Wednesday 11 May 2022

                             మల్లాది చన్ద్రశేఖరశాస్త్రిగారు

ప్రథమం ఆవలింతంచ - ద్వితీయం కళ్లు ముయ్యడం - తృతీయం త్రుళ్ళిపడటం - చతుర్థం చెంపదెబ్బచ - పంచమం పారిపోవడం - ఇదీ ఒకప్పటి పురాణ ప్రవచన లక్షణమట. ఈ మాటలు అప్పటి ప్రవచనాల తీరుపై ఎవరో సంధించిన వ్యంగ్యాస్త్రం. కానీ నిజానికి పురాణంలాగే పురాణ ప్రవచనకారులకు కూడా పంచలక్షణాలుండాలేమో అనిపిస్తుంది. అవి.. ఒకటి.. రామాయణ భారత పురాణాదుల మీద, వేదవేదాంగాల మీద, సంపూర్ణమైన సాధికారత కలిగినవారై ఉండాలి. రెండు.. పురాణసాహిత్యంలో పైకి అసంబద్ధంగా కనిపించే కొన్ని విషయాల అసలు రహస్యాలను ప్రామాణికంగా విశదీకరించగలిగిన ప్రజ్ఞాశాలురై ఉండాలి. మూడు.. లయబద్ధంగా సాగిపోయే శ్రావ్యమైన కంఠస్వరం ఉండుండాలి. నాలుగు.. సందర్భోచితమైన హాస్యచతురత కలిగినవారై ఉండాలి. అయిదు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాసనాబలం కలవారై ఉండాలి. ఇవీ ఆ అయిదు లక్షణాలు. వాల్మీకిమహర్షి నారదమహర్షిని పదహారు మహోన్నత లక్షణాలు కలిగిన నరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగినప్పుడు.. ఆ దేవర్షి.. అటువంటి వాడు ఉండటం దుర్లభమే కానీ.. ఒకే ఒక్కడు మాత్రం ఉన్నాడన్నాడు. అతడే మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు. అలానే మనం పైన చెప్పుకున్న అయిదు లక్షణాలూ కలిగిన ప్రవచనకర్త ఉండటం దుర్లభమే కానీ.. అటువంటి వారూ ఒక్కరున్నారు. ఆయనే పౌరాణిక సార్వభౌమునిగా పేరెన్నికగన్న మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు. “హరికథ, నాటకం, ఉపన్యాసం, పురాణం ఈ నాలుగూ కలిపి రంగరిస్తేనే నా ప్రవచనం” అన్నది స్వయంగా మల్లాది వారే చెప్పిన మాట.

మల్లాదివారు భాగవతం దశమస్కంధం చెబుతున్నప్పుడు బాలకృష్ణుడు ఆయనకు మనవడిగా మారిపోతుంటాడు. అదే మహాభారతం చెబుతున్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు జగదాచార్యుడిగా విరాడ్రూపంతో దర్శనమిస్తుంటాడు. ఇక శ్రీరామచంద్రమూర్తి ధర్మస్వరూప వైభవం గురించి చెబుతున్నప్పుడు, ఆ స్వామి శౌర్యపరాక్రమాలను, ప్రతిజ్ఞా పాలనను వివరించేటప్పుడూ ఆయన కంఠంలో ఉవ్వెత్తున ఎగసే ఆనందగంగ మన హృదయాల్ని ముంచెత్తుతుంటుంది. అంతటి మనోహర శైలిలో భగవంతుని లీలావిభూతులను వారు భక్తిపారవశ్యంతో చెబుతూంటే మానవుల సంగతి సరేసరి, దేవతలు కూడా మారురూపాలలో వచ్చి వినే ఉంటారనిపిస్తుంటుంది. అప్పట్లో మల్లాది వారి ప్రవచనం ఎక్కడ జరుగుతున్నా, అక్కడకు జనం తండోపతండాలుగా వచ్చేవారట. తినుబండారాల బళ్ళు, షోడా బళ్ళు, బూరలు, బుడగల బళ్ళతోనూ ఆ ప్రదేశమంతా తిరునాళ్ళ వాతావరణాన్ని తలపించేదట. చల్లపల్లి జమిందారు రామకృష్ణ ప్రసాద్, మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు, చిత్తూరు నాగయ్య, ఘంటశాల, ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, పి.వి.ఆర్.కె. ప్రసాద్ వంటి ఎందరో ప్రముఖుల దగ్గరనుండి పొలం పనులు చేసుకునేవారు, రిక్షాతొక్కుకునేవారు వరకూ అందరూ కూడా మల్లాదివారి అభిమానులే.
