Sunday 16 January 2022

 గొడుగు పాలుడు అనే భూమా నాయని కథ-

మనం విజయ నగర సామ్రాజ్య వైభవం గూర్చి చెప్పుకున్నపుడు ఎంత సేపూ రాయల విజయాలు, భువనవిజయ సాహిత్య విశేషాలు , రాయలు కట్టించిన ఆలయాలు , పరిపాలనా వైభవం వీటిని గూర్చి మనం ఎన్నెన్నో చెప్పుకుంటాము కదా!!

మరి రాయల ఆంతరంగికులు,సేవకులు ,రాయల విజయాలలో తోడ్పడిన వారు అందరినీ గూర్చి తెలియక పోయినా కొందరు గూర్చి మనకు తెలిసే ఉంటుంది. అలాంటివారిలో గొడుగు పాలుడు ఒకడు. ఈ గొడుగు పాలుని అసలు పేరు భూమా నాయుడు. ఈతడు గండికోట ప్రాంతంలో నుండి ఆనాడు తన రాజ భక్తిని ప్రదర్శించి విజయనగర సామ్రాజ్య రాజధాని హంపికి చేరుకుని అక్కడ సాక్షాత్ రాయల వారి అనుగ్రహం సంపాదించాడు.కేవలం అనుగ్రహమేనా చిరకీర్తినీ ఆర్జించాడు తన ఉన్నత మానసత్వముతో.
గొడుగు పాలుని ప్రత్యేకత ఏమిటీ అంటే మహా అశ్వాలను సైతం తట్టుకుని వాటితో పాటు పరుగు పెట్టే సామర్థ్యం కలిగినవాడు. రాయల వారు రాచ నగరులో విహారానికి వెళ్లినా, యుద్ధ క్షేత్ర సందర్శనకు వెళ్లినా,తిరుమల ఆలయాన్ని సందర్శించడం కోసం రాచ మహలు హంపి నుండి కదలి వచ్చినా ఎక్కడకు పోతే అక్కడకు తెల్లని వారాహ ధ్వజం కట్టిన చలువ ఛత్రాన్ని పట్టుకుని రాయల మీద ఎండ కన్ను పడకుండా చూసేవాడు.
విజయనగర సామ్రాజ్యమునకు రాజధానులు హంపి, ఘనగిరి గా పేరుగాంచిన పెనుగొండ, చంద్రగిరి. వేసవి కాలము రాయలవారు పెనుగొండలో సేద దీరేవారు. అప్పటిలో శిక్షలు వేస్తే ఆ శిక్షల అమలు పెనుగొండ లోనే జరిగేవి. రాచ మహల్లో జరిగిన అనేక గుప్త హత్యలకు పెనుగొండ సాక్షీభూతం.
ఓ సంవత్సరం సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణ దేవ రాయలు పెనుగొండలో ఉన్న కోటకు అంతః పుర దాస దాసీ జనంతో సహా వేసవి విడిది అయిన పెనుగొండకు విచ్చేసారు. అక్కడ ఉన్న చలువరాతి మండపాలు, మహళ్ళ లో అందరూ సేద తీరారు.
హంపి కి అపుడే విచ్చేసిన శృంగేరి పీఠాధిపతులు విరూపాక్ష ఆలయములో జరుగుతున్న ప్రత్యేక క్రతువునకు కు రాయలవారు రావలసిందిగా ఆరాధన జరిగే త్రయోదశి నాడు వారు తప్పక అక్కడ ఉండాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఈ విషయం రాయల వారికి వార్తాహరులు మరియు పీఠాధిపతి శిష్యులు పెనుకొండకు చేరవేశారు.
కేవలము కొన్ని గంటల్లో త్రయోదశి ఘడియలు ముగుస్తాయి.హంపికి పెనుగొండకు అశ్వికుల దారిలో వెడితే నూట ఇరువది మైళ్ళు,అదే భూగర్బ రహదారి సొరంగములో వెడితే ఎనుబది మైళ్ళు అయినా ప్రయాణ వ్యవధి ఎక్కువ అవుతుంది. రాయలు త్వరగా ఆలయానికి చేరుకోవాలని తన అశ్వాన్ని కొంతమంది మహావీరులు అయిన ఆంతరంగికులు మాత్రం వెంబడించగా గుఱ్ఱము మీద అశ్వికుల దారిలో ప్రయాణం సాగించాడు. రాయల వారు వెడుతుంటే ఆయనకు ఛత్రాన్ని పట్టే ఆంతరంగికుడు గొడుగు పాలుడు కూడా సిద్ధం అయ్యాడు.
