ తర్వాత మళ్లీ నిర్మల తన పరీక్షలపై దృష్టి పెట్టారు. తన అధ్యయనం పూర్తి కావడానికి మరో వంద శాంపిల్స్ ఆమె సేకరించాల్సి ఉంది.
ఆ తర్వాత కొన్ని వారాలు మరికొన్ని రిమాండ్ హోమ్స్కు ఆమె వెళ్లారు. స్వలింగ సంపర్కులను కూడా ఆమె కలిశారు.
1987 మార్చిలో ఆమె పరిశోధన పత్రాలను ‘‘సర్వైలెన్స్ ఫర్ ఎయిడ్స్ ఇన్ తమిళనాడు’’ పేరుతో సమర్పించారు. ఆ తర్వాత చెన్నైలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్ వ్యాక్సీన్ తయారీ విభాగంలో చేరారు. 2010లో ఆమె పదవీ విరమణ చేశారు.
మొదటి హెచ్ఐవీ కేసులను నిర్మల కొనుగొని 30 ఏళ్లకుపైనే గడిచాయి. అయితే, నేటికీ ఆమె పేరు చాలా మందికి తెలియదు.
తగిన గుర్తింపు దక్కలేదని ఎప్పుడైనా అనిపించిందా? అని అడిగినప్పుడు.. ‘‘నేనొక చిన్న గ్రామంలో జన్మించాను. అలాంటి విషయాలను మా ఊళ్లో ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదు. నేనూ అంతే. సమాజానికి ఏదైనా చేసే అవకాశం నాకు దొరికింది. అదే చాలు’’అని ఆమె అన్నారు.