శాస్త్రిగారి ప్రవచనాలలో అనవసర ప్రసంగాలుండవు. ప్రతీ ప్రవచనంలోనూ చమక్కులు కావలసినన్ని ఉన్నా, ఏదీ కూడా విషయానికి ఆవలగా ఉండదు. పీఠాధిపతులు, అవధూతలు, మహాత్ముల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, అప్పటివరకూ ఆచార్యునిలా అనర్ఘళంగా మాట్లాడుతున్న ఆయన కంఠం ఒక్కసారిగా వినయంతో దోసిలి ఒగ్గి నిల్చున్న పదహారేళ్ళ కుర్రాడిదిలా మారిపోతుంటుంది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ప్రవచనం వినడానికి వస్తున్నారని తెలిసినప్పుడు శాస్త్రిగారు తాను పడ్డ కంగారు గురించి చెబుతుంటే.. మనం పకపకా నవ్వుకుంటాం. అటుపై విశ్వనాథవారు వారిని ఆశీర్వదించిన తీరుకు ముగ్థులవుతాం. అసలు చన్ద్రశేఖరశాస్త్రిగారి ప్రవచనాల వీడియోలు చూస్తున్నప్పుడు కలిగే ఆశ్చర్యం ఏమిటంటే.. ఎన్నిగంటలైనా ఆయన ముఖంలో చిరునవ్వు చెదరకపోవడం. అలసటన్న మాటే వారిని దరిజేరకపోవడం.
చన్ద్రశేఖరశాస్త్రిగారు నిజమైన అద్వైతి. విభూతిరేఖలు ధరించి పరమశివ స్వరూపంతో వెలిగిపోయే ఆయన చేసే ప్రవచనాలన్నీ విష్ణుపరమైనవే. అసలు శివకేశవులన్న భేదం వారికి లేనేలేదు. వాల్మీకి మహర్షి అగ్నిశర్మ అనే భృగువంశీయుడైన బ్రాహ్మణుడనీ, క్షామం వల్ల దొంగగా మారిన అతను సప్తర్షుల దయచేత మహర్షిగా మారాడనీ అంటారు. అత్రి మహర్షి నుండి పంచాక్షరీ మంత్రోపదేశం పొంది, తపస్సుతో పరమశివుని మెప్పించిన గొప్ప శివభక్తుడు వాల్మీకి అంటూ పురాణాంతర్గత విషయాలను సాక్ష్యాలుగా చూపిస్తారు. శివభక్తుడైన వాల్మీకిమహర్షి రామకథను రచించి చరితార్థుడైన తీరును మనకు సప్రామాణికంగా నిరూపిస్తారు. ఆయన పుక్కిట పురాణాలనూ, కాకమ్మ కథలనూ కొట్టి పారేసే తీరు కూడా చమత్కారభరితంగానే ఉంటుంది.
