Monday, 6 September 2021

 భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్








భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృషన్ గొప్ప పండితుడు, తత్త్వవేత్త, జ్ఞానమూర్తి. ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను ఇక్కడ ముచ్చటించుకుందాం.

రామనాథన్ కృష్ణన్ వెనుకటి తరానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. 1960లో ఢిల్లీలో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ లో భారత జట్టుకు అతడు నాయకత్వం వహించేడు. పోటీలను ప్రత్యక్షంగా తిలకించడానికి స్టేడియంకి వచ్చిన నాటి రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు రామనాథన్ కృష్ణన్ ని తన ప్రక్కనే కూర్చోమన్నారు.

ఆట తిలకిస్తూన్న రాధాకృష్ణన్ గారు మధ్యలో "టెన్నిస్ లో ఉపయోగించే 'డ్యూస్' అన్న పదం ఎలా వచ్చింది?" అని అడిగేరు. "డ్యూస్ అంటే ఆటగాళ్ళు సమాన స్థితికి వచ్చినట్లు. అంటే ఇద్దరి బలాలు సమానంగా ఉన్నాయన్నమాట .. " అని సమాధానం ఇచ్చాడు రామనాథన్. అప్పుడు రాధాకృష్ణన్ గారు మాట్లాడుతూ "తప్పు నాయనా. అది 'ఎ డ్యూ' అనే పదం నుండి వచ్చింది. అంటే గెలవడానికి ఇంకా రెండు 'స్ట్రోక్'లు కావాలని అర్థం" అని అన్నారు.

కాసేపయ్యాక 'లవ్' అంటే ఏమిటని రాధాకృష్ణన్ గారు అడిగేరు. రామనాథన్ ఆ ప్రశ్నకి తెల్లమొహం వేసేడు. అప్పుడు రాధాకృష్ణన్ గారు 'లవ్' అనే పదం ఫ్రెంచ్ భాషలోని 'లోయిఫ్' అన్న పదం నుంచి వచ్చిందనీ, దీనికి అర్థం 'గుడ్డు' అనీ అన్నారు. గుడ్డు సున్నా ఆకారంలో ఉంటుంది కాబట్టి, స్కోరులో సున్నాని 'లవ్' అని అంటారని అన్నారు. ప్రపంచంలో ప్రతి విషయం పట్ల విశేష పరిజ్ఞానం ఉంది వారికి.

ఒకసారి కర్ణాటకలో ఒక గ్రామంలో పర్యటిస్తున్నారు రాధాకృష్ణన్ గారు. మీ గ్రామంలో ఏమైనా విశేషం ఉందా అని అడిగారు అక్కడివారిని. తమ ఊరిలో ఒక వ్యక్తీ ఉన్నాడనీ, నలుగురు తినగలిగే తిండి అతడొక్కడే తినగలడనీ అన్నారు ఆ గ్రామస్థులు. వెంటనే రాధాకృష్ణన్ గారు "మరి ఆ వ్యక్తీ నలుగురు చేయగల పని చేయగలడా?" అని వారిని ప్రశ్నించేరు చమత్కారంగా.

భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు డా. రాధాకృష్ణన్ బెంగుళూరు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించడానికి వచ్చేరు. ఒకరోజు ముందుగానే బెంగుళూరుకి విచ్చేసిన వారితో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చెయ్యబడింది. మర్నాడు స్నాతకోత్సవ సభలో ఆయన చేసే ప్రసంగాన్ని అడిగి వ్రాసుకున్నారు విలేకరులు. మర్నాడు అన్ని పత్రికలలోనూ ఆ రోజు రాధాకృష్ణన్ చేయబోయే ప్రసంగం అంటూ పూర్తి పాఠాన్ని మొదటి పేజీలో ప్రచురించేయి. ఇక ఆ మధ్యాహ్నం స్నాతకోత్సవం మొదలయ్యింది. డా. రాధాకృష్ణన్ ప్రసంగించడానికి  లేచి నుంచున్నారు. ముందు వరుసలో కూర్చున్న విలేకరుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. తమ పత్రికలలో రాధాకృష్ణన్ ప్రసంగం అంటూ మొదటి పేజీలలోనే ఆర్భాటంగా ప్రచురించేరు. ఇప్పుడు రాధాకృష్ణన్ గారి ప్రసంగం మరో విధంగా వుంటే తమ గతేం కాను? రాధాకృష్ణన్ ప్రసంగం పూర్తయ్యేంత వరకూ సభా ప్రాంగణం నిశ్శబ్దంగా వుంది. ప్రసంగం ముగిసిన తరువాత విలేకరుల ఆశ్చర్యానికి అంతే లేదు. క్రిందటి రోజు విలేకరుల సమావేశంలో ఏ ప్రసంగం చేసేరో అదే క్రమంలో ఒక్క వాక్యం, ఒక్క పదం కూడా తేడా లేకుండా చేతిలో చిన్న కాగితం ముక్క కూడా లేకుండా ధారాళంగా ప్రసంగించేరు రాధాకృష్ణన్. అదీ ఆయన ధారణా పటిమ. 

ప్రంచంలో పలుదేశాలను గడగడలాడించిన రష్యన్ నియంత స్టాలిన్. తాను ప్రవేశపెట్టిన విధానాలను వ్యతిరేకిస్తున్నారని ఆరు లక్షల మంది అమాయక రైతులను నిర్దాక్షిణ్యంగా చంపించిన రక్తచరిత్ర అతడిది. అటువంటి స్టాలిన్ కూడా "ప్రపంచంలో నన్ను మనిషిగా భావించి నాతో ప్రేమపూర్వకంగా మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి రాధాకృష్ణన్" అని అన్నాడు. అంతటి మానవతా మూర్తి డా. రాధాకృష్ణన్. 

భారతదేశంలోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలోని పలు విశ్వవిద్యాలయాలు తత్త్వశాస్త్రంపై ప్రసంగించమని రాధాకృష్ణన్ పండితుని ఆహ్వానించేయి. Oxford విశ్వవిద్యాలయంలో హిందుత్వంపై ఆయన చేసిన ప్రసంగాలను "The Hindu Way of Life", "Comparative Religions" పుస్తకాలుగా ప్రచురించేరు. 1930లో రాధాకృష్ణన్ ప్రసంగాలు విని ముగ్ధుడైన బెర్ట్రాండ్ రస్సెల్ తత్త్వశాస్త్రం పై ఇంత సమగ్రమైన, వివరణాత్మకమైన ప్రసంగం ఇంతకు ముందెప్పుడూ తాను వినలేదని అన్నాడు. 

యు.జి.సి. చైర్మన్ గా, ఆంధ్ర, బెనారస్ విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా, పలు దేశాలలో భారత సాంస్కృతిక రాయబారిగా, భారత రాష్ట్రపతిగా మనదేశానికి విశిష్ట సేవలనందించిన మహనీయుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.  

అంతటి గొప్ప వ్యక్తి కాబట్టే వారి జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

show image

 Sardar Patel He had come out of the mosque and attacked Sardar Patel. We were taught that Mahatma Gandhi was assassinated by Nathuram Godse...