Monday, 26 April 2021

పివిఆర్కే ప్రసాద్ గారి అనుభవాలనుండీ సేకరణ:

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫీసు ఆ రోజుల్లో ఎంతో సమర్థుడని పేరు తెచ్చ్చుకున్న పి వి ఆర్ కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు..సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సవపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలు పెడితే బావుంటుందన్న ఆలోచనలో వున్నారు..
వారంతా ఆలోచనయితే చేసారు గానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టటంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు..సమయం దగ్గర పడుతోంది..ఏం చేయాలో దిక్కు తోచని స్థితి..వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యకపోతే అభాసుపాలు అవుతామేమోనన్న భయం అందర్లోనూ ఏ మూలో ఉంది….
“సరే..ఇక ఇవ్వాళ ఏదో ఒకటి తేల్చేయ్యాల్సిందే ” అని ఎంతో పట్టుదలగా ఉన్న సంబందిత అధికారులంతా కరెక్టుగా అదే రోజు అదే సమయంలో టీటీడీ బోర్డు రూం లో పీ వీ ఆర్ కే ప్రసాద్ అధ్యక్షతన సమావేశమై ఉన్నారు..
అక్కడున్న వారిలో టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నకొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరి కొంత మంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు..అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది..చర్చ అయితే జరుగుతోంది కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామి వారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక ఖచ్చితమైన అవగాహనకు రాలేక పోతున్నారు..
సమయం గడుస్తున్నకొద్దీ ఈ. వో పీ వీ ఆర్ కే ప్రసాద్లో అసహనం పెరిగిపోతోంది..ఎవరెవరో ఏమేమో చెప్తున్నా ఆయన మాత్రం వినలేక పోతున్నారు..ఒక విషయం మాత్రం ఆయనకు క్లియర్ గా అర్థం అయ్యింది..తమ ఆలోచన ఏ మాత్రం ముందుకు సాగాట్లేదని..దాంతో ఆయనలో అసహనంతో పాటు కాస్త చిరాకు కూడా మొదలయ్యింది..
సరిగ్గా అదే సమయంలో తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ మెల్లిగా ప్రసాద్ దగ్గరికి వచ్చాడు..అసలే చిరాగ్గా ఉన్న ప్రసాద్ టైం గాని టైం లో వచ్చిన ఆ అటెండర్ని చూస్తూ ‘ఏంటయ్యా” అని మరింత చిరాకు పడిపోతూ అడిగారు..కంగారు పడ్డ ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి “సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు.. ” అని మెల్లిగా చెప్పాడు..
చిర్రెత్తుకొచ్చింది ప్రసాద్ కి.. “..ఎవరయ్యా అతను..ఇప్పుడింత అర్జెంటుగా మీటింగులో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది..కాసేపుండమను…”మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ప్రసాద్…”చెప్పాను సార్..కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట..అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు..” కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్..
“.. షేక్ మస్తానా…” అని ముందు కాస్త ఆశ్చర్య పోయినా..”ఎవరో ముస్లిం భక్తుడు ఏదో రికమండేషన్ లెటర్ తో వచ్చి ఉంటాడు.. మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు..మళ్ళీ బయటకు పోవటం ఎందుకు..ఏదో రెండు నిమిషాలిక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా ” అని మనసులో అనుకుంటూ.. “.. సర్లేవయ్యా..ఇక్కడికే రమ్మను..” ..అని అటెండర్ తో చెప్పి పంపించేసారు ప్రసాద్..
అప్పుడు దుద్రుష్టవసాత్తు ప్రసాద్ కి గానీ అదే రూం లో ఉన్నఏ ఇతర బోర్డు మెంబర్లకి గానీ తెలినీ విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమె కాదని స్వయంగా తమ స్వామి వారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తలలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని..
ఇవేమీ తెలీని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం భక్తుడొక్కడూ బయట వెయిటింగ్ హాల్లోవెయిట్ చేస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే అటెండర్ బయట కొచ్చిఆ ముస్లిం భక్తుడి దగ్గర కెళ్ళి చెప్పాడు “సార్..మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు” అని..