అలానే దుర్యోధనుడు తాను చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే తన మాతామహుడైన సుబలుడిపై కోపం వచ్చి, అతడినీ, అతడి కుమారులైన శకునీ మొదలైనవారిని బంధీలుగా చేశాడనీ, అందరికీ కలిపి రోజూ కొన్ని అన్నం మెతుకులు మాత్రమే వేసేవాడనీ, దానితో వారంతా చనిపోవడంతో, శకుని తన తండ్రి ఎముకలతో పాచికలు తయారు చేసుకుని, దుర్యోధనుణ్ణి నాశనం చేయడానికి ప్రతిన బూనాడనీ.. ఇలా చిలవలు పలవలుగా ప్రచారంలో ఉన్నవన్నీ అసంబద్ధ అసత్యపు కథలేనంటారు. నిజానికి ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సందర్భంలో ఈ సుబలుడు కూడా వచ్చాడు. నెలరోజుల పాటూ పాండవుల ఆతిథ్యం స్వీకరించాక స్వయంగా నకులుడే అతడిని గాంధారదేశం దాకా సాగనంపి మరీ వచ్చాడు. ఇదంతా భారతంలో స్పష్టంగా ఉండగా.. ఇలాంటి పెట్టుడు కథలకు విపరీతమైన ప్రచారం వస్తోందంటే కారణం సినిమాలే అంటూ ఆక్షేపిస్తారు. నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణానికీ కారకుడైనవాడు, దుర్యోధనుడి పతనానికి తానూ ఒక కారణమైనవాడూ అయిన కర్ణుడివంటి దురాత్ముడిని ఆదర్శవంతునిగా చూపించడంలో కూడా సినిమాలే ప్రధానపాత్ర పోషించాయంటారు.
ఇక సీతారాములు వనవాసానికి బయలుదేరే సమయానికి రామునికి 28, సీతకు 18 సంవత్సరాలంటూ అనేక ప్రమాణాలను ఉదహరిస్తూ నిరూపిస్తారు. రాముడు సేతువు కట్టింది కన్యాకుమారి దగ్గర కానీ, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా రామేశ్వరం దగ్గర కాదంటారు. ఇక సీతారాముల పర్ణశాల ఉన్న పంచవటి భద్రాచల ప్రాంతమేనన్న మన నమ్మకంలో ఏమాత్రం నిజం లేదంటారు. “మన్మాండు దిగి షిర్డీ వెళ్ళేదారిలో ఎడమవైపు ఒక కొండ కనబడుతుంది. అక్కడ అగస్త్యాశ్రమం ఉంది. అక్కడ నుండి కుడివైపు కొద్ది దూరంలో గోదావరీ తీరంలో పంచవటి ఉంది. అయిదు మర్రి చెట్ల మధ్యలో ఉన్న ప్రదేశమది.” అంటూ నిర్ధారణగా చెబుతారు. అలానే కిష్కింధ పంపా సరోవరతీరంలో ఉన్న ప్రాంతమట. అంటే ఇప్పటి శబరిమలకు దగ్గరలో ఉన్న ప్రదేశమన్న మాట. అలానే మహాభారతం విషయానికి వస్తే, మీరట్‌కు 50 మైళ్ళ దూరంలో ఉన్న గంగాతీరంలో హస్తినాపురం ఉండేదట. నేటి ఢిల్లీనే అప్పటి ఇంద్రప్రస్థమట. ద్రోణాచార్యుడు కురుపాండవుల అస్త్రవిద్యా పాఠవాన్ని పరీక్షించిన చోటు ఇప్పటి డెహ్రాడూన్ ప్రాంతమట.
ఇక ధర్మసందేహాల విషయానికి వస్తే.. ధర్మరాజు తనను తాను జూదంలో పందెంగా పెట్టి ఓడిపోయాక కూడా ద్రౌపదిని ఎలా పందెంగా పెట్టగలుగుతాడు అన్నది మనలో చాలామందికి కలిగే పెద్ద సందేహం. దానికి మల్లాదివారు సమాధానమిస్తూ.. ధర్మరాజు పందెం ఓడిపోవడం వల్ల దుర్యోధనాదులకు దాసుడయ్యాడు. వాళ్ళు నీ భార్యను పందెంగా పెట్టు అన్నారు. యజమాని చెప్పింది చెయ్యడం ధర్మం కనుక, దాసుడికి కూడా తన భార్య ఆస్తే కనుక.. ఆవిడను పందెంగా పెట్టక తప్పలేదు. అది ధర్మం ప్రకారం తప్పనిసరి పరిస్థితే తప్పితే, జూదం మత్తులో ఒళ్ళుమరచి చేసింది ఎంతమాత్రం కాదంటారు. తనను తాను పందెంగా పెట్టుకొనక ముందు అయితే ధర్మరాజు తన భార్యను పణంగా పెట్టడానికి అంగీకరించే అవకాశమే లేదంటారు. “యజమాని దాసుడిని ఆదేశించవచ్చు అనే ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, జూదంలో ఓడిపోయిన ధర్మరాజుతో బలవంతంగా అతని భార్యను పందెంగా పెట్టించారు. ఇది చెల్లదు” అన్న విదురుని మాటే దానికి తార్కాణమంటారు.
