Thursday, 2 December 2021

 

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

సినిమాకి పాటలు అసలు అవసరమా? అవి లేకుండా తియ్యలేరా?

మా భేషుగ్గా తీయొచ్చు.... నేషనల్ అవార్డులొచ్చే సినిమాలలో అసలు పాటలే ఉండవు మామూలుగా.
నిజానికి సత్తా ఉన్న దర్శకుడైతే ఈ నిజం ఒప్పుకుతీరాలి.
అలా ఒప్పుకునే దర్శకులలో కె.విశ్వనాథ్ గారు ఒకరంటే నమ్మకం కలగదు. ఎందుకంటే ఆయన సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయి మరి!
అలా పాటలు అవసరం లేదనుకునే పాటల రచయిత గా చేంబోలు సీతారామ శాస్త్రి గారిని కూడా చేర్చాలి!
ప్రవృత్తిని...వృత్తి గా చేసుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ మాట చెప్పడం....ఆశ్చర్యం కదూ!
అసలు పాటలే కాదు మాటలు కూడా లేకుండా....పుష్పక విమానం తీసి విజయం సాధించారు కదా!
ప్రతిభ ఉన్న దర్శకులకు....పాటలు అడ్డే మరి.
పాటలంటే....ఇప్పుడు వస్తున్న ఎక్సర్ సైజు ఫీట్ల తో కూడిన.... దరువు పాటలు అవీను.
పది సన్నివేశాలతో కూడా చెప్పలేని కథ...ఒక్క పాటతో చెప్పగలిగితే!
ఆ పాట అద్భుతం కదా!
ముప్పిరిగొన్న భావావేశాలను...మాటలు భరించలేవు. అవి కవితావేశంగా పాట రూపాన మరింత రక్తి కట్టిస్తాయి.
*******
అలా పాటకు పట్టాభిషేకం చేసిన మాహామహులు ఎందరో!
కానీ సినిమా పాటను....మరో స్థాయికి తీసుకెళ్ళి నిలిపి....ఓ కావ్య గౌరవం ఆపాదించిన వారిలో ప్రథములు....
కీ.శే. వేటూరి సుందరరామ మూర్తి గారైతే....
ఆ స్థాయిని....అలా కాపాడిన ఘనత....
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిదే.
అంటే అంతకు ముందు వ్రాసిన....
సముద్రాల,మల్లాది,పింగళి, దేవులపల్లి,ఆత్రేయ, ఆరుద్ర,శ్రీ.శ్రీ., సినారె, దాశరథి,....
వీరంతా ఆపాటి చెయ్యక పోయారా మరి?
అంటే.....
చేశారు. వారందరూ మహా కవులే...రచయితలే. కానీ వారందరూ ద్వంద్వావధానం చేశారనే చెప్పాలి.
సినిమా కోసం...సరళంగా...ప్రజలకు అర్థం అయ్యే భాషలో వ్రాస్తూ....
స్వంతంగా కావ్యాలూ, నాటకాలూ....అవీ వ్రాస్తూ పాటు పడ్డారు.
సినిమాలకు అంత పాండిత్యం అవసరం లేదులే అనికూడా భావించి ఉండొచ్చు కూడా.
భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్.....
అంటూ ప్రజలకోసం వ్రాసుకున్నారు.
********
1974 లోవచ్చిన 'ఓ సీత కథ తో సినీ గీతాల రచన క్రొత్త మలుపు తిరిగింది.
ఆ పదవిన్యాసంలో.....
ఆ నవ్యతలో.....,
ఆ వైవిధ్యంలో....,
ఆ నిర్భయ పదసృష్టిలో....
ఆ ప్రభంజనంలో......
సినీ కవిత 4 దశాబ్ధాల పాటు ఉర్రూత లూగింది.
నీతులు రాశారు. బూతులు రాశారు!
కానీ ఈయన రాకతో రసవద్గీతలు & భగవద్గీతలు కూడా వెల్లువయ్యాయి. ఆయన మరెవరో కాదు...
వేటూరి గారు.
1986 లో విడుదలైన....సిరివెన్నెల సినిమా పేరునే తన ఇంటి పేరుగా చేసేసుకుని...
సినిమా పాటలకు వేటూరి ఆపాదించిన కావ్య గౌరవాన్ని....దాదాపు 35 ఏళ్ళ పాటు నిలిపిన ఘనత...
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిదే.
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం...
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...
విరించినై విరచించితిని.......అంటూ....
ప్రేక్షకుల ఆత్మలను తాకే రచనతో శ్రీకారం చుట్టి....
ఆదిబిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చే వాడినేది అడిగేది?...అంటూ నిలదీసి....
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ,
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ,
కరెన్సీ నోటు మీద, ఇలా నడిరోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరత మాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ..
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ.......
గాంధీ గొప్పతనాన్ని మహా గొప్పగా చాటినా....
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి..
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి..
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం..
ఏ క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం…..
ఇలా నిలదీసినా........అది సిరివెన్నెల కే చెల్లింది.
********
అలా అని...కేవలం...నీతులు...సూక్తులే...వల్లించలేదాయన.
ఆకాశంలో ఆశల హరివిల్లు లు వెలయించి...
లలిత ప్రియ కమలం విరిసినది....అంటు కవితా పుష్పాలను విరబూయించాడు.
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకూ.....
తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి
అలమేలు మంగకు....
వాగ్గేయ కారుడైన అన్నమయ్య కీర్తనను తలపించే గీతమొకటి వెలయిస్తే...
అది అన్నమయ్య కీర్తనే అనుకుని....ఆయనకివ్వాల్సిన నంది అవార్డు...ఆ ఏడాది ఇవ్చనేలేదట!
పెద్ద నష్టమేం లేదనుకోండి. బోలెడు నందులు ఆయన ఇంట చేరాయి...ఉత్తమ సినీ గేయ రచయితగా!
అలా అని....అన్నీ క్లాస్ గీతాలే కాదు. మాస్ పాటలూ లెక్కలేనన్ని!
బోటనీ పాఠముంది...మాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా...
క్లాస్ రూం లో తపస్సు చేయుట వేస్ట్ రా బ్రదర్...
చక్రవర్తికి...వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ..
బధ్రం బీ కేర్ ఫుల్ బ్రదరు, భర్తగ మారకు బాచిలరు...
ఇలా లెక్కకు మించిన గీతాలే ఉన్నాయి.
ఇక శృంగార గీతాలు మచ్చుకు....
కన్నుల్లో నీ రూపమే(నిన్నే పెళ్ళాడుతా), నువ్వు నువ్వు....నువ్వే నువ్వు.....(ఖడ్గం), ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ....(గులాబి)....
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడుంటాయి సిరివెన్నెల వెదజల్లిన గీతాలు.
అన్నింటికీ తలమానికమని చెప్పదగ్గ గీతం....
జగమంత కుటుంబం నాది....ఏకాకి జీవితం నాది.....
చక్రం....మూవీలోని ఈ పాట....ఆయన 1978 లోనే వ్రాసుకున్న గీతం!
అంటే ఆశ్చర్యం కలగక పోదు! 23 ఏళ్ళప్పుడే అంత చక్కటి గీతాన్ని వ్రాశారు!
సినిమా పాటల కోసం.....కవిగా మారలేదాయన.
సినిమా పాట అదృష్టం కొద్దీ....కవిగా ఆయన పయనం...సినిమా వైపు మళ్ళింది.
అది సినిమా లక్కే కాదు. ఆయన పాటలను ఆస్వాదించే మనందరిదీను.
*******
సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన..
చేంబోలు సీతారామశాస్త్రి గారు
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో
1955 మే 20 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు.
10వ తరగతి దాకా అనకాపల్లి...
ఇంటర్ కాకినాడలో...
ఇంటర్ అయ్యక...ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో ఎం.బి.బి.ఎస్....లో చేరినా...