అప్పటిదాకా తను కూర్చున్నచెక్క కుర్చీ లోంచి లేచి ఆ అటెండర్ కి థాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగూ వేసుకొంటూ బోర్డు రూం లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు..వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్నవారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తరువాత మెల్లిగా ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు..
“.. అయ్యా.. నా ఏరు షేక్ మస్తాన్..మాది గుంటూరు జిల్లా..మాది చాల పెద్ద కుటుంబం..అన్నదమ్ములందరం కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటాం..మా కుటుంబానికక్కడ ఓ చిన్న పాటి వ్యాపారముంది..ఎన్నోతరాలుగా మేమంతా స్వామి వారి భక్తులం..”
“..మా తాత ముత్తాతల కాలం నుండీ కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్న పిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నేలేచి స్వామి వారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పటిస్తాం..అట్లాగే ఏ మాత్రం తప్పులు పోకుండా శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి, మంగళాశాసనం కూడా పటిస్తాం..నా మటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పజెప్పగలను..”
“తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది..అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళ వారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామి వారి 108 నామాలూ ఒక్కొక్కటిగా పటిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత నామ పూజ చేస్తాం..”
“అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిమిటంటే..మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామి వారికి తన స్వార్జితంతో 108 బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు..మొక్కయితే మొక్కుకున్నారు గానీ పాపం వారి ఆరోగ్యమూ అంతంత మాత్రమే ఆర్ధిక స్తోమతా అంతంత మాత్రమె కావటం చేత కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించ గలిగారు..”
“..ఆ తరువాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రిగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడ పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు..అంత కష్టపడీ చివరికా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారి లాగానే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామి వారి పాదాల్లో ఐక్యమై పోయారు..”
“..మరి మా తాతగారిది తండ్రిగారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా వుంటుంది కాబట్టి నా ఆర్ధిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించక పొయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను..ఈ మధ్యనే కరెక్టుగా 108 పూల లెక్క పూర్తయ్యింది..ఎంతో భక్తితో అవి స్వామి వారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యుల మంతా మొత్తం 54 మందిమి కలిసి ఇందాకే కాలి బాటన కొండెక్కి పైకి చేరుకున్నాం..”
అంటూ కాసేపాగి అందరివేపు ఒక్క నిమిషం తదేకంగా చూసాడు షేక్ మస్తాన్..ఆ తరువాత మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు…
“అయ్యా..ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను..కానీ చివరగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం.. మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించాం..ఇవి ఒక్కోటి 23 గ్రాముల బరువుంటాయి..”
“..కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేణా స్వామి వారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారవుతారు..మా తండ్రీ తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి..ఇది విన్నవించు కుందామనే మీ దగ్గరకు వచ్చాను ..ఇక మీ ఇష్టం..నిర్ణయం మీకే వదిలేస్తున్నాను..”
అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లిగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచీని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు..
నిశ్శబ్దం..నిశ్శబ్దం..నిశ్శబ్దం..
గుండెలు పిండేసే నిశ్శబ్దం.. రాతిని కరిగించే నిశ్శబ్దం.. బరువైన నిశ్శబ్దం.. గుండె చెరువైన నిశ్శబ్దం.. నిర్వెదమైన నిశ్శబ్దం… నిలువెల్లా మనిషిని నివ్వెర పరిచే నిశ్శబ్దం.. మనసంతా నిశ్శబ్దం.. మనసుని కలవర పరిచే నిశ్శబ్దం.. గతి తప్పిన నిశ్శబ్దం.. మనసుని గతి తప్పించే నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం..
కొన్ని క్షణాల పాటక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకాని నిశ్శబ్దం తాండవించింది..అక్కడున్నవారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వొదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లాగా freeze అయిపోయి కూర్చున్నారు..అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసిన pedestal fans తిరుగుతూ చేసే శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరే ఇతర శబ్దం వినిపించటంలేదు..
