ఏమిటీ బ్లాక్ ఫంగస్ ;?
ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కోవిద్ నుంచి కోలుకున్న కొంత మంది బ్లాక్ ఫంగస్ వ్యాధి గురవుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి . ఒకటో రెండో రోజుల్లో దీనికి సంభందించి భయపెట్టే వార్తలు ప్రచారం కావడం ఖాయం . కోవిద్ నుంచి కోలుకొన్నామన్న ఆనందాన్ని కూడా దక్కకుండా , తిరిగి వేలాది మంది ఆందోళనకు గురయ్యే స్థితి కనిపిస్తోంది . ఈలోగా సరైన సమాచారాన్ని తెలుసుకొందాము .
ముకోర్ మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి . ఇది కొత్త వ్యాధి కాదు . ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదే. ఇది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి . దీన్నే బ్లాక్ ఫంగస్ అంటారు .
వ్యాధి లక్షణాలు :
1 . ముఖం లోని కండరాలు తిమ్మిరెక్కడం .
2 . కళ్ళు ఎర్రబడడం , ఇంకా కళ్ళు వాపుకి గురికావడం అంటే కను గుడ్డు పెద్దది కావడం .
3 . ముక్కు లో ఒక్క పక్క మూసికొనిపోయినట్టు ఉండడం .
ఇది ఎంత వరకు ప్రమాదకరం ?: ఇది సోకిన వారిలో సరైన చికిత్స అందని పక్షం లో సగం మంది మరణించే అవకాశం ఉందని అంటున్నారు . అలాగే వ్యాధి సోకిన ముగ్గురిలో ఒకరికి కనుచూపు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దవడ ఎముక ముక్కు పోగొట్టుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు .
ఎలా వ్యాపిస్తుంది? : ఈ ఫంగస్ { ఒక రకమైన బూజు } గాలిలో ఉంటుంది . పుట్టగొడుగు కోవకు చెందిందే ఈ శిలీన్ద్రము. ఇది ఎప్పటినుంచో ఉండేదే. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది సోకుతుంది .
కారొనకు దీనికి ఏమిటి సంబంధం ?: ఒక విధంగా చెప్పాలంటే సంభందం లేదు . ఇది కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాదు . కానీ కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమందికి ఇది సోకుతోంది . ఢిల్లీ అహ్మదాబాద్ , బెంగళూరు లాంటి నగరాల్లో కొంత మంది ఈ వ్యాధి సోకి ఆసుపత్రులకు వస్తున్నారు . వీరందరూ కరోనా నుంచి ఇటీవల కోలుకున్న వారే !
ఎందుకిలా ?: కరోనా సోకి తీవ్రమైన వారికి చికిత్స లో భాగంగా అధిక శక్తి కలిగిన స్టెరాయిడ్ లు ఇస్తారు . ఈ స్టెరాయిడ్ ల వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి . ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది . మరో పక్క కాలేయము దెబ్బ తింటుంది . దీని వల్ల గ్లూకోస్ రీడింగ్ ఒక్క సారిగా మూడు నాలుగు వందలు దాటే ప్రమాదం వుంది .
కరోనా వల్ల ప్రాణం పోయే స్థితి ఉంటే అప్పుడు పెద్ద నష్టాన్ని నివారించడానికి ఈ చిన్న నష్టం తప్పదు అనే ప్రాతిపదికన డాక్టర్ లు స్టెరాయిడ్ లు వాడుతారు . అది సమర్థనీయం . కానీ ఇటీవల స్టెరాయిడ్ ల ను యథేచ్ఛగా వాడేస్తున్నారు . వ్యాధి ముదిరి ఇక మామూలు మందులతో లాభం లేదనుకొన్నప్పుడు వాడాల్సిన స్టెరాయిడ్ ల ను వ్యాధి సోకడం తోటే వాడేస్తున్నారు . మరీ దారుణం ఏమిటంటే కరోనా సోకకుండా ఆస్తమా రోగులు వాడే ఈ స్టెరాయిడ్ వాడండి అని ఇటీవల వీడియోలు వైరల్ అయ్యాయి . స్టెరాయిడ్ లు విషం . వాటిని విచ్చలవిడిగా వాడితే ప్రమాదం అని నేను అప్పుడే చెప్పాను. డాక్టర్ ల ప్రత్యక్ష పర్యవేక్షణ లో అదీ వితి లేని స్థితి లో వాడాల్సిన మందు ను నేరుగా మెడికల్ షాప్ కు వెళ్లి ఆలా కొనుక్కని వాడడం అంటే కోరి కొరివి తో తలగోక్కున్నట్టే .