అలానే.. ద్రౌపది నిన్ను ఆరో భర్తగా స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు కర్ణుడితో అన్నాడన్న మాట పూర్తిగా అసంబద్ధమైనదంటారు. ఇది వ్యాఖ్యాతల బుద్ధికి తోచిన విషయమే కానీ, వ్యాస హృదయం కాదంటూ శాస్త్ర వాక్యాలను ఆధారంగా తీసుకుని నిరూపిస్తారు. ఇంకా పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని వచ్చాక, మళ్ళీ వారిని జూదానికి పిలిచి ఓడించవచ్చును కదా? అన్నది కూడా చాలామందికి ఉన్న ప్రశ్న. అసలు ధర్మరాజు జూదగాడన్న అపప్రథ కూడా ప్రచారంలో ఉంది. వీటన్నింటికీ సుస్పష్టంగా ఎవ్వరూ కాదనలేని విధంగా సమాధానాలను సప్రామాణికంగా చెబుతారు మల్లాది వారు. అలానే రామాయణం విషయానికి వస్తే.. వాలిని చంపడం ధర్మమేనా? రాముడికి రాజ్యాధికారం ఉందా? మొదలైన ఎన్నో ప్రశ్నలకు “నిజమే కదా!” అనిపించేలా నిర్దుష్టమైన సమాధానాలిస్తారు.
అమరావతి పట్టణ నివాసి అయిన డాక్టర్ గోళ్ళమూడి వరప్రసాద రావుగారి ఇంటిలో 1945 మార్చి నెలలో తొట్టతొలిగా భాస్కర రామాయణంతో తన ప్రవచన మహాయజ్ఞాన్ని ప్రారంభించిన మల్లాది చన్ద్రశేఖరశాస్త్రిగారు, ఆ తరువాత సుమారు అరవై సంవత్సరముల పాటూ తన వేలాది ప్రవచనాలతో భగవంతుని వాణిని తన వాణిగా దేశం నలుదిక్కులా వినిపించారు. మన అదృష్టవశాన ఇప్పటికీ వారి దివ్యవాణిని రోజూ వినగలుగుతున్నాం. పారమార్థిక సత్యాలను అవగతం చేసుకోగలుగుతున్నాం. మన ముందు తరాలలోనూ, మన తరంలోనూ ఎందరో ప్రవచనకారులు ఉన్నా.. ఎవరి విశిష్టత వారిదే అయినా.. మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారిని మాత్రం వేరెవ్వరితోనూ పోల్చలేం. నదులన్నీ పవిత్రమైనవే. కానీ గంగానది మహత్తు వేరు. అలానే చన్ద్రశేఖరశాస్త్రిగారిదీను.
మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారి ప్రవచనాల విశిష్టత గురించి చెప్పుకోవాలంటే, ముందుగా చెప్పేవాడికీ ఒక స్థాయి ఉండుండాలి. ఆ విషయంలో నేను బుడతడిని కనుక, వారి గురించి నాకు తోచిన నాలుగు మాటలూ ఇలా చిన్న వ్యాసంగా వ్రాస్తూ ఆనందిస్తున్నాను. ఇక చివరిగా.. జగద్గురు దత్తాత్రేయస్వాముల వారి ఉపాసకులైన ఆ మహాపురుషుని పాదపద్మములకు భక్తిప్రపత్తులతో నమస్కరించుకుంటూ స్వస్తి!

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...