ఎంతో సాదా సీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలుడిగి పోయి ఉన్నారంతా.. అందరికంటే ముందు తేరుకున్నవాడు పీ వీ ఆర్ కే ప్రసాద్..
“దివినుండి దేవ దేవుడే దిగి వచ్చినాడా..”
అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్త పాటు కాలంలో ఓ మహోగ్ర రూపం దాల్చిఆయన మనసంతా ఆక్రమించింది..ఇంకొక్క ఉత్తర క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటున లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు ప్రసాద్..
కళ్ళనుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ఎంతో ఆర్త్రతతో,”మస్తాన్ గారూ..మమ్మల్ని దయచేసి క్షమించండి..మీరెవరో తెలీక ఇంతసేపూ మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడించాను..రండి ..” అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తరువాత మెల్లిగా ఇట్లా అన్నారు..
“మస్తాన్ గారు..ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల్ని చూసాం..కానీ మీ అంతటి అద్వితీయమైన భక్తుడ్నిమాత్రం ఇప్పుడే చూస్తున్నాం..ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి..బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి పంపించాడేమో..ఎవరికి తెలుసు..”
“..కానీ నాదొక విన్నపం..ఈ అమూల్యమైన బంగారు తామర పూలను TTD తరఫున ఒక బాధ్య dత కలిగిన ఆఫీసర్ గా నేను తప్పకుండా స్వీకరిస్తాను..కానీ వీటిని స్వామి వారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణం లో మీకు మాటివ్వలేను.. ఎందుకంటే పేరుకి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి.. వాటిని అధిగమించటానికి మాకు చాలానే సమయం పడుతుంది..”
“అయినా సరే.. ప్రయత్నలోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను.. ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను..మీరు మీ అడ్రస్సు ఫోన్ నెంబర్ మాకిచ్చి వెళ్ళండి..మిగతా విషయాలు నేను చూసుకుంటాను..అంతవరకూ కాస్త ఓపిక పట్టండి..”
అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులూ పట్టుకొని ప్రసాద్ ఇట్లా అన్నారు..
” మస్తాన్ గారు.. చివరగా ఒక్క మాట.. ప్రస్తుతం మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్సనం వసతి ఏర్పాటు చేస్తారు..హాయిగా మీ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి..thank you very much..”
ఉపసంహారం
ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపొయినయి.. ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీ వారికి ఒక కొత్త అర్జిత సేవను ప్రవేశ పెట్టాలని TTD బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది..ఆ సేవలో భాగంగా స్వామి వారికి వారానికొకసారి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది..
ఆ పూజలో స్వామి వారి 108 పేర్లను ఒక్కొక్కటిగా పటిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూవును పూజారులు స్వామి వారి పాదాల మీద ఉంచుతారు..TTD ఈ ఆర్జిత సేవను 1984 లో స్వామి వారికి తమ స్వర్మోత్సవపు కానుకగా ప్రవేశ పెట్టింది..
శ్రీ వారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికున్న గొప్ప భక్తి వలన స్వామి వారికి ఒక కొత్త ఆర్జిత సేవ ప్రారంభం అవటమే కాకుండా అదే కుటుంబం వలన TTD బోర్డుకి కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకొనే ఒక గొప్ప సదవకాశం లభించింది..
గత 30 సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం స్వామి వారికి జరపబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు..కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది..మొదట్లో ఈ సేవను “అష్టదళ స్వర్ణ పద్మ పూజ” అని సుసాధ్యం ఇప్పుడది “అష్టదళ పాద పద్మారాధన సేవ” గా మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.. ఏడుకొండల వాడిని నమ్ముకుంటే అసాధ్యాలని సైతం సుసాధ్యం చేస్తాడు కదండీ మరీ....




. శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా !
(శ్రీ రామ చరిత మానస్)

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...