టెలికమ్యూనికేషన్స్ లో అసిస్టెంట్ జాబ్ రావడంతో...మొదటి ఏడాదే కాలేజ్ మానేసి...ఉద్యోగంలో చేరారు.
అలా రాజమండ్రి, తాడేపల్లి గూడెం, కాకినాడ లలో పనిచేసి...ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు.
అప్పుడే సాహితీ క్షేత్రాన్ని సాగు చేయడం మొదలు పెట్టారాయన.
భరణి అనే కలం పేరుతో పత్రికల్లో కథలు...కవితలు వ్రాసిన ఆయన్ని మిత్రులు ఎంతో ప్రోత్సహించారట.
అప్పుడే దర్శకులు కె.విశ్వనాథ్ గారి ద్వారా....జననీ జన్మ భూమి మూవీకి వ్రాశారట.
కానీ పేరు తెచ్చిన చిత్రం....సిరివెన్నెల లో అన్ని పాటలూ ఆయనే వ్రాసి....గొప్ప పేరు సంపాదించారు. అదే మొదటి చిత్రం అయింది.
ఆయన ఇంటి పేరూ...సిరివెన్నెల అయ్యింది.
1974 లో వేటూరి ని పరిచయం చేసిందీ కె.విశ్వనాథ్ గారే.
గొప్పతనాన్ని గుర్తించాలంటే .....మరో గొప్ప వ్యక్తికే సాధ్యం మరి.
ఇక శాస్త్రి గారి విషయానికొస్తే...
వారి విషయ సంగ్రహణ...గ్రాహ్య శక్తి అపారం.
వయస్సనేది మనస్సుకు సంబంధించినదే గానీ....శరీరానికి కాదు.
100 పుస్తకాలు చదివినా కలగని జ్ఞానం...ఒక మంచి అనుభవజ్ఞుడితో ఓ గంట మాట్లాడినా కలుగుతుంది.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
దీనిని మనసా వాచా కర్మణా నమ్మి ఆచరించారాయన.
వారి అర్ధాంగి పద్మావతి గారిని....తన అర్ధాంగి అనడం కంటే....ముప్పాతికాంగి....అని చెప్పేవారు.
ముగ్గురు పిల్లలతో...చెన్నై చేరేనాటికావిడ గారికి 21 ఏళ్ళు. శాస్త్రి గారి కవిత్వం....గీతం సాగాలన్నా....సంసారం ఈదుకొచ్చింది ఆవిడేననేవారు.
పైగా....ఆర్.ఎస్.ఎస్. లో యాక్టివ్ మెంబర్ ఆయన.
సినిమా కి రాకముందు....వారి గీతాలు ఆర్.ఎస్.ఎస్. కి ఉపయోగపడేవి.
శాస్త్రి గారూ....మీరేమిటి...మీఅంతటి వారు.....అల్పమైన సినిమా పాటలను వ్రాయడం అంటే...
ఆయనకు కోపం వచ్చేది.
సినిమా ను అల్పమని అనడానికే వీల్లేదండి. ఈ నాడు నేను ఈ స్థితి లో ఉన్నానంటే కారణం సినిమా. ఆ సినీ వ్యవస్థ లో ఎందరో ఉపాధి పొందుతున్నారు.
మనం వ్రాసే పాటల్లో అల్పత్వం ఉండొచ్చు. లేదా తీసే సినిమాలు కొన్ని అల్పంగా అనిపించొచ్చేమో గానీ....సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ...అల్పం కాదండి. అనేవారు.
నిజం కూడా.
పురస్కారాలు బోలెడున్నాయి.
11 నందులు....
ఇక కళాసాగర్, రసమయి, సౌత్ ఇండియా, నెఫ్జా....ఇలా చిన్నా చితకా కలిపి ఓ 50 అవార్డులు దాకా ఉంటాయి.
కవి సన్మానాలకు లెఖ్ఖ లేదు.
2019 లో ప్రభుత్వం....పద్మశ్రీ ఇచ్చింది.
********
ఊపిరితిత్తుల కేన్సర్ తో.....సిరివెన్నెల వారి నిష్క్రమణ.....మంచి పాటల కోసం ఎదురు చూచే మనకు ఆశనిపాతమే.
గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.
వెలలేని కవితా నిధులు వెలయించిన సిరివెన్నెల వారి నిష్క్రమణ కు...
అశ్రు నివాళి.🙏🌹😢
వారి కుటుంబ సభ్యులకు...ప్రగాఢ సానుభూతి.
వారి గీతాలు మాత్రం శాశ్వతాలు.
జయంతి తే సుకృతినోః రస సిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే జరా మరణ జం భయం.
రస సిద్దులైన కవీశ్వరుల యశస్సు అనే శరీరానికి
చావు పుట్టుకల భయం లేదు.
🙏🌹ఓం శాంతిః🌹🙏

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...