ఇప్పుడేమిటి : కరోనా నివారణ లో భాగంగా బలమైన స్టెరాయిడ్ మందులు వాడిన వారికి వ్యాధి నిరోధక శక్తి బలహీన పడడం వల్ల గాలిలోని ఈ బూజు సోకి వ్యాధి వచ్చే అవకాశం వుంది . షుగర్ , కాన్సర్ , కిడ్నీ ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులు ఉండి కరోనా సోకి నెగటివ్ వచ్చిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాధులు వున్నా వారికి ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలహీనముగా ఉండడమే కారణం .
ఏమి చెయ్యాలి : అనేక అంటు రోగాలనుండి మనల్ని రక్షించేది మన ఇమ్మ్యూనిటి వ్యవస్థే . అది బలంగా ఉంటే కరోనా వచ్చినా ఏమీ కాదు . ఆలా కరోనా నుండి కేవలం విటమిన్ మాత్రలతో కోల్కొన్న వారికి ఈ వ్యాధి రాదు . దురదృష్ట వశాత్తూ కొంత మంది ఇమ్మ్యూనిటి ని నమ్ముకోరు. మందులనే నమ్ముతారు .
ఉదాహరణకు బిపి తీసుకొందాము . బిపి ఎక్కువైతే నడవడం , ఉప్పు తగ్గించడం , భావోద్వేగాలకు దూరం గా ఉండడం అనే పద్ధతిలో దీన్ని తగ్గించుకోవచ్చు . అవసరం అయితే మందులు వాడాలి . కాదనడం లేదు . కానీ బిపి వచ్చిందా ? టాబ్లెట్ వేసుకొంటే పోతుంది అనే ఆలోచన మంచిది కాదు . సుగర్ వ్యాధి వస్తే వ్యాయామం చెయ్యాలి . రోజుకు నలభై నిముషాలు వేగంగా నడవాలి . పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు , నెమ్మదిగా జీర్ణం అయ్యే పదార్తాలు , పీచు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి . షుగర్ వస్తే ఒక మాత్ర .. అటు పైన కొన్ని నెలలకు భోజనానికి ముందు ఒక ఇన్సులిన్ సూది అనుకొనే పద్దతి మంచిది కాదు ..
ముగింపు : బ్లాక్ ఫంగస్ గురించి అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . కాన్సర్, డయాబెటిస్ , కిడ్నీ సమస్యలు లాంటివి ఉండి కరోనా సోకి సీరియస్ అయ్యి స్టెరాయిడ్ లు తీసుకొన్న వారు , ఏవో వీడియో లు చూసి కరోనా అతిభయం తో అనవసరంగా స్టెరాయిడ్ లు తీసుకొన్న వారు మాత్రం జాగ్రత్త . ముఖ కండరాలు తిమ్మిరెక్కడం , కళ్ళు ఉబికి ఎర్రబడడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి . అనవసరంగా టెన్షన్ పెంచుకొని ముఖం తిమ్మిరెక్కినట్టు వూహించుకోవద్దు . ఇలాంటి కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రిపోర్ట్ కాలేదు . ఢిల్లీ బెంగళూరు అహ్మదాబాద్ లాంటి చోట్ల 10 - 20 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి .
సమగ్ర పరిష్కారం : మీరు ఇమ్మ్యూనిటీ ని నమ్ముకొంటే అంతా మంచే జరుగుతుంది . చక్కటి ఆహారం , వ్యాయామం , నిద్ర , భయానికి దూరంగా ఉండి జీవితాన్ని ఆనందించడం అనే పద్దతిలో తొంబై ఏళ్ళ వ్యక్తి అయినా ఇమ్మ్యూనిటి ని పెంచుకోవచ్చు . కరోనా అయినా బ్లాక్ ఫంగస్ అయినా మరొకటి అయినా జయించవచ్చు . రోగానికి విరుగుడు మందు మాత్రమే అనే పద్ధతిలో వెళితే { మందు అవసరమే .. మరో సారి చెబుతున్నా. కానీ మందే మార్గం అని అనుకోవడం తప్పు }. .. ఒక రోగం .. దానికి రెండు మందులు .. అప్పుడు బోనస్ గా మరో రెండు రోగాలు ..వాటి కోసం మరో నాలుగు మందులు .. ఇలా విష వలయం లో చిక్కుకొంటారు . తస్మాత్ జాగ్రత్త ! ఇప్పటికైనా మేలుకోండి !