Tuesday, 9 November 2021

 తెలుగు కథకు మాస్టారు!!!

"అనగనగా ఓ యజ్ఞం"....
సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయుడు
శ్రీ కాళీపట్నం రామారావు గారి జయంతి సందర్భంగా


















【'భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ అతనికి నమస్కరిస్తారని, మనందరికీ తెలిసిన విషయమే. అయితే, దేముడు మానవుడైతే అప్పుడు అతనైనా సరే శ్రీ కాళీపట్నం రామారావుగారికి నమస్కరించి తీరవలసిందే! పురుషులలోన పుణ్యపురుషులు వేరయా అని వేమన గారు రామారావుగార్లాంటి వారిని చూసే చెప్పి ఉంటారు. రామారావు గారి వంటి సజ్జనుడి సాంగత్యం లభించడం నా అదృష్టం. ఆయన లాంటి గొప్ప కథకులుండటం మన జనం అదృష్టం.'
- రాచకొండ విశ్వనాధ శాస్త్రి, యజ్ఞం కథాసంపుటి ముందు మాట, 1971】

తెలుగు కథా #సాహిత్యంలో ఆయనదో ఓ ఒరవడి.. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థను చిత్రిక పట్టి తన రచనల ద్వారా దాని నిజస్వరూపాన్ని తేటతెల్లం చేశారు. ‘#కథల మాస్టారు’ అన్న పేరుకు పర్యాయపదంగా నిలిచారు. ఆయన కథలు ప్రపంచ సాహిత్యంలో సముచిత స్థానాన్ని సంపాదించాయి. కారా మాస్టారుకు సాహిత్యం అంటే ప్రాణపదం. ఆయన మానస పుత్రిక కథా నిలయాన్ని వందేళ్ల తెలుగు కథా #సాహిత్యానికి చిరునామాగా నిలిపారు.
#కారా మాస్టారు గా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు #సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా #ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్య జ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావ ప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాధ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారు.
కారా మాస్టారుగా సుపరిచితులైన కథా రచయితే #కాళీపట్నం రామారావు. రెండోతరం తెలుగు కథా సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్రవేశాడు. కథాసేవే తన జీవిత మార్గంగా ఎన్నుకుని జీవిస్తున్న సాహిత్య సృజనశీలి. నిత్యం కథ గురించి మాట్లాడుతూ, కథ గురించి రాస్తూ, కథల్ని భద్రపరుస్తూ కథే జీవితమైన వ్యక్తి కాళీపట్నం రామారావు. గురజాడ బాటను కథల్లో మరింత ముందుకు తీసుకెళ్లి, దానికి అభ్యుదయ వాసనలు పూయించిన ఘనుల్లో కారా మాస్టారు ముఖ్యులు.
#బాల్యం-తొలి జీవితం:
కారా మాస్టారు శ్రీకాకుళం జిల్లా మురపాకలోనవంబరు 9, 1924లో జన్మించారు. వీరి నాన్న కరణం పేర్రాజు. అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదువుకున్నారు. విశాఖ జిల్లా భీమిలీలో టీచర్ ట్రైనింగ్ శిక్షణ తీసుకున్నారు. 1948లో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి 31 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులకు పాఠాలు బోధించాడు. 1979లో ఉద్యోగ విరమణ చేశారు. మార్చి 19, 1946లో సీతామహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. జీవితంలో అనేక సాధక బాధకాలు పడ్డారు.
#సాహిత్యం:
కారా మాస్టారు తన 19వ ఏట తొలికథ 'ప్లాటు ఫారమో...' రాశారు. ఇది 1943లో 'చిత్రగుప్త' పత్రికలో వచ్చింది. ఆ తర్వాత 'వీసంలో... అయితే గియితే' పేరుతో రెండో రాశారు. రామారావు మొదట స్వాతంత్ర్య పోరాటం, గాంధీ భావాలు, నెహ్రూ సోషలిస్టు భావాల ప్రభావంతో కథలు రాసినట్లు కనిపిస్తుంది. రాగమయి, అభిమానాలు, అభిశప్తులు, పలాయితడు... లాంటి కథలు ఇలాంటివే. 1967లో నక్సల్బరీ ఉద్యమం తర్వాత వీరి చూపులో మార్పు వచ్చింది. కారా గారికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన కథ 'యజ్ఞం' 1966లోనే వెలువడింది. తర్వాత ఈ భావాలతోనే హింస, నో రూమ్, ఆర్తి, భయం, చావు, కుట్ర, ఆయన చావు... లాంటి ఎన్నో కథలు వీరి నుంచి వచ్చాయి. ఇవన్నీ తెలుగులో శాశ్వతంగా నిలిచిపోయే రచనలు.
#పలు సంపుటాలుగా:
వీరి రచనలు పలు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. రాగమయి (1957), యజ్ఞం (1971), కాళీపట్నం రామారావు కథలు (1972), అభిమానాలు (1974), జీవధార-ఇతర కథలు (1974), కాళీపట్నం రామారావు కథలు (1986), యజ్ఞంతో తొమ్మిది (1993), కాళీపట్నం రామారావు కథలు( 1999). 2008లో వీరి రచనలు అన్నీ 567 పేజీల గ్రంథంగా వెలుగులోకి వచ్చింది.
'#యజ్ఞం' కథ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథ. ఈ కథలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించారు. అందులో నిగూఢంగా కనిపించే ధనికవర్గం పక్షపాతాన్ని సూటిగా చెప్పారు. కథా లోతుకు, విస్తృతమైన పరిదికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ.
'#జీవధార' కథలో పేదవాళ్లు నీళ్లు దొరక్క నానా యాతన పడుతుంటే... శ్రీమంతులు విలాసం కోసం పెంచుకునే క్రోటను మొక్కలకు నీళ్లు వృధా చేస్తూ ఉంటారు. పేదవాళ్లందరూ కలిసి నీళ్లకోసం శ్రీమంతుల ఇంటికి వెళ్తారు. వాళ్లు జనశక్తికి బెదిరి అనుగ్రహించే దేవుళ్లలా పట్టుకోమంటారు. ఇలా సాగుతుంది కథ. ఈ కథలో లోతుగా వర్గ దృక్పథమే ఉంటుంది. కానీ రచయిత ఎక్కడా ప్రవేశించడు. తన భావాలను చెప్పడు. శిల్పం దృష్ట్యా కూడా ఇదో గొప్పకథ.
కాళీపట్నం రామారావు ప్రత్యేకతే ఇది. రచయిత చెప్పదలచుకున్న భావం అంతర్లీనంగా పాఠకుడికి చేరుతుంది. భాష సరళంగా ఉంటుంది. జీవితంలో అనుభవించి, పరిశీలించి, కష్టాలను, సంఘర్షణలను కథల్లో రాశారు కారా. అట్టడగు వర్గాల జీవన సమరాన్ని పాత్రల్లో ప్రవేశపెట్టాడు. ఆరు దశాబ్దాలు తెలుగు కథను సుసంపన్నం చేసిన కారా మాస్టారి కథలు రష్యన్, ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదాలయ్యాయి. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి ఎంతో మంది కొత్త రచయితలను ప్రోత్సహించారు.
#గురువుగా, మార్గదర్శకునిగా.....
కారా మాస్టారు తన కథా రచనకు కొడవటిగంటి కుటుంబరావును గురువుగా, రా.వి.శాస్త్రిని మార్గదర్శకునిగా భావిస్తారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటిస్తే ప్రభుత్వ విధనాలు నచ్చక తిరస్కరించారు.
#కథానిలయం:
1995లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును స్నేహితుల కోరిక ప్రకారం అందుకుని ఆ డబ్బుతో ఫిబ్రవరి 22, 1977లో శ్రీకాకుళంలో 'కథానిలయా'న్ని స్థాపించారు. ఇక్కడ సుమారు ప్రముఖ తెలుగు పత్రికలన్నీ దొరుకుతాయి. 600ల మంది కథా రచయితల కథలు లభ్యమవుతాయి. రామారావు నేడు కథా రచయతల జీవిత విశేషాలను, ఛాయాచిత్రాలను భద్రపరిచే పనిలో ఉన్నారు. ఇదొక అపూర్వమైన కథా ప్రపంచం. తెలుగులో సుమారు 3000ల మంది కథా రచయితలు ఉన్నారని వీరి అంచనా.