త్రయోదశి ఘడియలు మీరక ముందే రాజధాని హంపి చేరి ఆలయ సందర్శనము చేసుకుని పీఠాధిపతుల దీవెనలు అందాలని రాయలు గుఱ్ఱాన్ని దౌడు తీయించసాగాడు. ఆ గుఱ్ఱం తో పోటీ పడుతూ ఛత్రాన్ని పట్టుకుని గొడుగు పాలుడూ పరుగుకు సిద్ధం అయ్యాడు. రాయల మీద ఎండ పడకుండా గుఱ్ఱముతో పాటు తానూ పరుగు అందుకుని ఛత్రాన్ని పట్టుకుని రాయలు ఎటు వైపు గుఱ్ఱాన్ని పరుగు తీయిస్తే అటువైపు ఛత్రాన్ని పట్టుకుని పరుగులు తీశాడు. సమయానికి చేర్చాలి అన్న భక్తి గుఱ్ఱానిది అయితే, రాయలు మీద ఎండ పొడ పడరాదన్న భక్తి గొడుగు పాలునిది.
గుఱ్ఱము, గొడుగు పాలుడు పోటీ పడుతూ రాయలవారిని హంపికి చేర్చారు. గుఱ్ఱాన్ని వదలి అక్కడ వేచియున్న పండిత వర్గం అంతా వెంటరాగా మంగళా ధ్వానములతో రాయల వారికి బ్రాహ్మణులు ఎదురేగి స్వాగతించి అక్కడ సిద్ధం చేయించిన మంగళ ద్రవ్యాలతో స్నానమాచరింపజేసి క్రతువు చేస్తున్న మండపానికి తీసుకుని పోయారు. క్రతువు ముగిశాక దీవెనలంది రాయలు రాచనగరుకు పల్లకీలో చేరి విశ్రమించారు.
అలసిపోయిన గుఱ్ఱం సకిలిస్తూ విరూపాక్ష ఆలయ ప్రాకారానికి సమీపములో సేద దీరుతోంది. గుఱ్ఱం తో బాటు పరుగులెత్తిన గొడుగు పాలుడు తీవ్రంగా డస్సి పోయి సొమ్మసిల్లి ఆలయ రాజ మంటపం వద్దే కూల పడిపోయాడు. ఛత్రం మీద పడిపోయింది..కాబట్టి ఆ క్రతు కార్యములో మునిగిన వారు ఎవరూ అతనిని పరికించ లేదు.
సేదదీరిన కృష్ణ రాయలు మెలకువ వచ్చి తాను వచ్చిన విధానాన్ని ఆంతరంగికులతో చెబుతూ అన్నట్టు గొడుగు పాలుడు ఏడీ అని అందరి వంకా చూడగా ఎక్కడా గొడుగు పాలుడు కనిపించలేదు. గొడుగు పాలుడు ఏమయ్యాడో కనుక్కుని తీసుకు రమ్మనగా వెళ్ళిన పరివారము విరుపాక్ష ఆలయ ప్రాకారం గోడవద్ద సొమ్మసిల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కనుగొని వెంటనే వైద్యులు అమిత నైపుణ్యం తో అతడికి చికిత్స చేసి అపస్మారక స్థితి నుండి బయటపడేశారు.
గొడుగు పాలుని పరామర్శించడానికి వచ్చిన రాయలు ఆతని రాజ భక్తికి మెచ్చి అనేక బహుమానాలు అందజేశారు. కోలుకున్న గొడుగు పాలుడు కొలువుకు రాగానే రాజసభలో అతడి రాజభక్తికి సన్మానించారు. ఇంకేమైనా కోరుకో అని కూడా అడుగగా.. గొడుగు పాలుడు తనకు ఏమీ వలదని ఒక్క రోజులో తాను ఎన్ని ఆగ్రహారాలను భూసురులకు దానమిచ్చి శాసన పత్రాలు చేయించ గలడో ఆ అధికారాన్ని మాత్రం ఇమ్మని కోరాడు. మల్లె పూమాల లో ఉన్న దారానికి సైతం పరిమళం అలదుకున్నట్టు దానవీరమున్న రాయని సాంగత్యం కలిగిన గొడుగు పాలుడు అనే భూమానాయనికీ అదే గొప్పదనం అబ్బింది.
రాయల వారిచ్చిన అధికారముతో తన ధర్మ పత్నులతో కలసి భూమానాయుడు రాయల రాజ్యంలో అనేక పల్లెలు కట్టించి భూసురులకు దాన ధర్మాలు చేసి తరించాడు. ఇప్పటికీ భూమానాయుని పేరుతో సీమలో అనేక పల్లెలు ఉన్నాయి.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...