#జీవితానికి చాలా ముఖాలున్నాయి. ఆంతరంగిక జీవితం మనకొక్కడికి మాత్రమే. అది అందరికీ కాదు, కొందరికే తెలుస్తుంది. మన వ్యక్తిగత జీవితం చుట్టూ ఉండే వాళ్లకు కూడా కనిపిస్తుంటుంది. కౌటంబిక జీవితం చుట్టూ ఉండే కుటుంబ సభ్యులకూ, బంధుమిత్రులకూ తెలుస్తుంది. సామాజాకి జీవితం ప్రపంచానికి తెలిసేదైతే, వ్యవస్థాగత జీవితం స్పష్టమైన ప్రపంచ దృక్పథం ఉన్న వాళ్లకు మాత్రమే తెలిసేది' అని కథా రచన చేస్తున్న వారికి, కథా లోతుల్ని పసిగట్టే వారికి చెప్తారు కారా మాస్టారు.తెలుగు సాహిత్యం పై ఏమాత్రం అభిమానమున్న వారు ఒక్కసారైనా ఈ కథా నిలయాన్ని దర్శించాలి.
#కాళీపట్నం "#యజ్ఞం":
గోపన్న కొన్నాళ్ళక్రితం అప్పల్రాముడనే మాల కుల పెద్దకు రెండువేలు అప్పు ఇస్తాడు.అప్పల్రాముడు అప్పు తీర్చడు.అది వడ్డీతో సహా రెండువేల అయిదొందలవుతుంది.అప్పుతీర్చాలని గోపన్న తగవుకొస్తే,శ్రీశ్రీరాములు నాయుడు పంచాయితీ వద్దని మధ్యస్థంగా తీర్పు చెప్తాడు.మూడేళ్ళ గడువు అడుగుతాడు అప్పల్రాముడు.అతడికి రెండెకరాల ముప్పై సెంట్ల మడిచెక్క వుంటుంది.అది అమ్మితేకానీ అప్పు తీర్చలేడు.అది అమ్మటం అతనికి ఇష్టం లేదు.అందుకే మూడేళ్ళ గడువు కోరతాడు.
మూడేళ్ళవుతుంది.అప్పల్రాముడు అప్పు తీర్చడు.దాంతో విషయం పంచాయితీకి వస్తుంది.ఇక్కడి నుంచీ కథ ఆరంభమవుతుంది.
అప్పు తీర్చలేనంటాడు అప్పల్రాముడు.తీర్చాలంటారు పెద్దలు.భూమి అమ్మితే తనకేమీ మిగలదంటాడు అప్పల్రాముడు.తీర్చక తప్పదంటారు పెద్దలు.చివరికి శ్రీరాములు కూడా తీర్చాలనటంతో అప్పల్రాముడు అందుకు ఒప్పుకుంటాడు.అయితే,అప్పల్రాముడి పెద్ద కొడుకు ఆవేశపరుడు.భూమి అమ్మటం అతనికి ఇష్టం వుండదు.అతడు వూరి పెద్దలను ఖాతరు చెయ్యడు.తండ్రి భూమి అమ్మి అప్పు తీరుస్తాననగానే ఇంటికి పరుగెత్తుతాడు.తన సంతానాన్ని నరికేస్తాడు.తన కొడుకు బానిస బ్రతుకు బ్రతకటం ఇష్టం లేక ఆపని చేస్తాడు.
ధర్మాన్నాలేంతవరకూ?అంతా నువ్వు చెప్పినట్టు వినేవరకూ.ఆ తరువాత!అని కథ ముగుస్తుంది.
మొదటీ నుంచీ కథ చదువుతూంటే ముగుంపు గురించిన ఒక ఊహ కలుగుతుంది.కానీ తన కొడుకునే,అతడు చంపేసుకోవటం(అప్పల్రాముడి పెద్దకొడుకు తన కొడుకుని చంపుకుంటాడు.)అనూహ్యమయిన ముగింపు.అది చదవగానే వొళ్ళు గగుర్పొడుస్తుంది.ఒక మనిషి,ఎంతగా అణచివేయబడితే,ఎంత దుర్భరమయిన నిరాషా నిస్పృహలకు గురయితే అంత ఘోరమయిన పని చేస్తాడో అన్న ఊహ కలుగుతుంది.ముఖ్యంగా తనలాగే తన సంతానం బానిసలా బ్రతకటం నచ్చని తండ్రి కొడుకును అలా చంపుకోవటం తీవ్ర మయిన అలజడిని మదిలో కలిగిస్తుంది.
ఆ అలజడి,ఆ వేశం తగ్గిన తరువాత ఆలోచన వస్తుంది.అప్పుడు కథను మళ్ళీ చదివితే,కథను ఒక్కొక్క అంశంగా విడతీసి విశ్లేషిస్తే యజ్ఞం అసలు రూపు తెలుస్తుంది.ఒక భావావేశ తీవ్ర కలిగించి రచయిత మన కళ్ళముందు నిలిపిన మాయా ప్రపంచం అర్ధమవుతుంది.
#యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు.
#తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేసి
సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసిన కాళీపట్నం రామారావు గారు 4 జూన్ 2021 మరణించారు.

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...